ఈ బ్లాగును సెర్చ్ చేయండి

3, జులై 2020, శుక్రవారం

యుద్ధాలు వద్దు -ప్రాణదాతలే ముద్దు

యుద్ధాలు వద్దు -ప్రాణదాతలే ముద్దు(సూర్య 5.7.2020)
యుద్ధం అంటే నరబలే.యుద్ధాలకు , ఉగ్రవాదులకు నిలయాలైన పాకిస్తాన్,ఆఫ్ఘనిస్తాన్,ఇరాక్,సిరియా లాంటిదేశాలు నాశనమైపోయాయి.ప్రభుత్వాల కన్నా ప్రజాభిప్రాయం బలమైనది.ప్రజలు ఎప్పుడు యుద్ధాన్ని కోరుకోరు.మహాభారత యుద్ధం చేసిన వాళ్ళుకూడా యుద్ధమంటే అసహ్యించుకున్నారు.పల్నాటి యుద్ధంచేసిన బ్రహ్మనాయుడు. కళింగ యుద్ధం చేసిన అశోకుడు యుద్ధాన్ని ప్రారంభించడానికి ముందు తమలో ఉన్న కోపం, ద్వేషం,వదిలి విరాగులుగా మారిపోయారు.పీనుగులతో నిండిన యుద్ధభూమిని ఏలుకోవటానికి ఇష్టపడలేదు. యుద్ధం ఏ సమస్యను పరిష్కరించదు. యుద్ధానికి చర్చలే పరిష్కారం.యుద్ధం దేనికీ పరిష్కారం కాదు. మహాత్మాగాంధీ లాంటి పెద్దలెందరో యుద్ధం వద్దన్నారు.చివరికి యుద్ధంలోని సైనికుడు కూడా యుద్ధాన్ని ఎట్లా ఆపాలో ఆలోచించాలని కోరారు. లడక్ వెళ్ళిన మోడీ ధైర్యవంతులే శాంతిని కోరుకుంటారని అన్నారు.ఐక్యరాజ్యసమితికి యుద్దాలు ఆపే శక్తి లేదు. శోచనీయ పరిస్థితి.
ఇప్పటికి రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ఆటంబాంబు దాడికి గురైన జపాన్,వియత్నాం దేశాల దురవస్థలను,బాంబువేసిన అమెరికా దుర్మార్గాన్ని నేటికీ తలుచుకొని బాధపడుతూ ఉంటాం.మళ్ళీ ప్రపంచయుద్ధం వస్తే భస్మీపటలమే అనుకునే రోజుల్లో కరోనా వచ్చిపడింది.ప్రపంచంలో 5.21 లక్షలమంది చనిపోతే,అమెరికాలోనే 131 వేల మంది చనిపోయారు.ఇండియాలో కూడా 17 వేలమంది చనిపోయారు.చైనాలో సరైన సంఖ్య తెలియదు కానీ కొన్ని వేల మంది అక్కడే మొదట చనిపోయారు.అసలు కరోనాతో పాటు జి4 వైరస్ కూడా అక్కడే పుట్టుకొస్తోందని విమర్శలు వస్తున్నాయి.చైనా సరుకులు ఏమీ కొనొద్దని వాణిజ్య యుద్ధం చైనా యాప్ ల నిషేధంతో మొదలుపెట్టారు.మానవాళికి మహా శత్రువులు దోమలు.మలేరియా లాంటి రకరకాల రోగాలకు కారణమైన దోమలను చంపే తేలికైన ఆయుధాలు దోమల బ్యాట్లు కూడా చైనా నుండే కోనాల్సివస్తోంది.పేద దేశానికి అన్నము కావాలి కానీ యుద్ధవిమానాలు ఎందుకు?యుద్ధప్రాతిపాధికన దోమలబ్యాట్లు ఇండియాలోనే తయారు చేయించండి అని ప్రజలు కోరుతున్నారు.ఆయుధాలు అమ్ముకునే దేశాలు ఇండియాకు దోమల మందులు ఇవ్వాలని కోరుతున్నారు. వలసకూలీలకు రైళ్లు కూడా ఇవ్వకుండా వందల కిలోమీటర్లు నడిపించారు.నవంబర్ దాకా ఉచిత రేషన్ ధాన్యాలు ఇవ్వటమే గొప్ప పని అయ్యింది.అమెరికాలో ఎప్పుడూ యుద్ధాలనే కోరుకునే ఆయుధవ్యాపారి ట్రంప్ మాదిరిగానే రష్యా కూడా ఉంది.యుద్ధాలు చేసుకునే దేశాలమధ్య మధ్యవర్తిత్వం పేరుతో దూరటం ఆయుధాలు అమ్మటం ఎన్నో ఏళ్లుగా నడిచింది. మాకు ఎవరి జోక్యం అక్కర్లేదని తేల్చి చెప్పినా గొర్రెలకు తోడేలు కాపలాలాగా ఉంటాననటం యుద్ధాలకు తెగబడే దేశాలు ఆలోచించుకోవాలి.ఇప్పటికే మీ దగ్గర కొన్న ఆయుధాలు చాలులేఅంటే తన వద్ద నిల్వ ఉన్న ఆయుధాలను అమ్ముతానంటారు. ప్రపంచంలో ఆయుధాల కొనుగోళ్ళలో మనది రెండవ స్థానం. చైనాతో యుద్ధం జరిగితే అమెరికా,రష్యా తమ ఆయుధాలు అమ్మాలని చూస్తున్నాయి.కోర్టులో ఓడిపోయినవాడు అక్కడే ఎడిస్తే,గెలిచినవాడు ఇంటికొచ్చి లెక్కలు వేసుకున్నాక ఎదుస్తాడట.యుద్ధ విమానాల కొనుగోలుకోసం 39 వేల కోట్ల రూపాయలు కేటాయించారు.స్వదేశీ సరుకు కొనడానికి ప్రజల్ని ముందుకురమ్మంటున్నారు.రహదారులు రైల్వేల నిర్మాణాల చైనా కాంట్రాక్టులు రద్దుచేశారు.యుద్ధంలో ఇరుదేశాలకూ నష్టమే.సైనికులభార్యలు,పిల్లలు అనాధలు అవుతారు.ఎన్నిశౌర్యపతకాలు వచ్చినా అమరుల కుటుంబాలలో చెప్పుకోలేని బాధ.
రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు మానవప్రాణాలే ముఖ్యమంటూ ముస్లిం దేశాలలో ఆ సంస్థ పేరు రెడ్ క్రీసెంట్ గా మార్చి మరీ తన ప్రాణదాన కార్యక్రమాన్ని కొనసాగించాడు.యుద్ధాలు ఏ దేశాలమధ్య జరిగినా అక్కడికి ఆ సంస్థ వెళ్లింది.గాయపడ్డ సైనికుల్ని మందులిచ్చి వైద్యం చేసి ఆదుకోంది.పెన్సిల్లిన్,టెట్రాసైక్లిన్ లాంటి మందులు ప్రాణాధార మందుల్ని కనుగొని వైద్యులు మానవసేవ చేస్తూనే ఉన్నారు.యుద్ధాన్ని ఆపి ఇలాంటి ప్రాణదాతలను వ్యాక్సిన్ శాస్త్రవేత్తలను ప్రభుత్వం ప్రోత్సహించాలి.అప్పుడే ప్రజలకు శాంతి సౌఖ్యం.
ఆరోగ్యంగా ఉన్న పౌరులే దేశానికి నిజమైన సంపద. ప్రజల ఆరోగ్యంతోటే సుఖము సంతోషము. యుద్ధాలకంటే ప్రాణదానం చేసే ప్రతిపనీ మంచిదే.అది ప్రభుత్వపరంగా జరిగినప్పుడు మెచ్చుకోకతప్పదు.130 కోట్ల జనాభా ఉన్న మన దేశానికి 12 లక్షల మంది డాక్టర్లు మాత్రమే అదీ ఎక్కువమంది మహా నగరాల్లో, పట్టణాల్లో స్థిరపడిపోయారు. వైద్యులు,ఆసుపత్రుల పరంగా మనం చాల వెనుకబడి ఉన్నాం.పల్లెటూళ్ళ ప్రజలు వైద్యం కావాలంటే ఒక మోస్తరు టౌనుకు రావలసిందే.ఇలాంటి దశలో 1.7.2020 న ఒకే రోజు మొత్తం 1088 అంబులెన్సులు విజయవాడనుండి జిల్లాలకు ‘కుయ్‌...కుయ్‌’మంటూ వెళ్లాయి.108,104 వాహనాలను ప్రతిమండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేశారు. వీటి ద్వారా పేదలకు వైద్య అత్యవసర సేవలు అందుతాయి.ప్రైవేటు వైద్యం చాలా ఖరీదు.అందరూ భరించలేరు.ఆరోగ్యసేవలకు కూడా ప్రభుత్వ ఆసుపత్రులలో యూజర్ ఛార్జీలు వసూలు చేసిన గతం మనది. మంగళగిరిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పెడతామంటే పక్కనే ఉన్న విజవాడలోనే పెట్టాలని అడ్డుకొన్న నాయకులకు రెండుచోట్లా పెడదామని ఆనాడు రాజశేఖరరెడ్డి హితవు చెప్పారు.ఇప్పుడు మంగళగిరిలో జాతీయస్థాయి ప్రభుత్వాసుపత్రీ ఏర్పడింది.క్రమంగా ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగు పరచాలి. అంబులెన్సు సర్వీసుల గురించి చెప్పనవసరం లేదు. మన్యంలో పల్లెలకు అంబులెన్సులు పోలేక ఈనాటికీ డోలీలు కావడులే గతి.ఇప్పుడు ఈ అంబులెన్సుల రాకతో రాష్ట్రంలో ప్రతి 75 వేల మందికి ఒక అంబులెన్సు ఉంటుంది. రోగులను,ప్రమాద బాధితులను ఆసుపత్రులకు చేర్చటానికి అరగంటలో అంబులెన్సు వస్తుంది. ప్రాణాపాయస్థితినుంచి కాపాడటానికి కావలసిన అత్యా ధునిక ఉపకరణాలు అంబులెన్సుల్లో ఏర్పాటు చేశారు.అయితే వీటిని ప్రజలకోసం సరిగా నడిపి వైద్యసేవలు అందించే వారిపై ఈ పధకం విజయం ఆధారపడి ఉంటుంది.యుద్ధాలు ప్రాణాలు తీస్త్తుంటే డాక్టర్లు ప్రాణాలు పోస్తున్నారు.మనం డాక్టర్ల పక్షానే ఉందాం.
--నూర్ బాషా రహంతుల్లా, విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్,6301493266

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి