ఈ బ్లాగును సెర్చ్ చేయండి

4, డిసెంబర్ 2013, బుధవారం

పని నేర్పని చదువులు –భద్రతలేని బ్రతుకులు






పని నేర్పని చదువులు భద్రతలేని బ్రతుకులు
                              నూర్ బాషా రహంతుల్లా 9948878833      

3.12.2013 రాష్ట్ర ప్రభుత్వం 162 కోట్ల అదనపు ఖర్చుకు సిద్ధపడి 14 శాఖల్లో 14115 కొత్త ఉద్యోగాల భర్తీకి పచ్చ జండా ఊపింది.మరుసటి రోజే మరో 7173 ఉద్యోగాలభర్తీకీ అనుమతించింది. రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఇది పెద్ద శుభవార్త ,తీపి కబురు.ప్రస్తుతం రాష్ట్రమే కాదు దేశం ఎదుర్కొంటున్న సమస్యలలో అతిపెద్ద సమస్య నిరుద్యోగం. ఒక పక్క రేపోమాపో రాష్ట్ర విభజన జరిగే  అవసాన దశలోకూడా , కొత్త ఉద్యోగాలను ప్రకటించడమంటే తుఫాను గాలిలో పేలపిండి పెట్టినట్లేననీ ,కంటితుడుపు చర్యవలన పెద్దగా   ప్రయోజనముండదని కొందరు పెదవి విరుస్తున్నారు.కానీ నిరుద్యోగుల్లో మాత్రం ఏదో ఆశ మిగిలే ఉంది.చాలా ధైర్యంగా ఖాళీలు ప్రకటించారనీ, ఏజ్ బారైనా 45 ఏళ్ళకు గరిష్ట వయోపరిమితిని  పెంచుతారనీ ,రాష్ట్ర విభజన లేటైతే తమ అదృష్టం కొద్దీ ఉద్యోగాల చాన్సు తగలొచ్చనీ,ఒకవేళ ఈలోపు రాష్ట్రం చీలినా కొత్తగా ఏర్పడే రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ప్రకటించిన ఖాళీలు భర్తీ చెయ్యక తప్పదనీ సంబరంగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఏళ్ళతరబడి ఉద్యోగాలు రాక  పేద నిరుద్యోగ యువకులు అల్లాడిపోతున్నారు.ఎన్ని డిగ్రీలున్నా ఉద్యోగాలు దొరకడం లేదు. ప్రైవేట్ కంపెనీలు  పెట్టే  సవాలక్ష ఆంగ్ల నిబంధనలలో గెలిచి ఉద్యోగం సంపాదించుకున్నఆ ఉద్యోగాలకి భద్రత లేదు. ఎప్పుడైనా ఊడిపోవచ్చు. నిరుద్యోగంవల్ల విద్యాధికుల్లో కూడా బిక్షాటన, దొంగతనాలు, మోసాలు పెరిగిపోతున్నాయి.ఖాళీలు వెంటనే భర్తీచేయటం లేదు. పనిచేసే హక్కు లేదు. నిరుద్యోగులకు నెలవారీ జీవన భృతి కల్పించలేదు.
రాష్ట్ర జనాభాలో నిరుద్యోగం 13 నుండి 15 శాతానికి పెరిగింది. దేశ వ్యాప్తంగా 7  కోట్ల మంది యువకులు నిరుద్యోగంతో బాధపడుతున్నారు. ఔట్ సోర్సింగ్ , తాత్కాలిక ఉద్యోగాలతోనే యువత జీవనం సాగిస్తుంది. చాలీ చాలని వేతనాలతో సతమతమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వంలో 3.50 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉన్నా 2004 నుండి ఇప్పటి వరకు ఉపాధ్యాయులతో కలిపి 65 వేల ఉద్యోగాలు మాత్రమే కల్పించింది. .ముందుంది మరింత మంచి కాలంఅంటూ నిరుద్యోగ యువతకు పెద్దసంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తామన్న రాజీవ్ యువకిరణాలు పథకంలో ఉద్యోగాలు పొందిన వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంది. వీరిలో చాలామంది వేతనాలు తక్కువగా ఉండటంతో ఉద్యోగాలు మానివేశారు. 
రాష్ట్రంలోని ప్రైవేటు కంపెనీల్లో కూడా అత్యధికులు ఇతర రాష్ట్రాలవాళ్ళే ఉన్నారు. తక్కువ వేతనాలతో ఎక్కువ రోజులు ప్రైవేటు రంగంలో పనిచేయాల్సి రావడంతో ఆర్ధిక స్ధితిగతులు మారడం లేదు. జీవన ప్రమాణాలు మెరుగుపడటం లేదు. ప్రైవేటు కంపెనీల్లో కార్మిక చట్టాలను అమలు పర్చటంలేదు. 30 ఏళ్ల వయస్సు దాటితే కంపెనీల్లో పని దొరకటం లేదు.39 ఏళ్ళకు గరిష్ట వయో పరిమితిని పెంచాలని నిరుద్యోగులు ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని అభ్యర్దించారు. చట్టాలను సక్రమంగా అమలు జరపని కారణంగానే శ్రమకు తగిన మూల్యం లభించడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఉద్యోగ వేటలో తిరగడా నికే ఏళ్ళు పడుతోంది.

దళారులు మోసగాళ్ళు
ఉద్యోగాల భర్తీకి ఎక్కడ అవకాశముంటే అక్కడ దళారులు మోసగాళ్ళు తయారౌతున్నారు.ఉద్యోగాలిప్పిస్తామనిచెప్పి నిరుద్యోగుల దగ్గర డబ్బులు గుంజుతున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్ యువకిరణాలు ప్రాజెక్టుల్లో చిన్న చిన్న ఉద్యోగాల పేరు చెప్పి కూడా 22 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలకు టోకరా వేసిన ఘరానా మోసగాడు తోట బాలాజీనాయుడు గుర్తున్నాడా? అతను ఉద్యోగాల పేరుతో సాక్షాత్తూ వీహెచ్, దేవేందర్‌గౌడ్, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి లాంటి ఎంపీల దగ్గర నుంచే మూడు లక్షలు గుంజగలిగాడు.ఇక అవినీతి ఆరోపణలు రుజువై కొంతమంది సర్వీసు కమీషన్ సభ్యులు కూడా గబ్బుపట్టారు.ఇంటర్వ్యూ లలో చ్చే కొద్ది మార్కుల తేడా తోనే అభ్యర్డుల జాతకాలు మార్చేస్తున్నారు.ప్రతి పోస్టుకూ రాజకీయనాయకుల సిఫారసు కోసం తిరగాల్సి వస్తోంది.  
ముసలోళ్ళకు భారం
పక్షులూ,జంతువులూ కూడా తనబిడ్డలకు యుక్తవయసు వచ్చాక పోషించవు.పిల్లల పోషణ వాటికి యావజ్జీవిత బాధ్యత కాదు.అలాగే పిల్లలు తిరిగి తమ తల్లిదండ్రుల పోషణ బాధ్యత మోయవు కానీ జీవన దారిని  తాము  చూసుకుంటాయి.ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకని ,ఉద్యోగం చేయలేని నిరుద్యో యువతలో ఆత్మాభిమానం తగ్గి పరాన్నజీవి స్వభావం  పెరుగుతోంది.  
 స్కూల్ విద్య ముగియడంతోనే తల్లిదండ్రులను వదిలి సొంత కాళ్లపై నిలబడడానికి ప్రయత్నించే యువకులు ఇప్పుడు సమస్యల సాగరాన్ని ఈదలేక స్వయం శక్తితో జీవనం గడిపే ఆలోచనలను విరమించుకుని తల్లిదండ్రులతోడిదే లోకం అంటున్నారు. వయసొచ్చాక కూడా తల్లిదండ్రుల కష్టార్జితం తినడానికి సిగ్గుపడటం లేదు. వివాహాన్నీవాయిదా వేస్తున్నారు,లేదా మానేస్తున్నారు. కొద్దిమంది మాత్రం దొరికిన చిన్న ఉద్యోగంతో సెటిల్ అవుతున్నారు.34 ఏళ్ళ వయసోళ్ళు కూడా తల్లిదండ్రులు, తాతా నాయనమ్మలతో కలిసి జీవిస్తున్నారు. నిరుద్యోగం వలన తల్లిదండ్రుల సహాయం, తోడు లేనిదే బతక లేకపోతున్నారు.ప్రైవేటు కంపెనీల్లో కఠినమైన పనులు చేయలేక గోడకుకొట్టిన బంతులు (బూమరాంగ్ కిడ్స్) లాగా తిరిగొచ్చి ఉద్యోగాల వెతుకులాటను కూడా మానేస్తున్నారు.ఇక నిరుద్యోగ భృతి కలలో మాటే.





చదువుతోపాటే నిరుద్యోగం
మన దేశంలో విద్యతో పాటూ నిరుద్యోగం కూడా పెరుగుతూనే ఉంది.15-29 ఏళ్ల మధ్య వయసున్న ప్రతిముగ్గురిలో ఒకరు నిరుద్యోగిగా ఉంటున్నారు. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారు ఉద్యోగం దొరక్క తిప్పలు పడుతుంటే... రాయడం...చదవడం తెలియని నిరక్షరాస్యులో మాత్రం నిరుద్యోగ సమస్య తక్కువగానే ఉందట.గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులు 36.6 శాతం ఉంటే పట్టణాల్లో నిరుద్యోగులు 26.5 శాతం ఉన్నారట.

యువతలో పట్టభద్ర నిరుద్యోగం పెరుగుతోంది. ఎన్ని పథకాలు వచ్చినా కనీస ఉపాధి దొరకడం లేదు. చదువుకుంటే ఉద్యోగాలొస్తాయని, జీవితంలో స్థిరపడవచ్చని కష్టపడి డిగ్రీ పూర్తి చేసినా ఉద్యోగాలు మాత్రం లేవు. చదువుకున్న వారిసంఖ్యతో పాటు.. నిరుద్యోగమూ అదేస్థాయిలో పెరుగుతోంది. డిగ్రీ చదివిన ప్రతి ముగ్గురు పట్టభద్రుల్లో ఒకరు నిరుద్యోగిగా ఉన్నారు. చేసే పనికన్నా చదువు ఎక్కువగా ఉండటం వల్ల  నైపుణ్యం పూర్తి స్థాయి లో వినియోగం కావట్లేదు. ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం 12.6 శాతం ఉండగా, దేశంలో 31.1 శాతంగా నమోదైంది.యువతకు సరైన ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో పార్ట్‌టైం, తాత్కాలిక ఉద్యోగాలు చేస్తున్నారు. సాధారణ ప్రజలతో పోలిస్తే యువత సరైన ఉద్యోగాలు పొందడంలో మరింత ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఉద్యోగం కోసం దీర్ఘకాల అన్వేషణ ఫలితంగా వారిలో అసంతృప్తి, అశాంతి నెలకొంటున్నాయి.యువతలో సరైన నైపుణ్యాలు లేకపోవడంతో అవకాశాలు అందుబాటులో ఉన్నా ఉద్యోగాలు రావడం లేదు. దీంతో తాత్కాలిక, ఒప్పంద కార్మికులుగా పనిచేస్తూ అసంఘటిత రంగంలోకి వెళ్తున్నారు.తయారీ, సేవా రంగాల్లో ఉద్యోగాలు పెరగడం లేదు. దీంతో ఉద్యోగాల కొరత పెరుగుతోంది. చదువుకుంటున్న వారి సంఖ్యకు, ఉద్యోగ అవకాశాలకు పొంతన లేదు.స్వయంఉపాధి మార్గాన్ని ఎంచుకున్నప్పటికీ మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉండటం లేదు. అనుభవం లేకపోవడం, అధిక వడ్డీరేట్లకు రుణాలు తీసుకోవడంతో సంక్షోభంలోకి వెళ్తున్నారు. పట్టభద్రులైనా బతుకుబండి సవ్యంగా సాగక జీవనభద్రత లేక నిరుద్యోగుల్ని కుంగదీస్తోంది. చదివిన చదువుకు దీటైన ఉద్యోగం దొరక్క, తాత్కాలిక ఉపాధితో జీవితం నెట్టుకొస్తున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. 90శాతం పట్టభద్రులు, 75శాతం ఇంజినీర్లకు ఉద్యోగార్హత లేదట.విద్యావ్యవస్థ పనికొచ్చే చదువులు నేర్పటం లేదు. పట్టాకూ పనికీ సంబంధమేలేని మేడిపండు చదువులు దేశంలో బతుకుతెరువు కరవైన విద్యావంతుల జనాభాను పెంపొందిస్తున్నాయి.

విద్యావంతులు ఎలాంటి వృత్తిపరమైన మెలకువలూ ఒంటపట్టక నిరుద్యోగులుగామిగలడానికి మూలకారణమేమిటి? మన పిల్లలు ప్రైవేటు కంపెనీలు కోరే స్థాయిలో భావవ్యక్తీకరణ నైపుణ్యం, సాంకేతిక ప్రజ్ఞాసామర్థ్యాలు, బృందంలో ఇమిడి పనిచేయగల స్వభావం, సమస్యా పరిష్కారశక్తి లేఉపాధి వేటలో డస్సిపోతున్నారు. చైనా, జపాన్‌, సింగపూర్‌, తైవాన్‌ లో లాగా పనికొచ్చే చదువులు నేర్పాలి. పరిశ్రమలు, ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు కలిసి మేలిమి మానవ వనరులను  తయారుచేయ్యాలి. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఐరోపాలలో పాఠశాల విద్య సహా అన్ని స్థాయుల్లోనూ నాణ్యమైన బోధన ఉంటుంది. చదువుకు, ఉపాధికి లంకె లేదు. సాంకేతిక పట్టాదారులు కూడా గత్యంతరం లేక ఏ పనికైనా సిద్ధపడే దురవస్థ మన విద్యావ్యవస్థ కల్పిస్తోంది.


బోధన ప్రయోగాత్మకంగా సాగాలి. షికాగో, ఇల్లినాయిస్‌, స్టాన్‌ఫోర్డ్‌, క్యాలిఫోర్నియా లాంటి విశ్వవిద్యాలయాల్లో పనితో కూడిన చదువు ఉంటుంది కాబట్టే అక్కడ ఎక్కువమంది ఉద్యోగార్హత పొందుతున్నారు. చైనా విద్యావంతుల్లో 96శాతం మంచి ఉద్యోగాల్లో కుదురుకుంటున్నారు. మనదేశంలో  పీహెచ్‌డీ పట్టభద్రులు కూడా చిన్నాచితకా ఉద్యోగాలకోసం పోటీపడుతున్నారు.  తాత్కాలిక గ్రామపంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలకు కూడా కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చిపడ్డాయి. పదో తరగతి అర్హత సరిపోయే అబ్కారీ కానిస్టేబుళ్ల కూ అయిదు లక్షల మంది పట్టభద్రులు; ఎంటెక్‌, ఎంబీయే, ఎంఫార్మసీలు అర్జీలు పెట్టుకున్నారు. దేశ జనాభాలో 24ఏళ్లలోపువారి సంఖ్య 55కోట్లు. బతికించే చదువులు, అక్కరకొచ్చే నైపుణ్యాలు నేర్పితే కదా అందరికీ తగిన పని దొరికేది?

ఉపాధి కల్పనా కేంద్రాలు ఏమయ్యాయి?
పాధి కల్పన శాఖపై నిరుద్యోగుల్లో నమ్మకం పోయింది.ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకుని ఏళ్లు గడుస్తున్నా ఎలాంటి ప్రయోజనం ఒనగూరటంలేదు. కొత్త రిజిస్ట్రేషన్ల సంఖ్య పడిపోగా, పాత రిజిస్ట్రేషన్లు సైతం పునరుద్ధరణకు
నోచుకోవడం లేదు. ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనలు ఎప్పుడోకానీ రావు. ప్రైవేటు రంగంలో ఉపాధి అందరికీ దొరకదు. జాబ్ మేళాల్లో ప్రైవేటు కంపెనీలిచ్చే ఉద్యోగాలు, వేతనాలు నిరుద్యోగులకు ఏ మాత్రం సంతృప్తిని కలిగించలేకపోతున్నాయి. మార్కెట్లలో అమ్ముడుపోని ఉత్పత్తులను ఇంటింటికి తిరిగి విక్రయించే సేల్స్‌మేన్‌తో పాటు వాచ్‌మెన్, సెక్యూరిటీ గార్డులాంటి ఉద్యోగాలు  తప్ప ఇతర అవకాశాలు ఉండడం లేదు.
దిగువ స్థాయి ప్రభుత్వ ఉద్యోగానికి సైతం వేల సంఖ్యలో దరఖాస్తులు పెడుతున్నారు ఉన్నత విద్యావంతులైన నిరుద్యోగులు.ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ లలో నమోదు విషయానికి వస్తే ఆశలు వదులుకుంటున్నారు. గతంలో టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ  ఫలితాలొచ్చి పట్టాలు చేతికందిన వెంటనే ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ కోసం క్యూ కట్టేవారు. రోజూ వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగేవి. ప్రస్తుతం మారిన పరిస్థితుల వల్ల పదుల సంఖ్యకు రిజిస్ట్రేషన్లు పడిపోయాయి. గతంలో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నవాళ్లు ప్రతి మూడేళ్లకోసారి పునరుద్ధరించుకోవాల్సి ఉండగా.. మిన్నకుండిపోతున్నారు. గడువులోగా పునరుద్ధరించుకోవడంలో విఫలమైనవారికి మరో ఆరు నెలల సమయాన్ని గ్రేస్ పీరియడ్‌గా అవకాశమిస్తున్నా స్పందన ఉండడం లేదు. నిరుద్యోగ అభ్యర్థులు మొఖం చాటేస్తుండడంతో ఉపాధి కల్పన శాఖ కార్యాలయం వెలవెలబోతోంది. పునరుద్ధరణ కాక పాత రిజిస్ట్రేషన్లు క్రమంగా ల్యాప్స్ అవుతుండగా.. మరోవైపు కొత్త రిజిస్ట్రేషన్లు సైతం తగ్గిపోవడం వల్ల లైవ్ రిజిస్ట్రేషన్ల సంఖ్య లక్షల నుంచి వేలల్లోకి  పడిపోయింది. 2011 నాటికి రాష్ట్రంలోని ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ ల్లో 1,44,553 మంది అభ్యర్థులు పేర్లు నమోదు చేయించుకున్నారు. ఈ కేంద్రాలకు 4,156 ఉద్యోగాలు నోటిఫై చేయగా 816 మందికి ఉద్యోగాలు లభించాయి.ఎంప్లాయ్‌మెంట ఎక్స్చేంజ్‌ల లైవ్ రిజస్టర్లలో 18,33,231 మంది అభ్యర్ధులు నమోదై ఉన్నారు. 2013లో మన జనాభా 123 కోట్లు. సంవత్సరానికి 1.5 శాతం పెరు గుతోంది. అంటే ప్రతియేటా 1,84,50,000 మంది పెరుగుతున్నారు. 2021 నాటికి మన జనాభా 140 కోట్లు కావచ్చు. అంటే చైనాను మించిపోతాం. వీరందరికీ ఉపాధి కల్పించగలమా? కోట్ల సంఖ్యలో ఉపాధి రహితులు తయారైతే పర్యవసానం ఏమిటి?గతంలో చాలా మంది విద్య, నైపుణ్యం లేని వారే. ఇటీవల తరాల వారు బీటెక్, ఎం సీఏ, ఎంబీఏ, ఎంకాం, ఎంఏ, బీఈడీ, బీఏ, సీఏ వగైరా పట్టాలు తీసుకుంటున్నారు. ఇటు వంటి వారికి ఉపాధి అవకాశాలు లేకపోతే, వారు పెడదారి పడతారు.
 ప్రస్తుతం ఒక్క మన రాష్ట్రంలోనే 10 లక్ష ల మంది బీటెక్ ఇంజనీర్లు నిరుద్యోగులుగా ఉన్నారు. దేశంలో ఏడాదికి, 3,600 ఇంజనీరింగ్ కళాశాలల్లో, 13 లక్షల మంది యువతీ యువకులు చేరుతున్నారు. పెరుగుతు న్న జనాభాను సంపదను సృష్టించే వారిగా తయారు చేయనందువల్ల  విద్యావంతులైన నేరగాళ్లు పెరుగుతున్నారు. 

యువకులు నిరాశ నిస్పృహలతో పనీ పాటా లేకుండా ఉంటే ఎలా? దేశానికి దిక్కెవరు?   ప్రపంచంలో ఐదవ వంతు యువత మనదేశంలోనే ఉంది. కేంద్రం 13-35 ఏళ్ల మధ్య వయసు వారిని యువతగా గుర్తించింది. కాబట్టి యువత మన జనాభాలో 40 శాతానికిపైనే ఉంటుంది. చదువు వేరు. నైపుణ్యం వేరు. ప్రపంచీకరణ పుణ్యమా అని మన యువత వృత్తి నైపుణ్యానికి దూరమైంది. కానీ చాలినన్ని ఉద్యోగాలున్నా మన యువతకు వృత్తి నైపుణ్యం లేనందున ఉద్యోగ ఖాళీలు ఉన్నా నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నార. మన యువకుల్లో నైపుణ్యం కొరవడి ఉద్యో గాలు పొందలేకపోతున్నారని ప్రైవేటు కంపెనీలు దుర్మార్గంగా చెబుతున్నాయి.అవి తమ కంపెనీల స్థాపనకోసం ప్రభుత్వంనుండి  ఉచితంగా చవకగా భూములు,రకరకాల  సబ్సిడీలు పొందాయి.నిరుద్యోగ యువకులకు నైపుణ్యం కల్పించే సామాజిక బాధ్యత అవి తీసుకుంటున్నాయా? దేశ ప్రజలపై సేవా దృష్టితో ఉచితంగానో చవకగానో విద్యా, శిక్షణ, ఉద్యోగ కల్పన చేస్తున్నాయా

  
 ఆంధ్రప్రదేశ్ అవతరించిన 1956 నవంబర్ 1 స్థాపించిన ఉపాధి కల్పనా కేంద్రాలు నాలుగు దశాబ్దాల పాటు యువతకు ఉపాధి కల్పించడంలో కీలకపాత్ర పోషించాయి. కావలసిన నిధులు, ఉద్యోగాలు ఇవ్వకుండా వాటిని నిర్లక్ష్యం చేశారు. చాలా కాలంపాటు ఉపాధి కల్పనా కార్యాలయాలు యువతకు బాగా ఉపయోగపడ్డాయి. కానీ ఇప్పుడు ఉపాధి కల్పించడంలో మన ఉపాధి కల్పనా కార్యాలయాలు అట్టడుగు స్థానానికి ఎందుకు వెళ్ళాయి? గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు  యువతకు ఉపాధి కల్పించడంలో ముందున్నాయి. మన రాష్ట్రంలో రాజీవ్ ఉద్యోగశ్రీ, రాజీవ్ యువకిరణాలు వంటి ఉద్యోగ మేళాలు పెట్టినా అందరికీ ఉద్యోగాలు రావటంలేదు. రాష్ట్రంలోని 1,000 రాజీవ్ యువ కిరణాల శిక్షణా శిబిరాల ద్వారా ఇప్పటి దాకా 3 లక్షల మందికి ఉపాధి కల్పించారట,మరో 12 లక్షల మందికి 2015 లోపున కల్పిస్తారట.


 2011 నాటికి దేశంలో 1,000 ఉపాధి కల్పనా కేంద్రాలున్నాయి. మన రాష్ట్రంలో ఉన్నవి 31 మాత్రమే . వీటి ద్వారా 2,36,000 నిరుద్యోగ యువత ఉపాధి కోసం రిజిస్ట్రేషన్ చేసుకోగా, 2011లో ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 800 మాత్రమే. అదే గుజరాత్‌లో 41 కేంద్రాలలో 4,16,500 రిజిస్ట్రేషన్ చేసుకోగా, ఒక్క ఏడాదిలో 2,25,600 మందికి ఉపాధి కల్పించారు.అక్కడ వందల కోట్లు ఉపాధి కల్పనాశాఖకు కేటాయించారు.ఇక్కడ పాతిక కోట్లు కూడా కేటాయించలేదు. అవి ఉద్యోగుల జీతాలకే సరిపోతాయి.  ఇక ఉపాధి కల్పనా కార్యక్రమాలు జరిగేదెలా? ‘యువకిరణాలుపథకాన్ని ప్రైవేట్ సంస్థలకు కాకుండా జిల్లా ఉపాధి కల్పనా కేంద్రాలకు అప్పగిస్తే ఆ పని ఇంకా బాగా చేసేవి. యువతకు ఉపాధి కల్పించడం ఉపాధి శాఖ విధి. అలాగే రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఎంత మంది పనిచేస్తున్నది, ఉద్యోగ ఖాళీలు ఎన్ని అని  లెక్కించాల్సింది ప్రభుత్వ ఉపాధి కల్పనా కేంద్రాలే. సర్వీసు కమీషన్ కు జిల్లా ఉపాధి కల్పనా కేంద్రాలన్నిటినీ బ్రాంచి ఆఫీసులుగా మార్చేస్తే ఎక్కడికక్కడ పరీక్షలు నిర్వహించటానికీ,రికార్డులు నమోదు చేయటానికీ సర్వీసు కమీషన్ కు కూడా తగినంత బలం ఏర్పడుతుంది.
  నిరుద్యోగ భృతి
ఉపాధి కల్పనా కేంద్రాల్లో రిజిస్టర్ చేసుకునే నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని, జాతీయ ఉపాధి కల్పనా పోర్టల్‌కు అనుసంధానం చేసిన ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజిల ద్వారా ప్రైవేట్ కంపెనీల్లోని ఖాళీలను కూడా నోటిఫై చేయాలనీ పార్లమెంటు స్థాయీ సంఘం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఉపాధి కల్పనా కేంద్రాల్లో రిజిస్టర్ చేసుకునే అభ్యర్థులకు చండీగఢ్, హర్యానా, కేరళ, తమిళనాడు, పంజాబ్, పుదుచ్చేరి, జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రాలు మాత్రమే నిరుద్యోగ భృతిని ఇస్తున్నాయి. మిగతా రాష్ట్రాలు కూడా నిరుద్యోగభృతి ఇవ్వాలని కేంద్రం అభిప్రాయపడింది.
వికలాంగులకు పెన్షన్
 20 శాతం వైకల్యం ఉన్నా నెలకు రూ.200లు పింఛన్‌ చెల్లిస్తామని చెప్పడం బాగానే ఉంది. కానీ గత రెండేళ్లుగా రాష్ట్రంలో వికలాంగులను హింసించినంతగా వేరెవరినీ ఈ రాష్ట్ర ప్రభుత్వం హింసించలేదంటే అతిశయోక్తి కాదు. కంప్యూటర్‌ ద్వారా అంగవైకల్యాన్ని నిర్ణయించడానికి పెట్టిన సదరం క్యాంపుల్లో వికలాంగులు హింస అనుభవించారు.అంతకుముందు పింఛన్లు పొందుతున్న వేలాదిమంది వికలాంగులకు 'నీ వైకల్యం చాలదు-నీకు పెన్షన్‌ లేదు' అని నిర్దాక్షిణ్యంగా చెప్పారు. గతంలో మీ ఊళ్లో వృద్ధాప్య పింఛను పొందుతున్నవారెవరైనా చనిపోతే అప్పుడు నీకు పింఛనొస్తుంద చెప్పేవారు. వికలాంగులకు ప్రకటించిన ఈ రెండొందలకు కూడా మళ్లీ సదరం సర్టిఫికెట్ల హింస తప్పదట.
గీటురాయి  20.12.2013
 https://www.facebook.com/photo.php?fbid=679563828742277&set=pcb.679564122075581&type=1&theater
గీటురాయి 27.12.2013

http://www.suryaa.com/opinion/edit-page/article-165399 సూర్య  January 4, 2014

1 కామెంట్‌:

  1. ఒక పక్క రేపోమాపో రాష్ట్ర విభజనకు కేంద్రం ఏర్పాట్లు అన్నిరకాలుగా చేస్తుంటే ఇట్టి అవసాన దశలో, నీరో చక్రవర్తి నీ మించి ప్రస్తుత ముఖ్య మంత్రి గారు కొత్త ఉద్యోగాలను ఇస్తామని ప్రకటించడమంటే తుఫాను గాలిలో పేలపిండి పెట్టినట్లే వుంటుంది మినహా వేరే ప్రయోజనముండదు .

    రిప్లయితొలగించండి