ఈ బ్లాగును సెర్చ్ చేయండి

23, డిసెంబర్ 2013, సోమవారం

రాజధాని నగరానికి ఎంత భూమి కావాలి?


రాజధాని నగరానికి ఎంత భూమి కావాలి?
నూర్ బాషా రహంతుల్లా 9948878833

(ఈనాడు 6.3.2015)
సీమాంధ్ర రాజధానికి లక్ష ఎకరాలు కావాలంటున్నారు.నిజంగా అంత భూమి అవసరమా?ఇప్పుడు హైదరాబాద్‌లో 400 ఎకరాల విస్తీర్ణంలోనే  45 శాఖలు నిర్వహిస్తున్నారు.మిగిలిన 99,600 ఎకరాలు ఎవరి కోసం అంటే ఆ నగరం చుట్టూతానే  ప్రైవేటు వ్యక్తులు పరిశ్రమలు పెట్టుకోటానికీ,రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహించుకోటానికీ అన్నమాట. దేశంలో ఏ రాజధాని నగర విస్తీర్ణమూ 22వేల ఎకరాలు మించలేదు
ఛత్తీస్‌గఢ్ రాజధాని నయారాయ్‌పూర్ 22వేల ఎకరాల్లో,జార్ఖండ్ రాజధాని రాంచీ 15వేల ఎకరాల్లో,గుజరాత్ రాజధాని  గాంధీనగర్ సిటీ 43వేల ఎకరాల్లో నిర్మించారు.కొత్త రాజధాని కోసం లక్ష ఎకరాల ప్రభుత్వ భూమి ఒకేచోట ఎక్కడా దొరకదు.ప్రైవేటు భూమి సేకరించక తప్పదు. ఒకేచోట భారీ ఎత్తున భూసేకరణకు పాల్పడితే రైతుల వ్యవసాయ భూములు మాయమైపోవచ్చు అని రైతులూ భయపడుతున్నారు.
నికరంగా ఎంత భూమి కావాలి?
అసలు రాజధాని నగరానికి నికరంగా ఎంత భూమి కావాలి? నికరంగా అంటే పరిపాలనా భవనాల కోసం మాత్రమే అన్నమాట.ఇప్పుడు హైదరాబాద్‌లో ఏయే శాఖలు ,ఎన్ని పరిపాలనా కేంద్రాలు ఉన్నాయో  సీమాంధ్ర రాజధాని నగరంలో కూడా అవే భవనాలు నెలకొల్పాల్సి ఉంటుంది. 23 జిల్లాలకు 400 ఎకరాల్లోనే హైదరాబాద్‌లో రాజధాని కార్యకలాపాలు కొనసాగినప్పుడు లక్ష ఎకరాలు అడగటం అనవసరం.ప్రభుత్వం కూడా తన కార్యాలయాలకు అవసరమైనంత భూమినే సేకరించుకోవాలిగానీ అవసరాన్ని మించి భూసేకరణ జరుపకూడదు.ప్రైవేటు వ్యక్తులు తమకు అవసరమైన భూమిని తామే కొనుక్కోవాలి.ప్రైవేటు  సెజ్ లకోసం ప్రభుత్వం సేకరించిన వేలాది ఎకరాల భూమి కొన్నిచోట్ల నిరుపయోగమయ్యింది .రాజధానిని అధునాతన పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని,తక్కువ స్థలాలలోనే ఎక్కువ సౌకర్యవంతంగా నిర్మించుకోవచ్చు. కొత్త రాజధాని కోసం ఏకంగా లక్ష ఎకరాల స్థలం కావాలని కొందరు నాయకులు కేంద్ర మంత్రుల బృందానికి నివేదించినట్లు వార్తలొచ్చాయి.లక్ష ఎకరాలు ఎందుకు కావాలో వివరాలు కూడా చెబితే బాగుండేది. ప్రస్తుతం హైదరాబాద్‌లో రాజధాని కార్యాలయాలన్నీ కలిపినా విస్తీర్ణం  400 ఎకరాల లోపే ఉంది. మరి లక్ష ఎకరాలను రాజధాని స్థలంగా ఎందుకు కోరుతున్నారు? సీమాంధ్ర కొత్త రాజధాని కోసం లక్ష ఎకరాల భూమి కావాలన్న కోరిక అనుమానాన్ని కలిగిస్తున్నది. హైదరాబాద్‌లో ఇప్పటిదాకా కొనసాగిన రాజధాని కార్యాలయ భవనాలను  అవసరం మేరకు ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూ పోయారు. వాటన్నిటి  విస్తీర్ణం కలిపినా 400 ఎకరాల లోపే ఉన్నది. 45 ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాలతోపాటు సిబ్బంది క్వార్టర్లు, ఇతరత్రా అవసరాలు అన్నీ ఈ 400 ఎకరాల విస్తీర్ణంలోనే తీరుతున్నాయి. కొత్త రాజధాని కాబట్టి వెయ్యి ఎకరాల భూమి అడగొచ్చు. కానీ లక్ష ఎకరాలు ఎందుకు?
కొత్త రాజధానిని నిర్మించుకునేంత వరకూ తాత్కాలికంగా పదేళ్ళపాటు సీమాంధ్ర రాజధాని హైదరాబాద్‌ లోనే ఉంటుంది కాబట్టి ముందు 500 ఎకరాల స్థలంలో శాఖలవారీ ప్లానులు వేసుకొని నిర్మాణాలు మొదలుపెట్టాలి. కొత్త రాజధానికి లక్ష ఎకరాల స్థలం అక్కరలేదు కానీ , ఐదు లక్షల కోట్ల నిర్మాణ వ్యయం కేంద్రాన్ని కోరవచ్చు.ఎందుకంటే ఆ మొత్తాన్నీ మళ్ళీ ఒకే నగరంలో కుప్పబోసి పాత అవస్థలను మళ్ళీ ప్రజల నెత్తి మీదకు తెచ్చేకంటే 13 జిల్లాలకు ఆడబ్బు సమంగా పంచవచ్చు. పరిశ్రమలు,ప్రాంతీయ జోనల్ కార్యాలయాలు, అసెంబ్లీ , హై కోర్టు,సచివాలయం,డైరెక్టరేట్లు,కమీషనర్ ఆఫీసులు, అన్నీ ఒకచోట ఉండకుండా తలా ఒక ప్రాంతంలో పెడితే మళ్ళీ ఇలా విభజనోద్యమాలు తలెత్తవు.అన్నీ ప్రాంతాలు సమతూకంలో అభివృద్ధికి నోచుకునేలా ప్రణాళిక వేసుకోవాలి.

ఇతర రాష్ట్రాల రాజధానులకు ఎంత భూమి వాడారు ?
కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల రాజధానులు ఏవీ 22వేల ఎకరాలను మించి అడగలేదు. ఛత్తీస్‌గఢ్ రాజధాని నయారాయ్‌పూర్ 22వేల ఎకరాల్లో నిర్మిస్తున్నారు. నిర్మాణానికి ఎక్కువగా ప్రభుత్వ భూములనే వినియోగించారు. 4వేల ఎకరాలను మాత్రం ప్రజలనుంచి సేకరించారు. అదీ మార్కెట్ ధరకు నాలుగు రెట్లు అధికంగా చెల్లించి! నాలుగు గ్రామాల ప్రజలను మాత్రమే అక్కడి నుంచి తరలించాల్సి వచ్చింది. మరి లక్ష ఎకరాలు సేకరించాలంటే ఎన్నో గ్రామాల రైతులు తమ భూములు కోల్పోవాల్సి ఉంటుంది. ప్రజలు భారీ ఎత్తున నిర్వాసితులు కావాల్సివస్తే అది మరో ఉద్యమానికి దారితీస్తుంది.గుజరాత్‌ రాజధాని మొత్తం గాంధీనగర్ సిటీని 427 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. జార్ఖండ్ రాజధాని రాంచీ కూడా 15వేల ఎకరాల్లోపే ఉంది. సీమాంధ్ర కొత్త రాజధాని హైదరాబాద్‌ తో సమానంగా  విస్తీర్ణం కలిగి ఉంటే చాలు. ఇప్పుడు హైదరాబాద్‌లో ఏయే శాఖలు ఉన్నాయో? ఎన్ని పరిపాలనా కేంద్రాలు ఉన్నాయో దాదాపు అవే సీమాంధ్రలోనూ పెట్టాలి. హైదరాబాదు లో ఇప్పుడు 400 ఎకరాల్లో రాజధాని కార్యకలాపాలు కొనసాగిస్తునప్పుడు లక్ష ఎకరాల కోసం పేచీ పెట్టడంలో అర్ధం లేదు.  
సచివాలయం 23 ఎకరాలే
సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు 57ఏళ్లుగా రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో ప్రభుత్వ కార్యాలయాలు ఎంత  విస్తీర్ణములో ఉన్నాయో పరిశీలిద్దాం. 1965 లో మన రాష్ట్ర రాజధానిలో  ప్రభుత్వ భవనాల విస్తీర్ణం కేవలం 22.80 లక్షల చదరపు అడుగులు మాత్రమే ఉంది. ఇప్పుడు మాత్రం 250 ఎకరాల విస్తీర్ణంలో అన్ని పరిపాలనా భవనాలు కొనసాగుతున్నాయి. ఇందులో ప్రభుత్వ కార్యాలయాలతోపాటు అధికారుల నివాసాల కోసం నిర్మించిన క్వార్టర్లూ ఉన్నాయి. రాష్ట్ర గవర్నర్ నివసించే రాజ్‌భవన్ మొత్తం 22 ఎకరాలలో నిజాం కాలంలో కట్టారు. రాష్ట్రంలో ఎక్కువ విస్తీర్ణంలో నిర్మితమైన భవనం ఇదే . బంజారాహిల్స్‌లో 30మంది మంత్రుల నివాస సముదాయం 22 ఎకరాలు. బేగంపేటలో ముఖ్యమంత్రి నివాసం , క్యాంపు కార్యాలయం విస్తీర్ణం ఎకరాలు . సచివాలయం 22.80 ఎకరాల్లో ఉంది. ఇందులో భవనాలున్నది పది వేల చదరపు అడుగులు మాత్రమే.                   
           హైదరాబాద్‌లో కొన్ని ముఖ్యమైన ప్రభుత్వభవనాలు         (విస్తీర్ణం ఎకరాలలో)

రాజ్‌భవన్
22
బంజారాహిల్స్ మంత్రుల క్వార్టర్లు
22
సీఎం క్యాంపు కార్యాలయం
2
సచివాలయం
22.80
బూర్గుల రామకృష్ణారావు భవన్
8
హైదర్‌గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్లు
7.10
ఆదర్శ్‌నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్లు
11
అసెంబ్లీ (టౌన్ హాల్  1913)
6
హైకోర్టు
2.9
ఆర్ అండ్‌బి కార్యాలయం
2.35
గగన్‌విహార్, చంద్రవిహార్
30
సర్వే భవన్
2
సీసీఎల్‌ఏ
4
సంక్షేమ భవన్ మాసబ్‌ట్యాంక్
10
ట్రాన్స్‌పోర్ట్ భవన్
18
ఆబ్కారీ భవన్
1.28
ల్యాండ్ సర్వే కమిషనరేట్
2.16
డీజీపి కార్యాలయం
5
వ్యవసాయ కమిషనరేట్
1.20
మలక్‌పేటలోని వ్యవసాయ విస్తరణ కేంద్రం
4
జలసౌధ
4
మెడికల్ డైరెక్టరేట్ (కోఠి):
15
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్
10.15
బస్‌భవన్
3.20
దేవాదాయ శాఖ కమిషనరేట్
2.24
డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్
3.20
రాజీవ్ విద్యామిషన్
1.20
ఇంటర్మీడియట్ బోర్డు, కళాశాల విద్య
1
మొత్తం
223.78

ఇలా చూసుకుంటూ పోతే కొత్త రాజధాని ఏర్పాటుకు పరిపాలనా భవనాలన్నిటికీ ,మౌలిక సదుపాయాలతో కలిపి పది వేల ఎకరాలే ఎక్కువ. కానీ రాజధాని కార్యాలయాలతోపాటు జనావాసాలకూ , ప్రైవేట్ రియల్ ఎస్టేట్లూ,పారిశ్రామికవేత్తలూ , కార్పొరేట్ సంస్థలకూ కూడా భూమి ప్రభుత్వమే ఇవ్వాలంటే లక్ష ఎకరాలు కూడా సరిపోకపోవచ్చు. జీహెచ్‌ఎంసీతోపాటు.. హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న కార్యాలయ భవనాలన్నీ కలిపినా వాటి విస్తీర్ణం  400 ఎకరాలు మించదు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 630 చదరపు కిలోమీటర్ల పరిధిలో జనాభా సుమారు 75లక్షలు. 217 చ.కి.మీ. పరిధిలో ఉన్న హైదరాబాద్ రెవెన్యూ జిల్లాలో జనాభా 40 లక్షలు. తెలంగాణలోని ఐదు జిల్లాల్లో 7020 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన హెచ్‌ఎండీఏ పరిధిలో జనాభా సుమారు కోటి. ఏడువేల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న నగరానికే కేవలం 400 ఎకరాలలో అన్ని కార్యాలయాలూ నిర్మించారు కాబట్టి  కొత్తరాజధానికి లక్ష ఎకరాలు అక్కరలేదు.

  రైతుల గగ్గోలు   
సీమాంధ్ర లో రాజధాని నగరం ఏర్పాటు చేస్తారనే వార్త సంతోషంగానే ఉందిగానీ  రాజధాని కోసం లక్ష ఎకరాలు సేకరిస్తారనే వార్త మాత్రం సీమాంధ్ర రైతుల్లో తీవ్రంగా కలత రేపింది. ఎందుకంటే కొత్త రాజధాని కోసం అంతమొత్తం ప్రభుత్వభూమి ఒకేచోట ఎక్కడా దొరకదు. రైతుల  భూమిని సేకరించడం తప్పదు. దీంతో కొంతమంది తమ వ్యవసాయ భూములకు కొత్త భూసేకరణ చట్టం ప్రకారం మార్కెట్‌ విలువకు నాలుగు రెట్ల దాకా పరిహారం వస్తుందనీ , భూమికి భూమి, ఇళ్ల మంజూరు, ఉపాధి, జీవితాంతం వడ్డీ లాంటి ప్రతిఫలాలూ దక్కుతాయనీ ఉబ్బితబ్బిబ్బవుతుంటే ,కొందరు మాత్రం బంగారం లాంటి తమ వ్యవసాయ భూమిని  ప్రభుత్వం ఎక్కడ గుటుక్కుమనిపిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. గతంలో సెజ్‌లు,జలయజ్నం, ఔటర్ రింగురోడ్ల కోసం  సేకరించిన భూములకు నామమాత్రపు ధర చాలా ఆలస్యంగా చెల్లించారని తలుచుకొని కలవరపడుతున్నారు.

పారిశ్రామికవేత్తల గోల
తమ ప్రాంతంలోనే రాజధాని ఉండాలని  పట్టుబట్టిన  పారిశ్రామికవేత్తలు కూడా రాజధానికి లక్ష ఎకరాలు సేకరిస్తే తమ ఆస్తులూ అందులో కలిసిపోతాయని భయపడుతున్నారు. కొత్త రాజధాని చుట్టూ సెజ్‌లు పెట్టకపోతేనే బాగుంటుందని అంటున్నారు. అభివృద్ధి ప్రాజెక్టులు మొత్తం సీమాంధ్ర జిల్లాలకు సమానంగా పంపిణీ అయితేనే సమానాభివృద్ధి సాధ్యమవుతుందని ఆంధ్రా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అభిప్రాయపడుతోంది. లేనిపక్షంలో అభివృద్ధి ఒకేనగరంలో పరిమితమై మళ్ళీ మెగాసిటీ బాధలు పునరావృతమౌతాయని ఫలితంగా అసంఖ్యాక రైతులు చిన్న పరిశ్రమలవాళ్ళూ అభివృద్ధికి నోచుకోక బాధితులుగా మారుతారని వాదిస్తున్నారు. పైగా లక్ష ఎకరాల సేకరణతో కొత్త  ఇబ్బందులొస్తాయని ,ఏళ్ళ తరబడి తగాదాలు, కోర్టు వ్యవహారాలు నడుస్తాయని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే  ఉద్యమాలతో తమ రియల్ ఎస్టేట్ వ్యాపారం తీవ్రంగా దెబ్బతిన్నదని, ఇప్పుడు కొత్త రాజధానికి లక్ష ఎకరాలంటే ఉన్న వ్యాపారం నాశనమవుతుందని ఆయా ప్రాంతాల రియల్టర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పైగా ఎక్కడెక్కడ ఎంతెంత ప్రభుత్వ భూమి,అటవీ భూమి ఉందో ఆరా తీసి, రాజధానిని అక్కడ పెట్టుకొమ్మని సలహాలు కూడా ఇస్తున్నారు.
 సామాజిక శాస్త్రవేత్తల సూచనలు
రాష్ట్రాభివృద్ధి కోసం ఇప్పుడన్నా శాస్త్రీయంగా ఆలోచన చెయ్యాలి. రాజకీయాలకతీతమైన ఆచరణాత్మకమైన ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలి. భూమి అనేది మనిషిసృష్టించలేనిఒకఅమూల్యసంపద.ఉండటానికి ఇంటి స్థలము,పొలమూలేని పేదలూ నిరాశ్రయులూలక్షల సంఖ్యలోఉన్న 
దేశంలోభూమినిపొదుపుగావాడటం,భూమి ఎంతోకొంత అందరికీ ఉండేలా చేయటం, చిన్నరైతుల దగ్గర ఉన్న కొద్దిపాటిభూమిని 
లాక్కోకపోవటం  శ్రేయోరాజ్య లక్షణం.అందువలన ప్రభుత్వ కార్యాలయాలకూ క్వార్టర్లకూ ఎక్కువగా ప్రభుత్వ భూమినే ఉపయోగించాలి.ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేకపోతేనే ప్రైవేటు స్థలాల్ని కొనాలి. భారీ వ్యయంతో కొనుగోలు చేయడం ఇష్టం లేకపోతే అటవీ భూములు దొరికినా ప్రత్యామ్నాయంగా అటవీ శాఖకు మరోచోట భూములిచ్చి అటవీ భూముల్ని అయినాసరే తీసుకోవాలి. నికరంగా అవసరమైనంత భూమిని మాత్రమే లెక్కగట్టి భూసేకరణకు పూనుకోవాలి,ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటుచేసి ముఖ్య కేంద్రాలను అన్ని ప్రాంతాలకూ వికేంద్రీ కరించాలి అని సామాజిక శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
మెగాసిటీలు వద్దు బాబో
రాజధానులుగా ఉన్న ప్రాంతాలు మెట్రో నగరాలే కావాల్సిన అవసరంలేదు. పాలనాపరమైన కార్యకలాపాల నిర్వహణకు పరిమితమైతే చాలు. దేశంలోని కొన్ని రాష్ట్రాల రాజధానులు ఆయా రాష్ట్రాల్లోని ఇతర నగరాలకంటే చాలా చిన్నగానే ఉన్నా యి. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో కంటే కాన్పూర్, అలహాబాద్, వారణాసి నగరాలే పెద్దవి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కంటే ఇండోర్, ఒడిశా రాజధాని భువనేశ్వర్ కంటే కటక్ పెద్దది. గుజరాత్ రాజధాని గాంధీనగర్ జనాభా 1.90లక్షలు కాగా అహ్మదాబాద్ జనాభా 39 లక్షలు. సూరత్ జనాభా 33 లక్షలు. అసోం రాజధాని డిస్పూర్ జనాభా లక్షలోపే. గౌహతి 15 లక్షల జనాభా ఉన్న పెద్ద నగరం. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ కంటే హరిద్వార్, జార్ఖండ్ రాజధాని రాంచీ కంటే బొకారో, ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్ కంటే బిలాస్‌పూర్ పెద్దనగరాలు. దేశ రాజధాని ఢిల్లీ కంటే ముంబై, కోల్‌కతాలు పెద్ద నగరాలు. ఇప్పటికే పాతబస్తీలతో ఇరుకైపోయిన పాతనగరాలలోనే రాజధాని ఉండనక్కరలేదు.కొత్త పట్టణాలు కట్టవచ్చు. నయా రాయ్‌పూర్, గాంధీనగర్, భువనేశ్వర్ నగరాలను కొత్తగానే కట్టుకున్నారు.ఆంధ్రా కాంట్రాక్టర్లు అసోం ఆఫ్ఘనిస్థాన్ లాంటి దూరప్రాంతాలకుకూడావెళ్ళినిర్మాణాలుచేస్తున్నారు.నిధులు సక్రమంగా ఇస్తే వాళ్ళుఅయిదేళ్ళలో రాజధాని నగరాన్ని నిర్మించగలరు. ఏ వసతి ఏ నగరానికి ఎంత వరకు అవసరమో హేతుబద్ధంగా నిర్ణయించుకోవాలి. అయితే వసతులూ పరిశ్రమలూ కూడా ఒకే నగరంలో ఏళ్ళతరబడి కుప్పబోయదలుచుకుంటే అది హైదరాబాదు లాగా, వలస జనవిస్పోటనంతో మహానగరం పేలిపోతుంది. 
మధ్యలో ఉంచండి
ప్రజల ప్రయాణం సుఖంగా ఉండేలా రాష్ట్రానికి రాజధాని భౌగోళికంగా ఆ ప్రాంతానికి మధ్యప్రాంతంలో ఉంటే మంచిది. కానీ అలా లేని రాష్ట్రాలూ కొన్ని ఉన్నాయి కదా అని ఒక మూలన రాజధానిని పెడితే చరిత్ర మళ్ళీ పునరావృతం కావచ్చు. ఎందుకంటే కర్నూలు ఒక మూలన ఉండటం వలన ఉత్తరాంధ్ర ప్రజలు హైదరాబాదు కొంత మేలనుకున్నారు.ప్రజలు దూరప్రయాణాన్ని నిరసిస్తూ ఉంటారు.దూరప్రాంతానికి బదిలీ అయిన ఉద్యోగులు కూడా ప్రయాణాన్నే శిక్షలా భావిస్తారు.ప్రజలు కూడా అంతే.ఎక్కడిదాకో ఎందుకు ,జిల్లా కేంద్రాలు జిల్లాల అంచుల్లో ఉన్నచోట ప్రజలు జిల్లా కేంద్రాలకు ప్రయాణమంటే భయపడుతుంటారు. ప్రజల సౌకర్యంకోసం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ సమాన దూరంలో ఉండే చోట రాజధాని నగరాన్ని అభివృద్ధి చేస్తే మళ్ళీ విభజనవాదాలు తలెత్తవు. ఆన్ని ప్రాంతాల ప్రజలు తృప్తి పడతారు. ఒకే నగరానికి వలసలు తగ్గుతాయి.తిరగలేక చస్తున్నాం.రాజధానిని రాష్ట్రం మధ్యలో ఉంచండి నాయనా అని వయోవృద్ధులు,మారుమూల ప్రాంతాల ప్రజలూ  మొక్కుతున్నారు
అన్నీఒకే నగరంలో వద్దు
పూర్వం పెద్దనగరాలకే ప్రాధాన్యత ఇచ్చి "కలిగినవాడికే ఇంకా దోచిపెట్టినట్లు" రాజధాని నగరాన్ని అభివృద్ధి చేసేవారు.గత అరవై ఏళ్ళలో హైదరాబాదు తెలుగు ప్రజలకు " ప్రాంతీయ రాజధానులు కూడా కావాలి"అనే ఒక చేదు పాఠం నేర్పింది.జిల్లా కేంద్రాలు ఏర్పడిన తరువాత మౌలిక వసతులు వాటిచుట్టూ వాటంతటవే అభివృద్ధి చెందినట్లు ప్రాంతీయ కేంద్రాలుకూడాఎదుగుతాయి.ఉత్తరాంధ్ర,రాయలసీమ,కోస్తా ప్రాంతాలలోని నాలుగు జోనులకు నాలుగు కేంద్రాలను ఏర్పాటుచేసి రాజధాని నగరానికి అనవసర ప్రయాణాలను తగ్గించాలి. రాష్ట్రంలోని ఆన్ని ప్రాంతాలవారికీ ఏదో ఒక పౌర ప్రాధాన్యం దక్కేలా ప్లాన్ చెయ్యాలి. రాష్ట్ర విభజన తర్వాత హడావిడిగా ఏదో ఒక నగరాన్ని మాత్రమే రాజధానిగా ప్రకటించి అభివృద్ధి అంతా అక్కడే జరిగేలా చూస్తే కొన్నేళ్ళకు హైదరాబాద్ అనుభవమే ఎదురౌతుంది. మళ్లీ విభజన వాదాలొస్తాయి. 
 http://www.suryaa.com/opinion/edit-page/article-164924 
సూర్య 31.12.2013
గీటురాయి 3.1.2014

https://www.facebook.com/photo.php?fbid=717479864950673&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater


(సాక్షి 7.10.2014)

1 కామెంట్‌:

  1. దాదాపు 500 ఎకరాలు అభిలషణీయంగా రాజధానికి కావలసిన అన్నిరకాల కార్యాలయాలు , అసెంబ్లీ మొదలుకొని సెక్రటేరియట్ , హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ , అన్నీ గూడ ఒకే ప్రాంతంలో ఏర్పాటుచేసుకోవచ్చు . ముఖ్యంగా ఎకో ఫ్రెండ్లీ గా , అత్యంత ఆధునికంగా ఇన్ఫోసిస్ కేంపస్ ల ఆదర్శముగ ,నిర్మిప చేసుకోవచ్చు . నిజంగా వేలాది ఎకరాలు రాజధాని పేరున , రైతులనుండి సేకరించడం అవసరం లేదు . అంతే గాకుండా ఇప్పటికే అభివృద్ది చెందిన పట్టణాల్లో పెట్టడంగూడా సమంజసం గాదు . అందుకోసం గ్రాండ్ ట్రంక్ రోడ్ కు , అలాగానే రైల్ వే లైన్ కు చేరువ లో కొత్తరాజధాని కోసం పరిశీలించడం మంచిది . అంతే గాకుండా 5 సం !! లకన్నా ఎక్కువకాలం రాజధాని నిర్మాణానికి సమయం తీసుకోగూడదు.

    రిప్లయితొలగించండి