ఈ బ్లాగును సెర్చ్ చేయండి

13, ఫిబ్రవరి 2020, గురువారం

రాజధానికి సరైన కేంద్రాలు రైల్వే జంక్షన్లే!

రాజధానికి సరైన కేంద్రాలు రైల్వే జంక్షన్లే! (సూర్య 16.2.2020)
రైల్వే జంక్షన్లే రాజధానికి సరైన కేంద్రాలు. చరిత్రలో వీటిని ప్రజల కోర్కెలతో, ప్రజల అవసరాలకు తగ్గట్లు, కాలానుగుణంగా ప్రభుత్వాలే ఏర్పాటు చేశాయి.ఇప్పుడున్న రైల్వే జంక్షన్ స్టేషన్లు ఆంధ్రలో 10 : విజయవాడ, తాడేపల్లి(కృష్ణా కెనాల్) , గుంటూరు,తెనాలి,భీమవరం,గుడివాడ, నిడదవోలు, సామర్లకోట, గూడూరు, నడికుడి. రాయలసీమలో 7: ధర్మవరం, ధోన్, గుత్తి,గుంతకల్లు ,పాకాల,పెనుకొండ, రేణిగుంట. మన సమాజ పురోగతి రైలుమార్గాలవల్లనే ఎక్కువగా జరిగింది.గతంలో ఊరికి రైలు ఉంటేనే కొంతమంది పిల్లనిస్తామనేవారట. సామాన్యప్రజలు కూడా తమప్రయాణాలకు రైలునే మొదట ఎంచుకుంటారు.చాలావరకు మన ప్రయాణ అవసరాలు తీర్చింది,తీరుస్తున్నది రైళ్లే కదా?విమానాలలో అందరూ వెళ్లలేరు.పుట్టపర్తిలో కూడా విమానాశ్రయం ఉంది.పూర్వం రాష్ట్రపెద్దలు తాడేపల్లిగూడెం,దొనకొండ లలోకూడా విమానాశ్రయాలకు ప్లాన్ చేశారు. ఇక గతుకుల రోడ్లపై బస్సులలో కుదుపులు.పదిమందీ కోరేది రైలునే. బెజవాడ (విజయవాడ) నేటికీ జిల్లా కేంద్రం కూడా కాలేదు.విజయవాడ సహజ సంపద రైల్వే జంక్షను కావటమే. రాష్ట్రానికి మూడు రైలు మార్గాల మధ్యస్థానం కాబట్టే విజయవాడను రాష్ట్ర రాజధానిగా చేసుకుందామని ప్రయత్నిస్తున్నారు.రైల్వే జంక్షన్లన్నీ సహజంగానే భవిష్యత్తులో అభివృద్ధి చెందే కేంద్రాలు.వాస్తవానికి అమరావతి అంటే విజయవాడే. గుంటూరు ,తెనాలి,విజయవాడ మూడూ రైల్వే జంక్షన్లే కాబట్టి అన్నీ వైపులనుండీ ప్రజలు ప్రయాణీకులు సులభంగా చౌకగా రాకపోకలు సాగిస్తారు.విజయవాడ ఎప్పుడో జిల్లా కేంద్రం కావలసింది.ఇప్పటికైనా అవబోతోంది సంతోషం.
బ్రిటీషు వాడు తనదేశానికి మన సంపదను తరలించుకుపోవటానికి అనుకూలంగా ఓడరేవులను రాజధానులుగా ఎన్నుకున్నాడని కొందరు చెబుతారు.ఇప్పుడు మనరాష్ట్రం భౌగోళిక స్వరూపాన్నిబట్టి మనం ఆలోచించుకోవాలి.రాజధానిని అన్నీ ప్రాంతాలవాళ్ళూ కోరుకుంటారు.వద్దని ఎవరూ అనరు. అయితే మధ్యస్థానానికి సెంటర్ అని ప్రత్యేకత సహజంగానే వస్తుంది.రాజధానిని అంచుల్లో పెట్టి కూడా అభివృద్ధి చేయవచ్చు,కానీ ప్రజలకు ఆ అంచులో దూరం భారమవుతుంది.ఒకరినొకరు దోచుకున్నారని అసూయలు పడటం కంటే కొత్త రైలు లైన్లు వేయించి జంక్షన్లు సాధించండి.కేంద్రస్థానం మధ్యలో ఉంటే నలువైపులవారికీ సమదూరంలో ఉంటుంది.పార్లమెంటు స్థానాలన్నీ జిల్లాలుగా చేస్తామనే హామీకి భిన్నంగా గురజాల పేరు వినబడగానే నరసరావుపేట వారిలో కలవరం మొదలయ్యింది.బాపట్ల జిల్లా కేంద్రం అయితే మాకు దూరం పెరుగుతుందని సంతనూతలపాడు వాళ్ళు గోలచేశారు.రాజమండ్రి జిల్లాలో కలపమని కొవ్వూరు వాళ్ళు,విజయవాడ జిల్లాలో కలపమని తాడేపల్లి వాళ్లు అడుగుతున్నారు. పార్లమెంటు నియోజకవర్గాలయినా సరే ప్రజలు దూరం పెరిగితే మొరపెడతారు.పాత తాలూకాలను చీల్చి మండలాలను ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ను నేటికీ గుర్తుంచుకొంటున్నారు జనం. రహదారి సౌకర్యం లేనిచోట్ల కూడా రాజకీయ పలుకుబడితో కొన్ని మండలాల కేంద్రాలను ఏర్పాటుచేస్తే ఇప్పటికీ జనం తిట్టిపోస్తున్నారు.అందువలన నలువైపులనుండి ప్రజల రాకపోకలకు రైలు,రహదారి సౌకర్యాలు ఉండటమే మండల కేంద్రాలకు గానీ ,రాజధానినగరానికి గానీ పెద్ద సంపద.వాటిని నిర్ణయించే ముందు పెద్దలుఇలా శాస్త్రీయంగా ప్రజల రోడ్డు రవాణా సౌకర్యాల గురించి ఆలోచించాలి.పూర్వం తెనాలి పక్కన చుండూరు కూడా జంక్షన్ గా ఉండేది.బ్రిటీష్ వాళ్ళు రైలుమార్గాలు తమకు అవసరమనుకున్న ప్రతిచోట్లకూ వేసుకున్నారు.ఆతరువాత రైలుమార్గం రావటం అంటే గొప్ప వారం దొరికినట్లే. నడికుడి-శ్రీకాళహస్తి రైలుమార్గం కోసం కొన్నితరాల జనం ఎదురుచూసి చనిపోయారు.కోనసీమకు నేటికీ రైలులేదు.తిరుమల వెంకటేశ్వరుని దేవాలయం జమ్మూలో కూడా కడతారట.దానివలన తిరుపతి గౌరవం తగ్గుతుందా?జమ్మూ ప్రజలకు ప్రయాణం కొంత తగ్గుతుంది.బ్రాంచీలు పెరగటం ఆయా ప్రాంతాల సౌకర్యాలు పెంచటానికే.
తెలంగాణాలో ప్రజలకు అవసరమైన పాలనామార్పులు చాలా సమయానుకూలంగా చకచకా జరిగాయి.కొత్తగా 23 జిల్లాలు ఏర్పడ్డాయి.ఇప్పుడు మొత్తం 33 జిల్లాలున్నాయి.పార్లమెంటు సభ్యులకంటే ఐ ఏ యస్ కలక్టర్లే ఎక్కువ ఉన్న రాష్ట్రం అది.చిన్నజిల్లాలతో గ్రామీణ ప్రజలకు దూరం భారం తగ్గాయి. జిల్లాలు పెరగటం వల్ల సబ్ కలక్టర్లు ,ఆర్డీవోలు ఉండే డివిజన్లు ,మండలాలు,గ్రామ పంచాయతీలు పెరిగాయి. దగ్గరలో పనులు జరగటం వల్ల ప్రజలలో సంతృప్తి స్థాయి పెరుగుతుంది..జిల్లా రెవిన్యూ అధికారుల వ్యవస్థను రద్దుచేసి వారి స్థానంలో అడిషనల్ కలక్టర్లను నియమించి పంచాయతీ రెవిన్యూ విధులను అందరికీ పంచటం జరిగింది.కొత్త రెవిన్యూ ,పంచాయతీ,మున్సిపల్ చట్టాలను ప్రవేశపెట్టే ప్రయత్నం జరుగుతోంది.సిరిసిల్ల,గజ్వేలు లలో రైలు కూత కూపిద్దామని శపధాలు చేస్తున్నారు.
ఉగాదినాటికి రాష్ట్రంలోని నిరాశ్రయులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు పంచాలని నవరత్నాలలో భాగంగా జగన్ ప్రభుత్వం తలపెట్టింది. 13 జిల్లాల్లో ఉగాది రోజునే మహిళల పేరుతో స్థలాలను రిజిస్ట్రేషన్‌ చేసి పట్టాలు పంపిణీ వేగంగా చేసేందుకు తహసీల్దార్లనే జాయింట్‌ సబ్‌రిజిస్ట్రార్లుగా నియమించారు .ఈ ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ఫీజు, స్టాంప్‌ డ్యూటీ, యూజర్‌ చార్జీల చెల్లింపు నుంచి లబ్ధిదారులకు మినహాయింపునిచ్చింది.అవసరాన్నిబట్టి రెవిన్యూ వాళ్ళకు రిజిస్ట్రేషన్ బాధ్యతలు ఇచ్చారు.పనులు త్వరగా జరగాలి అంటే పనివిభజన బాధ్యతల విభజన తప్పదు.జిల్లాలవిభజనకూడా పూర్తయితే ఇంకా బాగుండేది.కొత్తగా కొన్ని జిల్లాలు వచ్చేవి.
ఆంధ్రలో కూడా తెలంగాణాను మించి కొత్తజిల్లాలు ఏర్పాటుఅవుతాయనే ఆశలో ప్రజలు ఉన్నారు . గ్రామసచివాలయాలతో గ్రామ స్థాయి ఉద్యోగులు అందుబాటులోకి వచ్చారు. అర్జీల స్పందన ఊపు అందుకోంది.అమరావతి నుండి రాజధానిని ఏ క్షణమైనా విశాఖకు తరలిస్తామని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.60 రోజులనుండి అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని ధర్నాలు చేస్తున్న రైతులకు ఇది బాధాకరంగా ఉంది. ఈ గొడవల్లో కొత్త జిల్లాల ఏర్పాటు గానీ ,జోనల్ కార్యాలయాల ఏర్పాటుగానీ ప్రజలు మరచిపోయారు.కానీ అసలు సమస్యకు ఈ రెండూ చాలా వరకు పరిష్కారం చూపుతాయి. జోనల్ కార్యాలయాలతో సచివాలయ స్థాయి సేవలు కూడా అన్ని ప్రాంతాలకూ విస్తరిస్తాయి. ఈనాటి మండల, డివిజను కేంద్రాలే రేపటి జిల్లా కేంద్రాలు అవుతాయి. నవరత్నాలు ప్రజారంజకంగా ఉన్నాయి,ఆపధకాలన్నీ దీర్ఘకాలంలో మేలుచేసేవే.అయితే పంటిలోనిరాయిలా ఈ రాజధాని తరలింపు సమస్యగా మారింది. ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోడీ దగ్గర మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చినట్లు వార్తలొచ్చాయి.ఇప్పటికే లక్షలజనాభాతో పెద్దదయిన తీర నగరాన్ని మరింత జనాభారాన్ని మోపటం అనవసరం.ఎంతపెద్దనగరమైనా అది రైలు జంక్షను కాదు.ఒక అంచులో ఉంది. రాజధానుల అభివృద్ధికి దూరదృష్టి ఉండాలి. ఉత్తరాంధ్ర రాజధాని కోసం శ్రీకాకుళం – విజయనగరం మధ్యస్థానం , రాయలసీమ రాజధాని కోసం మధ్యస్థానం కడప . వీటిని రైల్వే జంక్షన్లుగా అబ్జివృద్ధి చెయ్యాలి. ఆతరువాత రాజధాని కేంద్రాలుగా వాటంతట అవే అభివృద్ధి చెందుతాయి. 
 https://www.facebook.com/photo.php?fbid=3011228035575833&set=a.233025936729404&type=3&theater
 నూర్ బాషా రహంతుల్లా , విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్,6301493266




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి