ఈ బ్లాగును సెర్చ్ చేయండి

11, మార్చి 2020, బుధవారం

సానబెడితే మన పిల్లలూ ఆటల్లో వజ్రాలే




సానబెడితే మన పిల్లలూ ఆటల్లో వజ్రాలే
https://www.facebook.com/williams32143/posts/3084517791580190

స్వర్గీయ  షేక్ షంషేర్ ఖాన్ ఒలంపిక్స్ లో తొలి భారతీయ ఈతగాడు,బందరు దగ్గర పల్లెటూరువాసి.ఏటిమరుపు రజని అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి చిత్తూరుజిల్లా కుగ్రామీణ యువతి . విలువిద్యాకారిణి జ్యోతి సురేఖ  స్వర్గీయ విలుకాడు చెరుకూరి లెనిన్ కుమార్తె . .భారత పరుగుల వీరులు కంబళ పోటీల్లో గెలిచిన శ్రీనివాస గౌడను నిశాంత్ శెట్టిని భారతీయ ఉసైన్ బోల్ట్ అని పొగుడుతున్నారు. స్వయంకృషితోనే మేరీకోమ్‌, సానియా మీర్జా, సైనా నెహ్వాల్‌, సింధు, హరికృష్ణ, హంపి, జ్యోతి సురేఖ ,రాగాల వరుణ్ ,హిమాదాస్ లాంటి క్రీడాకారులు వెలుగులోకి వచ్చారు. అర్జునుడితో పాటు ఏకలవ్యుడు, కర్ణుడుకూడా విలువీరులుగా ఎదిగిన జాతి మనది. ప్రభుత్వ వ్యవస్థల ద్వారా పైకెగసిన ఆటగాళ్లు భారత్‌లో అతి అరుదు. వీళ్ళ ప్రతిభకు సానబెడితే భారత్ కు స్వర్ణ పతకాలు ఖాయం. సౌకర్యాల ఊసే లేని కుగ్రామాల నుండి అంతర్జాతీయ స్థాయికి చేరిన కష్టజీవులు కొందరు. విజయాలవెనుక వారి కుటుంబాలు పడిన ఇబ్బందులు, అవమానాలు ఎన్నో. హైస్కూలు దశలో వ్యాయామ ఉపాధ్యాయులు ప్రోత్సహించిన వాళ్ళూ ,ఆటలను సీరియ్‌సగా తీసుకొని ప్రాక్టీస్‌ చేసినవాళ్లూ, ఏళ్లతరబడి శిక్షణ తీసుకున్నవాళ్ళూ ,రాష్ట్ర, అంతర్రాష్ట్ర, జాతీయ క్రీడా పోటీల్లో సత్తా చూపించారు. అంచెలంచెల విజయాలతో అంతర్జాతీయ స్థాయిలో వారికి గుర్తింపు దొరికింది. మన గ్రామీణ క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం కానీ, క్రీడాకారుల నైపుణ్యాన్ని పెంచే సౌకర్యాలు కానీ లేవు. కనీసం బస్సు సౌకర్యం కూడా లేని ప్రాంతాల నుంచి అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా ఎదగడం సాధారణమైన విషయం కాదు.చదువులో వెనకబడినా, ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా, తాహతుకు మించి అప్పులు చేసి మరీ శిక్షణకు వెళ్ళాలి. శాప్‌ శిక్షణ కేంద్రాలలో రాటుతేలాలి. ప్రభుత్వం కొందరు విజేతలకు నగదు బహుమతి, గ్రూప్‌-1,2 ఉద్యోగాలు ఇస్తోంది. ఆ బహుమతులతో పేద క్రీడాకారుల కుటుంబాలకు ఆర్థికంగా ఉపశమనం లభిస్తుంది. క్రీడారంగంలో ఉన్న మహిళల్ని అన్ని విధాలా ప్రోత్సహించాలి. అప్పుడే మరికొంత మంది మహిళలు ఈ రంగంలో ప్రవేశించగలుగుతారు.

ప్రపంచకప్‌ సాధనే లక్ష్యంగా చైనా ఫుట్‌బాల్‌ యజ్ఞంలా చేస్తోంది.చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ స్వయంగా ఫుట్‌బాల్‌ క్రీడాభిమాని! ఆయనే ముందుండి ఈ మహాయజ్ఞాన్ని నడిపిస్తున్నారు.చైనా ప్రభుత్వం లక్ష్యసాధనను ఫాస్ట్‌ట్రాక్‌పై పెట్టింది. కఠిన శిక్షణలా కాకుండా వినోద, విజ్ఞాన ప్రధానంగానే ఈ పాఠశాలల్లో చిన్నారులకు ఆటను నేర్పిస్తున్నారు.2004, 2012, 2016 ఒలింపిక్స్‌ పతకాల పట్టికలో అమెరికా తరవాత రెండు మూడు స్థానాల్లో చైనా ఉంది. 2008లో ఒలింపిక్స్‌ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడమే కాదు, 48 స్వర్ణాలతో మొత్తం వంద పతకాలు గెలుచుకుని అగ్రస్థానంలో నిలిచింది. అయిదేళ్లలో క్రీడల ద్వారా 46 వేలకోట్ల డాలర్లను ఆర్జించవచ్చని, 2025 నాటికి అది 81,300 కోట్ల డాలర్లకు పెరగవచ్చని చైనా అంచనా వేస్తోంది. ప్రఖ్యాత బ్రెజిల్‌ దిగ్గజ ఆటగాళ్లు రొనాల్డొ, రొనాల్డిన్హో వంటి ఆటగాళ్లు, కోచ్‌లు సైతం చైనా బాటలో నడుస్తున్నారు.

ప్రస్తుతం చైనావ్యాప్తంగా అయిదు కోట్ల మంది పిల్లలు, యువకులు ఫుట్‌బాల్‌ నేర్చుకుంటున్నారు. చైనా ఇదే దూకుడు కొనసాగిస్తే ఫుట్‌బాల్‌ ప్రపంచకప్పు విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం! క్రికెట్‌ ఆటకు భారత్‌ ఆర్థిక రాజధాని అయినట్లుగానే, ఫుట్‌బాల్‌ ఆర్థిక వ్యవహారాలకు చైనా ప్రధాన కేంద్రమవుతుందట. ఒక ఆటను ప్రోత్సహించాలంటే ప్రణాళికలు ఎంత పకడ్బందీగా రచించాలో చైనాను చూసి భారత్‌ నేర్వాలి. చైనాలో వ్యవస్థల ద్వారా వందలు, వేల సంఖ్యలో ఆటగాళ్లు ఉద్భవిస్తున్నారు. మనదేశంలో పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధం. క్రికెట్‌ మినహా ఇతర క్రీడలకు భారత్‌ ఇస్తున్న ప్రోత్సాహం పెద్దగా లేదు. చైనాలో ఉన్నది, భారత్‌లో లేనిది ఏమిటంటే మూలమూలకూ క్రీడాసంస్కృతి విస్తరించడం. చైనా మాదిరిగా భారత దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువకులను ఏదో ఒక ఆటలో రాణించేలా చేయాలి. ఇప్పటివరకు అంతర్జాతీయ ఆటల పోటీలలో మన దేశం నవ్వుల పాలవుతోంది. క్రికెట్, టెన్నిస్, షూటింగ్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, హాకీ వంటి వేర్వేరు క్రీడాంశాల్లో దిగ్గజాలున్నారు.కరోనాను నిర్మూలించటంలో చైనా వారి కృషి ఎంత గొప్పదో మన కళ్లతో చూశాం.అలాగే పతకాలను సొంతం చేసుకోటానికి చైనా ఆటలపై పెడుతున్న శ్రద్ధ మనమూ పెట్టాలి .

మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం దేశంలోని 40 శాతానికిపైగా బడులకు ఆట స్థలాలు, విద్యుత్‌ సదుపాయం, పాఠశాలలకు ప్రహారీ గోడల్లేవని, ఇది పిల్లల భద్రతకు, ఆ బడులకు సంబం ధించిన ఆస్తికి చేటు తెస్తుందని హెచ్చరించింది. జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఆ బడుల ప్రహారి గోడల నిర్మాణం చేయిస్తే మంచిదని ప్రతిపాదించింది. మన రాష్ట్రంలోమన బడి నాడునేడుకార్యక్రమానికి 15 వందల కోట్లు కేటాయించారు. ఈ డబ్బుతో బడుల్లో మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్‌ సౌకర్యం, అదనపు తరగతి గదుల నిర్మాణం, బ్లాక్‌బోర్డుల ఏర్పాటు, ప్రహారీల నిర్మాణంవంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి. దేశ జనాభాలో సగానికిపైగా పాతికేళ్లలోపువారే. వీరంతా పాఠశాలల్లో, కళాశాలల్లో చదువుకుంటున్నారు. భారత క్రికెట్‌ జట్టులోకి ప్రవేశించిన సచిన్‌ తన ఎదుగుదలకు చిన్ననాడు చదువుకున్న బడిలోని ఆట స్థలమే దోహదపడిందని వివరించాడు. కానీ బడుల ఆటస్థలాలను పట్టించుకున్నవారేరి?సానబెడితే మనపిల్లలూ వజ్రాల్లా తయారవుతారు.

n   నూర్ బాషా రహంతుల్లా,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ ,6301493266




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి