ఈ బ్లాగును సెర్చ్ చేయండి

19, డిసెంబర్ 2019, గురువారం

నిజమైన శరణార్ధులను ఆదుకోండి


నిజమైన శరణార్ధులను ఆదుకోండి (సూర్య 22.12.2019)
'ఏ దేశచరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం, బలవంతులు దుర్బల జాతిని బానిసలను కావించారు, నరహంతలు ధరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధి కెక్కారు అని అన్నాడు మహాకవి శ్రీశ్రీ. శరణార్ధి,కాందిశీకుడు,వలసదారుడు ,స్వదేశీయుడు,విదేశీయుడు లాంటి పేర్లు మారతాయిగానీ శరణార్ధులు ప్రాణభయంతో బ్రతుకుతున్నారు . నిరంతర ఘర్షణలు, యుద్ధ వాతావరణం, ఉగ్రదాడులు, మతపరమైన వేధింపులు, కరువులు,వరదలు,భూకంపాల వల్ల  పొట్టచేత పట్టుకుని స్వదేశాన్ని విడిచి తమ కుటుంబాలను కాపాడుకోవడానికి వలసబాట పడుతున్నారు.తన అస్తిత్వాన్నీ కోల్పోయి దినదిన గండంగా చస్తూ బతుకుతున్నారు.ప్రపంచవ్యాప్తంగా 7.1  కోట్ల మంది తమ ఇళ్లు, వాకిళ్లు వదిలిపోయారు.ఇథియోఫియాలో తెగల మధ్య ఘర్షణలు, వెనెజువెలాలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి ఆహారం, మందుల కొరతతో నిత్యం వేలాదిమంది వలసపోతున్నారు. వీరిలో 4.13 కోట్ల మంది తమతమ దేశాల్లోనే ఇతర ప్రాంతాలకు వెళ్లి జీవిస్తున్నారు. 2.59 కోట్ల మంది ఇతర దేశాల్లోని శరణార్థి శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు.మరో 35 లక్షల మంది ఆశ్రయం కోసం ఎదురుచూస్తున్నారు. 2011 నుంచి యుద్ధంతో ఛిన్నాభిన్నమైన సిరియాలో ఎక్కువమంది స్వదేశంలోనే ఇతర ప్రాంతాలకు తరలివెళ్లి జీవిస్తున్నారు. అలాగే, కొలంబియాలో దశాబ్దాలుగా కొనసాగుతున్న హింసకు ఎక్కువమంది వలస పోతున్నారు. పాలస్థీనాకు చెందిన 55 లక్షల మంది వివిధ దేశాల్లో ప్రత్యేకించి లెబనాన్‌, జోర్డాన్‌లలో శరణార్థులుగా జీవిస్తున్నారు. సూడాన్‌లో 1983లో పౌర యుద్ధం లో 50 లక్షలమంది తమ ఇళ్ళనుండి పారిపోయారు.తమ కుటుంబాల నుండి వేరైపోయిన వేలాదిమంది పిల్లలు ఇతియోపియాలోని శరణార్థి శిబిరాలకు పారిపోయి, దాదాపు మూడు సంవత్సరాలు అక్కడే ఉండిపోయారు.
భారీ వలసలు తీవ్ర సవాళ్లుగా మారుతున్నాయని చెప్పారు. సంపన్న దేశాల ద్వారా దీన్ని అధిగమించవచ్చని, ఇందులో జర్మనీ కృషి ప్రశంసనీయమన్నారు. ఈ విషయంలో జర్మనీ చాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ రాజకీయంగా భారీ మూల్యాన్ని చెల్లించినప్పటికీ, ఆమె మరింత సాహసోపేతంగా ఉంటారని ఆమె చర్యలు నిరూపించాయని కొనియాడారు.
 టర్కీ అధ్యక్షుడు రిస్సెప్‌ తయ్యిబ్‌ ఎర్డోగన్‌ 30లక్షల మంది శరణార్థులకు టర్కీ ఆశ్రయం కల్పిస్తున్నదని అన్నారు. సిరియాలో 2011 అంతర్యుద్ధం కారణంగా ప్రాణభయంతో వలసవస్తున్న శరణార్థులను తమ దేశం ఆదుకుందని ,సిరియా సరిహద్దులో యుద్ధరహిత  జోన్‌ ఏర్పాటు కోసం కృషి చేస్తున్నామని, వలసదారులను అక్కున చేర్చుకునేందుకు టర్కీ సిద్ధంగా ఉందని ఆన్నారు.పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం ద్వారా ముస్లింలలో అభద్రతా భావం నెలకొనే ప్రమాదముందని అన్నారు. పాకిస్థాన్‌ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ 14 లక్షల ఆఫ్ఘన్ శరణార్థులకు ఆశ్రయం ఇస్తోందని ఇంతకుమించి వలసదారులకు ఆశ్రయం కల్పించే స్థితిలో పాక్‌ లేదని తెలిపారు.పలు దేశాల్లో శరణార్థులు దినసరి కూలీలుగా అవతారమెత్తారు. చాలీచాలని వేతనాలు తీసుకుంటూ ఇబ్బందిపడుతున్నారు. అనేక దేశాలు వలసదారులకు గ్రామ శివారుల్లో శిబిరాలను ఏర్పాటు చేశాయి. వీరిని తమ దేశ పౌరులతో కలవనీయకుండా వివక్ష కనబరుస్తున్నాయి.  శరణార్ధులు ప్రాథమిక అవసరాల కొరతతో ఇబ్బందిపడుతున్నారు. శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తున్న అనేక దేశాలు పౌరసత్వం ఇచ్చేందుకు ససేమిరా నిరాకరిస్తున్నాయి. అంతర్యుద్ధాలు చెలరేగిన దేశాల నుంచి వస్తున్న శరణార్థులను పలు దేశాలు అక్కున చేర్చుకోలేకపోతున్నాయి.  
మయన్మార్ ప్రభుత్వం తమ దేశంలోని రోహింగ్యాల జాతి ప్రజలను మయన్మార్ ప్రజలుగా గుర్తించడానికి నిరాకరించి తరిమేస్తుంటే లక్షలాది మంది రోహింగ్యా శరణార్ధులు కట్టుబట్టలతో పొరుగునే ఉన్న ఇండోనేసియా , భారత్, బంగ్లాదేశ్ లోకి వచ్చారు. రోహింగ్యాలకు పౌరసత్వం ఇవ్వము అన్నారు అమిత్ షా.  ఎందుకంటే రోహింగ్యాల ముసుగులో ఉగ్రవాదులు, అసాంఘీక శక్తులు దేశంలోకి ప్రవేశిస్తారని కేంద్రం వాదన. మయన్మార్ రోహింగ్యాలను తరిమేసి తిరిగి రానివాటంలేదు.రోహింగ్యాల పునస్థాపన ఎలా?దిక్కుతోచని స్థితిలో నిరాశ్రయులైన రోహింగ్యాలు కట్టుబట్టలతో తమ పసిపిల్లలను, వృద్ధులను, మహిళలను వెంటపెట్టుకొని ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో పడ్డారు.లక్షలాది మందికి శాశ్వతంగా ఆశ్రయం కల్పించడం ఏ దేశానికైనా చాలా కష్టమే. రోహింగ్యా ముస్లింలు ఇండో ఆర్యన్ జాతికి చెందిన వాళ్ళు. మయన్మార్ సైనిక ప్రభుత్వం 1982లో రోహింగ్యాల పౌరసత్వాన్ని రద్దుచేస్తూ చట్టాన్ని మార్చేసింది.పౌరసత్వాన్ని నిరాకరించడం అంటే రోహింగ్యాలకు భూమి మీద యాజమాన్య హక్కు లేకుండా చేయడమే. అంతేగాక వాళ్ళు ఇతర తెగల్ని పెళ్ళి చేసుకోరాదనీ, స్వంత తెగలో పెళ్ళి చేసుకోవడానికైనా, పిల్లల్నికనడానికైనా, చదువుకోవడానికైనా, పనిలో చేరాలనుకున్నా తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలనీ అమానుష నిబంధనలు విధించింది.రోహింగ్యాలను దేశ సరిహద్దులు దాటక ముందే చంపి భూమిలో పూడ్చివేయడానికి సైన్యానికి సకల అధికారాలు ఇచ్చారు. ఇతరదేశాలకు వెళ్ళి అక్కడి భద్రతాదళాల చేతుల్లో చావడంకన్నా స్వదేశంలో స్వదేశీ సైనికుల చేతుల్లోనే చనిపోవడం మేలని రోహింగ్యా శరణార్ధులు భావిస్తున్నట్టు ఐక్యరాజ్య సమితి శరణార్ధుల సంస్థ అధికార ప్రతినిధి ఆంద్రూస్ మెహసిక్ పేర్కొన్నారు. రోహింగ్యాలు శ్రీలంక లోని జాఫ్నా రాష్ట్ర తమిళుల్లాగా ప్రత్యేక ఇస్లామిక్ దేశo కోసం హింసాయిత లిబరేషన్ ఉద్యమాలు,గొరిల్లా నక్సలైట్ ఉద్యమాల లాంటివి చేపట్టారని,కొన్ని తెగలను ఇస్లాం లోకి బలవంతంగా మార్చే ప్రయత్నం చేశారని , ఇస్లాం జనాభా పెరగటానికి ఎక్కువ భార్యలు, ఎక్కువ సంతానాన్ని కంటారని  అక్కడి ప్రభుత్వం ఆరోపిస్తూ వారి ఉద్యమాలను అణచివేసింది. రోహింగ్యాలు  ముస్లిం మతస్తులే అయినా వారికి మలేషియా,ఇండోనేషియా,బంగ్లాదేశ్ సహా  ఏ ఇస్లామిక్ దేశమూ ఆశ్రయం ఇవ్వలేదు.వాస్తవానికి ఎవరిదేశంలో వాళ్ళు ఉండాలి.శరణు కోరిన హింసాత్మకులను,ఉగ్రవాదులను, ఆర్ధిక ఆధ్యాత్మిక మోసగాళ్లను దేశంలోకి అసలు రానివ్వకూడదు.అహింసకు కట్టుబడిన  శ్రామికశరణార్ధులకు మాత్రమే తాత్కాలిక ఆశ్రయం ఇవ్వాలి.
అంతర్యుద్ధాల కారణంగా అనేక దేశాలకు వలసల తాకిడి పెరిగింది. 80 శాతం మంది శరణార్థులు అభివృద్ధి చెందుతున్న, నిరుపేద దేశాల్లో ఆశ్రయం పొందుతున్నారు. అయితే, వీరిలో 20 శాతం మంది రెండు దశాబ్దాలకుపైగా శిబిరాల్లోనే కొనసాగుతున్నారు.శాంతి స్థాపనలో మనం దాదాపు విఫలమయ్యాం. కొత్తకొత్త ఘర్షణలు, సమస్యలు శరణార్థులను ఉత్పత్తి చేస్తున్నాయి. అదే సమయంలో పాత శరణార్థుల సమస్యలను పరిష్కరించలేకపోతున్నాం. యుద్ధాలు, హింస, విద్వేషపూరిత ఘటనలతో ప్రపంచ వ్యాప్తంగా 7.1 కోట్ల మంది ప్రజలు శరణార్ధులై థాయ్‌ల్యాండ్‌ జనాభాను దాటేశారు,  ప్రపంచవ్యాప్తంగా 27.2 కోట్ల మంది ప్రజలు వివిధ దేశాల్లో వలస జీవనం సాగిస్తున్నారు. ఆశ్రిత దేశాలు ఆశ్రయం పొందుతున్న వలసదారుల భద్రత కోసం ప్రత్యేక చట్టాలు చేసి శరణార్ధులకు  రక్షణ కల్పించాలి.ప్రపంచ దేశాలు శరణార్థులను ఆదుకోవాలి.తమ దేశంలో సుస్థిర పరిస్థితులు నెలకొన్నాక ఇళ్లకు తిరిగి వెళ్ళాలి. శరణార్థుల భారాన్ని అన్ని దేశాలు సమానంగా పంచుకోవాలి. వలసదారులపై దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి ,ఈ విషయంలో ప్రపంచ దేశాలన్నీ విధివిధానాలను రూపొందించుకోవాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్‌ అభ్యర్థించారు.
--నూర్ బాషా రహంతుల్లా
విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266

 గీటురాయి 3.1.2020

1 కామెంట్‌: