ఈ బ్లాగును సెర్చ్ చేయండి

19, డిసెంబర్ 2013, గురువారం

మరీవెనుకబడిన కులాలకు మోక్షమెప్పుడు?



మరీవెనుకబడిన కులాలకు మోక్షమెప్పుడు?
నూర్ బాషా రహంతుల్లా 9948878833

ఎన్నికలు దగ్గరపడేకొద్దీ  రాజకీయ పార్టీల దృష్టి  వెనకబడిన తరగతులపై పడుతున్నది. భారతీయ జనతాపార్టీ వెనుకబడిన కులస్తుడైన  నరేంద్రమోడీ పేరును ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఖరారు చేయటమే గాక  చట్టసభలలో బీసీల  రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని డిమాండ్ చేసింది.జాట్‌ కులస్తులను కేంద్ర బీసీల జాబితాలో చేర్చటానికి కాంగ్రెస్‌ పార్టీ అంగీకరించింది.అన్నివిధాలా అభివృద్ధి చెందిన జాట్లను బీసీలలో కలపొద్దని బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య వేడుకున్నారు. మనరాష్ట్రంలో కాపుల పరిస్థితీ ఇలాగే ఉంది.మన రాష్ట్రంలో కాపులు కూడా తమకులాన్ని బీసీలలో చేర్చాలని పోరాడుతున్నారు.వీటన్నిటి మూలంగా బీసీల జనాభా విపరీతంగా పెరిగిపోతుంది.రిజర్వేషన్ల కోటాను పెంచకుండా జాబితాలో కొత్త కులాలను చేర్చుకుంటూ పోవటం పట్ల  బీసీలు కంటగింపుగా ఉన్నారు.కొత్తగా బలమైన కులాల చేరికవలన ఇప్పటికీ ఎదిగిరాలేక  బలహీనంగా ఉండిపోయిన చిన్నకులాలు ఇక ఎదిగిరావటం కల్ల అంటున్నారు.2021 జనాభా లెక్కల్లో బీసీల కులాల వారీ జనాభా గణాంక వివరాలు సేకరించక తప్పదని అన్నీ పార్టీలు వత్తిడి తెస్తాయి. రాజ్యాంగం ప్రసాదించిన స్థానిక సంస్థల రిజర్వేషన్‌లు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా కాకుండా దేశవ్యాప్తంగా ఒకే రకంగా ఉండాలనీ , చట్టసభల్లో బీసీ రిజర్వేషన్‌లతో పాటు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చెయ్యాలనీ , జాతీయ బీసీ మిషన్‌కు కూడా చట్టబద్దత కల్పించాలనీ  అన్నీ పార్టీలు కోరుతున్నాయి.హైదరాబాదులో 15.12.2013 న జరిగిన బీసీసింహగర్జన సభలో మొత్తం 13 తీర్మానాలను ఆమోదించారు. 
13  తీర్మానాలు
1.
 పార్లమెంటు, అసెంబ్లీల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి. ఈమేరకు శీతాకాల సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలి.
2. బీసీలకు 150 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లను కేటాయిస్తూ అన్ని రాజకీయ పార్టీలు బీసీ డిక్లరేషన్‌ను విడుదల చేయాలి.
3. రూ.20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ప్రకటించాలి.
4.  బీసీ ఉద్యోగులకు ఉద్యోగోన్నతుల్లో రిజర్వేషన్లను అమలు చేయాలి.
5. పంచాయతీరాజ్ సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 50 శాతానికి పెంచాలి.
6. గ్రామాల్లోని బీసీ సర్పంచుల వేతనాలను రూ.20 వేలకు పెంచాలి.
7. కేంద్రంలో బీసీల కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలి.
8. రాష్ట్ర బీసీ కార్పొరేషన్‌కు రూ.2,000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించాలి.
9. ప్రస్తుతమున్న ఫీజు రీ-యింబర్స్‌మెంట్ స్కీమును ఎలాంటి ఆటంకాలు లేకుండా అమలు చేయాలి.
10. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం నుంచి బీసీలను మినహాయించాలి. బీసీ అత్యాచార నిరోధక చట్టాన్ని రూపొందించి, అమలులోకి తేవాలి.
11. రాజీవ్ గాంధీ జాతీయ ఫెలోషిప్‌ను బీసీ రీసెర్చ్ స్కాలర్లకు కూడా వర్తింపజేయాలి.
12. రాష్ట్రంలో ఉన్న బీసీ ఉద్యోగాలు మూడు లక్షలు, కేంద్రంలోని 14 లక్షల పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.
13. బీసీ ఫెడరేషన్లకు వెంటనే కార్యనిర్వాహక మండళ్లను ఏర్పాటు చేసి, ఒక్కో ఫెడరేషన్‌కు రూ.200 కోట్ల బడ్జెట్‌ను కేటాయించాలి.
బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ఆవేదన :
రాష్ట్రంలోని అయిదు జిల్లాల్లో బీసీ ఎమ్మెల్యే ఒక్కరూ లేరు. బీసీలుగా పుట్టడమే పాపమా?జనాభాలో 56 శాతం ఉన్నాం. పన్నులు కట్టేది మేమైనా కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లలో మాకు న్యాయబద్ధమైన వాటా ఉండదు. కష్టపడి పనిచేసి సంపదను సృష్టించినా అందులో భాగం లేదు. కులవృత్తులు నాశనమైనా ప్రభుత్వానికి చీమకుట్టినట్త్లెనా లేదు. జనాభా నిష్పత్తిలో చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి, బీసీ ఉప ప్రణాళికను ప్రవేశపెట్టాలి. బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలి. అగ్రకుల ఆధిపత్యానికి, దొరల పెత్తనానికి నూకలు చెల్లబోతున్నాయి. ఇక రాబోయేది బీసీల రాజ్యమే. ఓట్లు...సీట్లు మావే.... అసెంబ్లీలో, పార్లమెంటులో మా వాటా పొందుతాం. కచ్చితంగా రాజ్యాధికారం సాధించి తీరుతాం..ఏయే పార్టీ ఎన్ని సీట్లు ఇచ్చేది తక్షణమే ప్రకటించాలి. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖే ఇప్పటి వరకు లేదు. బడ్జెట్‌ కేటాయింపులు కూడా అతి తక్కువగా ఉన్నాయి. జనాభాకు అనుగుణంగా ఉద్యోగాలు లేని వర్గాలకు విధిగా రిజర్వేషన్లు కల్పించాలని నాచియప్పన్‌ కమిటీ 2005లో కేంద్రానికి నివేదిక ఇచ్చింది. ఇప్పటిదాకా అది అమలే కాలేదు. బీసీల్లో కొన్ని కులాల వారికే న్యాయం జరుగుతోందని చాలా కులాలలో అసంతృప్తి ఉంది. ఇది వాస్తవమే. అన్ని కులాలకు సమాన న్యాయం కోసం బీసీ కులాలలో మరింత వర్గీకరణ జరపాలని కోరుతున్నాం. ఉదాహరణకు బీసీ ఏ గ్రూపులో ఏ1, ఏ2, బీ గ్రూపులో బీ1, బీ2 ఇలా ఏర్పాటు చేయడం సబబు. పార్లమెంటులో గానీ, శాసనసభలో గానీ చాలా  కులాలకు ఇంకా ప్రాతినిధ్యం దక్క లేదు. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. బీసీలకు ఉప ప్రణాళిక డిమాండ్‌ ఎందుకంటే ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగపరంగా నిధుల కేటాయింపు జరుగుతోంది. వారి కంటే అధికంగా బీసీలు ఉన్నారు. ఆర్థిక అసమానతలు, వివక్షలను ఎదుర్కొంటోంది వాళ్లే. వారికి తప్పనిసరిగా జనాభా ప్రాతిపదికన నిధుల కేటాయింపు జరగాలి. పార్టీల ధోరణి మారకపోతే బీఎస్పీ తరహాలో కొత్త పార్టీ రావడం ఖాయం.
 అన్ని పార్టీలు మద్దతిస్తున్నాయి
బీసీలకు చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలని,,బీసీ డిక్లరేషన్‌ ప్రకటించిన ఏకైక పార్టీ తెలుగుదేశమేనని , బీసీమహిళలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని , కేంద్రంలో బీసీలకు ప్రత్యేకంగా మంత్రిత్వశాఖను ఏర్పాటుచేయాలని చంద్రబాబునాయుడు డిమాండ్‌ చేశారు. త్వరలో కాంగ్రెస్‌ బీసీ డిక్లరేషన్‌: వస్తోంది అని పిసిసి మాజీ అధ్యక్షుడు డీ.శ్రీనివాస్ ప్రకటించారు. ,బీసీ ప్రధాని కావడం ఖాయం అని బిజెపి నాయకుడు దత్తాత్రేయ జోస్యం చెప్పారు. బీసీలు చట్టసభల్లో పాగా వేయాలి అని టీఆర్ ఎస్: నాయకుడు ఈటెల సలహా ఇచ్చారు.బీసీలకు పార్టీలు టిక్కెట్లు ఇవ్వటం సరిపోదు . అందరం కలిసి ఇస్తామన్న 100 అసెంబ్లీ పార్లమెంటు సీట్లు నియోజకవర్గాలు కేటాయించాలో ఉమ్మడిగా నిర్ణయిద్దామా అని వైఎస్సార్ పార్టీ మిగతా పార్టీలకు సవాలు విసిరింది.
వెనుకబడిన కులాల అసంతృప్తి ఏమిటి?
ఇంతమంది నాయకులు బర్వాసా ఇస్తున్నాకూడా వెనుకబడిపోయిన కులాలకు మోక్షం లేదనే భావనే బీసీ లీడర్లు వ్యక్తం చేస్తున్నారు.వారికి ఈ వ్యవస్థలో ఎక్కివస్తామన్న నమ్మకం కలగటం లేదు.వారు చెబుతున్న కారణాలు ఇవి:
భారత రాజ్యాంగం పీఠికలోనే సామాజిక న్యాయాన్ని ప్రధమ లక్ష్యంగా పేర్కొన్నప్పటికీ 50 శాతానికిపైగా వున్న బీసీలకు వారి జనాభా దామాషా ప్రకారం భూమి పంపిణీలోగానీ, బడ్జెట్ కేటాయింపుల్లోగానీ, బ్యాంకులు, ఫైనాన్స్ కార్పొరేషన్లు అందించే రుణాల్లోగానీ, రాజ్యాంగ వ్యవస్థల్లోని కీలక పదవుల్లోగానీ, న్యాయంగా రావలసిన వాటాలు బీసీలకు రావడం లేదు. నిరంతర శ్రామికులై తమ శ్రమతో జాతి సంపదని సృష్టిస్తోన్న బీసీలు ,ముస్లిం మైనారిటీ ప్రజలు రానురాను ఎస్సీ ఎస్టీ లకంటే కటిక దారిద్య్రంలోకి నెట్టివేయబడ్డారు. ఏ పార్టీ కూడా పెద్దగా ఒరగబెట్టింది ఏమీలేదు. మేమే ఒక  రాజకీయ పార్టీ స్థాపించుకోవాలీ. ఎందుకంటే ఈ పార్టీలన్నీ కలిసి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల డిమాండ్ అరణ్యరోదనగానే మిగిల్చాయి. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు ఉపకోటా బిల్లును 15 సంవత్సరాలుగా అటక మీదే ఉంచాయి. బీసీలకు చట్టసభల్లో మూడోవంతు స్థానాలు రిజర్వు చేయాలని రాష్ట్ర శాసనసభ రెండుసార్లు తీర్మానం చేసినా, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టలేదు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఉత్తరాఖండ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో పంచాయతీరాజ్ సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు లేవు.శాసనసభలో తీర్మానాలు చేసిన పార్టీలు కూడా శాసనసభల్లో 100 స్థానాలు బీసీలకు కేటాయించడం లేదు. బీసీలకు టిక్కెట్లు ఇచ్చినా, వారిని గెలిపించుకొనే బాధ్యత ఆ పార్టీలు స్వీకరించడం లేదు. బీసీ అభ్యర్థులకు అవసరమైన ఆర్థిక సహకారం అందించడం లేదు. ఫలితంగా శాసనసభలో బీసీల సంఖ్య 50 దాటటంలేదు. సామాజిక న్యాయ సూత్రం ప్రకారం దక్కాల్సిన 150స్థానాల్లో ప్రతిసారీ 100స్థానాలు కోల్పోతున్నాము. బడ్జెట్‌లో ఒక్కో కుల సమాఖ్యకు రూ.15 నుంచి రూ.50 కోట్ల వరకు కేటాయింపులు చూపెట్టినా... ఈ సమాఖ్యల కింద రిజిస్టర్ చేసుకున్న ఒక్క సొసైటీకి కూడా ఆర్థిక సాయం లేదు. రాజీవ్ అభ్యుదయ యోజన ,బీసీ కార్పొరేషన్ కార్యక్రమాలకు కూడా చిల్లిగవ్వ ఖర్చుచేయలేదు. మరోవైపు ఇతర కులాల వారిని కులాంతర వివాహం చేసుకుంటే ఇచ్చే వివాహ ప్రోత్సాహకాల కోసం బడ్జెట్‌లో రూ.5.2 కోట్లు చూపెట్టినప్పటికీ ఒక్క రూపాయి కూడా బీసీ శాఖకు ఇవ్వలేదు.  సబ్‌ప్లాన్ పెడతారట...: ప్రణాళిక నిధులనే ఖర్చు పెట్టకుండా, బడ్జెట్‌లో చూపెట్టిన నిధులను కనీసం బీసీ శాఖకు కూడా ఇవ్వకుండా ఎస్సీ, ఎస్టీల తరహాలో బీసీల కోసం కూడా సబ్‌ప్లాన్‌ను పెడతామని చెపుతున్నారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లతోపాటు ఒక రాజకీయ శక్తిగా కూడా బీసీలు ఎదగాలి.అలా ఎదగడం వల్లనే ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లో బీసీలు రాజ్యాధికారానికి రాగలిగారు.


ఓబీసీ జాబితాలోకి మరిన్ని కులాల ప్రవాహం
రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన అన్ని బీసీ కులాలను కేంద్ర ప్రభుత్వం ఓబీసీ జాబితాలో చేర్చలేదు. మన రాష్ట్రంలో 2005లో 93 కులాలున్న బీసీ కులాల జాబితా ఇప్పుడు 144 కి చేరింది. 'గ్రూప్ ఏ లో 54, 'గ్రూప్ బి లో 28, 'గ్రూప్ సి లో 1, గ్రూప్ డి లో 47, గ్రూప్ ఇ లో 14 కులాలున్నాయి.వెనుకబడిన కులాలకు మొత్తం ఉన్న 29 % రిజర్వేషన్లలో గ్రూపు-ఏ కు 7శాతం, గ్రూ పు-బీ కు 10 శాతం, గ్రూపు-సీ కు 1శాతం, గ్రూపు-డీ కు 7శాతం గ్రూపు - ఇ కు 4 శాతం రిజర్వేషన్లుంటాయి. కేంద్రం గుర్తించిన ఒబిసి జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీసీ కులాలు 107 మాత్రమే గుర్తింపు పొందాయి.. ఇటీవల కేంద్రం ఓబీసీ క్రిమిలేయర్ పరిమితి పెంచింది. జాబితాలోకి రాని కులాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ సౌకర్యం కోల్పోతున్నాయి. దేశవ్యాప్తంగా బీసీ కులాలు, ఓబీసీల జాబితా ఒకేరకంగా లేదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కులం బీసీ జాబితాలో చోటు పొందింది. కొన్ని రాష్ట్రాల్లో బీసీ కులాలు పెద్ద ఎత్తున ఈ జాబితాలో చేరాయి. వివిధ రాష్ట్రాల్లో ఓబీసీ కులాల సంఖ్య వేరు వేరుగా ఉంది.మహారాష్ట్రలో 261 ,ఒడిషా లో 200,కర్ణాటకలో 195,తమిళనాడులో 180,బీహార్ లో 133,జార్ఖండ్ లో 127,అస్సాంలో 124,కులాలు ఓబీసీ జాబితాలో చేరితే ,ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 107 కులాలే కేంద్రజాబితాలో చోటు చేసుకోగలిగాయి.ఇతర రాష్ట్రాలలో లాగానే మన  రాష్ట్రంలో కూడా  కొన్నేళ్లుగా అనేక కులాలు తమను బీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఓబిసిల జాబితాలో లేని మన రాష్ట్ర కులాలు
పహిల్వాన్, బరాయి(మాల్), దావర్ష్(పక్కీర్), కూర్మి, గౌడ, బారె, గుడియా, బుంజూవా(బదుంజా), కత్రియా రాజ్‌పుత్, తూర్పు కాపు, గాజుల కాపు, లక్కమాని కాపు, బేరి వైశ్య, శెట్టి, అంబిట్టి వక్కలీల్, వక్క లింగార, వరాల, వీరశైవ లింగాయత్, లింగ బలిజ, దొమ్మాళి, పుండ్రా, ఆరె మార్తా, సండి, సండీభట్, 14 ముస్లిం కులాలు: అచ్చుకట్ల సాయిబులు, అత్తరు సాయిబులు,  తురక చాకలి , గంటా ఫకీర్లు ,  గారడీ సాయిబులు , గోసంగి సాయిబులు, ఎలుగుబంటు సాయిబులు ,నాయి ముస్లిమ్,  లబ్బి సాయిబులు, డేరా ఫకీర్లు,బొంతల సాయిబులు, కటికసాయిబులు, షేక్ సాయిబులు, సిద్ధి సాయిబులు,రోళ్లకు కక్కు కొట్టే సాయిబులు.  
మరోపక్క తెలుగు సాయిబుల వేదన

 అప్పటికే నిధుల లేమితో కునారిల్లుతున్న  బీసీ సంక్షేమ శాఖ పరిధిలోకి కొత్తగా ముస్లిముల్లోని 14 కులాలను ఇంకా మరిన్ని కొత్త కులాలనూ చేర్చుకుంటూ పోయారు.బీసీల కోటానూ పెంచలేదు,బడ్జెట్ నూ పెంచలేదు.ఇది బీసీలలో అంతర్గత అనైక్యతను ఇంకా పెంచింది.ఒక కులాన్ని మించి ఇంకో కుల ఎదిగిరావాలనే ముష్ఠికోసం పోటీ మరీ ఎక్కువయ్యేలా కులాల జాబితా పెరిగిపోయింది.ప్రభుత్వ నిర్ణయం కోర్టులపాలై,తమకు రిజర్వేషన్ ఉంటుందో ఉడుతుందో తెలియని అటూయిటూ కానీ పరిస్థితిలో పడిపోయిన సాయిబుల వ్యధ ఇలా ఉంది:  
ముస్లీం మైనార్టీలను పాలకులు ఓటు బ్యాంకుగానే చూస్తున్నారే తప్ప వారి సంక్షేమాన్ని పట్టించుకోవట్లేదు. దళితుల కంటే ముస్లీములు ఇంకా ఎక్కువ పేదరికంలో మగ్గుతున్నారని సచార్‌ కమిటీ చెప్పినా ప్రభుత్వాలకు పట్టట్లేదు. రాజేందర్ సచార్, రంగనాథ్‌మిశ్రా సిఫారసులను అమలు చేయలేదు.దళిత సిక్కులకు, దళిత బౌద్ధులకు వర్తింప చేసిన విధంగానే రిజర్వేషన్‌లను దళిత ముస్లింలకు, దళిత క్రిస్టియన్‌లకు వర్తింపచేయలేదు. 1901 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని ముస్లింలలో 133 కులాలను గుర్తించారు.1911,1932,1935 సంవత్సరాల్లో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన జనగణన తర్వాత 96 కులాలను దళిత ముస్లింలుగా షెడ్యూల్డ్ చేసి, వీరికి 1936 నుంచి ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లు కల్పించింది. వీటిని దళితముస్లిం వర్గాలు 1950 జూలై వరకు పొందారు. కానీ 10- 08-1950న కాన్సిట్యూషనల్(షెడ్యూల్డ్ కాస్ట్,ప్రెసిడెన్సియల్) ఆర్డర్‌ తో దళిత ముస్లింలకు, క్రిస్టియన్‌లకు, సిక్కులకు, బౌద్ధులకు ఎస్సీ రిజర్వేషన్లు వర్తించకుండా చేశారు.ఆ తరువాత వీరిని ఓబీసీలుగా చేసినారు. నాటి నుంచి దళిత ముస్లింలే కాకుండా సిక్కలు, క్రిస్టియన్‌లు రిజర్వేషన్లకు దూరం చేయబడ్డారు. ఫలితంగా ఈనాడు సాయిబులకు విద్య, ఉపాధి అవకాశాలు లేవు. పల్లెల్లో కాషి వారి గూడేల్లోనైనా , పట్టణాల్లో ముస్లీం బస్తీల్లోనైనా సాయిబుల  జీవనం దుర్భరంగా ఉంది. వీరిలో బూబమ్మల  పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పొదుపు గ్రూపులు ఏర్పాటు చేసుకున్నా వారికి రుణాలు ఇవ్వడంలో వివక్ష చూపుతున్నారు. ఆదరణ లేక అనేక గ్రూపులు రద్దయ్యాయి. మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి అవసరమైన బడ్జెట్‌ను కేటాయించడంలో పాలకులు వివక్ష చూపుతున్నారు.రాళ్లుకొట్టి బతికే కాషొళ్లు గుట్టలు, బండలు అన్యాక్రాంతమయ్యే సరికి వేసవిలో రాయి కొడుతూ మిగతా రోజుల్లో వ్యవసాయ కూలీలుగా బతుకీడుస్తున్నారు. ముస్లీంలు ఆర్థిక, సామాజికాంశాల్లోనే కాక అక్షరాస్యత లోనూ వెనకబడి ఉన్నారు. ముస్లీముల్లో ఫకీరు,మెహతారు,దూదేకుల వంటి కులాల వాళ్ళు కూడా నిరుపేదలుగా మగ్గుతున్నారు. షేకుల్లోనూ పేదలు అధికమే. ఉర్దూ రెండో అధికార భాషగా ఉన్నప్పటికీ ఏ ఒక్క ప్రభుత్వ కార్యాలయాల్లోనైనా ఉర్దూ రాయగల్గిన, మాట్లాడగల్గిన సిబ్బంది లేరు. దీంతో ముస్లీములు తమ సమస్యల చెప్పుకునేందుకు వస్తే వాళ్లను పట్టించునే పరిస్థితే ఉండట్లేదు.ముస్లీం మైనార్టీ మహిళలు కూడా పొదుపు సంఘాల్ని ఏర్పాటు చేసుకున్నారు. డ్వామా సంఘాలు ఏర్పాడ్డాయి. మైనార్టీ మహిళలు సభ్యులుగా చేరి పొదుపు చేస్తూ వచ్చారు. మున్సిపాలిటీల్లో బ్యాంకుల ద్వారా నేరుగా మ్యాచింగ్‌ గ్రాంట్‌, పావలా వడ్డీ రుణాలివ్వాలని మహిళలు అనేక సార్లు ఆందోళనలు చేశారు. అధికారులు పట్టించుకోలేదు. సంఘాల్ని గుర్తించే పేరుతో సర్వే చేశారు. సంఘాల నిర్వహణ రికార్డులు సక్రమంగా లేవని చెప్పి సంఘాలకు రుణాలివ్వొదని ప్రతిపాదించారు. దీంతో బ్యాంకర్లు కూడా వెనకడుగేశారు.చివరికి  సంఘాలు నడవట్లేదని చెప్పి రద్దు చేశారు. నడుస్తున్నాయని గుర్తించిన సంఘాలకీ రుణాలివ్వట్లేదు.ఇదంతా కావాలని చేస్తున్నట్లుంది.
ముస్లీం వితంతువులు , ఒంటరి మహిళలు కుటుంబ పోషణ కోసం కూలినాలి పనులు చేస్తూ పొట్ట పోసుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులతో వ్యవసనాలకు గురైన భర్తలు చనిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళలకు ఉపాధి లభించడం కష్టంగా ఉంది. మహిళలు  బండి హోటల్‌, పుట్‌పాత్‌, పండ్లు, కూరగాయలు, చెప్పులు ఇతర చిల్లర వ్యాపారాలు లాంటివి నడుపుతూ కుటుంబాన్ని పోషిద్దామన్నా వాటి  నిర్వహణకు డబ్బుల్లేక నడిచీ నడవని పరిస్థితి ఉంది . బ్యాంకు రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే ఆస్తుల్ని ష్యూరిటీ పెట్టాలని నిరాకరిస్తున్నారు.పేదవాళ్ళకు ఆస్తులెక్కడినుంచి వస్తాయి? స్వయం ఉపాధి కోసం బ్యాంకు రుణాలిస్తే కుటీర పరిశ్రమలు, చిరు వ్యాపారాలు పెట్టుకుని జీవనోపాధి పొందేందుకు వీలుండేది. మెప్మా, డిఆర్‌డిఎ, రాజీవ్‌ యువకిరణాల ద్వారా శిక్షణ ఇస్తున్నామని చెబుతున్నా మైనార్టీలకు ఇవ్వట్లేదు. అన్యాక్రాంతమైన వక్ఫ్‌, పీర్లమాన్యం, ఆవాక్యూ ప్రాపర్టీ ఆస్తుల్ని స్వాధినం చేసుకుని భూమిలేని పేద ముస్లీంలకు పంపిణీ చేయటం లేదు. కులాంతర మతాంతర వివాహాలు చేసుకొని మిగతా కులాల జనంతో కలిసిపోయిన వారికి  ప్రోత్సహకాలు కూడా సరిగా ఇవ్వటం లేదు.లోపలికొస్తే పొగ - బయటే ఉంటే వెలి అన్నట్లుంది మాపరిస్థితి.ఎవరికి చెప్పుకోము?”
మరీ వెనుక బడ్డ కులాల ఉద్ధరణ
రిజర్వేషన్ల పుణ్యాన ఇన్ని ఏళ్ళ పాలనలో ఏవో కొన్ని కులాలైనా రాజకీయంగా,సాంఘీకంగా,ఆర్ధికంగా పైకి వచ్చి ఉంటాయి.అలా ఎదిగోచ్చిన  కులాలే జాబితాలోని మిగతా అణగారిన కులాలకు కాలం గడిచేకొద్దీ అడ్డమౌతాయి. ఆచరణలో జరుగుతున్నది ఇదే. బీసీలలో జనాభా ఎక్కువగా ఉండి, రాజకీయ శక్తులను భయపెట్టగలిగే కులాలు మాత్రమే ఈ రిజర్వేషన్ల వల్ల ఎక్కువగా లాభపడుతూ ఉండగా, జనాభా తక్కువగా ఉండి, రాజకీయ నాయకత్వమే లేని కులాలు నష్టపోతున్నాయి.ఇందుకే ఎస్సీ వర్గీకరణ పోరు జరుగుతోంది. అందువలన శక్తివంతమైన కులాలను, శక్తిహీనమైన కులాల సరసన ఉండకుండా వేరు చేయాలి. ఆ విధంగా శక్తిమంతమైన కులాలు, శక్తిహీనమైన కులాలకు అడ్డురాకుండా కాపాడాలి. శక్తిమంతమైన రాజకీయ పలుకుబడి గల కులాలను అంతకంటే  క్రిందివరస  వర్గంలోకి చేర్చాలి. అలాంటి నిరంతర వడపోత , పునర్వర్గీకరణ పద్ధతి ద్వారా కొంత కాలానికి రిజర్వేషన్లు అక్కరలేదని ఎత్తివేసే పరిస్థితి రావాలి. బాలసంతు, బుడబుక్కల, దాసరి,దొమ్మరి, గంగిరెద్దుల, జోగి, జంగం,కాటిపాపల, మందుల, మొండిబండ,పంబల, పాముల, పెరికి ముగ్గుల, పిచ్చిగుంట్ల,వీరముష్టి ,మెహతార్, అచ్చుకట్ల వాళ్ళు, దేవాంగులు, దూదేకుల,జాండ్ర, కరికాల భక్తులు,సెగిడి, తొగట, ఆగరు, ఆరెకటిక, చిప్పోళ్లు,కొడమి, జక్కల, జింగారు,కచ్చి, కండ్ర, కొష్టి, మాలి, నెల్లి,పస్సి, పూసల, సాతాని, అత్తరు సాయిబులు,తురక చాకలి, నాయి ముస్లిమ్,గంటా ఫకీర్లు,గారడీ సాయిబులు ,పకీరుసాయిబులు,ఎలుగుబంటు వాళ్లు,కుక్కుకొట్టె జింకసాయిబులు,కూడా శాసన సభల్లో ప్రవేసించాలంటే ఇప్పటికే బీసీలలో ఎదిగోచ్చిన కులాలను మరీ వెనుకబడిన కులాలకు అడ్డంరాకుండా తొలగించాలి.కనీసం రొటేషన్ పద్ధతి అయినా పెట్టి అన్నీ కులాలకూ రిజర్వేషన్ ఫలితం అందేలా చెయ్యాలి.ఉమ్మడి ప్రయోజనం కోసం భారీ చాకిరీ చేసినా చివరికి అమృతం దక్కలేదనే ఆవేదనతో ,మోసపోయామనే బాధతో ఆనాడు కొందరు రాక్షసుల్లాగా మారిపోయారు.ఈనాడు 144 కులాల ఉమ్మడి ప్రయోజనాలను ఆశించి ఉద్యమాలు నడుపుతున్న నాయకులు కూడా అందులో మరీ వెనుకబడిపోయిన కులాలు ఏవో గుర్తించి వారిని ముందుకు తేవటానికీ ప్రయత్నించాలి.
సూర్య 22.12.2013
http://www.suryaa.com/opinion/edit-page/article-163816
https://www.facebook.com/photo.php?fbid=683302998368360&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater

 సూర్య 25.12.2013 
 http://www.suryaa.com/opinion/edit-page/article-164195

https://www.facebook.com/photo.php?fbid=684783901553603&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater

2 కామెంట్‌లు: