ఈ బ్లాగును సెర్చ్ చేయండి

5, డిసెంబర్ 2019, గురువారం

మూఢనమ్మకాల నిషేధచట్టం రావాలి


చేతబడుల నిషేధచట్టం రావాలి
అమానవీయ సాంఘిక చర్యలు, చేతబడి నివారణ, నిర్మూలన బిల్లు-2017’ ను కర్ణాటక శాసనసభ ఆమోదించినా మూఢనమ్మకాల విషయంలో దేశంలో ఎలాంటి మార్పు రాలేదు.భారత రాజ్యాంగంలోని 51-A (h)  పౌరుల ప్రాథమిక విధుల  ప్రకారం ‘‘ప్రతి పౌరుడు ఇతరులలో శాస్త్రీయ దృష్టినీ, మానవతా వాదాన్నీ, పరిశోధనాసక్తినీ, సంస్కరణాభిలాషను పెంపొందించేందుకు కృషిచేయాలి.’’ మూఢ, అనాగరిక విశ్వాసాలకు వ్యతిరేకంగా పౌరులందరూ ప్రచారం చేయాలి.ఈ చట్టం ప్రకారం అమానవీయ చర్యలను శిక్షించదగిన నేరాలుగా పరిగణిస్తారు.
మూఢనమ్మకాల పనిపట్టేలా ప్రత్యేక చట్టం కోరుతూ జనవిజ్ఞాన వేదిక వంటి సంస్థలు ఆందోళన బాటపట్టాయి. నరేంద్ర ధబోల్కర్‌, కల్బుర్గీ, పన్సారే, గౌరీ లంకేశ్‌ లాంటి మేధావులను దుండగులు హతమార్చారు. జయలలిత,బీజేపీ మీద విపక్షాలు చేతబడి చేయించారని ఎంపీ ప్రజ్నాసింఘ్ లాంటివారు వాపోతే దమ్ముంటే నాపైన చేతబడి చేయండని మంత్రి కామినేని శ్రీనివాస్  సవాలు విసిరారు. ఈ కుతంత్రాలకు కఠిన చట్టాలే విరుగుడు అని జాతీయ మహిళా కమిషన్‌ సూచించడంతో- ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, బిహార్‌, మహారాష్ట్రలు మూఢనమ్మకాల్ని నిరోధించే చట్టాల్ని ప్రవేశపెట్టాయి. మంత్రగత్తె అని అనుమానించి ఏ మహిళకైనా శారీరక హాని కలిగిస్తే, దోషులకు గరిష్ఠంగా అయిదేళ్ల కారాగారవాస శిక్ష పడేలా బిహార్‌ 1999లో చట్టం తెచ్చింది. గ్రామాల్లో దురాచారాలు, దురాగతాలకు కారకులయ్యే వ్యక్తులకు జరిమానాతో పాటు మూడేళ్ల శిక్ష విధిస్తూ 2013లో బిహార్‌ ప్రభుత్వం చట్టం చేసింది. మహరాష్ట్ర ప్రభుత్వం అమానవీయంగా ప్రవర్తించేవాళ్లకు ఏడేళ్ల జైలుశిక్ష, క్షుద్రపూజలపై నిషేధం విధిస్తూ 2013లో  చట్టాన్ని తీసుకొచ్చింది. ఏ వ్యక్తినైనా శారీరకంగా మానసికంగా సామాజికంగా హింసించి ఆత్మహత్యకు పురికొల్పేలా చేసిన నేరగాళ్లకు యావజ్జీవ శిక్ష  అమలులోకి తెస్తూ  2015లో అసోం చట్టం చేసింది.
ఈదురాచారాల  నివారణకు  పటిష్టమైన చట్టమే మార్గమని జాతీయ మహిళా కమిషన్‌  సూచించింది. భారత రాజ్యాంగం నిర్దేశించిన విధంగా ప్రతి పౌరుడూ శాస్త్రీయ దృష్టినీ, మానవతా వాద భావాలనూ, పరిశోధనాసక్తినీ, సంస్కరణాభిలాషనూ పెంపొందించడానికి కృషిచేయాలి.అమానవీయ సాంఘిక చర్యలు, చేతబడి దురాచారాలు,అనాగరిక, అశాస్త్రీయ విశ్వాసాలు అన్నిటినీ నిషేధించాలి.
 మంత్రాలతోనే రోగాలు నయంచేస్తామనీ, ఎలాంటి పరికరాలూ లేకుండా ఒట్టి చేతులతోనే శస్త్ర చికిత్సలు చేసి శరీరంలోని కణుతులను తీసేస్తామని మోసంచేస్తున్నారు. దెయ్యం విడిపిస్తామంటూ జనాన్ని చిత్రహింసలకు గురిచేయడం, గుప్త నిధులకోసం నరబలులూ, క్షుద్రపూజలు చేయడం, నగ్న పూజలు, గర్భంలోని శిశువు ఆడపిల్ల అయితే మగపిల్లవాడిగా మార్చేస్తామనే పేరుతో మోసాలు చేస్తున్నారు , అగ్నిగుండాలలో నడుస్తున్నారు. కొన్ని  దేవాలయాలలో తమ దుష్కర్మలు నశిస్తాయనీ, రుగ్మతలు తొలగిపోతాయని మడె స్నాన పులివిస్తర’ (ఎంగిలాకు), దురాచారం  పాటిస్తారు.కర్ణాటక ప్రభుత్వం మడె స్నానను నిషేధించింది. తెలుగు రాష్ట్రాలలో బాణామతి లేక చేతబడి పేరిట చాలా దౌర్జన్యాలు, మోసాలు జరుగుతున్నాయి.తమకు లొంగని  కుటుంబాన్ని సాధించదలచిన గ్రామ పెత్తందార్లు ఆ అమాయకుల ఇండ్ల ముందు తమ మనుషులతో రాత్రికి రాత్రే పసుపు, కుంకుమ, నిమ్మకాయలు వేయించి, వారికి మంత్రగాళ్లనే ముద్రవేసి, వారి జుట్టు గొరిగించి, పళ్ళు ఊడగొట్టించి వీధుల్లో నగ్నంగా ఊరేగించి కసి తీర్చుకుంటున్నారు.చేతబడి చేస్తామని, ఇతరులు చేసిన చేతబడిని తిరగగొడతామనీ ఇంకొందరు  సొమ్ముచేసుకుంటున్నారు. పక్షవాతం కారణంగా కోమాలో ఉన్నవారిని ఎవరో చేతబడి చేసిన కారణంగానే వారలా అయ్యారని చెబుతారు. కొందరు అమ్మలూ, అవధూతలూ, బాబాలూ, స్వాములూ  రాజకీయ దళారులుగా, కొందరు డేరా బాబాలు అక్రమార్జనాపరులకు రహస్య ధనాగారంగా మారుతున్నారు.అత్యాచారాలు చేస్తున్నారు.
స్వామిజీలను ఆధ్యాత్మిక గురువులను, బాబాలను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరిగేకొద్దీ  కొందరు స్వార్థపరులు స్వామిజీల అవతారం ఎత్తి ప్రజలను మోసం చేయడమేకాక చేయరాని పనులు కూడా చేస్తున్నారు.కొందరు తమ ఆశ్రమాలకోసం ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారు. నిత్యానందస్వామి పోలీసులకు చిక్క కుండా విదేశాలకు వెళ్లి ఏకంగా ఒక ద్వీపాన్నే కొనుగోలు చేసి అక్కడ స్వతంత్రంగా కైలాస రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నారట. అన్నివేల కోట్ల రూపాయలు ఎలా కూడబెట్టగలి గాడు?ఎంతమందిని మోసం చేశాడు? ఎలా తప్పించుకొని విదేశాలకు వెళ్లిపోయాడో మరి? ఇక మరికొందరు స్వామిజీలు, బాబాలు జైళ్లల్లో కాలం గడుపుతున్నారు.భక్తి కూడా ఒక వ్యాపారంగా మారి పోయింది. పెట్టుబడి పెట్టకుండా కుబేరులుగా మారడానికి బాబాలు కావటం దగ్గరదారి అయ్యింది.
ఎక్కడపడితే అక్కడ స్వామిజీలు, బాబాలు వెలుస్తున్నారు ఏవేవో చెప్పి ప్రజలను నమ్మిస్తున్నారు. కొందరు చేసే వికృతచేష్టలు అమాయకుల ప్రాణాల మీదకు కూడా తెస్తున్నాయి. మంత్రాల పేరుతో రోగాలను నయం చేస్తామంటూ కిందపడేసి తొక్కడం, వాతలు పెట్టడం ఇష్టానుసారంగా కొట్టడం ఒకటేమిటీ వారికి తోచిన అటవిక చర్యలన్నీ చేస్తున్నారు.భైరవకోనలో గుప్తనిధులకోసం అమావాస్య నాడు క్షుద్రపూజలు నిర్వహిస్తున్నవారిని  పోలీసులు పట్టుకున్నారు.ఆలయఅధికారిని సస్పెండ్‌ చేశారు. కదిరి కొర్తికోటలో క్షుద్రపూజలు చేస్తూ ముగ్గురిని బలి ఇచ్చారు.బలికి గురైనవారిలో ఇద్దరు మహిళలు కాగా ఒక పురుషుడు ఉన్నారు. చేతబడులతో ప్రాణాలు తీస్తున్నారు. క్షుద్రపూజలతో  దేశంలో పదేళ్లలో రెండువేలకుపైగా హత్యలు జరిగాయట.ఒక్క జార్ఖండ్‌లోనే  చేతబడులు చేశారనే అనుమానంతో 58 మందిని మట్టుపెట్టారు. మహారాష్ట్రలో విదర్భలో పుత్రసంతానం కోసం 11 మంది చిన్నారులను బలి ఇవ్వాలన్న భూతవైద్యుడి సలహా ప్రకారం ఐదుగురు పసికందులను పొట్టనపెట్టుకున్నారు.భూతవైద్యులు,క్షుద్ర పూజలు చేసే పూజారుల సలహాలు విని నరబలులు కూడా ఇచ్చారు . భార్య ఆరోగ్యంకోసం, పక్షవాతం నయమౌతుందని, కొడుకు పుట్టాలనే ఆశతో యాగంచేసిమరీ పసిపాపలను బలి ఇచ్చారు.కొత్త పొక్లైయినర్‌కు నరబలి , గంగాలమ్మ తల్లికి ఒక మహిళను బలిచ్చారు.అత్యాచారం చేసినతరువాత మహిళలను తగలబెడుతున్నారు.
క్షుద్రపూజలపై జాతీయ స్థాయిలో చట్టం తేవాలని కేంద్రం సన్నాహాలు చేసింది . చేతబడులు, బాణామతి, క్షుద్రపూజలంటూ ప్రజల్ని మోసం చేసే వారికి కఠిన శిక్షలు పడేలా ఆయా రాష్ట్రాల్లో ఉన్న చట్టాల గురించి తెలపాలని  అన్ని రాష్ట్రాలకూ లేఖ రాసింది. క్షుద్రపూజలను నమ్మి మోసపోవద్దంటూ కొన్ని  సామాజిక సేవా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి మూఢనమ్మకాలను పాటించేవారు ఆ సంస్థ కార్యకర్తలను చంపేశారు. హైదరాబాద్‌లో కూడా క్షుద్రపూజలు చేస్తామంటూ వచ్చి ఓ ఇంట్లో సొమ్మంతా దోచుకుపోయారు. దీనిపై ప్రత్యేక చట్టం లేనందున పోలీసులు కూడా దీన్ని నేరం కింద పరిగణిచలేకపోతున్నారు. బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే, క్షుద్రపూజలు చేసినవారిపై కేవలం మోసం కేసు మాత్రమే పెట్టగలుగుతున్నారు. గతంలో  కొంతమంది ఎంపీలు ప్రజలు ఇంతలా మోసపోతున్నా, భాదపడుతున్నా ఎందుకు చట్టం తేలేదని ప్రశ్నించారు. దీంతో కదిలిన కేంద్రం.. చేతబడి, క్షుద్రపూజల నియంత్రణకు దేశవ్యాప్తంగా ఓ కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు నడుం బిగించింది.ఇంకా బిల్లు రావాలి. దేవుళ్లకు, దెయ్యాలకు బలులిస్తే తమ కోరికలు నెరవేరుతాయని ఇప్పటికీ కొంతమంది జనం నేరమనస్తత్వంతో  నమ్ముతున్నారు. జంతువులు కన్నా నరబలి ఇస్తే తమ కోరికలు నెరవేరుతాయనే మూఢత్వంతో ఉన్నారు.అశాస్త్రీయమైన విషయం ఏదైనా అది మూఢవిశ్వాసమే.మనిషిలో శాస్త్రీయ దృక్పథం పెరగాలి. ఇలాంటి బలుల మూఢత్వాన్ని తిప్పికొట్టాలి.మూఢ విశ్వాసాలు తాము చేస్తున్నది ఏమిటో కూడా తెలియనంతగా మనిషిని లొంగదీసుకుంటాయి. ఇలాంటి అమానుష చర్యలు తప్పుకావని, ఫలానా గ్రంథంలో ఉంది. ఫలానా శాస్త్రంలో ఉంది అంటూ సమర్ధించుకునే మానసిక స్థితి వారిలో ఉంటుంది. జంతుబలి, నరబలి, మూఢత్వ నిర్మూలనకు విస్తృతమైన ప్రచారం జరగాలి.
---నూర్ బాషా రహంతుల్లా
విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ ,6301493266
 https://www.facebook.com/photo.php?fbid=2844906868874618&set=a.233025936729404&type=3&theater

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి