ఈ బ్లాగును సెర్చ్ చేయండి

5, సెప్టెంబర్ 2020, శనివారం

తీరప్రాంత కష్టాలు తీరాలంటే ?

 



తీరప్రాంత కష్టాలు తీరాలంటే ?
(గీటురాయి 4.9.2020) (సూర్య 6.9.2020)
వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి.కాళేశ్వరం దగ్గర నుంచి ధవళేశ్వరం దాకా వరదలే. వరంగల్ నగరం తోసహా గోదావరీతీర ప్రాంత గ్రామాలన్నీ ముంపు బారిన పడ్డాయి. మన దేశంలో కూడా విపత్తుల చట్టాన్ని విపత్తుల నిర్వహణా వ్యవస్థలను ఏర్పాటు చేశారు కానీ, ఇప్పటికీ పూర్తిస్థాయి యంత్రాంగం ఏర్పడలేదు.1977 దివిసీమ ఉప్పెన తరువాత, కోస్తా ప్రాంతంలో తుఫానుల నుంచి రక్షణకు ఏమిచేయాలన్న ఆలోచన జరిగాయి.ప్రకాశం బ్యారేజికి దిగువన చోడవరం,తూర్పుపాలెం దగ్గర ఇంకోరెండు బ్యారేజీలు కట్టాలని తలపెడుతున్నారు.ధవళేశ్వరం ఆనకట్ట కట్టడానికి ముందు ఆ ప్రాంతంలో తరచు గోదావరి నదికి వరదలు వచ్చేవి. కోరంగి రేవు వరదల్లోనే ధ్వంసమయింది.సర్ఆర్ధర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజి నిర్మించడం తో వరదలు తగ్గాయి. హైదరాబాద్ నగరంలో 1908లో వచ్చిన మూసీ వరదల తరువాత, అప్పటి నిజాం పాలకుడు, హైదరాబాద్ లో శాశ్వత వరద నివారణ వ్యవస్థను, మంచినీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేశారు. పాలకులలో ఉండే దూరదృష్టికి అవి ఉదాహరణలు. పెరుగుతున్న పట్టణీకరణ- ఒకనాటి చెరువులను, నీటి వ్యవస్థలను తుడిచిపెట్టి కాంక్రీట్ మయంగా మారుస్తున్నది. హైదరాబాద్‌ వరంగల్ ముంబై , చెన్నై, బెంగుళూరులో వికృతపట్టణీకరణ ఫలితాలను చూస్తున్నాము. నీటిదారులకు అడ్డుకట్టలు వేసి, భూములు ఆక్రమించి, భవనాలు నిర్మిస్తే ఏమవుతుంది, ఇళ్లలోకి నీళ్లు వస్తాయి, రోడ్లు కాలువలవుతాయి.
కోస్తా ఆంధ్ర ప్రాంతంలో తరచుగా వచ్చే వరదలు హైదరాబాద్లో, వరంగల్లో తెలంగాణలో రావు. అటు కృష్ణ, ఇటు గోదావరి రెండూ కూడా పీఠభూమికి లోతట్టునే ప్రవహిస్తున్నాయి. ఎగువున ఉండే నివాసప్రాంతాలలో చెరువులే జలవ్యవస్థలు. విపత్తు అంటే, వరదలు, తుఫానులు , కరువులు, వర్షాభావ పరిస్థితులు.వానలు, వరదలు ముంచెత్తిన ప్రతిసారీ ముంపు ప్రాంతాల్లో వేలు లక్షల్లో ప్రజలు సర్వం కోల్పోయి నిర్వాసితులవుతున్నారు. ఇళ్లూ వాకిళ్లు వదిలేసి ఉన్న ఊళ్ల నుంచి కట్టుబట్టలతో తాత్కాలిక పునరావాస కేంద్రాల్లో వరద తీసే వరకు తలదాచుకోవడం, మరలా సొంత గూటి బాట పట్టడం ముంపు బాధితులకు పరిపాటైంది. అత్యవసర సాయం కింద నిర్వాసితులకు , ముంపు బాధితులకు రూ.2 వేలు 5 కిలోల బియ్యం ఇస్తున్నారు. పునరావాస కేంద్రాలలో తలదాచుకున్న ఒక గర్భిణి సహా ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. కృష్ణ గోదావరి నదులకు వరదలొచ్చినప్పుడు పంటలు, తోటలు దెబ్బతింటున్నాయి. గొడ్డు గోదా, ఇళ్లూ, పశువుల కొట్టాలు, పడవలు, వలలు, మరమగ్గాలు నష్టపోతున్నారు. పరిహారాల చెల్లింపులకు ఏళ్లూ పూళ్లు పడుతున్నాయి. ప్రాజెక్టులకు భూములిచ్చిన వారే మొదటి బాధితులు.జాతీయ ప్రాజెక్టు పోలవరం లో 300 గ్రామాల ప్రజలు ఆదివాసీలున్నారు. కాంటూరు పరిధి దాటి గ్రామాలు మునిగిపోయాయి.నేటికీ నిర్వాసితులకు ఆర్‌ఆర్‌ ప్యాకేజీ పూర్తిగా అందలేదు. పునరావాసం బాధ్యత తనకు లేదని కేంద్ర బిజెపి ప్రభుత్వం అంటోంది. గోదావరి పోటెత్తితే కాఫర్‌డ్యామ్‌ వలన గ్రామాలు మునుగుతున్నాయి. కృష్ణా వరదలతో 'పులిచింతల' గ్రామాలు మునుగుతున్నాయి. వంశధారకు వరదలొచ్చినా అంతే. శ్రీశైలం నిర్వాసితుల సమస్య నేటికీ తేల్లేదు. గోదావరి, కృష్ణా నదుల కరకట్టలను ఇంకా పటిష్టం చేయలేదు. కేంద్రం నుంచి సాయం రాలేదు. వరదలొచ్చినప్పుడు లీకేజీల దగ్గర సిమెంట్‌, ఇసుక బస్తాలు అడ్డం వేసి సరిపెడుతున్నారు. కృష్ణకు, బుడమేరుకు వరదలొచ్చినా బెజవాడ లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయి. శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ కర్నూలును ఏ విధంగా బురదమయం చేసిందో మనకు తెలుసు. 20 లక్షల కోట్ల రూపాయల 'ఆత్మ నిర్భర భారత్‌' ప్యాకేజీ మొత్తం అంబానీ, అదానీలకు, పోగా నీటిపారుదల ప్రాజెక్టులకు ఏమీ మిగలలేదు. ప్రభుత్వరంగ సంస్థలను కూడా తెగనమ్ముతున్నారు. కోవిడ్‌ సమయంలో పనుల్లేక పూట గడవని కోట్లాది కుటుంబాలకు నెలకు పది కిలోల ఉచిత బియ్యం ఇవ్వాలని కోరుతున్నారు. పైగా గ్రామ సచివాలయాల ద్వారా చెత్త సేకరణ పన్ను కూడా వసూలు చేస్తారట. 972 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతమున్న రాష్ట్రం మనది.రోడ్లు వేసి అభివృద్ధి చేస్తే ఎన్నో రుషి కొండలు,మరెన్నో రామకృష్ణాబీచ్ లు తయారౌతాయి.అభివృద్ధి ఖర్చంతా హైదరాబాదు,విశాఖపట్టణం లోనే పెట్టారు.ఇంకా పెడుతున్నారు. మిగతా కోస్తా బారుకీ పేద మురికి సముద్రముంది గానీ అందాలకు నోచుకోలేదు. 1946 లో పుచ్చలపల్లి సుందరయ్య గారు వరదలు తుఫానులనుండి తీరప్రాంత ప్రజలను కాపాడటానికి కోరిన కోస్తా రైలుమార్గం కోస్తా రహదారి నేటికీ పూర్తిగా ఏర్పడలేదు. కటిక పేదరికం తాండవిస్తోంది.సెజ్ లు వచ్చాక తీరంలోని ఇసుక దిబ్బలు,సరివి తోటలు గ్రామాలకు గ్రామాలే క్రమంగా మాయమైపోయాయి,పోతున్నాయి.తీరప్రాంత ప్రజలే వరదలు మొయ్యాలి. తుఫానులు కాయాలి . వాగులపై వంతెనలుండవు.కోస్తావాసుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు.తుఫానులు వరదలు వచ్చినప్పుడు ఉన్నతాధికారులు కోస్తాను దర్శించిపోవటం కాకుండా కోస్తా ప్రాంతాభివృద్ధికోసం కనీసం రెవిన్యూ జోనల్ కార్యాలయాలన్నా ఏర్పాటుచెయ్యాలి.ప్రయాణం అనుత్పాదక వ్యయం.రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉండాలి.జిల్లాల నుండి రాజధానికి ప్రయాణించే అవసరం దూరం కోస్తా ప్రజలకు తగ్గించాలి. సముద్ర తీర ప్రాంతానికి మేలు చేయాలి.ఒక్కచోటే పేరుకుపోయిన పరిశ్రమలను మిగతా ప్రాంతాలకు తరలించకపోతే కోస్తా ఎడారికాక ఏమౌతుంది? ఎన్టీ రామారావు గారు మండలాలు పెట్టి ప్రజలకు మహోపకారం చేశారు.అలాగే ఇప్పుడు కొత్తజిల్లాల ఏర్పాటుపై దృష్టి సారించారు.పార్లమెంటు స్థానాలన్నీ జిల్లాలుగా మారుతాయి.తుఫానులు వరదల సమయంలో అలవిమాలిన పెద్దజిల్లాల అవస్థ తీరుతుంది.తీరప్రాంతాలలో కోట్ల మంది ప్రజలు సరైన రవాణా వ్యవస్థ లేక నదులు,వాగులు,మురుగుకాలవలు దాటలేక అవస్థలు పడుతున్నారు.తలదాచుకోటానికి పాత కాలం నాటి చర్చీలు,గుడులు,తుప్పుఊచలు బయటపడిన తుఫాను షెల్టర్లు మరింత భయపెడుతున్నాయి.ఎవరి పక్కా బిల్డింగ్ వారికి రావాలి.జిల్లాలలోని మన యువకులంతా ఉపాధికోసం మరో దిక్కు లేక రాజధానికి వెళ్ళిపోతున్నారు.జిల్లాలు వృద్ధాశ్రమాలలాగా తయారయ్యాయి.ముసలోళ్ళకు మందుబిళ్ళ తెచ్చిచ్చేవాళ్ళుకూడా లేరు.భారీ వర్షాలు,తుఫానుల సమయంలో వాళ్ళు అనాధల్లా విలవిలలాడుతున్నారు.మన పిల్లలకు మన ఊళ్ళలోనే ఎక్కడికక్కడ దగ్గరలో ఉద్యోగాలు దొరకాలంటే పరిశ్రమల వికేంద్రీకరణ తప్పదు.వికేంద్రీకరణలో దూరం భారం తగ్గించే మానవత్వం ఉంది.మిగతావారికీ ఫలాలు సమానంగా దక్కాలని చేసే త్యాగం ఉంది.కేంద్రీకరణలో అంతా నాకే కావాలి అనే స్వార్దం,అంతా నాదే అనే నిరంకుశత్వం ఉంది.అవినీతి ఉంది.విభజనవాదానికి విరుగుడు,సమైక్యత సాధించే సాధనం అభివృద్ధి కేంద్రాల వికేంద్రీకరణ.972 కి.మీ.పొడవైన సముద్ర తీరం వెంబడి మడ అడవులను పెంచాలి. తీరం పొడవునా 6 లైన్ల కోస్తా జాతీయ రోడ్డు , రెండు లైన్లతో కోస్తా రైల్వే మార్గాన్ని వేయాలి. తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే దేశానికి మేలు.ఎక్కడికో వలసపోవటంకంటే కళింగపట్నం,భీమునిపట్నం,విశాఖపట్నం,కాకినాడ, మచిలీపట్నం,నిజాంపట్నం.చీరాల,బాపట్ల,రామాయపట్నం,మైపాడు లాంటి ఎన్నో ఓడ రేవులను బాగు చేసుకోవటం నయం కదా?ప్రజా సమస్యలు పట్టించుకోకుండా కాలం గడిపే ప్రజల దుస్థితి ఎప్పటికీ ఇంతే.కీర్తి తమకు మాత్రమే దక్కాలని ఒకరు తెచ్చిన పనికి మరొకరు అడ్డంపడటం,ఇలా ఎన్నో కారణాలతో కోస్తా వాసులు బాధలు పడుతున్నారు.విమానం ఎక్కగలిగేవాళ్ళకు ఈ కష్టం తెలియకపోవచ్చుగానీ ఆర్టీసీ బస్సులతో అవస్థలుపడేవాళ్ళకు బాగా తెలుసు.సముద్ర తీరప్రాంత వాసుల సమస్యలు ప్రత్యేకమైనవి.
--- నూర్ బాషా రహంతుల్లా విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి