ఈ బ్లాగును సెర్చ్ చేయండి

29, నవంబర్ 2019, శుక్రవారం

స్త్రీ బాల వృద్ధులను చట్టాలతో కాపాడాలి


స్త్రీ బాల వృద్ధుల తెగవేత ఆపాలి  
స్త్రీలు దేవతలుగా కొలవబడతారని చెప్పుకునే దేశంలో ఆడబిడ్డను కనేందుకు తల్లిదండ్రులు ముందుకురావటం లేదు. దుర్మార్గులకు మహిళలు,పసిపిల్లలు,వృద్ధులు బలౌతున్నారు.ఏడేళ్ళ చిన్నారి దీప్తిశ్రీ ఇషానిని చంపి మురుగు కాలవలో పడేసిన సవతితల్లి శాంతకుమారి 13 నెలల బిడ్డ ను సాకటానికి అమ్మమ్మ కు అప్పగించారు.సవతితల్లి చేసిన తప్పు అందరికీ శాపంగా చుట్టుకుంది. ఆ పసిపిల్ల చేసిన నేరమేంటి? రెండో పెళ్ళి ఇందుకేనా? రాక్షస సవతి తల్లిని ఏమి చెయ్యాలి? అన్నము అడిగితే వాతలుపెట్టే దొకరు, సొంత అక్క కూతురుపైనే దాష్టీకం చూపేదొకరు.నాగరీక ప్రపంచం లో నాగరికత ఏది? బాలలు,స్త్రీలపై ఈ అమానుష కృత్యాలకు అడ్డుకట్ట ఎప్పుడు,ఎలా?ఇటువంటివారికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చెయ్యాలి. గోడ దూకిన వాడేవడంటే ఆలు చచ్చిన వాడన్నట్లు చాలా మంది తండ్రులు తమ పిల్లల కళ్ళెదుట చక్కని మాదిరి కరమయిన జీవితాన్ని ఉంచలేకపోతున్నారు. కొంతమంది ముసలి వాళ్ళకు పశ్చాత్తాపం రాదు గదా పిల్లల్ని గూడ చెడగొడతారు. “నీ వయసే నాకుంటే ఊరిని ఇరగదీసే దాన్నికదమ్మా” అని చింతామణీదేవిని చెడ్డ పనికి ప్రోత్సహించిన అరవై ఏళ్ళ శ్రీహరికుమారి ఇందుకు చక్కని ఉదాహరణ. కల్లు కుండ ఇంట్లో నిలవపెట్టి రోజూ తప్ప తాగే తండ్రి, సారాయి షాపు పెట్టిన తండ్రి, వ్యభిచార గృహాన్ని నడిపే తండ్రి, తల్లిని చితకబాది కొంగున దాచుకున్న రూకల్ని లాక్కెళ్ళి తాగొచ్చే తండ్రి, దొంగతనమే వృత్తిగా గల తండ్రి, దున్నపోతులాంటి ఆరోగ్యమున్నా అడుక్కుతినటమే అలవాటు చేసుకొన్న తండ్రి, లంచగొండి తండ్రి తమ పిల్లలకు ఏ నీతులు బోధించగలరు? చచ్చిన దాని పిల్లలు వచ్చిన దాని కాళ్ళ క్రింద అన్నట్లు అనేక మంది పిల్లలు సవతి తల్లుల చేత రాచి రంపాన పెట్టబడుతున్నారు. రెండవ భార్యగా వస్తున్న స్త్రీ తాను తల్లి బాధ్యతను గూడా నెరవేర్చే సిద్ధపాటుతోనే రావాలి. కొత్త బార్య మోజులో పది మొదటి భార్య పిల్లల్ని ఆలనాపాలనా లేకుండా గాలికి వదిలేసే తండ్రిని ఏమనాలి ? పిల్లల్ని కనటంపై నియంత్రణ లేకుండా గుంటలో బిడ్డ, కడుపులో బిడ్డ అన్నట్లుంటుందికొందరి వ్యవహారం.పుట్టిన వాళ్ళందరినీ సరయిన రీతిలో పోషించే ఆర్ధికశక్తి లేకపోయినా దేవుడు పోషిస్తాడులెమ్మని కనేస్తారు.మంచి శీల సంపదను నేర్పరు.నారు పోసిన వాడు నీరు పోస్తాడని గాలికి వదిలేస్తారు.పది సంవత్సరాలు దాటక ముందే పిల్లల్ని కాయకష్టం చేయటానికి పంపుతారు.నారు పోసిన వాడు దేవుడు కాదు. మనిషే. నీరు పోయవలసింది కూడా మనిషే. నారు పోసిన వాడు నీరు కూడా పోస్తున్నాడా లేదా అని ఎవరు కనిపెట్టి చూస్తారు? చేసేవి లోపాలు చెప్పితే కోపాలు.తల్లి దండ్రులకేదయినా చెబితే మాకే నీతులు చెబుతావా అంటారు. విపరీతంగా తాగి ఆరోగ్యం చెడగొట్టుకొని నలభయ్యేళ్ళకే ఒకతను చనిపోయాడు ఈ మధ్య. ఆరుగురు పిల్లలు, ఇంకా యవ్వనం గడవని భార్య, ముసలి తల్లిదండ్రులు అనాధలయ్యారు. బ్రతికి బాధించారు చచ్చీ బాధించారు. అసమర్ధుల జీవితమొక వ్యాధి. బాధ్యతారహితులు,సోమరిపోతులకు నిద్ర ఉపశమనం, మరణమే ఆరోగ్యం. మరణానంతరం లెక్కఉన్నా లేకపోయినా కన్నపిల్లల్ని ఎవరూ పోషించరు.బాధ్యతలేని పెద్దవాళ్ళ కాముకత్వ కారణంగా పుట్టిన పిల్లల రక్షణ దేవుడే ఎందుకు చూసుకోవాలి? అది మూర్ఖత్వము దుర్మార్గమూ కాదా?బాలల హక్కుల కమిషన్ వంటినిండా వాతలు గాయాలతో ఉన్న ఎందరో బాలలను కాపాడింది.కన్నతండ్రులు కబోదుల్లా మారినా,తండ్రులు త్రాగుబోతులైనా పిల్లలకు నరకమే. ఇలాంటి దుర్మార్గులను వెంటనే ఉరితిస్తే మిగతా వారికి హెచ్చరికగా ఉంటుంది.చట్టాలు కూడా దుర్మార్గులకు భయాన్ని కలిగించేలా మార్చాలి.షీ టీములు నిరంతరం కదులుతూ ఉండాలి. కాలుతున్న గంజి పోసి, కర్రతో కొట్టి, చేయి విరగ్గొట్టి ,మర్మాగంపై వాతలు పెట్టి,బందించి చితకబాది,ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి,ఒళ్ళుహూనం చేసి,సిగిరెట్టుతో అట్లకాడతో వాతలుపెట్టి, కిరాతకంగా చంపి,పిల్లలను అడ్డుతొలగించుకునే దుర్మార్గులను సమాజంనుండి తొలగించాలి.ఇలాంటి కిరాతకులు సంఘానికి హాని.
అత్యాచారాలకు మహిళలే కారణమనిచెప్పే భాగ్యరాజ్ లాంటి నటులు నెలల పిల్లలు కూడా ఆగమైపోతున్నారే అని ఆలోచించాలి.చీరను బురఖా లాగా మార్చి యాంటీ రేప్ చీర అని పేరు పెట్టినా అత్యాచారాలు ఆగలేదు.ప్రతిచోటా మృగాళ్ళు చెలరేగిపోతున్నారు.సంపూర్ణ మద్యనిషేధం రావాలి.లైంగిక నేరస్తులను నపుంసకులుగా మార్చే మందులు,వారికి కుటుంబ నియంత్రణ మందులు నిర్బంధంగా ఇవ్వాలి. జీవితంలో పెళ్లి , పిల్లలు, కుటుంబం ప్రతి మనిషికీ ఓ వరం.అందమైన జీవితాన్ని ఆస్వాదించడానికి, అనుభవించడానికి పిల్లల్ని కంటారు.పుట్టబోయే బిడ్డ మగ అయితే ఊరుకుంటున్నారు.ఆడబిడ్డఅయితే అబార్షను చేపిస్తున్నారు. భార్య, భర్త, బిడ్డ, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు,వీరందరితో కలిసి జీవించటానికి మనిషి ఇష్టపడటం లేదు. స్వార్థం, ఈర్ష్య అసూయల్లో కొట్టుమిట్టాడుతున్నారు.కామంతో కళ్లుమూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు. రొమ్ములుకోసి ,పళ్లుపీకి,మర్మాంగంలో చెయ్యి జొనిపి ,చిత్రహింసలు పెట్టి మహిళలను చంపిన కేసులున్నాయి.ఆయేషా మీరా, ప్రత్యూష,ఇంకా అనేకమంది ఆడపిల్లలపై జరిగిన హత్యాచారాలకూ శిక్షలు పడ లేదు.వాళ్ళ తల్లిదండ్రులు నేటికీ ఏడుస్తూ తిరుగుతున్నారు. కొన్నేళ్లక్రితం జ్యోతీసింగ్ అనే మెడికల్ స్టూడెంట్ అత్యాచారం తర్వాత నిర్భయ చట్టం వచ్చినా స్త్రీలు నిర్భయంగా తిరగలేని దుస్థితి పోలేదు.జనం తిరిగే దారిలో లారీ అడ్డంపెట్టి ఒక మహిళా డాక్టర్ ను రేప్ చేసి చంపారట.వాళ్ళంతా 25 ఏళ్ల లోపువాళ్లేనట.అదే రోజు మరో అమ్మాయిని రప్పించి ఊరంతా తిప్పి చంపారట.హైదరాబాదు లో ప్రియాంకా రెడ్డి,హనుమకొండ లో మానసలపై హత్యాచారాలు బ్రతుకంటేనే భయ పడేలా చేస్తున్నాయి. పిల్లలను వ్యభిచారంలోకి దింపి పాపపు సొమ్ము గడించే ముఠాలను ఎవరు ఎప్పుడు అరికడతారు? ఈ దేశంలో ఆడపిల్లగా పుట్టడమే నేరమా? ఆడ పిల్లల్ని కంటే ఎలా కాపాడుకోవాలో అని తల్లిదండ్రులు ఆందోళనకు గురౌతున్నారు. ఆడపిల్ల హత్యను చూడకుండాపోయిన ప్రయాణించిన ప్రజలదా వెంటనే స్పందించని పోలీసులదా ?అని విలేకరులు తెగ ఆలోచిస్తున్నారు.నాగరికులు రౌడీల నుండి తమనుతాము రక్షించుకొటానికే సతమతమౌతున్నారు.మహిళలు బాలికలపై నిరంతరం అత్యాచారమో హత్యాచారమో జరుగుతూనే ఉన్నాయి. ఆడవాళ్లకి మనుగడలేదు. మగ చూపులనించి రక్షణలేదు. ఆడదాని కష్టాలు ఆడదానికే తెలుస్తాయి అంటారు.కానీ అత్యాచారాలు ఈ భూమి పుట్టినప్పటినుంచి జరుగుతున్నాయి అని కొందరు మహిళా నాయకులే చవకగా మాట్లాడుతున్నారు.భయం పుట్టే చోట ఆడపిల్లలు ఉండకూడదు. ప్రాణం కంటే వాహనాలు ముఖ్యంకాదు.పారిపోవాలి,పారిపోవటం నేరం కాదు.చిన్నపిల్లలను కూడా బలితీసుకుంటున్నారు. వయసుతో పనిలేకుండా మైనారిటీ తీరని బాలురు మొదలు అరవైఏళ్లు దాటిన ముసలివాళ్లు కూడా అత్యాచారాలు చేస్తున్నారు. సవతి తల్లుల ఆగడాలు,పిల్లల కిడ్నాపులు చంపటాలు లాంటి ప్రమాదాలు ఎదురైనప్పుడు 100,112,181,1090,1091 లాంటి మా హెల్ప్ లైన్లకు ఫోన్ చెయ్యండి అని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఐరాస ప్రధాన కార్యదర్శి అత్యాచార నిందితులకు ఉరిశిక్ష వేయమని భారత ప్రభుత్వానికి సూచించారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మొదలు చాలామంది పెద్దలు,సామాన్య గృహిణులు ఇలాంటి హత్యాచారులను నడిరోడ్డుపై కసబ్ లాగా ఉరితీయ్యాలి లేదా వెంటనే కాల్చి పారెయ్యాలి అన్నారు. వరంగల్లు యాసిడ్ దాడి నిందితుల్ని ఆనాడు కాల్చేస్తే ఎవరూ ఏమీ అనలేదు.హత్యాచార నిందితుల్నికూడా అలా చంపేయ్యాలన్నదే ప్రజావాక్యం.కీడు శంకించిన అబలలు వెంటనే అత్యాచారుల ఫోటో తీసి వాట్సప్ లో తమ ఏరియా పోలీసులకు పంపాలి.తాము ఎక్కడ ఆపదలో ఇరుక్కున్నారో పోలీసులకు ఆ యాప్ ద్వారా తెలిసిపోతుందట. షీ టీములు , పోలీసులు కూడా వెంటనే స్పందించాలి.మన చట్టాలను కూడా కఠిన శిక్షలు పడేలా మార్చుకోవాలి. ప్రజలు ఇచ్చే మంచి సలహాలు పాటించాలి.మనతోటి ప్రజలను దుష్టులనుండి కాపాడాలి.దుష్ట శిక్షణ సజ్జన రక్షణ నిరంతర ప్రక్రియ.
నూర్ బాషా రహంతుల్లా ,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ ,6301493266

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి