ఈ బ్లాగును సెర్చ్ చేయండి

25, మార్చి 2020, బుధవారం

మహమ్మారులను ఆపాలి ! మానవజాతిని రక్షించాలి !

                                                           
మహమ్మారులను ఆపాలి !మానవజాతిని రక్షించాలి ! 

మనిషి కంటే ముందే పుట్టిన సూక్ష్మజీవులే  మహమ్మారులు. మిగతా జీవుల ప్రాణాలు తీయటం ఈ భూతాల పని.వైరస్ లు,బ్యాక్టీరియా ల రూపంలో ఇవి మన ప్రాణాలు తీస్తూ ఉంటాయి.అధికజనాభాను తగ్గిస్తూ అహంకరించిన మానవుల గర్వాన్ని అణుస్తూ ఉండటంకూడా ఈ భూతాలకు పనిలోపని అంటారు మాల్తస్ లాంటి శాస్త్రవేత్తలు. 13వ శతాబ్దంలో ప్లేగు వ్యాధి వల్ల మూడు కోట్ల మంది చనిపోయారు.తరువాత కలరా,ఫ్లూ,ప్లేగు,మశూచి,ఎయిడ్స్ లాంటి అంటురోగాలు కోట్లమందిని బలితీసుకున్నాయి. ఈ ఏడు  కరోనా వల్ల 199 దేశాలలో 24 వేలమంది మరణించారు.ఇటలీలో 8300,స్పెయిన్ లో 4400,చైనాలో 3300 ,ఇరాన్ లో 2500,ఫ్రాన్స్ లో 1700,అమెరికాలో 1300 మంది చనిపోయారు.బ్రిటన్ యువరాజు చార్లెస్ కూ వచ్చింది.ఇటలీలో రోడ్లమీదనే రోగులను పడుకోబెట్టి వైద్యం చేస్తున్నారట. రాజు పేద అనేతేడా లేకుండా అందరికీ వ్యాపిస్తోంది ఈ అంటు రోగం . ప్రజలు అందరూ అంటరానివాళ్లే అయ్యారు. కలిసి గుంపులుగా తిరగటం, కరచాలనాలు మానేశారు.
ఆవుమాంసం తినేవాళ్లూ పందిమాంసంతినేవాళ్లను పరస్పరం అసహ్యించుకుంటుంటే ,అసలు మాంసాహారం వల్లనే ఈ వైరస్ లు చెలరేగుతున్నాయని శాకాహార పండితులు విమర్శిస్తున్నారు.అయితే మాంస సారమైన పాలు,పెరుగు,వెన్న,నెయ్యి కూడా మానెయ్యండి అని మాంసాహారులు ఎత్తిపొడుస్తున్నారు. భరద్వాజుడి దగ్గరనుండీ మాంసాహార విందులు తిని ఇప్పుడు మమ్మల్ని తినోద్దు అంటారా, తినేవాళ్ళ కడుపుకొడతారా అని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు.దేవుని దృష్టిలో మాంసాహారం ,శాకాహారం అనే తేడాలేదు.రెంటినీ ఆయనే సృష్టించాడు.జంతువుకి ఆహారం మాంసమే కదా?పూర్వజన్మల్లో మనంకూడా జంతువులుగా పుట్టి ఉంటాము అని మాంసాహార భక్తులు వాదిస్తున్నారు. గబ్బిలాలు,పాములు,తేళ్ళు, కోతుల వంటి జంతువుల మాంసాహారం ద్వారా మనిషికి రోగాలు వస్తాయని వీళ్ళ బాధ. క్షయ,రెబీస్,ఆంత్రాక్స్,ప్లేగు,ఎబోలా,మెదడువాపు,స్వైన్ ఫ్లూ,బర్డ్ ఫ్లూ లాంటి వ్యాదులు అలాగే వచ్చాయట. మనది గోమూత్రం సేవించే వేద భూమి కాబట్టి ఇలాంటి కరోనాలు ఏమీ చేయవని, పాములు, కుక్కల్ని తినే చైనా వాళ్ళకే ఇది వస్తుందని వాదిస్తున్నారు.అసలు మోషే ధర్మశాస్త్రంలోనే దేవుడు ఫలానా జంతువులు పక్షుల మాంసాలు తినవచ్చనీ,ఫలానావి తినకూడదనీ చెప్పాడు కాబట్టి ఆ ఆహారనియమాలు పాటించాలనీ ఆ మతపెద్దలు వాదిస్తున్నారు.  
మేము కరోనాతో కరీంనగర్‌ జిల్లా వచ్చినా అల్లా దయవల్ల కరోనా వదిలిందని ఇండోనేషియో నుంచి వచ్చిన ముస్లిం మత పెద్దల వాదన.వైరస్ లు దేవుని ఆజ్నలు నెరవేర్చే భూతాలు కాబట్టి దైవ విదేయతలేని పాపులకు పాఠం నేర్పే పోతాయని అధిక జనాభాను అవే తగ్గిస్తాయని వాళ్ళు అంటున్నారు. ఎవరివాదనా పట్టించుకోకుండా వైరస్ జనాన్ని చంపుకుంటూ పోతోంది.భూమిమీద ఉన్న రకరకాల వైరస్ లు భూమిపై ట్రోపో స్పియర్ లోకి వెళ్ళి కొన్ని వేల కిలోమీటర్లుప్రయాణించి మరో భూ ప్రాంతానికి చేరుకుంటున్నాయట.సకలదేశాలలో వ్యాపించే సర్వాంతర్యామి లక్షణాలు చూసే ఈ వైరస్ లను మహమ్మారులు అన్నారట. ఇంత చిన్న సూక్ష్మ జీవుల వల్ల దేశాలమధ్యజరిగే యుద్ధాలలో చనిపోయేవారికంటే ఎక్కువమంది చనిపోయారట.మహమ్మారులకు మనుషులను చంపటం తప్ప మరే మంచి పనీ లేదా అంటే మిగతా జీవులు ఉత్పత్తి చేస్తున్న చెత్తను శుభ్రం చేస్తున్నాయట.మన వ్యర్ధాలను నిర్మూలం చేస్తున్నాయట.ఏనాటికైనా యముని దూతలైన మారెమ్మల ద్వారానే మనకు చావు కాబట్టి తప్పని చావుని గురించి ఆలోచించుకొమన్నారు.మరణం రెండూరకాలు. కాలమరణాలు,అకాలమరణాలు.ఆత్మహత్యలన్నీ ఇచ్చామరణాలు. జీవులకు ముసలితనంలో వచ్చే చావులు కాలమరణాలు, అంటువ్యాధులు,ప్రమాదాల ద్వారా వచ్చే చావులన్నీ అకాలమరణాలు.జాతస్య మరణం ధృవం కాబట్టి రాలే ఆకు కూడా అల్లాహ్ కు తెలియకుండా రాలదు. కరోనాల ద్వారా దేవుడు మనుషులకు పునరపి జననం అనే గుణపాఠం నేర్పుతాడు,మరణం సంపూర్ణ ముగింపు కాదు మళ్ళీ మరోకచోట పుట్టిస్తాడు, సూక్ష్మ పాపాల బాకీ తీరేదాకా దయ్యంగానైనా బ్రతికిస్తాడు అని భక్తులను ఓదారుస్తున్నారు.పైగా మనందరం కనపడే దయ్యాలమేనంటున్నారు.ఈ వ్యాధి నుండి ఏ దేవుడూ రక్షించలేడన్నట్లు దేశవ్యాప్తంగా వున్న అన్ని దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు కూడా మూసివేశారు. గోమూత్రం త్రాగితేనో, ఆవు పేడ పూసుకుంటేనో, ఎండలో నిలబడితేనో కరోనా తగ్గుతుందనే వార్తలను జనం తిరస్కరించారు, గుంపులు గుంపులుగా బయట తిరగకూడదన్నారు.
 కష్టకాలంలో కొందరు మనుషుల్లో మానవత్వం వెల్లివీరుస్తుంది.శతృభావం వదిలి బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సనారోకు క్యూబా వైద్యుల సహాయం అందించింది. విప్రో అజీమ్ ప్రేమ్ జీ కరోనా నివారణ పనుల కోసం 52 వేల కోట్ల రూపాయలు , సిప్లా యూసుఫ్ హమీద్,వేదాంత అనిల్ అగర్వాల్ వంద కోట్ల రూపాయలు, ఆలీబాబా జాక్ మా 10 కోట్ల యువాన్లు విరాళం ఇచ్చారు.అమీర్ ఖాన్ 250 కోట్ల రూపాయలు ఇచ్చారు.అలాగే ఇంకా కొందరు దాతలు.
మహమ్మారుల వల్ల చనిపోయే వృద్ధులు,పేదల తో  ఎలాంటి ఉపయోగం లేదని, ఇటువంటి వారు చనిపోతే బాధపడనక్కర్లేదు అని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ అన్నారు. కరోనాతో ఇరాన్‌లో పెద్దయెత్తున జనం చనిపోతుంటే ఆ దేశంపై విధించిన ఆర్థిక ఆంక్షలనుఅమెరికా ఉపసంహరించుకోలేదు. కరోనాను అదుపు చేసేందుకు అమెరికా చేసిందేమీ లేదు. కరోనా మందు తయారీలో పరిశోధన చేస్తున్న జర్మనీ కంపెనీని కొనేసేందుకు అదియత్నించింది. ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక 'ఒబామా హెల్త్‌ కేర్‌' ను రద్దు చేశారు. ఔషధ రంగంలో పరిశోధనలకు నిధుల్లో కోత పెట్టి, అంతరిక్ష సైనికీకకరణకు వాటిని మళ్లించారు.ట్రంప్‌ కార్పొరేట్లకు లక్షన్నర కోట్ల డాలర్ల బెయిలవుట్‌ ప్యాకేజి ప్రకంటించారు ,ఎంతమంది చనిపోయినా వారికి డబ్బులిస్తాం కానీ అమెరికాను లాక్ డౌన్ చేయం అన్న ట్రంప్ కు తిరిగి డబ్బులు సంపాదించుకుంటాముగానీ పోయినప్రాణాలను తిరిగి తేలేము అని బిల్ గేట్స్ బుద్ధి చెప్పాడు.  వూహాన్‌లో కరోనా తలెత్తగానే బెంబేలెత్తిన అమెరికన్‌ కంపెనీలు,సెనెటర్లు తమ షేర్లను ఒక్కసారిగా అమ్మేసి స్టాక్‌ మార్కెట్‌లో కల్లోలానికి కారణమయ్యారు. అమెరికన్‌ కంపెనీల షేర్లను చౌకగా కొనుగోలు చేసిన చైనా కంపెనీలు ఇప్పుడు నిలదొక్కుకోవటంతో ట్రంప్‌ కంటగిస్తున్నాడు.కరోనా వైరస్‌ చైనాలో పుట్టింది కాబట్టి వాళ్ళే దీన్ని సృష్టించారని అమెరికా ప్రచారం చేస్తోంది. కానీ బయోటిక్‌ ఆయుధాలను, వైరస్‌లు సృష్టించి శత్రు దేశాలపై ప్రయోగించిన చరిత్ర అమెరికాదే. గతంలో అమెరికా ఎయిడ్స్‌ వైరస్‌ను సృష్టించింది.
భారత్‌ 135 కోట్ల జనాభాతో దుర్భర దారిద్ర్యంలోనూ మశూచి,పోలియో లను తప్పించుకున్న దేశం. కిక్కిరిసిన ఇళ్ళలో ఏకాంతం పాటించలేని దేశం.కానీ వేడి వాతావరణంలో కరోనా వ్యాప్తి తక్కువగా ఉండటం మన దేశానికి మంచిదయ్యింది. లాక్ డౌన్లు బడుగు వర్గాల జీవితాలను మరింత దుర్భరం చేస్తాయి. అర్ధాకలితో బతుకులు వెళ్లదీసే బడుగు జీవుల్ని అసలు గడప దాటొద్దంటే కొత్త సమస్యలు వస్తాయి. జనం అటూ ఇటూ పోకుండా కొన్ని గ్రామాలలో  స్థానికజనమే రోడ్లకు ముళ్ళకంచెలు అడ్డువేస్తున్నారు.కొన్నిచోట్ల ఇరుక్కుపోయిన జనం చాలాదూరం నడుస్తున్నారు. చాలామంది ఆకలితోనే చనిపోయేలా ఉన్నారు. అందువలన అడ్డా కూలీలు ,ఇండ్లలో పనివాళ్ళు, అద్దె ఆటో డ్రైవర్లు, బిచ్చగాళ్ళు, వ్యవసాయ కూలీలు,హమాలీ కూలీలను ఆదుకోవటం కోసం 80 కోట్ల మంది పేదలకు నిత్యావసర వస్తువులు అందజేసే పధకాలు ప్రవేశపెట్టారు. కేరళలో ముందుగానే అందరికీ ఉచితంగా బియ్యం, ఇతర నిత్యావసరాలు, ఆర్థిక సాయం అందించారు.మద్యాహ్న భోజనాన్ని ఇళ్లకే పంపిస్తున్నారు. తమిళనాడు,పుదుచ్చేరి,ఆంధ్రలలో 9 వతరగతి దాకా పిల్లలందరినీ పరీక్షలు లేకుండానే పాస్ చేశారు.టోల్ గేట్లు రద్దు చేశారు.ఉచిత రేషన్‌ తో పాటు ఆర్థిక సహాయం ప్రకటించారు. కార్పొరేట్‌ వైద్యశాలలు కమ్యూనిటీ వైద్యాన్ని అందించవు కాబట్టి కేజ్రీవాల్‌ ప్రభుత్వం వీధి మొహల్లా క్లినిక్‌ల లాగా, రాజశేఖరరెడ్డి హయాంలోని 108 వాహనాలలాగా ప్రాధమిక వైద్యం దొరకాలని ప్రజలు కోరుతున్నారు. అయితే ప్రజల ఆపదల్ని తమ లాభాల కోసం మలుచుకొనే లాభార్జనాపరుల్ని,జలగల్లా పీడించే  వడ్డీ వ్యాపారులను రంగంలోనుంచి తప్పించమని కోరుతున్నారు.శరణార్ధులకోసం డిటెన్షన్‌ సెంటర్లు కట్టినట్లుగా దేశంలో కరోనా కట్టడికి ఆసుపత్రులు,ల్యాబ్ లు,ఐసోలేషన్‌, క్వారంటైన్‌ సెంటర్‌లు కట్టాలి. మాస్కులు, వెంటిలేటర్ల తయారీ పెంచాలి. మనుషుల అంతు చూసే మహమ్మారులను ఆపాలి !

--- నూర్ బాషా రహంతుల్లా,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి