ఈ బ్లాగును సెర్చ్ చేయండి

5, ఆగస్టు 2019, సోమవారం

నల్లమల అడవుల్లో అణురియాక్టర్లు వద్దు


నల్లమల అడవుల్లో అణురియాక్టర్లు వద్దు
జపాన్‌పై అణుబాంబు ప్రయోగం తరవాత అణుశక్తిని సవ్యంగా వినియోగించుకుంటే ఎంత మేలు కలుగుతుందో,సవ్యంగా వినియోగించుకోలేకపోతే అది ఎంత వినాశనకారో నెహ్రూ గ్రహించారు. అణుశక్తిని సక్రమంగా వినియోగించుకోవాలన్న లక్ష్యంతోనే హోమి బాబా , మేఘనాథ్‌ సాహా లాంటివారికి అణు పరిశోధన బాధ్యతలు అప్పగించారు. అణు పరిజ్ఞానం మానవాళి అభ్యున్నతికి తోడ్పడాలనే కోరికతో హోమీ బాబా ‘టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసర్చ్‌ సంస్థ’ను 1945లో బెంగళూరులో ఏర్పాటు చేశారు. ఆ సంస్థ బొంబాయికి మారినప్పుడు 1962 జనవరి 15న దాన్ని ప్రారంభించింది నెహ్రూనే. 1954లో అణుశక్తి సంస్థను ఏర్పాటు చేశారు. 1967లో హోమి బాబా పేర అణు పరిశోధనా కేంద్రం ఆ పునాదులపైనే ఏర్పడింది. నెహ్రూ ప్రోత్సాహంతోనే శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ నాయకత్వంలో 1948-1958 మధ్యకాలంలో 22 జాతీయ ప్రయోగశాలలు ఏర్పాటయ్యాయి. డా. పి.యం. భార్గవ P-32 న్యూక్లియోటైడ్ అణుమాత్రికలను తయారు చేయడం కోసం హైద్రాబాదులోనే అణుశక్తి ప్రయోగశాల 'జోనకి’ విభాగాన్ని నెలకొల్పాడు. 'గుహా పరిశోధక మహాసభల” ను నిర్వహించాడు.
అణుశక్తి సంపన్న రాజ్యంగా ఇండియాను తీర్చిదిద్ది, అమెరికా సహా పలు దేశాలు విధించిన ఆంక్షల్ని ఎదుర్కొని, అగ్రరాజ్యాల సరసన నిలబెట్టాడు వాజపేయి.పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో న్యూక్లియర్ రియాక్టర్ 'అప్సర'ను , రెండవ భారతీయ అణు రియాక్టర్ 'జర్లీనా'ను రూపొందించింది తెలుగు శాస్త్రవేత్త డా. ఎ.ఎస్.రావు.
నల్లమల అడవుల్లో యురేనియం
అయితే శాంతికాముక ప్రయోజనాలకోసం రూపొందించిన అణు కార్యక్రమాలను కొన్నేళ్ళనుండి విధ్వంసక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు. జనం ఎదురు తిరిగి ఉద్యమాలు జరిపినంతకాలం ఆపేసి అవకాశం చూసుకొని మళ్ళీ మళ్ళీమొదలు పెట్టేవారు.ఆ ప్రయత్నాలు ఇప్పుడు మనరాష్ట్రం లోనే నల్లమల అడవుల్లో చేయబోతున్నారు. నల్లమల అడవులు కర్నూలు, గుంటూరు, నాగర్‌ కర్నూలు, నల్గొండ జిల్లాల్లో ఉన్నాయి. నల్లని నల్లరేగడి నేల అడవులు, లోయలు కొండలు ఉన్న ప్రాంతం నల్లమల.చెంచుల ఆవాసాలు ఎక్కువ. ఈ అటవీ భూమిలో ఉన్న యురేనియం ఖనిజాన్ని వెలికి తీసే కార్యానికి భారత ప్రభుత్వం పూనుకుంది.నల్లమలలో యురేనియం తవ్వకాలను నిలిపివేయాలని నల్లమల చెంచులు,ఆదివాసీలు ఆందోళన చేస్తున్నారు.యురేనియం తవ్వకాలకు అనుమతులు వచ్చాయి.ఇక భారీ యంత్రాలు, బుల్‌డోజర్లు దిగుతాయి. పచ్చని అడవి పారిశ్రామిక దుమ్మైపోతుంది. టైగర్‌ ప్రాజెక్టు యురేనియం ప్రాజెక్టుగా మారుతుంది. కృష్ణానది కలుషితమై విషపునీరు సరఫరా అవుతుంది. ఇక్కడ 20 వేల టన్నుల యురేనియం 83 చ.కి.మీ. పరిధిలో విస్తరించినట్లు అంచనా వేశారు. యురేనియం తవ్వకాలు ప్రజల ప్రయోజనాల కోసమని కేంద్ర ప్రభుత్వం అంటోంది. 2030 నాటికి 40 వేల మెగావాట్ల అణువిద్యుచ్ఛక్తి ఉత్పత్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.అణు విద్యుత్‌ రియాక్టర్లకు ముడిసరుకు అయిన యురేనియం ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలని కేంద్రం చెబుతోంది. కానీ ఈ యురేనియం అణు బాంబులు తయారు చేయడం కోసమేమోనని కొందరి అనుమానం . ఈ అణుబాంబులు మానవాళికి ఎంత ప్రమాదకరమో చరిత్ర చెబుతోంది.
యురేనియం తవ్వకాలు
భయంకరమైన యురేనియం రేడియేషన్‌ వల్ల ప్రజల మనుగడకు తీవ్ర స్థాయిలో ముప్పు ఉందని, కెనడా, ఆఫ్రికా దేశాల్లో కూడా యురేనియం తీశారని, అక్కడి ప్రజలు పర్యావరణ పెనుమార్పులతో దుర్భర స్థితిలో ఉన్నారని జనవిజ్ఞాన వేదిక ఆందోళన వ్యక్తం చేసింది. పులివెందులలో కూడా యురేనియం తవ్వకాలు జరిగాయని, అక్కడ పంటలు పండక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పుట్టే బిడ్డలు కూడా పూర్తి ఆరోగ్యంగా లేరని వివరించారు. యురేనియం తవ్వకాల కారణంగా అడవులతో పాటు, శబ్ద కాలుష్యంతో అడవిలో ఉండే పులుల సంఖ్య తగ్గుతుందని, వాటి సంతానోత్పత్తి జరగదన్నారు. గతంలో నాగార్జునసాగర్‌ ప్రాంతంలో అటామిక్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ప్రయత్నించినప్పుడు ప్రజలు ప్రతిఘటించడంతో వెనక్కి తగ్గారు.
జపాన్ లోని ఫుకుషిమా రియాక్టర్ విధ్వంసం చూశాక మాప్రాంతం లో రియాక్టర్ వద్దని తమిళనాడులోని కుడంకుళంలో వేలాది మత్స్యకారులు నిరసన తెలియ జేశారు.
యురేనియం బాంబుల విధ్వంసం ఎలాంటిదో హిరోషిమా,రియాక్టర్ల నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఎంత ప్రాణనష్టమో చెర్నోబిల్‌ , ఫుకుషిమా, ఒంటారియో, త్రీమైల్‌ ఐలాండ్‌ అణు విద్యుత్‌ రియాక్టర్లు తెలియజేశాయి.అణు విద్యుత్‌ రియాక్టర్ల వలన ప్రపంచ వ్యాప్తంగా సంవత్సరానికి ఉత్పత్తి అవుతున్న 10 వేల మెట్రిక్‌ టన్నుల అణు వ్యర్థాలను పూర్తిగా శుభ్రపరచలేక వ్యర్ధాలను ఎక్కడా దాయలేక చస్తున్నారు. కొన్ని వేల సంవత్సరాలుఅణువ్యర్ధాలను భూమిలో పూడ్చినా పూడ్చిన ప్రాంతాలు వందల సంవత్సరాల తరబడి పనికిరాకుండా పోతాయట.నేలను ప్రమాద రహితం చేయడం, పూడ్చటానికి మానవ రహిత ప్రాంతాన్ని ఎక్కడ వెతుకుతారు?
అణు రియాక్టర్లు దేనికోసం?
విద్యుత్తు కోసం.ఒక్క అణు రియాక్టరు వెయ్యి మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తే 30 టన్నుల అణు వ్యర్ధాలను విడుదల చేస్తుంది.మన దేశంలోని 22 అణురియాక్టర్లు వదులుతున్న టన్నుల కొద్ది అణువ్యర్ధాలను ఎక్కడ పూడుస్తు న్నారో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలి.ఆ చుట్టుపక్కల జనాలకు ఏమీరోగాలు వస్తాయో వాటినుండి ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో కూడా చెప్పాలి. అణు విద్యుత్తు రియాక్టరు అణుబాంబుల్ని తయారుచేసే ప్లుటోనియం ఉత్పత్తి చేస్తుంది. ఆ అణ్వాయుధాలు ప్రయోగిస్తే హానికరమైన కాన్సర్‌, చర్మ వ్యాధుల్లాంటి అనేక రోగాలు కలిగించే స్ట్రాన్షియం, యురేనియం, సీసియం లాంటి అణుధార్మిక వ్యర్ధాలు విడుదలవుతాయి. ఇవే ప్రమాదకర మూలకాలు అణు విద్యుత్‌ ఉత్పత్తిలో కూడా బయటికి వస్తాయి. ఈ బయటికొచ్చే ప్రమాదకర పదార్ధాలను ఎలా ఆపుతారో ప్రజలకు చెప్పాలి.ఎందుకంటే మామూలు థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నుండి వెలువడుతున్న బూడిద బాధ తట్టుకోలేకే చుట్టూ పక్కల ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.విద్యుత్ ప్లాంటులే వద్దు తీసేయండి అని ఉద్యమాలు ఇప్పటికీ చేస్తున్నారు.అణు బూడిద అంటే ఇంకా ప్రమాదకరం కదా? ప్రజలు ప్రతిఘటిస్తున్నా వినకుండా ప్లాంట్లు కొనసాగిస్తున్నారు.కనీసం బాధితులకువచ్చే రోగాల నుండి రక్షణ కోసం బడ్జెట్ లో నిధులు కేటాయించాలి.
అణు రియాక్టర్ల ద్వారా ఉత్పత్తి అయ్యే కార్బన్‌ డై ఆక్సైడ్‌ వల్ల భూమండలం వేడెక్కుతుంది. గ్లోబల్‌ వార్మింగ్‌ వలన భూమిపైనా సముద్రాలలో ఎలాంటి ప్రమాదకర మార్పులువచ్చాయోచూశాక , అణు విద్యుత్‌ ప్రక్రియ ప్రమాదం అని గ్రహించాక కొన్ని దేశాలు ఇప్పటికే ఉత్పత్తిని నిలిపి వేశాయి.జార్ఖండ్‌ రాష్ట్రంలోని జాదుగూడ అణు రియాక్టరు చుట్టూ నివసిస్తున్న వేల మంది ప్రజలను క్యాన్సర్‌ కబళిస్తోంది.మహిళలు గర్భస్రావాలకు గురౌతున్నారు.అణు రియాక్టర్ల ద్వారా విద్యుదుత్పత్తి ప్రమాదకరంగా ఉన్నదని తెలిసినప్పుడు ఆ ప్రమాదాల నివారణ పద్ధతులు ఖచ్చితంగా పాటించాలి. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలను దూరంగా తరలించి వారికి పునరావాసం కల్పించాలి. అణు విద్యుత్తు ఉత్పత్తికి బదులు సౌర విద్యుత్తు బాట పట్టాలి. అడవులు,ప్రజల నివాస ప్రాంతాలను వదిలేసి సముద్రాలలో దూరంగా అణుకేంద్రాలను ప్లాన్ చెయ్యాలి. ఫాస్ట్ బ్రీడర్ సంప్రదాయ రియాక్టర్లకన్నా 70 శాతం అధికంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంతోపాటు అణువ్యర్థాలు చాలా తక్కువట.
సౌర విద్యుత్తే మేలు
సౌర విద్యుత్ అయితే అసలు ప్రమాదాలు ఏమీ ఉండవు.పెద్దపెద్ద చెరువుల్లో కూడా సౌర ఫలకాలను బిగించవచ్చు.సముద్రాలలోనైతే ఇంకా పెద్దపెద్ద ఫలకాలను కావలసినంతమేర నిర్మించవచ్చు. విద్యుత్తు ఉత్పాదనకోసమే అయితే అడవుల్లో భూమిని తవ్వి యురేనియం తవ్వాలనే ఆలోచన వదిలి సోలార్ విద్యుత్తు వైపు ఆలోచన చెయ్యాలి. నిక్షేపమైన భూమిని తవ్వి అటు అడవిని,అక్కడున్న భూమిని నాశనం చెయ్యటం తగదు.మనం ఎక్కడి భూమిని అడవిని అక్కడ అలాగే కాపాడుకోవాలి.చేతనైతే ఇంకా అటవీ భూమిని చెట్లను పెంచుకోవాలి.నోరులేని చెంచులు ప్రతిఘటించలేని అమాయకపౌరులు ఎక్కడుంటే అక్కడ వాళ్ళ భూముల్ని కాజేయటానికి పారిశ్రామికవేత్తలు ఇలా ఖనిజాలు తవ్వుకోటానికి ప్రయత్నిస్తున్నారు.ఆతరువాత జరిగే ప్రజా క్షయాన్ని పట్టించుకోవాలి గదా?మన చట్టాలలో మానవహితం ధ్యేయం గా ఉండాలి.సూర్యుడిలో ఇంకా కొన్ని వేల సంవత్సరాల దాకా మానవులందరికీ సరిపడా ఇవ్వగలంత శక్తి ఉంది. మనమే పొందలేకపోతున్నాము.భూమిలోంచి తవ్వితీసే పదార్ధాలు తరిగిపోతున్నాయి.డీజీలు,పెట్రోలు తరిగిపోయి ఇప్పుడు బ్యాటరీ వాహనాల వైపు మళ్ళారు.రేపు యురేనియం పరిస్థితీ అంతే .ప్రాణాలుతీసే పదార్ధాలు,ప్రమాదాల వైపు పోకుండా ప్రకృతి సిద్ధమైన సహజ శక్తులను పూర్తిగా రాబట్టి వాడుకోవటం మంచిది.అందుకోసం శాస్త్రవేత్తలను ప్రోత్సహించాలి.వారి ప్రయోగ శాలల స్థాపనకు భారీగా నిధులు ఇవ్వాలి. వారి కొత్త ఉత్పత్తుల క్రయ విక్రయాలపై రాయితీలు ఇవ్వాలి.
---నూర్ బాషా రహంతుల్లా, విశ్రాంత డిప్యూటీ కలక్టర్, 6301493266



 https://www.facebook.com/photo.php?fbid=2587792864586021&set=a.233025936729404&type=3&theater

1 కామెంట్‌: