ఈ బ్లాగును సెర్చ్ చేయండి

19, ఫిబ్రవరి 2020, బుధవారం

శాంతికోసం పాలస్తీనా, కుర్దిస్థాన్ దేశాలు ఏర్పడాలి

ఆదేశాల ఏర్పాటుతో శాంతి (సూర్య 23.2.2020)

శాంతికోసం పాలస్తీనా, కుర్దిస్థాన్ దేశాలు ఏర్పడాలి
పాలస్తీనా-ఇజ్రాయిల్‌ మధ్య మంటలు దశాబ్దాలుగా ఆరని కారుచిచ్చులా రగులుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇశ్రాయెల్ , పాలస్తీనా రెండింటిని 'స్వతంత్ర రాజ్యాలు'గా గుర్తించానన్నాడు. అతని దృష్టి మొత్తం ఇజ్రాయిల్‌ పక్షమే. 2017లో ఇజ్రాయిల్‌ జెరూసలేం లో తన రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది . ట్రంప్ రెండు స్వతంత్ర రాజ్యాల ప్రతిపాదన ప్రకారం పాలస్తీనియన్లు తమ భూభాగాలను ఇంకా వదులుకోవాలి. వెస్ట్‌ బ్యాంకు లోని యూదుల సెటిల్‌మెంట్లతో పాటు జోర్డాన్‌ లోయను కూడా ఇజ్రాయిల్‌కు పాలస్తీనా వదులుకోవాల్సి వస్తుంది. తూర్పు జెరూసలేం పాలస్తీనియన్ల రాజధాని అవుతుందట. మిగతా జెరూసలేం ఇజ్రాయిల్‌కు రాజధాని కావాలట . ఇజ్రాయిలీలకు జెరూసలేం ఎంత పవిత్రమైనదో.పాలస్తీనీయన్లకూ అంతే పవిత్రమైనది. ఇది ఇరువురికీ అత్యంత ముఖ్యమైన ప్రాంతం. అలాంటి పవిత్రస్థలంపై మీకు హక్కు లేదంటే ఎలా?
గాజాను విస్తరించటానికి ఇజ్రాయిల్‌లో ఉన్న అరబ్‌ పట్టణాలతో వెస్ట్‌బ్యాంకు లోని ప్రాంతాలను మార్పిడి చేసుకొనే ప్రతిపాదన వల్ల 30 శాతం వెస్ట్‌బ్యాంక్‌ ప్రాంతాన్ని పాలస్తీనా కోల్పోతుంది. పాలస్తీనా స్వతంత్ర పోరాటంలో వివిధ దేశాలకు తలదాచుకునేందుకు వెళ్లిన పాలస్తీనియన్లు తిరిగి తమ సొంత గడ్డపై అడుగు పెట్టేందుకు వీల్లేదట. శరణార్థులు ఎవ్వరైనా తమ సొంత స్థలాలకు వెళ్లడం అంతర్జాతీయంగా ఆమోదయోగ్యమైన హక్కు. ఇజ్రాయిల్‌ చేతిలో హత్యకు గురైన బాధిత కుటుంబాలకు సాయం చేయరాదట. ఇజ్రాయిల్‌ జైళ్లలో బందీలుగా ఉన్న పాలస్తీనియన్లపై అమానుష చర్యలను అంతర్జాతీయ వేదికలపై నిలదీయరాదట. స్వతంత్ర రాజ్యంగా ఆవిర్భవించ వచ్చుననే ఆకాంక్షతో ఒకవేళ ట్రంప్‌ ప్రతిపాదనలన్నిటిని పాలస్తీనా అంగీకరిస్తే ఇప్పుడున్న స్వేచ్ఛ, స్వతంత్రత కూడా అది కోల్పోవడం ఖాయం. చుట్టూతా ఉన్న ప్రాంతాలన్నీ ఇజ్రాయిల్‌ ఖాతా లోకి వెళ్లడం వల్ల కుచించుకుపోయిన వెస్ట్‌బ్యాంకుతో పాలస్తీనా ఇజ్రాయిల్‌ చేతిలో ఒక బందీ లాగా బతుకు వెళ్లదీయాల్సిందే. ఆ కొంచం కూడ కబళించెస్తే ,పాలస్తీనా అనే దేశమే ఉండదు . చిన్నప్పుడు మూడవతరగతిలో బలిచక్రవర్తిని భూమిలోకి తోక్కెసిన వామనావతారం,ముందు ముడ్డి పెట్టుకోటానికి చోటు అడిగి చివరికి అరేబియావానిని బయటికి నెట్టేసి పూర్తిగా గుడారాన్ని ఆక్రమించిన ఒ౦టె కధ చెప్పేవారు. అలాగే దేవుడు తమజాతికి ఏనాడో చేసిన వాగ్దాన భూమి అంటూ ఇస్రాయెల్ దేశం అమెరికా వత్తాసుతో పాలస్తీనాను క్రమంగా ఆక్రమిచింది. ఐరాస ఏమీ చేయలేక ఊరుకుంది.చుట్టూ ఉన్న అరబ్ దేశాలు తమ తమ అంతర్గత యుద్ధాలలో మునిగితేలుతూ పాలస్తీనాకు ఏమీ చేయలేదు.1946 లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పటినుండి పాలస్తీనా ఎలా చిక్కిశల్యమైపోయిందో చూడండి:
 
ఇప్పుడు అక్కడి దేశం వాస్తవానికి ఇజ్రాయెలే. ఎక్కడెక్కడో చెదిరిపోయిన యూదులు ఇశ్రాయెల్ వచ్చి దేశాన్ని ఏర్పాటుచేసుకోగా అక్కడ ఉన్న పాలస్తీనీయులు పలుదేశాల్లో చెల్లాచెదురు అయ్యారు. మిగిలిన అవశేష పాలస్తీనా అయినా ఈనాటికీ స్వతంత్ర రాజ్యం కాలేదు. చిత్రమేమంటే ప్రపంచంలో ఇజ్రాయెల్‌ ఒక్కటే కుర్దుల రిఫరెండాన్ని సమర్ధించింది. కుర్దులు , పాలస్తీనీయులు తమ భూభాగాలలోనే శరణార్ధుల్లాగా బ్రతుకుతున్నారు. ఇరాక్, ఇరాన్, టర్కీ, సిరియాలు కుర్డుల భూభాగాలను కలిపేసుకున్నాయి. కుర్దులు,పాలస్తీనీయులు తీవ్ర అణచివేతనూ, వేధింపులనూ ఎదుర్కొంటున్నారు. స్వతంత్ర పాలస్తీనా, స్వతంత్ర కుర్దిస్తాన్‌ ఏర్పాటు అమెరికాకు ఇష్టం లేదు.జాతుల స్వయంప్రతిపత్తిని గౌరవిస్తేనే ప్రశాంతత ఏర్పడుతుంది.ఐక్యరాజ్యసమితి వాయిదాలతో పొద్దుపుచ్చకూడదు. చరిత్ర పొడవునా రణరంగం యుద్ధాలేనా? యుద్ధాల వల్ల ఏమి సాధించాము ? ఒక మనిషిపై మరో మనిషి అధికారం, ఒక జాతిపై మరొకజాతి ఆధిపత్యం ఇంకా చెల్లాలా? ఏ యుద్ధమూ మానవజాతి మనుగడకోసం కాదు.యుద్ధాలలో జరిగేది నరబలి,మానవ హననమే. అశోకుడు యుద్ధంలో జరిగిన మారణ కాండను, రక్తపాతాన్ని చూసి శాంతి మార్గంలోకి మారాడట. ఆర్య ద్రవిడుల యుద్ధాల వల్ల ఫలితం ఏమీలేదు. అమెరికన్లు నీగ్రోలపై శ్వేతజాతి ఆధిపత్యాన్ని చూపారు. జాత్యహంకారంతో హిట్లర్ నియంతగా మారి లక్షలాది మందిని చంపించాడు. రష్యా, చైనాల్లో జరిగిన సాయుధ విప్లవాల్లో ఎంతో జన నష్టం జరిగింది. ప్రపంచాన్ని ఆయుధాలతో నింపుతూనే ఉన్నా రు. అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ సామ్రాజ్యవాద,ఆధిపత్య ధోరణినే చూపిస్తున్నారు.ప్రాణ నష్టంతో పాటు,వేలఏళ్లు శ్రామికులు కష్టపడి నిర్మించిన నాగరికత కూడా ఎందుకు నాశనమై పోవాలి? ఎవరికి ప్రయోజనం?ఎప్పుడూ తుపాకులతో కొట్టుకు చచ్చే వీళ్ళకు దేశాలెందుకు అనిపించవచ్చు. యుద్ధం ఆటవికం, శాంతి ప్రజాస్వామికం. శాంతి సామరస్యాలు ప్రజాస్వామ్య మూలగుణాలు.అందరినీ సుఖంగా బ్రతకనివ్వటమే నాగరికత . భూతాపం(గ్లోబల్ వార్మింగ్‌ ) తో భూగోళంపై మాన వ జాతి ఇంకో 200 ఏళ్ళు మాత్రమే ఉంటుందని శాస్త్రజ్నులు చెప్పారు.మన దేశాల అధిపతులు ఇది గుర్తెరిగి, శాంతిదూతలు, మానవతా మూర్తులు కావాలి.ప్రపంచ దేశాలలో యుద్ధ తాపాలను తగ్గించటం కూడా ఐరాస బాధ్యతల్లో ఒకటి.
 నూర్ బాషా రహంతుల్లా,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి