ఈ బ్లాగును సెర్చ్ చేయండి

13, జులై 2020, సోమవారం

కొత్తజిల్లాల ఏర్పాటుతో ప్రజలకు దూరం తగ్గాలి



కొత్తజిల్లాల ఏర్పాటుతో ప్రజలకు దూరం తగ్గాలి
దేశంలో ఇప్పుడు 543 పార్లమెంటు స్థానాలు 739 జిల్లాలున్నాయి.అంటే పార్లమెంటు స్థానాల కంటే జిల్లాలే ఎక్కువ ఉన్నాయి. పార్లమెంటు స్థానానికి సగటు వైశాల్యం 6054 చదరపు కి.మీ ఉంటే జిల్లాల సగటు వైశాల్యం 4459చ,కి,మీ.ఉంది. తెలంగాణాలో 17 పార్లమెంటు స్థానాలకు 33 కొత్తజిల్లాలు చేశాక వారి జిల్లాల సగటు విస్తీర్ణం 3396 చదరపు కిలోమీటర్లకు బాగా తగ్గిపోయింది.ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాలు ఏర్పడినా వాటి సగటు వైశాల్యం 6162 చ.కి.మీ.లు ఉంటుంది.తెలంగాణా లాగా కావాలంటే ఆంధ్రకు 47 జిల్లాలు వస్తాయి.పార్లమెంటు స్థానాలు 2026 లో మారినా మారకపోయినా తెలంగాణాకు కొత్త జిల్లాల అవసరం ఇప్పట్లో రాదు.ఎందుకు ఇన్ని జిల్లాలు అనుకోవద్దు. జిల్లా కేంద్రం అంటే జిల్లా అభివృద్ధికి కేంద్రం.సాధారణంగా రాజధాని చుట్టూ అభివృద్ధి కేంద్రీకృతం అవుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి అంతా రాజధాని హైదరాబాద్‌ కేంద్రంగానే జరిగింది.జనాభాలో ఆంధ్రా కంటే చిన్న రాష్ట్రాలైన అరుణాచలప్రదేశ్ లో 25జిల్లాలు, పంజాబ్ లో 22,హర్యానాలో 22,చత్తీస్ గడ్ లో 28 , జార్ఖండ్ లో 24 , అస్సాం లో 33 , తమిళనాడులో 38, కర్ణాటకలో 30 , ఒరిస్సాలో 30 ,కేరళలో 14,మణిపూర్ లో 16 ,తెలంగాణాలో ౩౩ జిల్లాలు ఉన్నాయి.అలాగే విస్తీర్ణంలో ఆంధ్రా కంటే చిన్న రాష్ట్రాలైన మధ్యప్రదేశ్ లో 55 , తమిళనాడులో 38, రాజస్ధాన్ లో 33, కర్ణాటక లో 30, గుజరాత్ లో 33 , ఒడిషా లో 30, అస్సాం లో 33, చత్తీస్ గడ్ లో 28, తెలంగాణాలో ౩౩ జిల్లాలున్నాయి. సాధారణంగా ఒక జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. తెలంగాణాలో అయితే రెండు నియోజకవర్గాలతో కూడా జిల్లా ఏర్పడింది.
1956 లో మనరాష్ట్రం ఏర్పడింది మొదలు ఈ 64 ఏళ్ళ కాలం లో కేవలం రెండే జిల్లాలు కొత్తగా ఏర్పాటయ్యాయి.అవి ప్రకాశం (1970), విజయనగరం (1979) జిల్లాలు.కొత్త జిల్లాల ఏర్పాటు సమస్య మన రాష్ట్రం లో అలా నానుతూనే ఉంది.ఎన్టీఆర్ మండలాల స్థాపనకు తెలుగు జనం అంతా హర్షించారు. ఇప్పుడు13 జిల్లాలను పునర్వ్యవస్థీకరించి 26 జిల్లాలు ఏర్పాటు చేయబోతున్నారు. 2008 లో బొబ్బిలి,పార్వతీపురం.తెనాలి లోక్ సభ నియోజకవర్గాలను రద్దుచేశారు.ఇప్పుడు కొత్తగా జిల్లా కేంద్రాలుగా మారే 12 పార్లమెంటు నియోజకవర్గాలు ఇవి : 1 అరకు 2 బాపట్ల3 అనకాపల్లి 4 అమలాపురం 5 హిందూపురం 6 నంద్యాల 7 నరసాపురం 8 నరసరావుపేట9రాజమండ్రి 10 రాజంపేట 11 తిరుపతి 12 విజయవాడ. ఇప్పుడు నెట్లో లోక్ సభ నియోజకవర్గాలలోని ఓటర్ల సంఖ్య , గెలిచిన అభ్యర్ధులు వారి పార్టీల సమాచారం దొరుకుతుంది కానీ నియోజకవర్గాల విస్తీర్ణాలు దొరకటంలేదు. వీటిపై సమగ్ర అధ్యయనం చేసి మార్చి 2021 నాటికి రిపోర్టు సమర్పించే కమిటీకి నియోజకవర్గాల విస్తీర్ణాలు పోల్చి చూసుకోవడం పెద్ద పని
.
కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన పక్షంలో పాలనా భవనాలు లాంటి మౌలిక సదుపాయల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఖర్చు ఒక్కసారి చేసే పెట్టుబడి మాత్రమే. కానీ దీనివల్ల అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు పొందే శాశ్వత ప్రయోజనాలు చాలా ఉన్నాయి.వెనుకబడిన ప్రాంతాలను అభివద్ధి చేయాలన్న లక్ష్యంతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామని సిఎం తెలిపారు. చిన్న జిల్లాలు పరిపాలనను సులభ సాధ్యం చేస్తాయి.ప్రజలకు దూరం భారం తగ్గుతాయి. అరకు పార్లమెంటు నియోజకవర్గం శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్నం ,అనకాపల్లి,రాజమండ్రి , ఏలూరు అనే నాలుగు జిల్లాల పొడవునా కొండల్లో ఉంటుంది.రోగులను ఆసుపత్రికి తీసుకెళ్ళటానికి అంబులెన్సులు వెళ్ళక రోడ్లులేక డోలీలమీద మోసుకెళుతూ ఉంటారు. అరకు జిల్లా సరిహద్దులో 6 జిల్లాలు ఉంటాయని ఏ జిల్లా సరిహద్దులో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలను పక్కనే ఉన్న ఆ జిల్లాలోనే కలిపి కొండ ప్రాంతాలలో గిరిజన ప్రజలకు దూరం తగ్గటం కోసం పుష్పశ్రీ వాణి అభ్యర్ధన మేరకు అరకు నియోజకవర్గాన్ని రెండు జిల్లాలు చేద్దామని ఈ ప్రాంత సమస్యను అర్ధం చేసుకున్న జగన్ సూచించారు . జిల్లాల విభజన వల్ల తమ జిల్లా అభివృద్ధి కుంటుపడుతుందన్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు,స్పీకర్ తమ్మినేని సీతారాం లాంటి వారికి జవాబుగా హైదరాబాదు రాజధానిగా ఉన్నప్పుడు చిత్తూరు శ్రీకాకుళం వాళ్ళు దూరం గురించి బాధపడకుండా వెళ్ళి వచ్చారు కదా? చిన్న చిన్న సమస్యలను పట్టించుకోవద్దు అని ముఖ్యమంత్రి సర్ది చెప్పారు.ఒంగోలు కు దగ్గరగా ఉండే సంతనూతలపాడు(13) అద్దంకి(37) లను 84 కి.మీ.దూరంలో ఉండే బాపట్లలో కాకుండా ఒంగోలు జిల్లా లోనే ఉంచాలనే డిమాండును ఆదిలోనే కాదన్నారు.
కోర్కెలు అనంతములు అన్నట్లు వివిధ ప్రాంతాలలో తమకు జిల్లాలు కావాలని డిమాండ్లు వస్తున్నాయి.అరకు బదులు పాడేరు,పాలకొండ,పార్వతీపురం లలో జిల్లాకేంద్రంఏర్పాటుచెయ్యమని,పార్వతీపురం,పుట్టపర్తి,రాయచూరు,మదనపల్లె,ప్రొద్దుటూరు లను జిల్లాలు చేయాలని కోరుతున్నారు.బాపట్ల,నరసాపురం బదులు రైల్వే జంక్షన్లు అయిన తెనాలి,భీమవరాలను జిల్లాలు చేయాలని, నూజివీడును ఏలూరులో కాకుండా విజయవాడలోనే ఉంచాలని,తాడేపల్లి మంగళగిరి మండలాలను విజయవాడ జిల్లాలో కలపాలని రకరకాల కోర్కెలు స్థానికులు అడుగుతున్నారు. అయితే ప్రజల సౌకర్యం కోసం ఏ గ్రామాలనైనా మండలాలనైనా ఒక జిల్లాలో కలపడానికి తక్కువ దూరమే శాస్త్రీయ నిర్ణయం కావాలి . కులాలు,రాజకీయ సమీకరణాలు కాదు. పార్లమెంటు స్థానాలు జిల్లాలు అయితే అసెంబ్లీ స్థానాలకు జిల్లాకేంద్రం దూరం తగ్గాలి.దూరం పెరిగిందంటే ప్రజలకు దీర్ఘకాల నష్టమే. 100 కి.మీ దూరం పైబడిన అసెంబ్లీ స్థానాలను వందలోపలికి వచ్చేలా దగ్గరలో ఉన్న జిల్లా కేంద్రాలకు కలపాలి.వీటికి వంద కిలోమీటర్ల లోపు రేడియస్ నిర్ణయించాలి.
అరకు జిల్లాకు మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు పేరు పెట్టమని కోరారు కొందరు.అలాగే మచిలీపట్నానికి నందమూరి తారకరామారావు పేరును జగన్ గతంలోనే ప్రతిపాదించారు. ప్రకాశం,గోదావరి,కృష్ణా,వైయస్ఆర్ పేర్లతో 5 జిల్లాలు ఉన్నాయి.మహనీయుల పేర్లు ప్రసిద్ధ ప్రాంతాలకు పెట్టుకోవటం మన ఆనవాయితీ.కానీ పేరు ఒక్కటే సమస్యలు తీర్చదు.జిల్లా కేంద్రం మిగతా ప్రాంతానికి ఎంత దూరం ఉంది,ప్రజల రాకపోకలకు సౌకర్యంగా ఉందా అని ప్రజలు సీరియస్ గా చూస్తారు.సముద్రతీర ప్రాంతాలలోని జిల్లా కేంద్రాలు జిల్లా మధ్యకు రావలసిన అవసరం,దూరం భారం సమస్య ఈ కొత్త జిల్లాల ఏర్పాటుతో కొంత తీరుతుంది.ఎందుకంటే ఓట్లు వేయటానికే కాక ప్రజలు తమ నిత్యవసరాల కోసం ఇతర అనేకమైన పరిపాలన పనుల కోసం జిల్లా కేంద్రాలకు నిరంతరం తిరుగుతుంటారు.మండలాల ఏర్పాటు ప్రజలకు దూరంతగ్గించింది.అలాగే స్పందన కార్యక్రమం ఊరూరా వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తున్నారు.అందువలన అవకాశం ఉన్నవరకు జిల్లా కేంద్రాలకు ప్రజలు వెళ్ళే ప్రయాణ దూరాన్ని తగ్గించాలి.చిన్న జిల్లాల ఏర్పాటు పుణ్య కార్యమే.జిల్లా కేంద్రానికి వంద కిలోమీటర్లు దాటిన ఈ అసెంబ్లీ స్థానాలకు దూరం తగ్గించటానికి కమిటీ ప్రయత్నించాలి.
అరకు జిల్లా లో కురుపాం 133 (విజయనగరం 87), పార్వతీపురం 104 (విజయనగరం 57), రంపచోడవరం 283 కి.మీ (రాజమండ్రి 59). ఒంగోలు జిల్లా లో ఎర్రగొండపాలెం 133 కి.మీ (మార్కాపురం 40) గిద్దలూరు 142 కి.మీ (మార్కాపురం 65)కర్నూలు జిల్లా లో పత్తికొండ 102 కి.మీ (అనంతపురం 87) కౌతాళం 134 కి.మీ ఆదోని 118 కి.మీ ఆలూరు 130 కి.మీ . హిందూపురం జిల్లా లో సింగనమల 128 (అనంతపురం 22) నెల్లూరు జిల్లా లో కందుకూరు 112 (ఒంగోలు 44) ఉదయగిరి 126 (కడప 107) తిరుపతి జిల్లా లో సర్వేపల్లి 121 (నెల్లూరు 13)రాజంపేట జిల్లా లో తంబళ్లపల్లి 118 (కడప 95) మదనపల్లి 135 (తిరుపతి 113) పుంగనూరు 152 (తిరుపతి 114) నగరి 110 (తిరుపతి 48)
--- నూర్ బాషా రహంతుల్లా,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ ,6301493266


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి