ఈ బ్లాగును సెర్చ్ చేయండి

28, ఆగస్టు 2019, బుధవారం

నాలుగు రాజధానులు మంచిదేనా?




నాలుగు రాజధానులు మంచిదేనా?
రాజధానుల మార్పు అన్ని దేశాలలో జరిగింది.అది సహజం.పాకిస్తాన్‌ అధ్యక్షులు అయూబ్‌ ఖాన్‌ దేశ రాజధానిని తన స్వస్థలమైన అబ్బోత్తాబాద్‌లో ఏర్పాటు చేయాలని సంకల్పించినా అది  భూకంపాలు వచ్చే ప్రాంతంగా గుర్తించడంతో ఇస్లామాబాద్‌ రాజధానిగా ఏర్పాటు చేయడం జరిగింది. తుగ్లక్‌ రాజధాని ఢిల్లీని దేవగిరికి మారిస్తే , బ్రిటిష్‌ ప్రభుత్వం రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి తరలించింది. ఆస్ట్రే లియా, అమెరికా దేశాల రాజధానులు కేవలం పరిపాలన రాజధానులే. ఆర్థిక కేంద్రాలుగా మహానగరాలుగా ఇతర నగరాలు అభివృద్ధి చెందాయి. వీటిని వివిధ ప్రాంతాల ప్రజల తో మాట్లాడి వారి మధ్య సర్దుబాటు చేశాకే ఏర్పరచారు.అలాగే ఇటలీలో రాజధాని నగరాలను 42 సార్లు  మారిస్తే,వియత్నాం 28 సార్లు మయన్మార్ 24 సార్లు రాజధానుల్ని మార్చాయి.
ప్రపంచంలో మూడు రాజధానులున్న ఏకైక దేశం దక్షిణాఫ్రికా.దేశంలోని మూడు ప్రాంతాలకు మూడురాజధానులు ఏర్పాటుచేసి ప్రాంతీయ ప్రజలను సంతృప్తిపరచారు. 1910 లో దేశ ఏకీకరణ జరిగినప్పుడు పాలనా సౌలభ్యం కోసం కేప్ కాలనీకి కేప్ టౌన్, ఆరంజ్ రివర్ కాలనీకి డర్బన్,ట్రాన్స్ వాల్ కాలనీకి ప్రిటోరియా రాజధానులుగా ఏర్పరచారు. దక్షిణకొరియా,బొలీవియా,చిలీ,మలేషియా,నెదర్లాండ్స్,శ్రీలంక,టాంజానియా,యెమన్,ఇజ్రాయెల్,జర్మనీ,జపాన్,హోండురాస్,పెరు దేశాలకు కూడా రెండేసి  రాజధాని నగరాలు ఉన్నాయి.
మనదేశంలో బ్రిటీష్ పాలనలో కలకత్తా,డిల్లీ,సిమ్లా దేశ రాజధానులుగా ఉన్నాయి.జమ్ము కాశ్మీర్,మహారాష్ట్ర,హిమాచల్ ప్రదేశ్  రాష్ట్రాల్లో కూడా రెండేసి రాజధానులున్నాయి.జమ్మూకాశ్మీర్  రాష్ట్రానికి ఎండాకాలానికి శ్రీనగర్,చలికాలానికి జమ్ము రాజధానులు. మహారాష్ట్ర కు ముంబై,నాగపూర్ రాజధానులు.హిమాచల్ ప్రదేశ్ కు సిమ్లా ,ధర్మశాల రాజధానులు.
బీజేపీ  నాయకుడు అయిన టీజీ వెంకటేష్‌ రాష్ట్రానికి నాలుగు రాజధానులను నాలుగు ప్రాంతాలలో అంటే విజయనగరం.కాకినాడ,గుంటూరు,కడప లలో  ఏర్పాటు చేయటానికి సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు  ఎవరి రాజధాని అమరావతిఅనే పుస్తకంలో  రాజధాని స్థల ఎంపిక ముందుగా అనుకూలతను  అధ్యయనం చేయకుండానే నిర్ధారణ చేశారని అన్నారు. శివరామకృష్ణన్‌  కమిటీ రాజధానిగా ఒక మహా నగర నిర్మాణము అక్కరలేదని, రాజధాని వికేంద్రీకరణ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మేలని సూచించింది.ఆ కమిటీ సిఫారసులను పట్టించుకోకుండా  ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానది ఒడ్డున రాజధాని నగరాన్ని కట్టడానికి  ప్రయత్నాలు ఆరంభించిందన్నారు.
మద్రాస్‌ ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు వివిధ ప్రాంతాల మధ్య రాజీ చేయవలసి వచ్చింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు రాజధానిలో సరైన ప్రాతినిధ్యం ఉండాలనే ఉద్దేశంతో అసెంబ్లీని   కర్నూలులో, హైకోర్టును గుంటూరులో,ఆంధ్ర విశ్వ విద్యాలయాన్ని వాల్టేరులో  ఏర్పాటు చేసి రాయలసీమ,ఉత్తరాంధ్రులను కూడా శాంతింపజేశారు.నేటికీ విజయవాడ కనీసం జిల్లా కేంద్రం కూడా కాదు.అది మంచి రైల్వే జంక్షన్  కావటంవలన సహజంగానే ఎదిగిన నగరం. మారిన పరిస్థితుల్లో నిపుణులకమిటీ రిపోర్టు పై  చర్చ జరిపి  విజయవాడ పరిసర ప్రాంతాలలో రాజధాని నిర్మాణానికి తలపడినట్లయితే బాగుండేది.అసెంబ్లీ ఆమోదం తీసుకొన్నారు గానీ  ఇతర పార్టీల ప్రాంతాల ప్రజలఅభిప్రాయసేకరణకు ప్రయత్నించలేదు. నవ్యాంధ్ర రాజధానిని మారుస్తారనీ , లేదా నాలుగు ప్రాంతాలకు నాలుగు రాజధానుల్ని చేస్తారనీ ... ఇలా అనేక ప్రశ్నలు, అనుమానాలు అమరావతిపై రాష్ట్ర ప్రజలలో అలుముకొన్నాయి. అమరావతి నగర భవితవ్యంపై రాజధానికి భూములిచ్చిన రైతులు,ఆందోళన చేపట్టారు. శివరామకృష్ణన్‌ కమిటీ అమరావతి అనుకూలం కాదని తన నివేదికలో తెలిపినా చంద్రబాబు నియమించిన మంత్రుల కమిటీ దాన్నే ఎంపిక చేసిందనీ,రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండే వెసులుబాటు కారణంచూపి  విజయవాడను రాజధానిగా ఎంపిక చేశారనీ . అమరావతి ప్రాంతం శివరామకృష్ణ కమిటీ సిఫారసు చెయ్యని ముంపుప్రాంతమనీ, ఇక్కడ పంటపొలాలలో రాజధాని భవనాలు కట్టడం తప్పు అనీ ,నిర్మాణాలకు ఖర్చు ఎక్కువ అవుతుందనీ , రాయలసీమ ప్రజలు తమప్రాంతానికి ఏమీ దక్కలేదని రగిలిపోతున్నారనీ వారిని సంతృప్తిపరచటంకూడా అవసరమేననీ  ప్రజలలో మంత్రుల్లో వాదోపవాదాలు జరుగుతున్నాయి.
ముంపు కారణంగానే రాజధానిని మార్చేటట్లయితే  వరదలకు గురవుతున్న ముంబై,మద్రాసు , హైదరా బాద్‌లను కూడా మార్చాలి. ఒకసారి రాజధాని ఎంపిక జరిగి కొంత పనులు జరిగిన తర్వాత దాన్ని మార్చాలనుకోవడం అనవసరం, అర్థరహితం. భూ సమీకరణ ద్వారా రైతుల భూములను తీసుకున్నారని, రాజధాని మారిస్తే భూములిచ్చిన రైతులకు  నష్టం జరుగుతుందని కొందరు బాధపడుతున్నారు. ఇప్పటికే చాలా డబ్బు ఖర్చు చేశారని ఇక  పునరాలోచన మంచిది కాదని కొందరి సలహా. ఎన్నికల ముందు జగన్‌ అధికారంలోకి వస్తే రాజధానిని దొనకొండకు మార్చేస్తారనే ప్రచారం జరిగింది. శివరామకృష్ణ కమిటీ సిఫారసు చేసిన దొనకొండ ప్రాంతానికి మారిస్తే మంచిది,అక్కడ వేలాది ఎకరాల ప్రభుత్వ భూమే దొరుకుతుంది కాబట్టి కొనుగోలు పునరావాసం సుళువు అని కొందరు వాదిస్తున్నారు. ప్రత్యేక హోదా ప్రసక్తి లేదనే మోడీ ప్రభుత్వం ఆంధ్రకు నిధులు ఇవ్వదు కానీ అమరావతే రాజధానిగా ఉండాలని కోరుతుంది కాబట్టి  వెంటనే ఒక అఖిలపక్ష సమావేశం జరిపి అందరి సలహాలు, సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళాలని మరికొందరు కోరుతున్నారు.

అమరావతిని అడ్మినిస్ట్రేటివ్‌ క్యాపిటల్‌గా కొనసాగించి అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు వికేంద్రీకరణ చెయ్యాలనుకుంటే మంచిదే.1972 ప్రాంతంలో వచ్చిన జై ఆంధ్ర ఉద్యమ ఫలితంగా మనరాష్ట్రంలో 6 జోన్లు ఏర్పాటు చేశారు.తరువాత తెలంగాణా విడిపోయి మనకు ఆంధ్రలో 3 రాయలసీమలో 1 మొత్తం నాలుగు జోనుల నేల మాత్రమే మిగిలింది. ఏ  జోనులోని ఉద్యోగాలు ఆ జోను వారికే ఇచ్చేవారు.అంటే సీనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగాలవరకు జిల్లా ,డిప్యూటీ తహసీల్దారు స్థాయి వరకు జోను పరిధిగా ఉండేది.స్థానికుల్ని సంతృప్తి పరచడమే జిల్లాలు,జోనుల ఏర్పాటు లక్ష్యం.ఇప్పుడు వెంకటేష్ గారు వెల్లడించినట్లు  నాలుగు రాజధానుల పంపకం కూడా నాలుగు ప్రాంతాలవారినీ సంతృప్తి పరుస్తుంది.1.విజయనగరం రాజధానిగా ఉత్తరాంధ్ర శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్నం జిల్లాలు 2.కాకినాడ రాజధానిగా తూర్పుగోదావరి ,పశ్చిమ గోదావరి,కృష్ణాజిల్లాలు 3.గుంటూరు రాజధానిగా గుంటూరు,ప్రకాశం,నెల్లూరు జిల్లాలు 4.కడప రాజధానిగా రాయలసీమ కర్నూలు,కడప,అనంతపురం,చిత్తూరు జిల్లాలు.పార్లమెంటు నియోజకవర్గాల ప్రకారం జిల్లాల సంఖ్య 25 అవుతుంది. పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన తరువాత  వాటి సంఖ్య మళ్ళీ పెరగవచ్చు.అయితే ప్రజలకు ఒరిగేది ఏమిటంటే ఇప్పుడున్నట్లు అందరూ అమరావతికే ప్రయాణం కట్టనక్కరలేదు. ఎవరి రాజధాని నగరం వారికి చాలా దగ్గర అవుతుంది. ప్రజలకు దగ్గరలో పనులు జరుగుతాయి.
చివరకు ప్రజల నిర్ణయమే పాలకులకు శిరోదార్యం అవుతుంది.
రాజధానినగరాన్ని మార్చడం ఒక ప్రయత్నం అయితే నాలుగు చోట్ల మినీ రాజధానుల్ని ఏర్పాటు చెయ్యటం ఇంకో ప్రయత్నం. రెండిటినీ ఎదుర్కొనేవాళ్ళు ఉంటారు.ప్రభుత్వం తన ఉద్దేశాన్నిప్రజలకు తెలియజెయ్యాలి. స్థానిక ప్రజలలో మెజారిటీ జనం ప్రభుత్వ ఉద్దేశాన్ని అర్ధం చేసుకుంటే చాలు ప్రభుత్వ ప్రయత్నం సఫలమౌతుంది.ఎన్టీ రామారావుగారు తాలూకాలను చీల్చి మండలాలు ఏర్పాటు చేసినప్పుడు ప్రజలు హర్షామోదాలు తెలియజేశారు.మళ్ళీ మండలాలను రద్దుచేసి తాలూకాలే పెట్టమని ఇంతవరకు ఎవరూ అడగలేదు.కొత్త జిల్లాల కోసం ఆయా ప్రాంతాల ప్రజలు ఎదురు చూస్తున్నారు.కొత్తజిల్లాలు వద్దని ఎవరైనా వారిస్తున్నారా?అలాగే ఇదీ.వాస్తవానికి రాజధాని నగరాన్ని మరోచోటికి మార్చటం కంటే నాలుగు చోట్ల రాజధాని నగరాలు పెట్టటం మరింత ప్రయోజనకరం.పూర్వం జోన్లు ఏర్పాటు చేశారు కానీ జోనల్ కార్యాలయాలను పెట్టలేదు.అక్కడ కలక్టర్లకంటే పై స్థాయి అధికారి ఉంటాడు.ఆ కొరత కూడా ఇప్పుడు నాలుగు రాజధాని కార్యాలయాలతో తీరుతుంది.
--- నూర్ బాషా రహంతుల్లా విశ్రాంత డిప్యూటీ కలక్టర్ 6301493266 


https://www.facebook.com/photo.php?fbid=2648235411875099&set=a.233025936729404&type=3&theater

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి