ఈ బ్లాగును సెర్చ్ చేయండి

3, జులై 2020, శుక్రవారం

ఇల్లు కట్టి చూడు



ఇల్లు కట్టి చూడు (సూర్య 4.7.2020)


“మేడంటే మేడా కాదు
గూడంటే గూడూ కాదు
పదిలంగా అల్లూకున్నా
పొదరిల్లూ మాదీ”
అంటూ ముఖ్యమంత్రి జగన్ ఇల్లులేని పేద వారికి ఇళ్ళు కట్టిస్తామని శుభవార్త వినిపించారు. అడిగిన అర్హులందరికీ ఇళ్ళు ఇళ్లస్థలాలు పంచుతామని,నవరత్నాలలో ఇల్లు మూడవ రత్నమనీ ఆనందవార్త వినిపించారు.30 లక్షల ఇళ్లపట్టాలు గ్రామ సచివాలయాల ద్వారా రాజశేఖరరెడ్డి జయంతి రోజున జులై 8 వతేదీన ఇస్తామని చెప్పారు.ప్రభుత్వం ఇచ్చిన ఉచిత స్థలంలో ఇల్లు కట్టుకొని అయిదేళ్ళ తరువాత అవసరమైతే అమ్ముకోవచ్చని జీవో ఇచ్చారు. ప్రజా సాధికార సర్వేలో ఇళ్లులేని వారిగా 32 లక్షల కుటుంబాలు నమోదయ్యాయి.30 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇస్తే చాలా మందికి నివాస స్థలం సమకూరుతుంది. ఇల్లు కట్టే కార్యక్రమానికి పెద్ద ఎత్తున డబ్బు సమకూర్చాలి కాబట్టి బ్యాంకు రుణాలు కూడా ఇప్పిస్తామన్నారు.నిరాశ్రయుల సంఖ్య ప్రతిఏటా పెరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తామన్నారు. కేంద్రంకూడా కరోనా కారణంగా ఇళ్లనిర్మాణ ప్రాజెక్టుల గడువును ఆరునెలలు పొడిగించింది.1987 లోనే అంతర్జాతీయ ఆశ్రయ కల్పనా సంవత్సరం అయిపోయింది కానీ ఇల్లు లేని ప్రజలు కోట్లలో ఉండిపోయారు.అంతర్జాతీయ ఆశ్రమం లాంటిది ఏదైనా ఒకటి కట్టించినా ఆ సంవత్సరానికి పెట్టిన పేరు సార్ధకం అయ్యేది.పార్టీలు ఏవైనా మంచి పనులు చేసినపుడు జనంసంతోషిస్తారు. తెలుగురాష్ట్రాలు రెంటిలోనూ అభివృద్ధి కార్యక్రమాలు పోటాపోటీగా జరుగుతున్నాయి.తెలంగాణాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ,కొత్త జిల్లాల ఏర్పాటు,30 కోట్ల మొక్కలు నాటే హరిత కార్యక్రమం,ఆంధ్రలో పచ్చతోరణం మంచిఫలితాలనే ఇస్తాయి.నాటినమొక్క ఎండితే బిడ్డ ఎండినట్లేనని కేసీఆర్ జనానికి భయంపెట్టారు.రాష్ట్రాల్లో జనం మాత్రం నిరాశ్రయులకు ఇళ్ళు కట్టించి ఎప్పుడిస్తారు అని దేశనాయకుల చెవుల్లో ఇల్లు ఇల్లు అని గోల పెడుతూనే ఉన్నారు. వాళ్ళ చెవుల్లో ఇళ్ళు కట్టుకుని పోరుతూనే ఉన్నారు.ఇళ్లు కట్టిన ప్రతి నాయకుడిని పేదలు అభిమానించారు.ఆనాడు ఎన్టీఆర్ పక్కా ఇళ్ళ స్కీముకు,రెండురూపాయల బియ్యానికి,మద్య నిషేధ కార్యక్రమానికి ప్రజలలో మంచి పేరు వచ్చింది.పక్కా ఇళ్ళు పెరిగే కొద్దీ అగ్నిప్రమాదాలు తగ్గాయి. కూలీల వలసలూ తగ్గాయి. అర్హులందరికీ అడిగినా అడగకపోయినా ఇల్లు సమకూర్చే బాధ్యతను కలక్టర్లకు అప్పగించారు జగన్.ఇల్లు లేదు అని ఎవరూ బాధపడకూడదని, నాకు ఓటు వేయనివారికి కూడా అర్హత ఉంటే ఇంటిపట్టా ఇచ్చితీరాలని,నేను గ్రామాల్లో పర్యటించినపుడు ఇంటిపట్టాలేదని ఎవరూ చెయ్యి ఎత్తకూడదని తన ఆశ,ఆశయం వెల్లడించారు.పేదవాడికి ఇళ్ళు కట్టటం పుణ్యకార్యం.దేశానికి అవసరమైన పని.ప్రతిఏటా చేయవలసిన పని. ఊరికి ఆనుకొని దగ్గరగా ఉన్న మెరకప్రాంతాలలో భూమిని సేకరించి ,పల్లపు ప్రాంతాలలో మెరక పోయించి ,ఇళ్లను నాణ్యంగా కట్టాలి. అందరికీ ఇళ్ళు పథకాన్ని విజయవంతంగా అమలుచెయ్యాలి.ఎందుకంటే అప్పుడే విమర్శల గోల మొదలయ్యింది.మెరకతోలకుండా నీళ్ళు నిలబడే పల్లపు భూమిలో పట్టాలు ఇచ్చారని,ఆవ భూములు కొన్నారనీ,పేదలకు ఎప్పుడో ఇచ్చిన పాత పట్టాలు తీసుకొని ఊరికి దూరంగా కొత్తచోట మళ్ళీ ఇచ్చారనీ ,పేర్లు మార్చారని,జాబితాలు మార్చారనీ,న్యాయస్థానానికి వెళతామని,ఇసుక మాఫియా ఆగలేదని,స్థానిక దళారులు ప్లాటులు అమ్ముకున్నారని పుట్టుకొచ్చిన రకరకాల సమస్యలను అధికారులు సకాలంలో పరిష్కరించాలి.
ఇల్లు కట్టడం కంటే కూలగొట్టడం తేలిక. ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు అని సామెత.అందుకని ఇప్పటికే కట్టిన భవనాలను వృధా కానివ్వకుండా ప్రజాసేవకు వాడుకోవటం మంచిదని కొందరు ప్రజావేదిక శిధిలాల దగ్గర బావురుమంటున్నారు. అంత్యదినాలలో జనం పెళ్లిళ్లు చేసుకుంటూ ఇళ్ళు కట్టుకుంటూ ఉంటారని ఏసుక్రీస్తు చెప్పాడట.పెళ్ళి చేయటం కంటే ఇల్లు కట్టటమే గొప్ప,అసలు ఇల్లు లేని వాడికి వెనుకటి రోజుల్లో పిల్లనిచ్చే వారు కాదట.ఇల్లు చూచి ఇల్లాలిని చూడమన్నారు.నాయకుడు తన ఇల్లు తమప్రాంతంలోనే కట్టుకుంటేనే ఓటర్లు తృప్తి పడుతున్నారు.చంద్రబాబు గారు ఇప్పటికైనా ఆంధ్రలో ఇల్లుకట్టుకోవాలని హితవు చెబుతున్నారు,ఈ దేశ నాయకులు కూడా ఇళ్ల ఇంపోర్టెన్స్ ను గుర్తిస్తూ ఇంట గెలిచి రచ్చ గెలవవోయ్ అని ఒకరినొకళ్ళు సవాలు చేసికుంటున్నారు.ముఠా కుమ్ములాటలతో, ముసుగులో గుద్దులాటలతో నిండి వున్న పార్టీని చూచి “ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత అంటూ ఈసడిస్తూ ఉంటారు.
ఇంటికి గుట్టు మడికి గట్టు ఉండాలి అంటారు. కానీ ఇంటి గుట్టును బయటపెట్టి లంకంత పార్టీకి చేటు తెచ్చే ప్రమాదకరమైన వ్యక్తుల్ని ఒక కంట కాదు వెయ్యి కళ్ళతో కనిపెడుతూ ఉండాలి. ఎందుకంటే మరి ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్నారు. ఇంటి దీపమని ముద్దు పెట్టుకుంటే మూతి మీసాలన్నీ తెగకాలినవట.అలాగే పార్టీ సభ్యుల్లో ఎవర్ని కూడా నెంబర్ టూ నువ్వే అని గారాబం చేయకూడదు. నెత్తిన ఎక్కించుకోగూడదు. ఇవతలికి రమ్మంటే ఇల్లంతా నాదేననే రకాలు ఉంటారు. ఇంట్లో చొరబడి ఇంటి వాసాలు లెక్క పెట్టుకొనే కక్కుర్తి మనుషులూ ఉంటారు. “ ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా నీ ఒళ్ళు జాగరతే తుమ్మెదా “ అని సినీకవి దాసం గోపాల కృష్ణ 1978 లోనే హెచ్చరించాడు కూడా.
ఇల్లు కాలింది జంగమయ్యా అంటే నా జోలే నా కప్పరా నా దగ్గరే ఉన్నాయిలే అన్నాడట. పార్టీ నాశనమైపోయినా సరే తన బతుకు బాగుపడితే చాలు అనుకునే స్వార్ధపరులు, ఇల్లు పీకి పందిరి వేసేవాళ్ళు రాజకీయాలలో అతి సహజం. పక్క ఇంటిలో పోరును పండుగంత వేడుకగా భావిస్తూ పచ్చని ఇంటిలో చిచ్చు పెట్టేవారు, పొరుగింటి వారు పచ్చగా ఉంటే చూడలేక ఓర్వలేక పోయేవారు. చివరికి ఇంట్లోవాళ్ల చేతనే ఇంటికి నిప్పంటిస్తారు. అలా ఇల్లు కాలి ఏడుస్తుంటే త్వరగా బావి తవ్వించండి అని ఉచిత సలహాలిస్తారు, చుట్టకు నిప్పివ్వమని కూడా అడుగుతారు. అందువలన ఇరు పోటీలు పడి ఇల్లు చెడగొట్టుకోకుండా, పక్కింటి వాళ్ళ తొక్కుకు ఆశపడకుండా, పరాయి పంచన చేరకుండా, ఇంటిని కనిపెట్టుకుని పడి ఉండటం ఇంట్లో సభ్యుల కర్తవ్యం, కనీస ధర్మం. ఇంట్లో క్రమశిక్షణ, ఇంటివాడిపట్ల, ఇంటిపేరు పట్ల, ఇంట్లో జనానికి గౌరవ విధేయతలు కొరవడితే “ఇంటి పేరు కస్తూరి వారు ఇంట్లో గబ్బిలాల కంపు” అన్నట్లుంటుంది.
--- నూర్ బాషా రహంతుల్లా ,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి