ఈ బ్లాగును సెర్చ్ చేయండి

12, డిసెంబర్ 2019, గురువారం

భిన్నత్వంలో ఏకత్వాన్నికాపాడాలి

భిన్నత్వంలో ఏకత్వాన్నికాపాడాలి(గీటురాయి 27.12.2019)
పౌరసత్వ సవరణ బిల్లుతో ప్రజల మతాల గెలుకుడు మొదలయ్యింది.పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంటులో నెగ్గినా అది నేరంతో సమానమని మక్కల్‌ నీధి మయ్యం అధినేత కమల్‌హాసన్‌ అభివర్ణించారు. కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు ఏ రోగం లేని వ్యక్తికి ఆపరేషన్‌ చేసినట్లుందని కమల్‌ హాసన్‌ ఎద్దేవా చేశారు. కేవలం ఏ ఒక్క వర్గంపై పక్షపాత ధోరణి లేని భారత్‌ కోసం తాము ప్రయత్నిస్తున్నామని అన్నారు. వ్యాధి లేని వ్యక్తికి ఆపరేషన్‌ చేయడం ఎంతనేరమో కేంద్ర చట్టం కూడా అంతే నేరమని కమల్‌ అభిప్రాయపడ్డారు.పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మతాలపేరుతో పౌరుల్ని విడదీయకూడదని అందరూ కలిసే ఉండాలని కోరారు.దేశంలో ఎవరు నివశించవచ్చో ఎవరు నివశించకూడదో చెబుతున్నారు.రాజ్యాంగాన్ని జూరాసిక్ పార్కు లాగా మార్చవద్దని కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ అన్నారు.బిల్లు మిశ్రమసంస్కృతిని దెబ్బతీస్తుందని మతాలవారీగా సమాజాన్ని చీలుస్తుందని అసోమ్ మాజీ ముఖ్యమంత్రి ప్రపుల్లకుమార్ మహంత అన్నారు. శివసేన ఎంపీ సంజరు రౌత్ హిందూ-ముస్లింలను మళ్లీ విడగొట్టే ప్రయత్నాలు చేయరాదన్నారు. ఈ బిల్లుతో రాజకీయాల కంటే మానవత్వం ప్రశ్నార్థకమైందన్నారు. ఈ బిల్లు లౌకికవాద విధానాలకు వ్యతిరేకమని ఎన్నికల నిపుణుడు ప్రశాంత్ కిషోర్ విమర్శించారు.
ఘర్ వాపస్ ,ట్రిపుల్ తలాక్ బిల్లుల్లో లాగా మనిషికి మంచిచేసే మానవత్వంకనిపించాలి.పాకిస్తాన్,బంగ్లాదేశ్,ఆఫ్ఘనిస్తాన్ దేశాలనుండి 2014 డిశంబరు కు ముందు ఇండియాకు వలస వచ్చిన శరణార్ధులు పౌరసత్వం పొందటానికి ఇక్కడ 6 సంవత్సరాలు నివసించి ఉండాలి.కానీ హిందూ,జైన,శిక్కు,,ఫార్శీ,బౌద్ధ.క్రైస్తవ మతస్తులకు మాత్రమే ఈ అవకాశం ఇస్తూ ముస్లిం శరణార్ధులకు లేదన్నారు.ఇతరదేశాలనుండి వచ్చిన ముస్లిములకు కూడా మన పొరసత్వం ఇవ్వాలా అని హోంశాఖ మంత్రి అడిగారు.బంతిలో వలపక్షం కూడదని మన పెద్దల నీతి. మతాలు వేరైనా నిన్నటిదాకా సోదరుల్లా మెలిగిన వారు ఒకరినొకరు అనుమానంగా చూసుకోవాల్సిరావటం అమానుషం.సమభావం సమన్యాయం మన రాజ్యాంగం మూలసూత్రం.14 వ ఆర్టికిల్ ప్రజలందరినీ సమాన హక్కులతో ఆదరించమనే ఆదేశించింది.పాకిస్తాన్ లో పీడనకు గురై ఇండియా వచ్చిన షియాలు,అహ్మదియాలు,శ్రీలంక శరణార్డులు ,రోహింగ్యాలు అల్లకల్లోలం అవుతారు. బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు వలసవచ్చి దశాబ్దాలతరబడి ఇక్కడే నివసించిన ఆరుమతాలవాళ్ళకు లభిస్తున్న పౌరసత్వం ముస్లిములకు మాత్రం లభించకపోవటంతో వారిలో భయోత్పాతం నెలకొంది.ఎక్కడికిపోవాలో అర్ధంకాదు.ఆదేశం వీళ్ళను తిరిగితీసుకొంటుందా?మళ్ళీ రోహింగ్యాలలాగా ఎవరు ఆశ్రయమిస్తే ఆ దేశానికి వెళ్లాలా? ఒక్క బిల్లుతో ముస్లిములకు ఎన్ని సమశ్యలు వచ్చిపడ్డాయో? మనిషి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పాగా వెయ్యటానికి ఇప్పుడు కుదరదు.ఆదికజనాభాతో అన్నిదేశాలూ కిటకిట లాడుతున్నాయి.ఏమతానికి ఆమతం నాయకులు తమ మతం సంతానం ఎక్కువకావాలని పోటీలుపెడుతున్నారు.
ఇది భిన్నత్వంలో ఏకత్వం సాధించిన దేశం.ఎన్నోమతాలు కలగలిసిన పూదోట,సఖ్యత,సామరస్యత తప్పక విలసిల్లాల్సిన అనేకమతాల దేశం. ఈశాన్యరాష్ట్రాలు బిల్లుకు వ్యతిరేకంగా భగ్గుమన్నాయి. పోలీసులు లాఠీ చార్జి చేశారు. బాష్ప వాయుగోళాలను, రబ్బర్‌ బుల్లెట్లను ప్రయోగించారు.అక్కడ పారా మిలిటరీ బలగాలను దించారు.ఇంటర్నెట్ ,టీవీ సేవలు ఆపుచేశారు.అసోం లో భద్రతా సిబ్బందితో జరిగిన ఘర్షణవల్ల ముగ్గురు విద్యార్ధులు చనిపోయారు.ఇండో జపాన్ సదస్సు వేదికను అసోమ్ సచివాలయంలో నిరసనకారులు కూల్చివేశారు.బిల్లు దేశబహుళత్వానికి వ్యతిరేకంగా ఉండని ముంబై ఐపియస్ అధికారి అబ్దుర్రహమాన్ రాజీనామా చేశారు. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత షిరీన్ దల్వీ బిల్లుకు నిరసనగా తన అవార్డును వెనక్కి ఇస్తానని ప్రకటించారు.పశ్చిమబెంగాల్ అసోం లలో వలస శరణార్డులు ఎక్కువగా ఉన్నారు. ఇది ఈశాన్యజాతులను తుడిచిపెట్టే ప్రయత్నం,క్రిమినల్ దాడి అని రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగవిరుద్ధమైన ఈ బిల్లు ఆమోదంపొందితే దేశ చరిత్రలో ఇది చీకటి దినంగా మిగిలిపోతుందని సోనియాగాంధీ, పి.ఓ.డబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య అన్నారు. ఈ బిల్లు రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఉందని, దేశ సమగ్రతకు, సమైక్యతకు తీవ్ర విఘాతం కలిగించేలా ఉందని, ఈ బిల్లు మతంపై ఆధారపడిన బిల్లు, సుప్రీంకోర్టులో ఈ బిల్లు నిలబడదని,ఇది మతపరమైన వివక్ష అని ముస్లిమ్ సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు..ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని మాజీ జస్టిస్ చంద్రకుమార్ అభిప్రాయపడ్డారు.ఈబిల్లు అసహ్యకరం,అప్రజాస్వామికం,అసహ్యకరం దీనిని బంగాళాఖాతంలో కలిపేయ్యాలి అని తమిళనాడు ఎంపీ వైకో అన్నారు.ఒవైసీ అయితే బిల్లు ప్రతిని లోక్ సభలో చింపివేశారు.
ఇది దేశానికి మైలురాయి , విపక్షాలది పాకిస్తాన్ భాష అని మోడీ అన్నారు.మనదేశంలో రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి,చీఫ్ జస్టిస్ లాంటి పదవులను ముస్లిములు కూడా అధిష్టించారు మరి అలాగా పాకిస్తాన్ లోకానీ బంగ్లాదేశ్ లో కానీ జరగలేదు కదా అని అమిత్ షా ప్రశ్నించారు.రోహింగ్యాలు నేరుగా మయన్మార్ నుంచి కాకుండా మధ్యలో బంగ్లాదేశ్ వెళ్ళి అక్కడినుంచి ఇండియా శరణుజొచ్చారు అందువలన రోహింగ్యాలకు పౌరసత్వం ఇవ్వము అన్నారు.6 మతాలవారిని చేరిస్తే మమ్మల్ని పొగడారు,ముస్లిముల్ని చేర్చకపోతే మాత్రం విమర్శిస్తారు.ఈ మూడుదేశాల నుంచి బాధలు పడుతున్న 566 ముస్లిములకు కూడా పౌరసత్వం ఇచ్చాము.9 లక్షలమంది శ్రీలంక శరణార్ధులకు పౌరసత్వం ఇచ్చాం అని అమిత్ షా సమాధానమిచ్చారు.వేలాది భారతీయులు అమెరికా,ఆస్ట్రేలియా, గల్ఫ్ లాంటి ఇతర దేశాల్లో పనిచేస్తున్నారు.వీళ్ళంతా వారికి పౌరసత్వం ఇస్తామంటే తీసుకోటానికి సిద్ధమేనా? రెండుదేశాల చీలికకు జిన్నా ,ముస్లింలీగ్ కారణమని కొందరంటే,సావర్కర్ కారణమని కొందరు వాదిస్తున్నారు.భవిష్యత్తులో ఇదే దేశంలో మేము నివసించాలి ఇలా మతాలవారీగా దేశాన్ని ముక్కలుచేయవద్దు,పొరసత్వ సవరణ బిల్లుతో సామాన్య ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయవద్దు అని కొందరు బాధపడుతున్నారు.హిందూత్వ బిల్లు ఇది,నాజీల కాపీబుక్ దీనికి స్పూర్తి.ఇంకానయం రాజ్యాంగసవరణ చేయలేదు.బిల్లుపెట్టి మందబలంతో నెగ్గించుకున్నారు.న్యాయస్థానం ఈ బిల్లును కొట్టివేస్తుంది అని చిదంబరం,డెరెక్ ఒబ్రెయిన్ లాంటివారు అన్నారు.విజయసాయిరెడ్డి ముస్లిముల్లోకూడా బోహ్రా,అహ్మదియ్యా లాంటి వర్గాలలో వేధింపులకు గురై ఇక్కడికి తరలివచ్చిన శరణార్డులకు పౌరసత్వం ఇవ్వాలని కోరారు.1951 ఐరాస శరణార్డుల అంతర్జాతీయ న్యాయసూత్రాల ప్రకారం అభివృద్దిచెందిన, చెందుతున్న దేశాలు శరణార్డులకు తమదేశాల్లో ఆశ్రయం కల్పించాలి,ఇండియా కూడా మానవతాదృక్పదంతో శరణార్ధులకు ఆశ్రయం కల్పించాలని కోరారు.
పౌరసత్వం ద్వారా పాలకులను ఎన్నుకునే ఓటు హక్కు నుండి నచ్చిన మతాన్ని అనుసరించడం, భావ వ్యక్తీకరణ స్వేచ్చ మొదలైన హక్కులు వస్తాయి.పౌరసత్వం కోల్పోతే తరతరాల వారసుల హక్కుల్నీ కోల్పోతారు.ఈశాన్య ప్రాంతంలోనేకాదు దేశంలో ఎక్కడైనా అక్రమ చొరబాటుదారుల సమస్య తలెత్తితే వారి ఏరివేతను ఆ ప్రాంతానికి పరిమితం చేసి పరిష్కరించాలి. 1955 పౌరసత్వ చట్టం ప్రకారం భారత పౌరసత్వానికి మతం అక్కరలేదు. దేశంలో నివసిస్తున్న వారందరికి మతప్రమేయంలేకుండా పౌరసత్వాన్ని రాజ్యాంగం ఇచ్చింది . ఇప్పుడు బిజెపి ప్రతిపాదించిన సవరణల ప్రకారం బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌ల నుండి 2014 డిసెంబర్‌ 31 నాటికి వచ్చి వున్న ముస్లిమేతర శరణార్ధులకు మాత్రమే పౌరసత్వం ఇస్తారు.ఆ మూడు దేశాలలో చెలరేగే మతహింస కారణంగా తరలి వచ్చే బాధిత మైనార్టీ మతస్తులకు పౌరసత్వం ఇచ్చి రక్షణ కల్పిస్తారట. శరణార్ధులందరికీ పౌరసత్వం అంటే బాగుండేది.భూటాన్ లో బుద్దిజం అధికార మతం అయితే అక్కడ క్రిస్టియన్లపట్ల వివక్ష ఉంది. శ్రీలంకలో తమిళ హిందువులు వేధింపులకు గురవుతున్నారు. ముస్లిం రోహింగ్యాలు మయన్మార్‌ బుద్ధుల నుండి ప్రాణరక్షణకోసం బంగ్లాకు భారత్‌కు చెల్లాచెదురయ్యారు.పాకిస్తాన్‌లోని అహ్మదీయులు, షియాలను ముస్లింలుగా ఆ దేశం ఇప్పటికీ గుర్తించలేదు.మతపిచ్చితోనే చంపుకుంటున్నారు.ఈ బిల్లులో శ్రీలంకలోని తమిళ హిందువులు, నేపాల్‌లోని హిందువుల గురించి ఏమీలేదు. వీళ్ళకు న్యాయం ఎవరు ఎలా చేస్తారు? విపక్షాలసందేహాలకు జవాబులు , చర్చకూ తగినంత సమయం ఇస్తే బాగుండేది. ఈ దేశంలోని మైనార్టీ హక్కులను రక్షిస్తే చాలు.పొరుగు దేశాలలో మైనార్టీలకు రక్షణ కల్పిస్తామనడం తనకుమాలినపనే. భారతీయ ముస్లిములు కూడా వారిలోని అహ్మదియాలు,షియాలు, మెహతార్లు , దూదేకుల లాంటి వివిధకులాల ముస్లిములను దర్గాలు,విగ్రహారాధన వంకతో వివక్షతో చూడకుండా తమలో కలుపుకోవాలి.మతంకంటే మానవత్వమే ముఖ్యం అనేది నినాదాలస్తాయి దాటి ఆచరణలోకి రావాలి. లౌకిక స్ఫూర్తి, సర్వమత సమానత్వ భావన, భిన్నత్వంలో ఏకత్వాన్ని పునాదిగా చేసుకుని ముందుకు సాగుతున్న సమాజం మనది! ఈ ఐక్యతను ముక్కలు చేయడం మహాపాపం.
--నూర్ బాషా రహంతుల్లా ,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ ,6301493266
https://www.facebook.com/williams32143/posts/2857008764331095 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి