ఈ బ్లాగును సెర్చ్ చేయండి

8, ఆగస్టు 2019, గురువారం

మూడు రాష్ట్రాలు చేస్తే బాగుండేది



మూడు రాష్ట్రాలు చేస్తే బాగుండేది
 
జై తెలంగాణా - సమైక్యాంధ్ర  ఉద్యమాలు  జరుగుతున్న రోజుల్లో ఆంధ్రప్రభ మాజీ ఎడిటర్ పొత్తూరి వెంకటేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్ ను (ఆంధ్ర-తెలంగాణా-రాయలసీమ )” మూడుముక్కలుచేస్తే పోలా?”  అని సలహా ఇచ్చారు. ఆయన చాలా దూరదృష్టితో గత చరిత్రను ఆలోచించి భవిష్యత్తును ఊహించి అలా చెప్పారు.ఇప్పుడు జమ్ము కాశ్మీర్ విభజన సంధర్భంగా కూడా ఆమాటే చెప్పాలనిపిస్తుంది.  
ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు, ఇద్దరు ప్రధానులు ఉండరాదనే విధానం  శ్యామప్రసాద్ ముఖర్జీ పోరాటం,వల్లబాయి పటేల్ ఆశయం,డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆలోచన అధికరణ 370 రద్దుతో విజయం సాధించినట్లయింది.రాష్ట్ర హోదా గల ప్రాంతం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారడం ఇదే తొలిసారి. అఖండ భారత్ మాత్రమే మా అంతిమ లక్ష్యమని పలికే చాలామంది జనసంఘీయులు ఈ చర్యతో శాంతించారు.పాక్ ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనం చేసుకోవటమే తరువాయి భాగమని సుబ్రహ్మణ్యస్వామి సలహా ఇస్తున్నారు.పాకిస్తాన్ లో కలిసిన సింధూ ప్రాంతాన్ని  హిందూస్థానం లో కలిపితే బాగుండేదని అద్వానీ ఎన్నోసార్లు అన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ,ఆక్సాయ్ చిన్ ప్రాంతాలను కూడా స్వాధీనం  చేసుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి.అఖండ భారత్ లక్ష్యాన్ని మోడీ ప్రభుత్వం సాధించాలని పాకిస్తాన్ రాజధానిలో ఫ్లెక్సీలు కూడా వెలిశాయట.
జమ్మూకశ్మీర్‌లో తాను మొన్నటి దాకా అధికారాన్ని పంచుకున్న పిడిపితో కానీ, కశ్మీర్‌కు చెందిన సీనియర్‌ పార్టీ నేషనల్‌ కాన్ఫరెన్స్‌తో కానీ  బీజేపీ చర్చించలేదు.బీజేపీ ఫెడరలిజం ప్రకారం రాష్ట్ర అసెంబ్లీకి కనీస సమాచారం ఇవ్వకుండానే  కేంద్రం రాష్ట్రాలను విభజించవచ్చు.పార్లమెంటులో కేంద్రానికి బలం ఉంటే చాలు అని ప్రతిపక్షాల విమర్శిస్తున్నాయి. జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. లడఖ్‌ కేంద్రపాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఉండదు, జమ్మూకశ్మీర్‌కు ఢిల్లీ, పాండిచ్చేరి మాదిరిగా అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి.

 
మూడు రాష్ట్రాలు చేస్తే బాగుండేది
విభజన జరిగిపోయింది.మెజారిటీ ప్రజలు ప్రజాప్రతినిధులు ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి ఆమోదమూ జరిగింది.భవిష్యత్తులో ఆంధ్ర -తెంగాణా లాగా జమ్ము-కాశ్మీర్ మధ్య ప్రత్యేక రాష్ట్రాల సమస్య రావచ్చు.అందువలన జమ్మూ - కశ్మీర్‌ - లడఖ్ లను   మూడు రాష్ట్రాలు చేస్తే బాగుండేది. జమ్మూ-కశ్మీర్‌ శాసనసభ గల కేంద్రపాలిత ప్రాంతంగా అయితే కేంద్రం,రాష్ట్రం రెండూ రెండుదారుల్లో పాలిస్తాయి.లద్దాఖ్‌ శాసనసభలేని కేంద్రపాలిత ప్రాంతంగా అవతరిస్తే స్థానిక శాసనసభ్యులేవ్వరూ ఉండరు.పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రాంతానికి చెందిన 24 శాసనసభ స్థానాలూ ఖాళీగా ఉంటాయి. గతంలో జమ్మూ-కశ్మీర్‌ని మూడు భాగాలుగా విడగొట్టాలన్న వాదన కూడా ఎన్నోసార్లు వినిపించింది. అయితే, కశ్మీర్‌కు రాష్ట్ర స్థాయిని తీసేయాలన్న వాదన మాత్రం జనసంఘ్‌ నేతల నుంచి కూడా వినిపించలేదు.ఆక్రమిత కశ్మీర్‌ భూభాగాన్ని చైనాకు పాక్‌ కొంత ధారాదత్తం చేసింది. చైనా ఆర్థిక కారిడార్‌లో ఆక్రమిత కశ్మీర్‌ భూభాగం కూడా ఓ భాగమే. జమ్మూ - కశ్మీర్‌ - లడఖ్ అనే మూడు రాష్ట్రాలుగా ఏర్పరచి ఉన్నట్లయితే ఈ మూడుప్రాంతాలవారికీ స్థానిక స్వపరిపాలన అధికారం కలిగేది.ట్రైబల్స్ కు కూడా ఒక రాష్ట్రం ఏర్పడి ఉండేది.భవిష్యత్తులో తెలంగాణ ఉద్యమం లాంటిది మళ్ళీ కాశ్మీర్ లో కూడా రాకూడదు.ఆరునెలలకొకసారి రాజధానిని మార్చతం  అనవసర రవాణా,అనుత్పాదక వ్యయం. జమ్ము కాశ్మీర్  రాష్ట్రం నుంచి లడక్‌ను వేరు చేసిన కేంద్రం.. ఆ ప్రాంతాన్ని చట్ట సభలేని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రతిపాదించింది. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా మార్చింది.అసెంబ్లీ కూడా లేదు కాబట్టి పరిశ్రమలకు అనుమతులన్నీ డిల్లీనుండే వస్తాయి. స్థానిక నాయకులకు ప్రజలకు ప్రాతినిధ్యం పెద్దగా ఉండదు. జమ్మూ కశ్మీర్‌కు కేటాయిస్తోన్న నిధులు లడ‌క్‌కు చేరడం లేదని, అందుకే ఇలా విభజించామని హోం మంత్రి అమిత్ షా తెలిపారు.జమ్మూ కశ్మీర్‌ను జమ్ము,కాశ్మీర్,లాడఖ్ అనే మూడు రాష్ట్రాలుగా చేసినట్లయితే ఇంకా బాగుండేది. జమ్ముకాశ్మీర్ రాష్ట్రంలో జమ్ము వారిదే అగ్రస్థానమైతే  కాశ్మీరీలు తమ ఉపాధి అవకాశాలకోసం మళ్ళీ జమ్ము ప్రజలతో పోరాటాలకు దిగే అవకాశం ఉంది.
 మూడు ప్రాంతాల వివరాలు
కొత్త కేంద్రపాలిత రాష్ట్రం
విస్తీర్ణం చదరపు కి.మీ.
జనాభా
ముస్లిముల శాతం
హిందువుల శాతం  
సిక్కులు,బౌద్ధులశాతం  
జమ్ము
26293
5378538
33.45
62.55
4
కాశ్మీర్
15948
6848475
96.40 
2.45
1.25
లడఖ్
59146
274289
46.40
39.67
12.93
మొత్తం
101387
125141302 
68.31
28.43
2.76
కాశ్మీరుకిస్తున్న నిధులు ఏమవుతున్నాయి?
 జమ్మూకశ్మీర్‌కు కేంద్రం ఇస్తున్న నిధులన్నీ ఏమవుతున్నాయి? కేంద్రం నిధులతో కశ్మీర్‌ గ్రామాల్లో ఎలాంటి మార్పూ రాలేదు. ఎలాంటి మౌలిక వసతులూ కల్పించలేదు. జమ్మూకశ్మీర్‌ ప్రజల్ని పేదరికంలో ఉంచేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. మూడు కుటుంబాలకే ఆర్టికల్‌ 370 రక్షణగా నిలిచింది. 370 రద్దుతో అందరికీ రక్షణ లభించింది. కేంద్రం ఇస్తున్న నిధులు పేద ప్రజలకు చేరడంలేదు. శాంతి భద్రతల కోసమే జమ్మూకశ్మీర్‌లో నిషేధాజ్ఞలు. ఈ నిర్ణయంతో మేం అక్కడి ప్రజల మనసులు గెలుచుకుంటాం.అభివృద్ధి ఫలాలు అందిస్తాం. 370 రద్దుతో జమ్మూకశ్మీర్‌లో పరిశ్రమలు ఏర్పాటవుతాయి. దీంతో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి’’ అని అమిత్‌ షా అన్నారు.
నిజమే.నిధులు వచ్చినవి వచ్చినట్లు జిల్లాలకు గ్రామాలకు ఇవ్వకుండా మింగేసే వాళ్ళనుండి రాష్ట్రాన్ని కాపాడాలి.మూడు రాష్ట్రాలుగా విడగొడితే ఇంకా బాగుండేది కదా? ఒకరుకాకపోయినా మరొకరు నిధులు అందరికీ అందించేవారు.ఇప్పుడు తెలంగాణా ఆంధ్ర రాష్ట్రాలు అబివృద్ధిలో పోటీ పడుతున్నట్లు జమ్ము,కాశ్మీర్,లడఖ్ రాష్ట్రాలూ పోటీపడేవి.ఆ నిధులు ఎక్కడికి పోయాయో గతప్రభుత్వాల నిగ్గు తేల్చేవి. ఉగ్రవాదులను అరికట్టడానికి,ఎన్ కౌంటర్లకు,కర్ఫ్యూలకు,సైనిక శాంతి భద్రతల అవసరాలకే సగం నిధుల ఆవిరైపోతుంటే ఇక అక్కడ సాధారణ పౌరుల ప్రాధమిక సౌకర్యాలకల్పనకు ఏమి డబ్బులు మిగులుతాయి?కాశ్మీర్ అంటేనే ఏదో స్వర్గభూమి అన్నట్లు మనం ఊహల్లో ఉంటాము కానీ నిరంతర అశాంతి ,హింసలతో ఉన్న భూమి అది. అక్కడ  పేదరికం మాత్రమే ఉంది.అక్కడ కవులు కళాకారులు కూడా వికసించలేరు.మనరాష్ట్రంలోకూడా ఏజెన్సీ చట్టం పేరుతో గిరిజనుల  భూములను మరెవరూ కొనరాదని నిబంధన పెట్టారు. కారణం ఏమిటంటే ఆ నిబంధన పెట్టి అడ్డుకోకపోతే  గిరిజనుల చేతుల్లో ఉన్న భూమి మిగలకుండా మైదానప్రాంతాల ధనవంతులు కొనేస్తారు కాబట్టి ఈ చట్టం పెట్టి గిరిజనుల్ని ప్రభుత్వమే పేదప్రజల్ని కాపాడింది అని చెప్పుకున్నారు .ఇప్పటికైనా ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం కలిగిందా?ఆయా ప్రాంతాల గిరిజన ప్రజలు దారిద్ర్యరేఖ దాటారా?ధనవంతులయ్యారా?
నేను రంపచోడవరంలో కొన్నాళ్ళు పనిచేశాను.ఇక్కడి భూముల్ని కోస్తా వాళ్ళను కొననిస్తే రాజమండ్రి,భీమవరం ధనవంతులు ఇక్కడకూడా పెద్దపెద్ద హోటళ్ళు స్కూళ్ళు కాలేజీలు కట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశేవారుకదా అనుకునేవాణ్ణి.అసలు ఈ కంచెలు లేకపోతే గిరిజనులు కూడా మైదాన ప్రాంతాలవారిలాగా బ్రతికేవాళ్ళుకదా?ఏముంది ఇక్కడ?అడివి,చెట్లు,కోతులు, దోమలు.నక్సలైట్లు గంజాయి.ఒక సెల్ టవర్ గానీ,రోడ్డు గానీ వెయ్యనివ్వరట.రోడ్డు శాంక్షన్ అయినా కాంట్రాక్టర్లు నక్సలైట్ల బెదిరింపులను సాకుగా చెప్పి మానేస్తారట.మళ్ళీ కొంత కాలానికి అదేపనికి కాంట్రాక్టు రేట్లు పెంచేస్తారట. సాయుధబలగాలను ఇలాంటిచోట దింపి మామూలు జనానికి పనికొచ్చే సెల్ టవర్ల,రహదారుల నిర్మాణం నిర్బంధంగా చేయించవచ్చుకదా అనుకునే వాడిని.రాజకీయనాయకులే సామంత రాజుల్లా తమ ప్రాంతాలవారీగా అభివృద్ధి పనులుచేసే కాంట్రాక్టర్లనుండి కప్పం కట్టించుకుంటారట. ఇంకెక్కడ అభివృద్ధి జరుగుతుంది? ఈ అవినీతి మామూలు ప్రజలకు అర్ధం కాదు.పెద్దరాష్ట్రాలలో పనులు త్వరగా జరగవు.పెద్దనాయకులకు  చిన్నరాష్ట్రాలు ఆనవు.జమ్ము కాశ్మీర్ కూడా ఇలాంటి ధారుణ పరిస్థితుల్ని ఎదుర్కొంది.అక్కడి కొండలమీద ఒక్క సరైన రోడ్డు ఉందా?ఎప్పుడూ లోయల్లో దొర్లి పోయిన బస్సులు ఇంతమంది మృతులు అనే వార్తలే వస్తుంటాయి.మూడు చిన్న రాష్ట్రాలు ప్రకటించి కేంద్రం వాటికి సహాయం చెయ్యొచ్చు.అక్కడికి అంబానీలు చేరితే చేరనివ్వండి.అభివృద్ధికి ప్రైవేటు పెట్టుబడిదారులూ కావాలి. వస్తువుల ఉత్పత్తి , వాణిజ్య ఎగుమతి దిగుమతుల్లో పారిశ్రామికవేత్తల కోరికలను క్రమమైన రీతిలో తీరుస్తూనే ,ఉద్యోగ  కల్పనల్లో స్థానిక ప్రజలకు రక్షణ కల్పించాలి. గ్రామ పంచాయతీలు, తహసీల్దారులు,జిల్లాలు,కలక్టర్లు ,పోలీసులు ఉన్నది  బలహీనులకు రక్షణ కల్పించడానికే. కశ్మీరులో స్థిరాస్తుల్ని కశ్మీరీలే కొనాలంటున్న 35(ఏ) నిబంధన రద్దుతో రాష్ట్రంలో సామాజిక ఆర్థిక రాజకీయ వాతావరణమే మారిపోయింది. స్థానికేతరులకు భూములు కొనే హక్కు అరకు రంపచోడవరం లాంటి గిరిజన ప్రాంతాల్లో కూడా లేదు.హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో మాత్రం 99 సంవత్సరాల లీజుకు తీసుకొని రాష్ట్రేతర పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెడుతున్నారు. కాశ్మీరీప్రజలు కాలక్రమంలో మిగతా దేశవాసులతో సమానంగా ఆర్థికబలాన్ని సమకూర్చుకోవాలి.అటవీ భూముల  రక్షణకు ఆదివాసీలు ఉండాలి అనే సిద్దాంతంతో  చాలా కాలం గడిపారు. 370 ఆర్టీకిల్ లేకపోతే కశ్మీర్‌ లోయ ఈ పాటికి కాలుష్యభరితమై, కాంక్రీట్‌ అరణ్యమై ఉండేదని భయపడ్డారు.కానీ ఇప్పుడు 370.371లాంటి సెక్షన్ల  రక్షణలే అభివృద్ధిని అడ్డుకుంటున్నాయంటున్నారు.అమెరికా ఉద్యోగాలు , కార్పోరేట్ కాన్వెంట్లు,కాలేజీలు ,ఆంగ్లమాధ్యమ చదువులకు ఆదివాసీలు కూడా జై  కొట్టారు.  ఎక్కడికక్కడ రాజకీయనాయకులు కూడా ఇంగ్లీషు మీడియం స్కూళ్ళు పెట్టి విద్యా వ్యాపారస్తులయ్యారు.ఎంపీలు ఎమ్మెల్యేల సహకారంతో  ఇష్టంలేని చట్టాలను,సెక్షన్లను  తీసేస్తున్నారు.కొన్నిటిని కష్టంగావున్నా కొనసాగిస్తా మంటున్నారు.
చిన్నరాష్ట్రాలు స్థానిక ప్రజల హక్కు
ఒక రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం స్వతంత్ర భారత చరిత్రలోనే లేదు. జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించి , లద్దాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన ప్రభుత్వం రాష్ట్ర ప్రజల మనోభావాల్ని పట్టించుకోవాలి.కశ్మీర్‌ ప్రత్యేక హోదా, రాష్ట్రప్రతిపత్తి  కోల్పోయింది. సమాఖ్య స్ఫూర్తి లేదు. మోడీ బీజేపీ ఎంపీలతో మీమీ ప్రాతాలలో ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారో వినిరండని చెప్పారట. తూటాలతో కశ్మీర్‌ సమస్య పరిష్కారం కాదని, కశ్మీరీలను అక్కున చేర్చుకోవడం ద్వారానే సత్ఫలితాలు సాధించగలమని, జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ అభివృద్ధికి ప్రతిఒక్కరి సలహాలు, సూచనలు స్వీకరిస్తాం. అక్కడి ప్రజల సుఖ దుఃఖాల్లో భాగం పంచుకుంటామని  చెప్పిన ప్రధాని మోదీ చేతల్లో ఆ స్ఫూర్తి చూపిస్తే మంచిదే.
 కశ్మీరీలు ప్రభుత్వం అందించిన చిన్నరాష్ట్రాల వల్ల తమ ప్రాంతానికి ఒనగూడే లాభాలను గుర్తించి సంతోషపడాలి.  కానీ ఈ సంబరాలు అక్కడక్కడా కశ్మీరీపండిట్లు ఈ మాత్రమే జరుపుకొంటున్నారు. కశ్మీర లోయలోని మొత్తం  ప్రజానీకానికి  ఆ సంతోషం కేంద్ర ప్రభుత్వం కలిగించాలి. కాశ్మీర్,జమ్ము,లడఖ్ ను కూడా ఒకే రాష్ట్రంగా కలిపి ఉంచాలని కోరే సమైక్యవాదులు  అవతలి ప్రాంతాలవాళ్ళ సంపదలో,సంపాదనలో వాటాకూడా తమకే కావాలంటారు.ఒకరాష్ట్రం మూడు రాష్ట్రాలయ్యాక పాలన గాడిలో పడ్డాక అందరూ సుఖపడతారు. మళ్ళీ కలుస్తామని ఎవరూ కోరరు.భవిష్యత్తులో మరిన్ని చిన్నరాష్ట్రాలు ఏర్పడతాయి.
భవిష్యత్తులో మరిన్ని చిన్న రాష్ట్రాలు  
ప్రజలే చరిత్ర నిర్మాతలు. ఇప్పుడు రాష్ట్రాల సంఖ్య 28, కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 9. ఎన్ని ప్రాంతాలలో ఎన్ని పోరాటాల తరువాత ఈ సంఖ్యకు చేరింది భారత దేశ రాష్ట్రాల చరిత్ర? ఎలా మారబోతోందో ఎవరికి తెలుసు? ప్రజాస్వామ్యంలో ప్రజల కోరికలు వారి ఉద్యమాల ఫలితంగా అయినాసరే పాలనా సదుపాయాలు సమకూరతాయి. బుందేల్కండ్,బాగల్కండ్,బోజపురి,మిథిల,హరితప్రదేశ్,బోడోల్యాండ్,సౌరాష్ట్ర,విదర్భ,కర్బి,అంగ్‌లాంగ్,కాంతాపూర్,కొడగు,తుళునాడురాయలసీమ,కొంగునాడు,గోర్ఖాలాండ్‌ రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్లు పెరుగుతాయి.
సమస్యలేమీ రాకుండా కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసిన బీజేపీ కి జమ్ము కాశ్మీర్ ను రెండు విడివిడి రాష్ట్రాలుగా చెయ్యటం కష్టమేమే కాదు. కేంద్రపాలిత ప్రాంతంగా ఉండటం అంటే కొన్ని పన్నురాయితీలు ఉంటాయి కాబట్టి సరుకులు చవకగా దొరుకుతాయి.ఉదాహరణకు కాకినాడ పక్కనే ఉన్న యానాం పుదుచ్చేరి రాష్ట్రంలో భాగం.యానాం వాసులు తెలుగే మాట్లాడుతారు.అయినా భాషాప్రాతిపదిక మీద ఏర్పడిన మొదటి తెలుగురాష్ట్రం ఆంధ్రలో కలవలేదు.తెలంగాణా ఉద్యమం జరిగేటప్పుడు కూడా ఆంధ్రతో కలపమని అడగలేదు.ఎక్కడో 600 కిలోమీటర్ల అవతల ఉన్న తమిళ పాండిచేరితోనే కలిసిఉంటామనే నేటికీ అంటున్నారు.సమైక్య ఆంధ్ర కావాలనే వాళ్ళు తెలంగాణాను వదిలి మీ పక్కనే ఉన్న యానాంను కలుపుకోండి చూద్దామని  సవాళ్ళు కూడా విసిరారు.లడక్ ఇప్పుడు ఒక కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి ఎప్పటికైనా ఒక రాష్ట్రంగా మారే అవకాశం ఉంది. ఉమ్మడి జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో జమ్ము పండిట్లదే ఆధిపత్యం అయితే కాశ్మీరీయులు – జమ్మువాళ్ళతో ఉపాధి అవకాశాలకోసం పోరాడవలసి వస్తుంది.మళ్ళీ ఒకటి రెండు తరాలు తెలంగాణ – ఆంధ్ర పోరాటం లాంటిది అక్కడ కొనసాగుతుంది. 370 ఆర్టీకిల్ రద్దుతో  కాశ్మీర్ లో ఉగ్రవాదం  నశిస్తుందని ఆశించినట్లు గానే మూడు అసెంబ్లీలు గల రాష్ట్రాలుగా వీటిని విడదీస్తే ఎవరి పాలన వాళ్ళు చేసుకుంటారు.ఒకరిని చూసి ఒకరు అభివృద్ధిలో పోటీ పడతారు.కొరావా సరవా మిగిలిపోయిన ఉగ్రవాదం ఉంటే కాశ్మీర్ అనే చిన్న భాగానికే పరిమితమౌతుంది.కేంద్రం అక్కడే తన దృష్టి కేంద్రీకరించవచ్చు.జమ్ము – కాశ్మీర్ రెండు ప్రాంతాల సాధారణ పౌరులు హింసకు దూరంగా బ్రతకవచ్చు.జమ్ము కాశ్మీర్ అనే ఉమ్మడి రాష్ట్రంలోఉపాధి,రాజకీయ ఆధిపత్యం  కోసం పోరాటం హింస ఎందుకు మొదలవ్వాలి? ఇప్పుడే మూడురాష్ట్రాలుగా చేస్తే ఆదిలోనే సగం సమస్యలు చల్లార్చినట్లవుతుంది.
---- నూర్ బాషా రహంతుల్లా , విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ ,6301493266 
 https://www.facebook.com/photo.php?fbid=2596974760334498&set=a.233025936729404&type=3&theater

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి