ఈ బ్లాగును సెర్చ్ చేయండి

6, ఫిబ్రవరి 2020, గురువారం

బాధ్యతలేని మాటలు ప్రేలాపనలు ఆపాలి


బాధ్యతలేని మాటలు ప్రేలాపనలు ఆపాలి (సూర్య 9.2.2020)
ఈ మధ్య కొందరు నాయకుల మాటలు విపరీతంగా ఉంటున్నాయి.గోముఖ వ్యాఘ్రాలలాగా విజృంభిస్తున్నారు. అసహన కోరలు చాస్తున్నారు. దేశ శాంతికాముకతను,సెక్యులర్ స్వరూపాన్ని తుడిచిపెట్టే మాటలు మాట్లాడుతున్నారు. నాగార్జునసాగర్ లాంటి నీటిపారుదల ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలు అన్న నెహ్రూను కించపరుస్తూ మాట్లాడుతున్నారు. జాతిపిత మహాత్మాగాంధీని చంపిన గాడ్సే మహానుభావుడని పార్లమెంటు సభ్యురాలు సాథ్వి ప్రజ్ఞాసింగ్ కీర్తిస్తే, మాజీ మంత్రి అనంత కుమార్ హెగ్డే అందుకు వంతపాడాడు.ఉపవాస సత్యాగ్రహఅనే డ్రామా ద్వారా గాంధీ మహా పురుషుడు అయిపోయారని అన్నారు.ఇందులో గాంధీజీ ప్రస్తావన నేరుగా లేదని ఆయన మరునాడు బుకాయించారు.
2014 లో  గాంధీ జయంతి నాడే స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని మోడీ ప్రారంభిస్తూ ప్రజలలోని శక్తిని సరైన మార్గంలో నడిపించి మార్పును సాధించిన మహానుభావుడు అని గాంధీజీని కీర్తించినా వీళ్ళకు బుద్ధిరాలేదు. జనానీకం ముందు నెహ్రూను గాంధీని విమర్శిస్తూనే ఉన్నారు.తరువాత మరోచోట మేము అలా అనలేదు అంటున్నారు.వీళ్ళకు మహాత్ముని అహింసా వాదం పట్ల లోలోపల ఇంత వ్యతిరేకత ఎందుకో? ఉపవాస సత్యాగ్రహం ద్వారా స్వాతంత్య్ర సాధన అనేది నాటకం కాదు. గాంధీజీ  అయాచితంగా, అనుచితంగా మహాపురుషుడయిపోలేదు. ఆయన అహింస,నిరాడంబరతలకు ప్రతీకగా నిలిచాడు,నడిచాడు.అంబేద్కర్ కూడా అణగారిన వర్గాలకు మేలుచేసే తన మంచి జ్నానము కృషి ఫలితంతోనే గొప్పస్థాయికి చేరాడు.
నోరుఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడటం మంచిదికాదు . నోరుజారితే తీసుకోలేము.నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది.ఎదుటివారి మనస్సు నొప్పించే మాట తీరు మంచిదికాదు.మంచి మాటలే మనకు  మర్యాద తెస్తాయి. అందరూ మెచ్చుకునేలా ఆహ్లాదకరంగా మాట్లాడగలగటం గొప్ప వరం. కొందరు నాయకులు నోటితో మాట్లాడుతూ నొసటితోవెక్కిరిస్తూదెబ్బతింటున్నారు. కటువుగా మాట్లాడడం కోటి దోమల పెట్టు అన్నారు.మాటలతో కోటలు సాధించవచ్చు.మాటలతోమంటలురగిలించవచ్చు.వాక్కుకత్తికంటేపదునైనది. మాటకు ప్రాణం సత్యం. మాట తీరును బట్టి మనిషిలోని మంచీ చెడ్డలను అంచనావేయవచ్చు. మృదువుగా మాట్లాడే వారితో వీలైనంత ఎక్కువ సేపు గడపటానికిఅందరూఇష్టపడతారు.మాన్పగలిగితికత్తికోతలు,మాన్పవశమేమాటకోతలు,కత్తిచంపును,మాటవాతలుమానవేనాడుఅన్నారుగురజాడ.పెదవి దాటితే పృథ్వి దాటుతుందన్నారు.అర్థంపర్థంలేని విపరీత వ్యాఖ్యలకు కోపతాపాలకు స్వస్తిపలికి మాటలు కలుపుకొంటే ఎంతమేలు? నోరా వీపుకు దెబ్బలు తేకే అనిసామెత.చెట్టు సారం పండులో వ్యక్తం అయినట్లు-మనిషి సారం మాటలో వ్యక్తం అవుతుంది.
 ముస్లిములకు ఇళ్ళు అద్దెకు ఇవ్వవద్దు అని ప్రవీణ్ తొగాడియా, రాహుల్ గాంధీ ఆవుమాంసం తిని కేదారనాథ్ వెళ్ళినందువల్లనే భూకంపాలు వచ్చాయని సాక్షి మహారాజ్, సోనియాకు తెల్లతోలువల్లనే అధికారం వచ్చింది అని గిరిరాజ సింఘ్, హిందువులు ఎక్కువమందిని కనాలి అని నరేంద్రజైన్, రష్యామహిళతో పంచె కట్టడం కాదు విప్పడం నేర్పిస్తానని బాబూలాల్, గంగానదిలో హిందువులు మాత్రమే స్నానం చేయాలని ముస్లిములకు అర్హతలేదని  సూర్యనమస్కారాలు రానివారు సముద్రంలో డూకండని యోగి ఆదిత్యనాథ్, ఖాన్ త్రయం సినిమాలు చూడొద్దు అని సాధ్వి ప్రాచీ, భారత్ మాతాకీ జై  అనకుంటే లక్షమంది తలలు నరికేవాణ్ణి అని బాబా రాందేవ్ , బూట్లు పాలిష్ చేసినవాళ్ళు పాలిస్తున్నారు అని మధు మిశ్రా, పాక్ ను పొగిడేవారిని బూట్లతో కొట్టి పాక్ కు పంపాలని సాధ్వి బాలికా సరస్వతి , సురేంద్రజైన్,గౌతమ్ గంభీర్ లాంటివారు  అన్నారు.ముస్లిములకు ఓటుహక్కు రద్దు చేయాలని శివసేన కోరింది. పౌరసత్వం కావాలని ఉద్యమాలు చేసే వారిని కుక్కల్ని కాల్చినట్లు కాలుస్తామని ,బాంబులువేస్తామని , 50 లక్షలమంది ముస్లిముల్ని దేశంనుండి పంపేస్తామని దిలీప్ ఘోష్ అన్నారు.ఇలాంటి విపరీత,అనాలోచిత,అనవసర  ప్రేలాపనలు,వ్యాఖ్యలవల్ల ఎవరికీ మేలులేదు, పైగా శాంతి సఖ్యతలను కోరే సామాన్యప్రజలు దూరమౌతారు.
మంచి వక్త సత్యవాక్కుతో చెలిమి చేయాలట. అబద్దాలు చెప్పి అదే నిజమని నమ్మించే వారు నిత్య జీవితంలో మనకు అక్కడక్కడ తటస్థపడుతూనే ఉంటారు.నోరు కల్లలపుట్ట పేరు హరిశ్చంద్రుడు లాంటి నాయకులు దేశానికి ప్రమాదం.ఓదె కట్టే దొంగ పరిగ ఏరే వాడిని బెదిరించినట్లు మెజారిటీ బలంతో తమబుర్రకు తోచిన అబద్దాలను సత్యాలుగా ప్రకటించేపనిలో కొంతమందినాయకులున్నారు.అధికారంలో కొనసాగాలనుకునే ఏ పార్టీ అయినా ఏనాయకుడైనా ప్రజలలో పలచబడకుండా జాగ్రత్తపడాలి.వెనకాముందూ చూసుకోకుండా ఏదిబడితే అది  మాట్లాడే అనుచరగణం వల్ల అధినాయకులకే ముప్పురావచ్చు.కాబట్టి అసత్య ప్రేలాపకుల్ని అనుచరుల్లోనుంచి ఎరిపారేయ్యాలి.
చంపదగినయట్టి శత్రువు,తనచేత చిక్కెనేని కీడుసేయరాదు, పొసగ మేలుజేసి పొమ్మనుటే చాలు లాంటి హితవాక్యాలు వేమన పద్యాలు  చదివి పెరిగిన జాతిమానది. ఎవరైనా శాంతిబాటలోకి రావలసిందే.చివరికి అహింసే పరమధర్మం అని మంచివాళ్లు తేల్చారు.కొన్నేళ్లు బ్రతికి భూమిని వదిలి వెళతామనుకునే భావనతో జ్నానులంతా జీవితం తాత్కాలికమనే అనుకున్నారు కానీ  నియంతలై తమ మాటలతో గానీ చేష్టలతో గానీ ప్రజల ఉసురు తీయలేదు.అందువలన తోటి మానవులకు కీడు చేయటం,పొరుగువాడి నాశనాన్ని కోరుకోవటం మనం ఏర్పాటు చేసుకున్న నాగరిక మానవతా ధర్మాలకు విరుద్ధం. పదవులను వదిలి సత్యంకోసం అడవుల పాలైన రాముడు,బుద్ధుడు పాలకులకు గుర్తు రావాలి.
--   నూర్ బాషా రహంతుల్లా ,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్,6301493266


1 కామెంట్‌: