ఈ బ్లాగును సెర్చ్ చేయండి

5, మార్చి 2020, గురువారం

ఈ బడ్జెట్ నిరుద్యోగాన్ని తగ్గిస్తుందా?


ఈ బడ్జెట్ నిరుద్యోగాన్ని తగ్గిస్తుందా?
నిరుద్యోగాన్ని రూపుమాపేదెలా? (సూర్య 8.3.2020)
మిగిలినదేశాలతో పోలిస్తే మానమెక్కడున్నాము? లోపం ఎక్కడుంది?సరైన ఉద్యోగాలురాని చదువులెందుకని వగరుద్దామా?సొంతకాళ్లపై నిలబడేదెలా ?

ప్రపంచదేశాల్లో నిరుద్యోగుల శాతం ఇలా ఉంది :

కంబోడియా,థాయ్ ల్యాండ్ 1 , జపాన్,చెక్,కువైట్,లావోస్,మొనాకో,సింగపూర్,ఎమిరేట్స్,వియత్నాం 2, జర్మనీ,గ్వాటెమాలా,క్యూబా.భూటాన్,నేపాల్,హాంగ్ కాంగ్ ,ఐస్ ల్యాండ్,నెదర్ ల్యాండ్స్ , స్విట్జర్ ల్యాండ్ 3,

మలేసియా,మెక్సికో,బహ్రైన్,బంగ్లాదేశ్,చైనా,ఇజ్రాయెల్,న్యూజిల్యాండ్,నార్వే,పోలాండ్ ,రుమేనియా,శ్రీలంక,తైవాన్,బ్రిటన్, అమెరికా 4.

జార్జియా, బ్రెజిల్,ఇరాన్ 13, గ్రీస్,ఇరాక్ 16, బోస్నియా,ఆర్మీనియా 21, డొమినికా, ఆఫ్ఘనిస్తాన్ 24 , పాలస్తీనా, దక్షిణాఫ్రికా 29 ,

వెనెజులా, యెమెన్, నమీబియా 34, సిరియా 50.

మనదేశ పరిస్తితి ఎలా ఉంది?

1901 లో 24 కోట్లు ఉన్న మనదేశ జనాభా 2020 లో 133 కోట్లని అంచనా. అందులోఎప్పుడూ నూటికి 8 మంది నిరుద్యోగులే ఉంటున్నారు.యువకులు మన జాతి భవిష్యత్తు నిర్మాతలు. పనికొచ్చే చదువులు, ఉపాధి కల్పన వారికి నిరంతర అవసరాలు. సరైన ఉద్యోగాలు లేకపోతే రాకపోతే ఆ చదువులు ఎందుకు? సామాజిక సంక్షోభమే కదా? ఏ చిన్నపోస్టుకు దరఖాస్తులు ఆహ్వానించినా.. వందలు, వేలల్లో ధరఖాస్తులు వస్తున్నాయి. నిరుద్యోగం దేశమంతా తాండవిస్తోంది. రైల్వే గేట్‌మెన్‌, పట్టాల మీద గ్యాంగ్‌మెన్‌ ఉద్యోగాలకు కూడా 82లక్షల మంది ఉన్నత విద్యా వంతులు బారులు తీరారు. ఎంటెక్‌ చేసినవారు కళాసీ ఉద్యోగాలకు క్యూలు కడుతున్నారు. నిరుద్యోగం జడలు విరబోసుకొందని జాతీయ గణాంక సంస్థ లేబర్‌ ఫోర్స్‌ సర్వే వెల్లడించింది. బడ్జెట్ లో నిరుద్యోగానికి చికిత్సలులేవు. ఉపాధికల్పించే మార్గాలూ లేవు. నిరుద్యోగిత పెరిగిపోతున్నది. తాము అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న మోడీ హామీలు ఫలించలేదు. 2016లో పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ(2017) నిర్ణయాలు చేపట్టినా దేశంలోని 50లక్షల ఉద్యోగాలు ఊడిపోయాయి. 2019-20 లో దేశంలో నిరుద్యోగిత రేటు 7.5 శాతానికి చేరింది. విద్యాధికులైన యువతలో ప్రతి నలుగురిలో ఒకరు నిరుద్యోగులై ఖాళీగా ఉంటున్నారు. ఇది దేశ భవిష్యత్తుకు ప్రమాదమని ఆర్ధిక సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ప్రపంచంలో కెల్లా యువ జనాభా అత్యధికంగా భారత్‌లో ఉన్నారు. వీరిలో నిరుద్యోగం పెరుగటం వల్ల కలిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. నిరుద్యోగం, నిర్వ్యాపారత్వం యువతను సోమరులుగా చేసి అసాంఘిక శక్తులుగా మారుస్తాయి.స్వతంత్రదేశంలో చావుకూడా పెళ్లిలాంటిదే బ్రదర్ అనే ఆకలిరాజ్య పాటను నిరుద్యోగులు గుర్తుచేసుకుంటున్నారు. అమెరికా, జపాన్‌, చైనా దేశాల జనాభాలో మూడోవంతు 65 ఏళ్ల వద్ధాప్యంలో ఉంటే మనదేశంలో 64 శాతం జనాభా 30 ఏళ్ల వయసు కుర్రాళ్ళతో పనిచేసే వయసులో ఉన్నారు. భారత్‌లో తయారీని పెద్దయెత్తున ప్రోత్సహించి ఉపాధి కల్పిస్తామని కేంద్ర సర్కారు చెప్పిన మాటలు ఆచరణలో డొల్లలై పోయాయి. దేశంలో పనిమంతులు దొరకట్లేదని కార్పొరేట్లు అంటున్నారు. అసలు పనేదొరకట్లేదని విద్యావంతులైన నిరుద్యోగులు వాపోతున్నారు. ఏమిటీ దురవస్థ? సామాజిక సంక్షోభమే కనిపిస్తోంది.ఉద్యోగాల ఊసెత్తకుండా బడ్జెట్‌ను రూపొందిస్తే ఫలితమేమిటి?2018 లో 12936 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రతి నలభై నిముషాలకు ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నాడని జాతీయ నేరాల నమోదు సంస్థ తెలిపింది.

2022 కల్లా 8 శాతం ఉద్యోగ పెరుగుదల సాధిస్తామని నీతి ఆయోగ్‌ నివేదిక చెప్పింది.ముద్ర, నైపుణ్య భారత్‌ లాంటి నినాదాలన్నీ నీరుగారిపోయాయి. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి నిధుల కోత విధించారు. గ్రామీణ పేదలకు కల్పించే పనిదినాలు తగ్గించారు.దేశ ఆర్థిక వ్యవస్థలో మాంద్యం ఆవహించింది.తయారీ రంగం పుంజుకుంటేనే కొత్త ఉద్యోగాలు వచ్చేది. మేకిన్ ఇండియా,స్కిల్ ఇండియా, ముద్రా యోజన లు ఏమైపోయాయో అర్ధం కావడంలేదు.ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం తగ్గుతున్నా ఇండియాలో తగ్గడంలేదు. మానవాభివ ద్ధి సూచీల్లో ఇండియా 130వ స్థానంలో ఉంది. ఉద్యోగాల స ష్టికి ఊతమివ్వాలి. అభివద్ధికి ఎన్నో సంస్కరణలుచేపట్టాలని రిజర్వు బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ రంగ రాజన్‌ లాంటి ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఇవేవీ పట్టించుకోకుండా రైల్వేలను, ఎల్‌ఐసీని ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నారు.తద్వారా ఉన్న ఉపాధినిస్తున్న అవకాశాలను పోగొడుతున్నారు. నిరుద్యోగం పెరుగుతూ పోతున్నదే తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు.కొత్త ఉద్యోగాలు రాకపోగా ఉన్న కొలువులు కోల్పోయే పరిస్తితి వచ్చింది. భారత నిరుద్యోగులు 2017లో183 కోట్లు, 2018 లో186 కోట్లు 2019 లో 189 కోట్లు ఉన్నారనే అంతర్జాతీయ కార్మికసంస్థ అంచనాలను మించి ఇండియాలో నిరుద్యోగులు పెరిగిపోతున్నారట. మన పిల్లలను బయటదేశాలకు వెళ్లిపొమ్మనకుండా దేశంలోనే చదువుద్వారా ఉపాధి మార్గాలు కల్పించాలి.



ఉద్యోగాలు రాని యువకులు తాగుబోతులు కాకుండా చూడాలి.హత్యాచారాలు,మూకదాడులు, మత విద్వేష దాడులను కఠినంగా అణచివెయ్యాలి.మంచి ఉపాధి దొరికితేనే ప్రజలు శాంతియుతంగా బ్రతుకుతారు. ఆర్మీ రిక్రూట్మెంట్ ఈ జిల్లాలో పెట్టినా వేలాదిమంది యువకులు హాజరవుతున్నారు.బురదలో పరుగు లాంటి కఠిన పరీక్షలకు కూడా సిద్ధపడుతున్నారు.ఇలాంటి నిర్భాగ్యులను చూసికూడా ఇంకా పిల్లల్ని కనండి అని నేతలు ప్రజల్ని ప్రోత్సహిస్తున్నారు.అది జాలిహృదయమా?వీళ్ళు బానిసల్లాగా బాధపడుతుంటే చూడాలనే కొరికా?

విద్యావిధానం యువతను గ్రామాల్లోనిలిపి వుంచటంలేదు.వ్యవసాయాన్ని గౌరవనీయమైన లాభదాయకమైనవృత్తి గామార్చాలి. విద్య యువతను కుటీరపరిశ్రమల దిశగా మార్చి పనికొచ్చే వృత్తిలో ప్రావీణ్యులుగా చెయ్యాలి. చైనా ,తైవాన్ దేశాల్లో పాలిటెక్నిక్ విద్య పూర్తయ్యేటప్పటికి ఏదో ఒక వస్తువు తయారు చేసే నైపుణ్యం కుర్రవాడికి వస్తుంది, ఇక్కడ ఏం.టెక్ చేసినా ఏమీ రావటంలేదు.మన పిల్లలకు వస్తువుల తయారీలో నైపుణ్యాలు చదువులోనే రావాలి.మన చిన్నప్పుడు సైకిళ్ళకు డైనమో ఉండేది.ఇప్పుడు బ్యాటరీ సైకిల్ కూడా పదివేల రూపాయలకు తక్కువ ధరకు దిగిరాలేదు.వందరూపాయల దోమల బ్యాట్లు కూడా చైనా వాళ్ళవే తయారీ. మన యువకులకు ఇవన్నీ ఎప్పుడు నేర్పుతారు? సైనిక నియామకాల ర్యాలీల్లో కూడా తొక్కిసలాటలు జరుగుతున్నాయి.ప్రపంచనిరుద్యోగులు 50 కోట్లు అయితే అందులో 27 కోట్లమంది 15 -24 ఏళ్ల మధ్యవారట. ఆంధ్ర  రాష్ట్రంలోని 1.40 లక్షలఉద్యోగాలను భర్తీ చేయాలని ఆంధ్రా యూనివర్శిటీ విధ్యార్ధులు 2018 లోనే నిరుద్యోగమార్చ్ నిర్వహించారు. నిరుద్యోగనిర్మూలనపై సలహాలు ఇమ్మని నీతి అయోగ్ ప్రజలను 2017 లో కోరింది. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 2017 నాటి ప్రజాసాధికార సర్వే లో 33 లక్షల నిరుద్యోగులు నమోదయ్యారు.18-40 ఏళ్ల మధ్య వయసుగల వాళ్ళ వివరాలను ఆధార్ కార్డు తో అనుసంధానం కూడా చేశారు.అయితే  4 లక్షల గ్రామ వాలంటీర్లకు ఉద్యోగాలిచ్చినరికార్డు మాది అని  సంతోషిస్తున్నారు  మన రాష్ట్ర ప్రభుత్వాధినేతలు.అంతర్జాతీయ కార్మిక సంస్థ చైనా కంటే మనమే నయం అని ఓదారుస్తోంది.దేశంలోని 14 లక్షలఖాళీలను, తెలంగాణాలోని 2.5 లక్షల ఉద్యోగఖాళీలను భర్తీ చేయాలని , రిటైర్ అయినవాళ్లను మళ్ళీ తీసుకోకూడదని,తమకు రిజర్వేషన్లను పెంచి  ఇంటికో ఉద్యోగమిస్తామన్న  హామీని నిలబెట్టుకోవాలని బీసీ నాయకులు  డిమాండ్ చేస్తున్నారు.

--- నూర్ బాషా రహంతుల్లా , విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్, 6301493266



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి