ఈ బ్లాగును సెర్చ్ చేయండి

19, మార్చి 2020, గురువారం

న్యాయ మూర్తులకు కీర్తి ప్రతిష్ఠలే కదా ఆస్తులు !


న్యాయ మూర్తులకు కీర్తి ప్రతిష్ఠలే కదా ఆస్తులు ! (సూర్య 22.3.2020)


అరాచకశక్తులనుండి ప్రజాస్వామ్యాన్ని కాపాడే అంతిమరక్ష సుప్రీంకోర్టు అని జస్టిస్ రంజన్ గొగోయ్ గతంలో అన్నారు.ఎన్నో నీతులు చెప్పిన రంజన్‌ గొగోయ్‌ తనను రాజ్యసభకు నామినేట్‌ చేయగానే ఏమాత్రం సంకోచంలేకుండా చేరిపోయారు.పైగా శాసన, న్యాయవ్యవస్థలు రెండూ కలసికట్టుగా పనిచేయాలన్న కోరికతో రాజ్యసభ పదవిని అంగీకరించాడట. గతంలో జస్టిస్‌ దీపక్‌ మిశ్రాకు సిక్కుల ఊచకోత కేసులో ప్రభుత్వ సానుకూల తీర్పు ఫలితమే రాజ్యసభ సీటు అని గగ్గోలు పెట్టిన గొగోయ్ తన దగ్గరకు వచ్చేటప్పటికి కళ్లుమూసుకున్నారు. మరి గొగోయ్ కూడా జాతీయ పౌర పట్టిక, రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు,అయోధ్య బాబ్రీ మసీదు రామజన్మభూమి కేసుల్లో తీర్పులిచ్చారు.వీటన్నిటికి ఈ రాజ్యసభ సీటు ప్రతిఫలమా అని మదన్ లోకూర్ ,కురియన్ జోసఫ్ లాంటి తోటి న్యాయమూర్తులే విమర్శిస్తున్నారు.పైగా ఒక మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించారన్న ఆరోపణలున్నగొగోయ్‌కి పెద్దలసభ పదవి ఇవ్వడం తగదని అంటున్నారు.జస్టిస్ మార్కండేయ కట్జూ అయితే గొగోయ్ సిగ్గుమాలిన న్యాయమూర్తి అన్నారు. లంచానికి ,మంచానికీ ఆశించే న్యాయమూర్తులవలన న్యాయవ్యవస్థ స్వతంత్రతపై అనుమానాలు పెరుగుతాయనీ ,న్యాయ పదవుల గౌరవం తగ్గిపోతుందనీ కొందరు పెద్దలు ఆక్రోశించారు.
పూర్వం జస్టిస్ నిసార్‌ అహ్మద్‌ కక్రూ, బహరుల్‌ ఇస్లాం, రంగనాథ్‌ మిశ్రా, హిదయ తుల్లా, ఫాతిమా బీవీ లాంటి కొందరికి పదవులిచ్చారు. బహరుల్‌ ఇస్లాం రాజ్యసభకు ఎన్నికై ఆ పదవికి రాజీనామా చేసి గౌహతి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి రిటైరయ్యాక ఆయన్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించారు. తరువాత పదవిని వదులుకుని అసోం నుంచి లోక్‌సభకు కాంగ్రెస్‌ తరఫున పోటీచేశారు. జస్టిస్‌ సదాశివం కేరళ గవర్నర్‌గా నియమితులయ్యారు.న్యాయమూర్తులు తమ తీర్పుల ద్వారా సమాజాన్ని ప్రభావితం చేస్తారు. పదవీ విరమణ అనంతరం ఆశబోతుతనంతో ప్రభుత్వాలిచ్చే రాజకీయ పదవులు తీసుకోకూడదని,ఇలా వచ్చే పదవుల్ని ఆశించి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు రాస్తున్నారని స్వర్గీయ అరుణ్‌ జైట్లీ వాదించేవారు. సీనియారిటీని కాదని జస్టిస్ రే,బేగ్ లకు ప్రధాన న్యాయమూర్తుల పదవులు ఇవ్వకూడదని ఆనాడు భీష్మించిన బీజేపీ తనవాదనలను తానే ఉల్లంఘించింది అంటున్నారు.
సీవీసీ లాగా న్యాయమూర్తులు కూడా పదవీ విరమణ చేశాక మరే పదవి చేపట్టకూడదనే రాజ్యాంగ నిబంధన ఉండాలి. పదవీ విరమణ తర్వాత న్యాయమూర్తులు ఏ పదవీ చేపట్ట కూడదని జస్టిస్‌ కేటీ థామస్, జస్టిస్‌ లోథాలు చెప్పారు.గతంలో ఇవే మాటలు చెప్పిన జస్టిస్‌ గొగోయ్‌ రిటైరైనాక ఇప్పుడు మాటమార్చి రాజ్యసభ సభ్యత్వాన్ని అంగీకరించారు.ఆనాడు జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా ప్రధాని మోడీని బాహాటంగా కీర్తించారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి అంటే ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడే రక్షకుడు అని ప్రజలు భావిస్తారు. అలాంటి న్యాయరక్షకుల్ని పాలకులు మళ్ళీ తమసేవలోనే పెట్టుకోవటం ఎందుకు? తమకు అనుకూలంగా తీర్పులిచ్చిన న్యామూర్తులకు పదవీ విరమణ తరువాత పదవులిచ్చి కాపాడుకోవటం లంచగొండితనం కాదా? న్యాయమూర్తులు పదవీ విరమణ చేసిన తరువాత లాభదాయక పదవులు పొందితే వారి తీర్పులపై అనుమానం రాదా? న్యాయవ్యవస్థ స్వతంత్రను స్వచ్ఛతను కాపాడేందుకు రిటైరైన వారు పదవులకు దూరంగా ఉండాలనే విషయమై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను హెచ్‌ ఎల్‌ దత్తు,ఎస్‌ఎ బాబ్డే ధర్మాసనాలు కొట్టివేయటం సబబేనా? న్యాయమూర్తులు పదవీ విరమణ తరువాత ఎలాంటి పదవులను చేపట్టరాదని చెప్పిన న్యాయమూర్తులే మాటతప్పితే ఎలా?పెన్షన్ తో ఏ పదవీ లేకుండా శేష జీవితం గడపలేరా?ఇప్పటికైనా దీనికి ఒక రాజ్యాంగ శాసనం రావాలి.
గతంలో ఏవైనా తప్పులు జరిగితే వాటిని సరిదిద్దకుండా అదే తప్పును తాము చేస్తామనడం ఎవరికీ తగదు. ప్రభుత్వం పదవులు లంచంగా ఇచ్చి న్యాయవ్యవస్థను లొంగదీసుకోకూడదు. న్యాయమూర్తులు ప్రజలు అందరికీ ఆదర్శంగా ఉండాలి.లేకపోతే ప్రజలకు న్యాయవ్యవస్థమీద నమ్మకం పోతుంది. మన నేతలు స్వార్ధం విడిచి పదవులు త్యాగాలు చేశారు.ఏపదవీ పొందని గాంధీజీనే మనకు ఉదాహరణ. న్యాయవాది కూడా తనకు స్వీయ నియంత్రణ విధించుకుంటాడు.విధించుకోవాలి. న్యాయమూర్తికి అవినీతి,ధనాపేక్ష ,కుల పక్షపాతాలులాంటి అవలక్షణాలు ఉండకూడదనే అతన్ని స్వేచ్ఛగా స్వతంత్రంగా న్యాయపాలకునిలాగా పెద్దలాగా ఉంచి గౌరవించారు. న్యాయవాది న్యాయమూర్తిగా మారేటప్పటికి న్యాయంగా బ్రతకడంలో మరింత పరిణితి చెందాలి.ఎన్నో వివాదాలలో తీర్పులు ఇచ్చిన అనుభవం న్యాయమూర్తికి కొన్ని ఆదర్శాలు నెరుతుంది.హత్యాచారాలు చేసిన దుర్మార్గుల తరుపున అసలు న్యాయవాదనే చెయ్యమని నిరాకరించిన న్యాయవాదులు కొందరు ఉన్నారు.న్యాయవాదిగా గాంధీజీ ఇలాగే ముందు వాది దగ్గర విషయాలు ముందుగానే కనుక్కొని ఆరా తీసేవాడట.మరి ఇప్పుడు సమాజంలో అలాంటి న్యాయవాదుల్ని గుర్తించటం తప్పనిసరి.న్యాయం త్వరగా జరక్క ,అసలు జరుగుతుందో లేదో తెలియక నిర్భయ తల్లి ఇప్పటికీ ఏడుస్తోంది.అయిషా బేగం తల్లి ఏడుస్తోంది.నిర్భయ హత్యాచార దోషుల పక్షాన ఉరి వద్దని నిస్సిగ్గుగా వాదిస్తున్న ఏపి సింగ్ లాంటి న్యాయవాదులకు , నిర్భయ దోషుల్ని ఉరి తీసినంత మాత్రాన నేరాలు ఆగవని నిరాశ పరిచే కురియన్ జోసఫ్ లాంటి న్యాయమూర్తులకు న్యాయ వ్యవస్థ అడ్డుపడాలి. న్యాయవాదులు,న్యాయమూర్తులు,అధికారులు,రాజకీయనాయకులు కలిసి పనిచేయటం వల్ల నేరగాళ్ళను పట్టుకొని త్వరగా శిక్షించాలి.న్యాయమూర్తులు రాజకీయనాయకులతో కలిసి పనిచేయటం అనేది ఇప్పుడున్న సమాజంలో సాధ్యమేనా?కోర్టులనీతి మీద నమ్మకం ప్రజలకు ఇకపై ఉంటుందా? విశ్రాంత న్యాయమూర్తిని రాజ్యసభలో కూచోబెట్టడం ఎందుకో? ఇంకా కావాలనే దురాశకు పోతే ఇచ్చినవారికీ పుచ్చుకున్నవారికీ కూడా అప్రదిష్టే మిగులుతుంది. విశ్రాంత ఉద్యోగులకు మళ్ళీ పదవులిచ్చి నిరుద్యోగులకు అన్యాయం చెయ్యకూడదని ప్రభుత్వాలకు ఎందరో చెబుతున్నారు.అలాగే విశ్రాంత న్యాయమూర్తులు రాజకీయపార్టీలలో చేరకూడదని ఎలాంటి లాభదాయక పదవులనూ పొందకూడదని రాజ్యాంగ సవరణ చెయ్యాలి.న్యాయవ్యవస్థలో చేరేటప్పుడే న్యాయవాది ఆశానిగ్రహం అలవాటుచేసుకోవాలి.న్యాయవాద పదవులకు ధన సంపాధనే లక్ష్యం కాకూడదు. జస్టిస్ మురళీధర్ బదిలీకి వెరవకుండా ఢిల్లీ పోలీసుల్ని ప్రశ్నించారు.జస్టిస్ లోయాను తీర్పు నచ్చని దుర్మార్గులు హతమార్చారు. న్యాయమూర్తుల జీవితం కత్తిమీదసామూలా ఉంటుంది.దురాశకుపోతే దొరికినంత సంపాదించుకోవచ్చు కానీ దురాశ దుఖము చేటు అన్నారు. న్యాయ మూర్తులకు చివరికి మిగిలేది కీర్తి ప్రతిష్ఠలే అని గ్రహించి శాసన కర్తలు ఇప్పుడైనా రాజ్యాంగ సవరణకు పూనుకోవాలి.
 నూర్ బాషా రహంతుల్లా,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి