ఈ బ్లాగును సెర్చ్ చేయండి

29, ఏప్రిల్ 2020, బుధవారం

ఆకలికి అన్నము వేదనకు ఔషధం


ఆకలికి అన్నము వేదనకు ఔషధం  (సూర్య 3.5.2020)
దేశ ఆర్థిక వ్యవస్థ బాగుంది కాబట్టి రాష్ట్రాలకు ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రులు ప్రధానిని కోరారు. కానీ కేంద్రం కార్పొరేట్లకు, విదేశీ గుత్త సంస్థలకు మెహుల్‌ చోక్సీ,విజయ్ మాల్యా లాంటి ఉద్దేశపూర్వకంగా రుణాలను ఎగవేసే బడా కంపెనీల అధిపతులకు 50 మందికి ప్రభుత్వం రూ. 68,607 కోట్ల మేర రుణాలను మాఫీ చేసింది. సూపర్‌ రిచ్‌కు పన్నుల రాయితీల రూపంలో రూ.1.45 కోట్ల మేర లబ్ధి చేకూర్చింది. రియల్‌ ఎస్టేట్‌, ఎగుమతి వ్యాపారులకు రూ.70 వేల కోట్ల రాయితీలు ఇచ్చింది. కేపిటల్‌ గెయిన్స్‌పై పెంచిన సర్‌చార్జీని ఎత్తివేసింది. లాభాలు చేకూర్చిన ప్రభుత్వం చిన్న మధ్యతరహా పరిశ్రమలకు కూడా ప్యాకేజీ ప్రకటించాలి . లాక్‌డౌన్‌ వల్ల ఉపాధి కోల్పోయిన వలస కూలీలు, వ్యవసాయ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లకు కేరళలో 5 వేల రూపాయలుఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం రూ.500 ఇస్తానంటుంది. ఎవరినీ పని నుంచి తొలగించ వద్దని మోడీ కోరారు. వారి వేతనాల్లో కొంత భాగం ప్రభుత్వం భరిస్తుందని ప్రకటిస్తే యాజమాన్యాలకు బాగుండేది. కరోనాలో కార్మికుల పని గంటలను 8 నుంచి 12 గంటలకు పెంచారు.ఎక్కువ సేపు పనిచెయ్యాలన్నా , రోగనిరోధక శక్తి కావాలన్నా మళ్ళీ మంచి తిండే కావాలి. ఆహార గిడ్డంగుల్లోని 7.5 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను బయటకు తీసి ప్రజలకు పంచిపెట్టాలని. మళ్లీ రైతుల నుంచి కొత్త పంటను కొనుగోలు చేయాలని జగన్‌మోహన్‌ రెడ్డి లాగా చాలా మంది ముఖ్యమంత్రులు మోడీని కోరారు.
కరోనా అంటు రోగానికి ప్రపంచం 2.26 లక్షలమందిని , అమెరికా 60 వేల ప్రాణాలను పోగొట్టుకొంది. కరోనాతో తీవ్రంగా దెబ్బతిన్న అమెరికా, స్పెయిన్, బ్రిటన్, ఇటలీలు ప్రయివేట్‌ హాస్పిటళ్ళ నెలవు. ప్రైవేటు ఇన్సూరెన్సు కంపెనీలు కరోనా లాంటి వ్యాధులకు ఏమీ చెయ్యవు. రోగుల నుండి వచ్చే లాభాల మీదే ప్రైవేటు హాస్పిటళ్ళు నడుస్తాయి.పాకిస్తాన్, బంగ్లాదేశ్‌, శ్రీలంక, గాంబియా, అంగోలా, కాంగో, ఘనా, లెబనాన్, కామెరూన్, లావోస్‌ లాంటి పేద దేశాలు డబ్బుల్లేక అల్లాడుతున్నాయి. కరోనా అంతరించేసరికి ప్రపంచ జనాభాలో సగంమంది పేదరికంలో మగ్గుతారట.
130 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ప్రైవేట్‌ ఆసుపత్రుల చేతుల్లోకి కూడా వెళ్లింది. జనాభాలోని 55 శాతం మంది పేదలు, కార్మికులకు పేలవంగా ఉంటున్న ప్రభుత్వ ఆసుపత్రులే దిక్కు.
మోడీ సప్తసూత్రాలలో వృద్ధుల సంరక్షణ, పేదలకు సాయం, వైద్య సిబ్బందిని గౌరవించడం, యాజమాన్యాలు ఉద్యోగులకు అండగా ఉండటం, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం వంటి సూత్రాలు మంచివే.ఆకలికి అన్నము,వేదనకు ఔషధం లాంటి సూత్రాలు కూడా ఉంటే బాగుండేది. మార్చి 25 నుండి నలభై రోజులకు పైగా దేశం లాక్‌డౌన్‌ లో ఉంది. 36 కోట్ల మంది వలస కూలీలు కార్మికులు,హమాలీలు , లారీ, ఆటో డ్రైవర్లు, మెకానిక్‌లు, ఇళ్లల్లో పాచి పని చేసుకునేవారు తిండికి దూరమయ్యారు. ఆకలిగొన్నవారి కి సిద్ధాంతాలు చెప్పడం కాదు, ఆకలి తీర్చాలని స్వామి వివేకానంద చెప్పారు. కరోనా ప్రభావం ఇప్పుడప్పుడే అంతం కాదని ఇంకా కొన్ని నెలల పాటు కొనసాగుతుందట. 12 కోట్ల మంది ఉపాధి కోల్పోయి వీధిన పడ్డారు. నిరుద్యోగ రేటు 7.5 శాతం నుంచి 23.6 శాతానికి పెరిగింది. లే ఆఫ్‌లు, రిట్రెంచ్‌మెంట్లు పెరిగిపోయి కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. చేతికొచ్చిన పంట అమ్ముకునే మార్గం లేక రైతులు, పనులు లేక వృత్తిదారులు ప్రభుత్వం ఆదుకోకుంటే మరణమే శరణ్యమంటున్నారు.
మందులు ఉత్పత్తి చెయ్యాలంటే లాక్‌డౌన్‌ సడలించాలి కర్మాగారాలు పనిచేయాలి , పండించిన పంటను రైతులు అమ్ముకొనేలా రవాణా మార్గాలు తెరవాలి. మొబైల్ చార్జీలు, పెట్రోలు, గ్యాస్‌ రేట్లు తగ్గించాలి. రేషన్‌ కార్డు ఉన్న పేదలకు ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున, అదీ కిలో మూడు రూపాయల వంతున బియ్యం, గోధుమలను అదనంగా ఇస్తామంది. రేషన్‌ కార్డులు లేని కూలీలకు రేషన్ కార్డులు ఇవ్వాలి. కేరళ లో కూలీలకు ముందుగానే మూడు మాసాలకు రేషన్ ఇస్తున్నారు. ప్రజల ఆహారానికి ఎక్కువగా ఖర్చు పెట్టాలి.క్యూబా లాంటి చిన్న దేశంలో ఎంతోమంది డాక్టర్లు తయారై ఆరోగ్య అవగాహన పెంచారు.మనం వాడుతున్న దోమల బ్యాట్లు కూడా చైనావే. క్యూబా, చైనాల లాగా మనంకూడా కరోనా రోగులకు ప్లాస్మా వైద్యం చేయించాలి. అందుకు కేంద్రం అనుమతించాలి. ప్రపంచంలో 32 లక్షలమంది కరోనా సోకిన వారిలో 9.77 లక్షలమంది కోలుకున్నారట.వీరినుండి ప్లాస్మా సేకరిస్తున్నారు.డిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ప్లాస్మాదాతలను అభ్యర్ధించారు.
తబ్లిక్ వాళ్లతోసహా చాలామంది ప్లాస్మా దాతలు ముందుకు రావటం హర్షణీయం. కరోనా వైరస్‌ పై మతం ముద్ర వేసే శక్తులకు శాస్త్రీయంగా బుద్ధి చెప్పాలి. తబ్లిక్ భక్తుల కల్లోలం మరువకముందే మధ్య్రపదేశ్‌ లో పల్లవి జైన్ అనే ఐఏఎస్‌ ఆఫీసర్‌ కుటుంబ సభ్యులకు అంటించి కూడా వైద్యశాలకు పోవడానికి కూడా నిరాకరించారు. నెల్లూరు డాక్టర్‌ లక్ష్మీనారాయణ రెడ్డి విదేశాల నుంచి వచ్చి కరోనాతో మద్రాస్‌ అపోలోలో చనిపోయారు. ముంబయిలో గాయని కనికా కరోనాతోనే విందు ఇచ్చారు. సాయం జరుగుతుందంటే ఎన్నిసార్లయినా చప్పట్లు కొడతారు, లైట్లు ఆర్పి దీపాలు వెలిగిస్తారు ఇలాంటి ఖర్చు లేని పనులు ప్రజలు ఎన్నయినా చేస్తారు.పరమాత్ముని సన్నిధికి రావే ఓ మనసా అని ప్రార్ధనలూ చేస్తారు.
కానీ కాలినడకనసొంత ఊళ్ళకు పోయే వారి యాతన తగ్గాలి.రైళ్లు బస్సులలో త్వరగా కూలీలను రవాణా చెయ్యాలి.దేశమంతా ఒకే స్థితి లేదు. కొన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువుంటే, మరికొన్నిచోట్ల దాని జాడలేదు. భిన్న పరిస్థితులున్న దేశంలో అన్ని రాష్ట్రాలకూ, అన్ని ప్రాంతాలకూ ఒకే రకమైన విధానం అక్కరలేదు. కోలుకుంటున్నవారి సంఖ్య సైతం పెరుగుతోంది. రెడ్‌జోన్‌లలో పూర్తిగా కట్టడి చేయాలి. గ్రీన్‌జోన్‌లో కార్యకలాపాలు కొనసాగాలి. జనం ఎక్కువగా గుమిగూడ కూడదు.మాస్కులు వాడాలి. లక్షలమందికార్మికులు,కూలీలు వేలకిలోమీటర్లు స్వస్థలాలకు నడుచు కుంటూ వెళుతున్నారు. వందల మైళ్ళ నడకదారి పట్టిన వలస కూలీలు 25మంది మరణించారు. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చటం కోసం రైళ్లు కూడా నడపాలి.
---నూర్ బాషా రహంతుల్లా , విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్,6301493266

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి