ఈ బ్లాగును సెర్చ్ చేయండి

12, డిసెంబర్ 2013, గురువారం

ఎన్నికల సంస్కరణలు-ఓటింగ్ యంత్రాలలో మార్పులు



ఎన్నికల సంస్కరణలు-ఓటింగ్ యంత్రాలలో మార్పులు
నూర్ బాషా రహంతుల్లా 9948878833
సోషల్‌ మీడియాపై కట్టడి
కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల సంస్కరణలలో భాగంగా  అభ్యర్ధిని తిరస్కరించే హక్కును కల్పించింది. ముందస్తు సర్వేలు, ప్రకటనలు చెల్లవని  సోషల్‌ మీడియాపై కట్టడి పెంచింది. అయితే ఈ  నిర్ణయాలను అమలు చేయదానికి ఇంకా ఎన్నో పనులు చెయ్యాల్సిన అవసరం ఉంది. సోషల్‌ మీడియాపై విదేశీ  సంస్థలకు అదుపు ఉండదు. సోషల్‌ మీడియాలో వచ్చే ప్రకటనలు అదుపు చేసే వీలున్నా విదేశీ కంపెనీలు దేశాలు కూడా మన ఎన్నికల సంఘానికి సహకరించేలా చేసుకోవాలి. 
నియంత్రణ సిబ్బంది పెరగాలి 
రాజకీయ పార్టీల నాయకులు తమ ప్రచారానికి ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాను విచ్చలవిడిగా వాడుకోకుండా చూడాలంటే నిఘా నియంత్రణ సిబ్బంది పెరగాలి.మీడియాను ఎన్నికల ప్రవర్తనా నియమావళి కిందికి తీసుకువచ్చి ఆంక్షలు పెట్టడంతో రాజకీయ నాయకులు ప్రత్యామ్నాయంగా సోషల్‌ మీడియాను విస్తృతంగా వినియోగిస్తున్నారు. దాంతో సోషల్‌ మీడియాకు కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తించే విధంగా చర్యలు తీసుకోబోతున్నారు. అయితే ఇది ఆచరణ సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నా ప్రయత్నం మాత్రం మంచిదేనని ప్రజాస్వామ్యవాదులు హర్షిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం పత్రికల్లో ప్రకటనలపైనా, పెయిడ్‌ ఆర్టికల్స్‌పైనా, ఎలక్ట్రానిక్‌ మీడియా, సోషల్‌ మీడియా .. లో ప్రకటనలపైనా ఇలా దేన్నీ వదలకుండా నిబంధనలు కఠినతరం చేస్తోంది. విదేశాల నుంచి నిర్వహించే సోషల్‌ మీడియాను కూడా  కంట్రోల్ చేయటానికి ప్రయత్నిస్తోంది.

ఫేస్‌బుక్‌ వినియోగలో 15 కోట్ల మంది
  రాజకీయ పార్టీలు, నాయకులు ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, యుట్యూబ్‌ ద్వారా తమ  డప్పు కొట్టుకుంటున్నారు.  నెట్‌లో వారిని అనుసరించే వారి సంఖ్య గణనీయంగానే ఉంది. ఓటర్లు లైకులు,షేరులు,వ్యాఖ్యల ద్వారా ఆ ప్రకటనలను వ్యాసాలను ఆదరిస్తున్నారు.అలా వచ్చే ఆదరణను బట్టి కూడా ఆయా రాజకీయ నాయకుల పాపులారిటీని లెక్కించుకుంటున్నారు.  
ప్రపంచవ్యాప్తంగా  ప్రతి ఐదుగురిలో ఒకరు సోషల్‌ సైట్లు వినియోగిస్తున్నారు. మన దేశంలో ప్రస్తుతం 15 కోట్ల మంది ఫేస్ బుక్ లాంటి సోషల్‌ సైట్లను వినియోగిస్తున్నారు.  2017 సంవత్సరం నాటికి  వీళ్ళు 24 కోట్ల మందికి పెరుగుతారట. జనాభాలో చైనాను కూడా మన దేశం తలదన్నబోతోందికదా  అలాగే సోషల్‌ మీడియా ఇంకా గ్రామీణ భారతంలోకి  బాగా చొచ్చుకుపోతే ఈ సంఖ్య బాగా పెరిగి  ప్రపంచంలోనే అత్యధికంగా సోషల్‌ మీడియా వినియోగించే దేశం మనదే అవ్వొచ్చు..

భావవ్యక్తీకరణకు విఘాతమా?   
సోషల్‌ మీడియా సంస్థలకు ప్రజలు పోస్టు చేసే అంశాలపై పూర్తి అదుపు లేదూ. అవి విదేశాల్లో ఉంటా యి. ఎన్నికల సంఘం అభ్యర్ధనకు అవి  తమ నిస్సహాయతను వ్యక్తం చేశాయి . అయినా  ఎన్నికల సంఘం మాత్రం ఆ అంశాలు మీరే చూసుకోవాలని తెగేసి చెప్పింది.ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌ లాంటి సంస్థలు ఎలా వీళ్ళను కంట్రోల్ చెయ్యాలో అర్ధాంకాక ఆందోళన చెందుతున్నాయి. తమ పరిధిలో లేని ,తమ వల్ల కాని అంశాలకు తమను బాధ్యుల్ని చేయడం ఎంతవరకు సమంజసమని  ప్రశ్నిస్తున్నారు. సోషల్‌ మీడియా నెట్‌వర్క్‌లపై ఎన్నికల సంఘం విధించబోతున్న నిబంధనలు ఐటి చట్టంలోని సెక్షన్‌ 79కు వ్యతిరేకమని అంటున్నారు. ఇది వ్యక్తుల భావవ్యక్తీకరణను హరించి ప్రజల  ఏకాంత హక్కును కాలరాస్తుందని అంటున్నారు.

 సోషల్‌ మీడియాను చాలా రాజకీయ పార్టీలు దుర్వినియోగం చేస్తున్నట్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వచ్చాయి. ఇలాంటి ఫిర్యాదులను కూడా ఎన్నికల నిబంధనావళి పరిధిలోకి తీసుకు రాబోతున్నారు. మన దేశంలో స్వేచ్ఛగా వ్యాపారం చేసుకుంటున్న సోషల్‌ మీడియా సంస్థల వారికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా మన దేశంలో వ్యాపారం చేసుకోవాలంటే ఇక్కడి చట్టాలను అమలు చేయక తప్పదు. ఎన్నికల నిబంధనావళిని ఖచ్చితంగా అమలు చేయక తప్పదు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు
ఈవీఎంలపై రాజకీయ పార్టీల విమర్శలు
న్యూఢిల్లీ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా ఈవీఎంలకు ప్రింటర్‌లను అనుసంధానించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. 2013  సెప్టెంబర్‌లో నాగాలాండ్‌లోని నోక్సెన్ నియోజకవర్గం ఉప ఎన్నికలో తొలిసారి ఈవీఎంలకు ప్రింటర్లు పూర్తిగా వినియోగించారు. బ్యాలెట్ బాక్సుల విధానానికి స్వస్తిపలికి ఈవీఎంలను ఉపయోగించడం మొదలెట్టాక పరాజితులు తమ ఓటమికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లే కారణమని వంకలు పెట్టారు. అధికార పక్షం ఈవీఎంలను టాంపర్చేసిందనీ, లేకపోతే తాము భారీ మెజారిటీతో గెలిచేవారమని ఆరోపించారు.
 హైటెక్ నిపుణుడు చంద్రబాబు నాయుడు కూడా ఈవీఎంల గురించి రాద్ధాంతం చేసేవారు. అన్ని పార్టీలూ ఈవీఎంల కు వ్యతిరేకంగా ఏదో ఒక వాదన  చేశాయి.పంజాబ్ లో  ఈవీఎంల సోర్స్ కోడ్‌ను హ్యాకర్లద్వారా మార్చి ఎన్నికల్లో విజేతగా గెలిచారనీ  కాంగ్రెస్ కూడా ఆరోపించింది.  సుప్రీంకోర్టు ఈవీఎంలకు ప్రింటర్లను అనుసంధానించమని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తన ఓటు ఎంపికచేసుకున్న పార్టీకే వెళ్లిందో, లేదో ఓటరు తెలుసుకోవడానికి,ఓట్ల లెక్కింపులో వివాదం తలెత్తినప్పుడు సరిచూసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.

ఓటు గోప్యతకు భంగం 
  ఈవీఎంలపై ఓటర్లకు విశ్వాసం కలగాలంటే ఇదొక్కటే మార్గమన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలనాటికి ఈ విధానాన్ని అమల్లోకి తేవాలట. ఆరునెలల వ్యవధిలో లక్షలాది ఈవీఎంలకు అవసరమైన ప్రింటర్లు ఉత్పత్తిచేయడం సాధ్యంకాదనీ , కొన్ని నియోజకవర్గాల్లో  అమలుచేయగలమని ఎన్నికల సంఘం విన్నవించింది. ఈవీఎంలపై పరాజితుల ఆరోపణలే తప్ప, ఓటర్లు ఎప్పుడూ ఫిర్యాదులు చేయలేదు.  పరాజితుల ఆరోపణలు కూడా రుజువు కాలేదు. ఏదైనా ఈవీఎం మొరాయిస్తే వెంటనే దాని స్థానంలో మరో ఈవీఎంను సమకూరుస్తున్నారు. కొన్నేళ్ళ క్రితం  ఒక ఈవీఎంను దొంగిలించి, దాన్ని మార్చగలిగి నట్టు నిరూపించడానికి ప్రయత్నించినా ఫలించలేదు. ఓటింగ్ సమయంలోగానీ, కౌంటింగ్ సమయంలోగానీ ఈవీఎంను దేనితోనూ అనుసంధానించలేరు. దాన్ని రిమోట్ కంట్రోల్‌తో కూడా మార్చలేరు. ఈవీఎంను తమ ఎదురుగా మార్చి దాని లోపాలను బయటపెట్టాలని ఎన్నికల సంఘం ఎన్నో సార్లు సవాలు చేసినా ఎవరూ అందుకు సిద్దపడలేదు .

సంస్కరణలతో కొత్త సమస్యలు రాకూడదు
   పోలింగ్‌కు ముందు ఈవీఎంలను ప్రతి దశలోనూ తనిఖీ చేస్తారు. వాటిని పరీక్షించే అవకాశం  పార్టీల ప్రతినిధులకు స్తారు. వివిధ నియోజకవర్గాలకు పోలింగ్ కేంద్రాలకు వెళ్లే ఈవీఎంలేవో తెలుసుకునే అవకాశమే ఉండకుండా జంబ్లింగ్ చేస్తారు. ఏ ఈవీఎంలు ఎక్కడికెళతాయో  తెలుసుకోకుండా  ఎన్నికల సంఘం చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఈవీఎంలను తారుమారు చేయలేరు. కొన్ని దేశాల్లో ఈవీఎంలకు స్వస్తిపలికి, మళ్లీ బ్యాలెట్ బాక్సుల విధానానికి ఎందుకు వెల్ళారంటే  అక్కడ వాటిని  ప్రైవేటు కంపెనీలు తయారుచేసాయి.మన దేశంలో ఈవీఎంలు బెల్,ఈసీఐఎల్ లాంటి ప్రభుత్వ సంస్థలు ఉత్పత్తిచేశాయి.

  ఈవీఎంలకు ప్రింటర్‌ను అనుసంధానించాక ఓటరు తాను ఓటేసిన పార్టీకి ఎదురుగాగల బటన్‌ను నొక్కిన వెంటనే ప్రింటర్‌నుంచి ఆ ఓటు ఏ పార్టీకి, ఏ అభ్యర్థికి వేశారో తెలియజేస్తూ ఒక స్లిప్ బయటికొస్తుంది. ఏడు సెకన్ల లోపు ఆ స్లిప్పు తీసుకోకపోతే అది ప్రింటర్ వెనుక ఉండే  బాక్సులో పడుతుంది. స్లిప్పులమీద కూడా తరువాత తగాదాలు తలెత్తవచ్చు. నేను ఒక పార్టీకి ఓటువేస్తే ఇంకో పార్టీకి స్లిప్పు  వచ్చిందని పేచీకి దిగొచ్చు.గొడవలకు దిగి పోలింగ్ ను నిలిపేయవచ్చు.ఏజెంట్లు అందరూ సవ్యంగా ఉన్నదని సంతృప్తిపడ్డాకగానీ తిరిగి మొదలయ్యే స్థితి ఉండదు. ఇలాంటి పరిస్థితిలో  ఓటుకు  గోప్యత ఉండదు. ఓటరు ఎవరికి ఓటేశాడో  తెలిసిపోతే ఆ ఓటరుకు ఇబ్బందులే కదా? . పారదర్శకత ఉండాలి కానీ మరీ ఓటేవారికి వేశారో తెలుసుకునేంత కాదు. ప్రింటర్లకోసం 1700 కోట్లు ఖర్చుపెట్టి  చివరకు ఇలాంటి గొడవలు ఎందుకు సృష్టించాలి?
 http://www.suryaa.com/opinion/edit-page/article-162765  సూర్య 14.12.2013
 https://www.facebook.com/photo.php?fbid=679397968758863&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి