ఈ బ్లాగును సెర్చ్ చేయండి

21, ఆగస్టు 2019, బుధవారం

మాన్ప వశమే మాటకోతలు


మాన్ప వశమే మాటకోతలు
ఈమధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని, భారత్‌కు వ్యతిరేకంగా వాడుతున్న పదజాలం తీవ్రత పరిధి దాటనివ్వకుండా చూసుకోవాలని సలహా ఇచ్చాడని వార్త. నోరుఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడటం మంచిదికాదు అని మనందరికీ తెలుసు.నోరుజారితే తీసుకోలేమనీ తెలుసు.అయితే తరచూ నోరుజారే ట్రంప్ ఇతరుల నోటి కంట్రోల్ గురించి సలహాయిస్తూ మాట్లాడటమే  ఇక్కడి వింత.అంతకుముందు కాశ్మీర్ విషయంలో భారత్ పాకిస్తాన్ దేశాలమధ్య  ట్రంప్ మధ్యవర్తిత్వం చేస్తానంటే ఇది గొర్రెలకు తోడేలు కాపలా అన్నట్లు ఉంటుందని కొంతమంది వ్యాఖ్యానించారు. ఆయనకున్న పేరుప్రఖ్యాతులు అలాంటివి.కూడుపెట్టడు,గుడ్డ ఇవ్వడు నామీద ప్రాణమే అన్నట్లు ఈయనవల్ల ఏదేశానికీ ఒరిగింది ఏమీలేదు.ఇరుదేశాలకు ఆయుధాలు అమ్ముతాడు.యుద్ధాలు ఆరిపోనీయడు.మధ్యవర్తిత్వం చేస్తానంటాడు.కొక్కిరాయి కొక్కిరాయి ఎందుకుపుట్టావు అంటే చక్కనివాళ్ళను ఎక్కిరించటానికి అందట. మన పార్లమెంటులో ఈయన మధ్వర్తిత్వంపై చిచ్చురేగి అసలు ట్రంప్ తో ఏం మాట్లాడావో  చెప్పమని విపక్షాలు నిలదీసే దాకా వెళితే అప్పుడు కాశ్మీర్ విషయం ఆ దేశాలే చూసుకోవాలి అని అమెరికా తాపీగా వివరణ ఇచ్చిందట. ఈయన మాటలు  ఒట్టి గొడ్డుకు అరుపులు మెండు అన్నట్లుంటాయి.నన్ను దింపేస్తే అమెరికా సర్వనాశనం అవుతుందని , అందరూ పేదవాళ్ళు అయిపోతారని,నాలాగా గొప్పపనులు  చేసేవాళ్ళను ఎందుకు తీసేయ్యాలనుకుంటారో అర్ధం కావటంలేదని అంటుంటారు.భారతదేశం ఇంకా వర్ధమాన దేశంఏంటీ? అభివృద్ధి చెందిన దేశమే కాబట్టి సబ్సిడీలు అవసరం లేదు. సుంకాలు విధిస్తాం అని బెదిరిస్తాడు. వివిధాదేశాల ఉద్యోగార్ధులపై మాదేశానికి రాకండి అని రంకెలు వేస్తాడు.ఈయన మనసు ఎప్పుడు ఎలా మారుతుందో నని మిగతా దేశాలు కలవరపడుతున్నాయి.
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. ఎదుటివారి మనస్సు నొప్పించే  మాట తీరు మంచిదికాదు. మాటలే మన మర్యాదకు కారణమవుతుంటాయి.అందరూ మెచ్చుకునేలా ఆహ్లాదకరంగా మాట్లాడటం అనేది ఓ కళ.కానీ ట్రంప్ గారు నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించేరకం.
అమెరికా జోలికి వస్తే ఉత్తరకొరియాను సమూలంగా తుడిచిపెట్టేస్తానని 193 దేశాలున్న ఐక్యరాజ్య సమితి  వేదికమీద తన తొలి ప్రసంగం చేశాడు. ఇరాన్‌, ఉత్తరకొరియాలపై ఆయన చేసిన దూకుడు వ్యాఖ్యలు ,ఆ భాష చూస్తే ఈయనకు మతి చలించిందేమో ఇతన్ని దించేయకపోతే అమెరికాకే నస్టమని కొందరు అనుకున్నారు.ఇతని భాషాచూస్తే ఆయన యుద్ధకండూతితో ఊగిపోతున్నాడనీ అని భయపడ్డారు కొందరు. అమెరికా యుద్ధోన్మాదదేశమనీ, అది ఉత్తరకొరియాను  మరో ఇరాక్‌లాగా, లిబియాలాగా కబళిస్తుందన్నారు  కిమ్‌.  దగ్గేవాని దగ్గర డొక్కలు ఎగరవేసినట్లు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ ఒక్కడే ట్రంప్ ప్రసంగానికి సంతోషంతో గంతులేసింది.
కటువుగా మాట్లాడడం కోటి దోమల పెట్టు అన్నారు. మాటలతో కోటలు సాధించవచ్చు.మాటలతో మంటలు రగిలించవచ్చు.. వాక్కు కత్తికంటే పదునైనది.
వదరబోతుతనం కుసంస్కారానికి నిదర్శనం. సప్తవ్యసనాల్లో వాచాలత్వం  ఒకటి. మాటకు ప్రాణం సత్యం.మాట తీరును బట్టి మనిషిలోని మంచీ చెడ్డలను అంచనావేయవచ్చు. మృదువుగా మాట్లాడే వారితో వీలైనంత ఎక్కువ సేపు గడపటానికి అందరూ ఇష్టపడతారు.అతి తక్కువగా మాట్లాడేవారు ఎక్కువగా ఆలోచిస్తారట.
మాన్పగలిగితి  కత్తికోతలు
మాన్పవశమే మాటకోతలు
కత్తి చంపును
మాట వాతలు మానవేనాడున్‌  అన్నారు గురజాడ.
మన నేతలు సబ్జెక్టు మీద మాట్లాడటం మాని  చట్టసభల్లో చర్చను రచ్చ చేస్తున్నారు.పెదవి దాటితే పృథ్వి దాటుతుందన్నారు. అర్థంపర్థంలేని విపరీత వ్యాఖ్యలకు కోపతాపాలకు స్వస్తిపలికి మాటలు కలుపుకొంటే ఎంతమేలు?  మన చట్టసభల సమయం ఎంతో కలిసివస్తుంది. జనం సమస్యలెన్నింటికో చక్కని పరిష్కా రాలు దొరుకుతాయి. ఒక నోరు, రెండు చెవులు ఉన్నది ఎక్కువగా విని తక్కువగా మాట్లాడడానికి. నోరా వీపుకు దెబ్బలు తేకే అని సామెత . ప్రల్లదం అంటే కఠినమైన మాట పరుషవాక్యాలు కూడా సప్త వ్యసనాలలో ఒకటి.

చెట్టు సారం పండులో వ్యక్తం అయినట్లు- మనిషి సారం మాటలో వ్యక్తం అవుతుంది. ముస్లిములకు ఇళ్ళు అద్దెకు ఇవ్వవద్దు అని ప్రవీణ్ తొగాడియా, రాహుల్ గాంధీ ఆవుమాంసం తిని కేదారనాథ్ వెళ్ళినందువల్లనే భూకంపాలు వచ్చాయని సాక్షి మహారాజ్, సోనియాకు తెల్లతోలువల్లనే అధికారం వచ్చింది అని గిరిరాజ సింఘ్,  హిందువులు ఎక్కువమందిని కనాలి అని నరేంద్రజైన్, రష్యామహిళతో పంచె  కట్టడం కాదు విప్పడం నేర్పిస్తానని  బాబూలాల్, సూర్యనమస్కారాలు రానివారు సముద్రంలో డూకండని యోగి ఆదిత్యనాథ్, ఖాన్ త్రయం సినిమాలు చూడొద్దు అని సాధ్వి ప్రాచీ, భారత్ మాతాకీ జయ అనకుంటే లక్షమంది తలలు నరికేవాణ్ణి అని బాబా రాందేవ్ , బూట్లు పాలిష్ చేసినవాళ్ళు  పాలిస్తున్నారు అని మధు మిశ్రా, ... లాంటివారు విపరీత వ్యాఖ్యలు చేశారు.
మంచి వాక్పాటవం గల వక్త సత్యవాక్కుతో చెలిమి చేయాలట. అబద్దాలు చెప్పి అదే నిజమని నమ్మించే వారు నిత్య జీవితంలో మనకు అక్కడక్కడ తటస్థపడుతూనే ఉంటారు.నోరు కల్లలపుట్ట పేరు హరిశ్చంద్రుడు లాంటి నాయకులు దేశానికి ప్రమాదం.ఓదె కట్టే దొంగ పరిగే ఎరే వాడిని బెదిరించినట్లు మెజారిటీ బలంతో తమబుర్రకు తోచిన అసత్యాలను సత్యాలుగా ప్రకటించే పనిలో కొంతమంది నాయకులున్నారు.
కృష్ణార్జునయుద్ధం డ్రామా లో అర్జునుడు కృష్ణునితో ఇలా అంటాడు :-

చనినారార్వురు చక్రవర్తులు మహీ చక్రంబు పాలించి,
ధర్మనిరోధిన్ చనినారు షోడశ మహారాజులు మహేంద్రాభులై
తమతో వారలు మూటకట్టుకొని ఐశ్వర్యంబు గొంపోయిరే?
రాజ్యములేల, వైభవము లేల ధర్మమున్ లేనిచో !

జీవితమంతా అక్రమ సంపాదన ఐశ్వర్యం కోసమే అవజేసే వాళ్ళకీ పద్యం పారాయణ యోగ్యం.
https://www.facebook.com/photo.php?fbid=2617112941654013&set=a.233025936729404&type=3&theater

--నూర్ బాషా రహంతుల్లా విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి