ఈ బ్లాగును సెర్చ్ చేయండి

11, జనవరి 2020, శనివారం

కొత్తజిల్లాల ఏర్పాటూ వికేంద్రీకరణే



కొత్తజిల్లాల ఏర్పాటూ వికేంద్రీకరణే   
స్థానిక సంస్థల ఎన్నికల తరువాత లోక్ సభ స్థానాలవారీగా జిల్లాల పునర్విభజన మొదలుపెడతామని ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు మార్చి 3 వతేదీకి పూర్తవుతాయి.మూడు రాజధానుల గోలలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం పక్కకు పోయింది గానీ కొత్తజిల్లాల కోసం ఆయా ప్రాంతాల ఆశ చావలేదు.1972 జైఆంధ్ర ఉద్యమానికి విరుగుడుగా ఏర్పాటు చేసిన జోనులకొసం ప్రజలు ఎదురుచూస్తూ ఉన్నారు.లోక్ సభ స్థానాలతో సమానంగా కొత్త జిల్లాల ఏర్పాటు చేయబూనడం దానికి మరో మేలు.దేశంలో జిల్లాల సంఖ్య 1983  లో 418 నుండి2020 నాటికి 732 కి పెరిగి 314కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. తెలంగాణలో  పది జిల్లాలను 33 జిల్లాలుగా కేసీఆర్ ఏర్పాటు చేశారు. అందువలన అక్కడ ఇప్పుడు 64 రెవిన్యూ డివిజన్లు.624 మండలాలు ఏర్పడ్డాయి. కొత్తగా  26 రెవిన్యూ డివిజన్లు,125 కొత్త మండలాలు,4380 గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయి.1956 లో మనరాష్ట్రం ఏర్పడింది మొదలు ఈ 64 ఏళ్ళ కాలం లో కేవలం రెండే జిల్లాలు కొత్తగా ఏర్పాటయ్యాయి.అవి ప్రకాశం (1970), విజయనగరం (1979) జిల్లాలు.మన రాష్ట్రంలో ఎన్టీరామారావుగారి కాలంలో జరిగిన మండలాలస్థాపనే రాష్ట్రంలో అతిపెద్ద పరిపాలనా సంస్కరణ. పరిపాలనను ప్రజల దగ్గరకు తీసుకొనివెళ్ళాలనే ఉద్దేశ్యంతో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.టి. రామారావు గారు రాష్ట్రంలోని 315 తాలూకాలను విడగొట్టి, వాటి స్థానంలో 1110 మండలాలను 1985 మే 25న ఏర్పాటు చేశారు.మండలాల మాదిరిగానే కొత్త జిల్లాలు కూడా ఏర్పాటు చేయమని కోరగా మండల వ్యవస్థ కుదురుకోగానే కొత్త జిల్లాల ఏర్పాటుపై ద్రుష్టి సారిస్తామని సచివాలయం నుండి నాకు 21.9.1988 న జవాబు ఇచ్చారు.
జగన్ గారి మ్యానిఫెస్టోలో మన రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను పార్లమెంటు నియోజకవర్గాలతో సమానంగా 25 జిల్లాలుగా  ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు.కొత్తగా జిల్లా కేంద్రాలుగా మారవలసిన 12 పార్లమెంటు నియోజకవర్గాలు :1 అరకు 2 బాపట్ల3 అనకాపల్లి 4 అమలాపురం 5 హిందూపురం 6 నంద్యాల 7 నరసాపురం 8 నరసరావుపేట9రాజమండ్రి 10 రాజంపేట 11 తిరుపతి 12 విజయవాడ.విజయవాడ,రాజమండ్రి,తిరుపతి,భీమవరం,గుడివాడ,తెనాలి పట్టణాలు జిల్లా కేంద్రాలు కాకపోయినా ప్రజల సహజ వలసలతో గొప్పనగరాలు అయ్యాయి.రైల్వే జంక్షన్లు ప్రజల చౌక ప్రయాణానికి సరుకుల రవాణాకు మంచికేంద్రాలుగా,పట్టణాలుగా  మారుతాయి. జిల్లాల సంఖ్య పెరిగేకొద్ది వాటి సైజు తగ్గుతుంది గనుక జిల్లా అభివృద్ధి రధానికి సారధుల్లాంటి ఐ. ఎ. ఎస్. ఆఫీసర్లు జనానికి దగ్గరవుతారు. జిల్లా కేంద్రానికి మారుమూల గ్రామాల ప్రజలు ప్రయాణం చెయ్యడానికి దూరం భారం తగ్గుతాయి. అధికార వికేంద్రీకరణ జరిగి మరిన్ని ప్రాంతాలు అభివృద్ధి    చెందుతాయి.జిల్లాస్థాయి అధికారులు దగ్గరకావటం  వల్ల స్పందన కార్యక్రమం విజయవంతం అవుతుంది. విపరీతమయిన జనాభారంతో ఉబ్బిపోయిన నగరాల నుండి జనమూ, ఉద్యోగులు చెదిరిపోయినందువల్ల ఆయా నగరాలు ఊరట చెందుతాయి. ప్రతి జిల్లాలోను భారీ పరిశ్రమలు ఉండాలనే కేంద్ర ప్రభుత్వ ఆశయం మేరకు జిల్లాల సంఖ్యతో పాటు పరిశ్రమల సంఖ్య పెరుగుతుంది. పరిశ్రమలన్నీ ఒకే చోట కేంద్రీకృతం కాకుండా అన్నీ ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందుతాయి.జిల్లా కేంద్రాల్లో ప్రాధమిక సదుపాయాలన్నీ కల్పించాలి. జిల్లాల విభజనకు ఒక ప్రామాణిక సూత్రం గానీ, శాస్త్రబద్ధమైన విధానంగానీ ఏదీ లేకుండానే కాలం గడుపుకొచ్చారు. జాతీయ స్ధాయిలో జిల్లాల సగటు వైశాల్యం ఈనాడు 4534 చ.కి.మీ.లకు తగ్గిపోగా ఆంధ్ర ప్రదేశ్ 12323 చ.కి.మీ. తో దేశంలోనే మొదటి స్ధానంలో ఉంది. మనరాష్ట్రంలో ఒక్కొక్క పార్లమెంటు సభ్యుడు సగటున 20 లక్షలమందికి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఒక్కొక్క జిల్లా కలెక్టర్ 38 లక్షల మంది అవసరాలను ఆలకిస్తున్నాడు.దేశంలో సగటున 18 లక్షల జనాభాకు ఒక జిల్లా ఉంది. అరుణాచలప్రదేశ్ లో అయితే 86 వేల మంది జనాభాకే ఒక జిల్లా ఉంది. మన రాష్ట్రం లో మాత్రం 38 లక్షల మందికొక జిల్లా ఉంది.అలాగే త్రిపుర లో 1311 చ.కి.మీ.లకు ఒక జిల్లా కలక్టర్ ఉంటే మన రాష్ట్రం లో 12323 చ.కి.మీ ల భూబాగానికి ఒక కలక్టర్ ఉన్నాడు.పనులకోసం వచ్చే ప్రజలకు అత్యంత దూరం భారం కలిగించే రాష్ట్రాలలో ఆంధ్ర ప్రదేశ్ దేశం లో మొదటి స్ధానంలో ఉంది. జిల్లాల సంఖ్య పెరిగితే అధికార వికేంద్రీకరణ జరుగుతుంది.ప్రస్తుతం ఉన్న ఏడు కేంద్రపాలిత ప్రాంతాల వైశాల్యం కలిసి 10,973 చ. కి.మీ. అంటే మన తూర్పు గోదావరి జిల్లా అంత అన్నమాట. గోవా, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్ లాంటి రాష్ట్రాలంకంటే మన జిల్లాలు పెద్దగా ఉన్నాయి. కొన్ని దేశాలు కూడా మన జిల్లాల కంటే చిన్నవి. అనంతపురం జిల్లా వైశాల్యం 19130 చ.కి.మీ. కర్నూలు 17658, ప్రకాశం జిల్లా 17626 చ.కి.మీ. ల భారీ సైజుతో హడలు పుట్టిస్తున్నాయి. రాష్ట్రంలోని  నాలుగు  జోనుల్లో రవాణా సదుపాయం బాగా ఉన్న కేంద్రాలలోగానీ ఆ జోనుమధ్య జిల్లాకేంద్రంలోగానీ  జోనల్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి.కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా పరిపాలన వేగవంతంగా జరుగుతుంది. ప్రతి చిన్న అంశానికి రాజధానికి వెళ్లనక్కర లేకుండా మూడు ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజల్లో ప్రభుత్వం తమకు దగ్గరగా ఉందనే భావన పెరుగుతుంది.ప్రతి పార్లమెంటు నియోజక వర్గానికి ఒక జిల్లా వల్ల జిల్లాలలో వాణిజ్యం పెరగడంతో పాటు, భూముల విలువ పెరుగుతాయి,దానివల్ల ఖజానాకు ఆదాయం కూడా సమకూరుతుంది. స్పందన కార్యక్రమం 25 చోట్ల కలక్టర్ల అధ్వర్యంలో జరుగుతున్నందువలన ప్రజలకు దూరం భారం తగ్గుతాయి.అధికారం అంతా ఒక్కచోటే ఉండదు. అన్ని జిల్లాలకూ పలచగా పంచబడుతుంది.శాఖాధిపతులకు కలెక్టర్లకు మధ్య ప్రాంతీయ అధికారులు ఉంటారు.ప్రజలకు అధికారులు చేరువఅవుతారు.తాలూకాలను మండలాలుగా విడగొట్టినందువలన ప్రజలకు పాలనా యంత్రాంగం దగ్గరయ్యింది.ఇప్పుడు మండలాలు తీసేసి మళ్ళీ తాలూకాలనే పెట్టమని ఎవరూ అడగరు. చిన్న జిల్లాల ఏర్పాటు వలన అధికారులందరికీ పని సమానంగా పంచబడుతుంది.తీవ్ర పని భారం తగ్గి ప్రజలకు పనులు త్వరగా జరుగుతాయి.కొన్ని పార్లమెంటు నియోజకవర్గాల కేంద్రాలు కూడా కొన్ని జిల్లాల కేంద్రాలలాగా చాలా దూరంగా అంచుల్లో ఉన్నాయి.వాటిని మధ్యలోకి మార్చాల్సిన అవసరం ఉంది.
నాలుగు కమీషనరేట్ల పంపకం కూడా నాలుగు ప్రాంతాలవారినీ సంతృప్తి పరుస్తుంది.
1. ఉత్తరాంధ్ర జోను:శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్నం,అరకు,అనకాపల్లి 5 జిల్లాలు
2.మధ్యకోస్తా జోను : తూర్పుగోదావరి ,పశ్చిమ గోదావరి,కృష్ణా,రాజమండ్రి,అమలాపురం,నరసాపురం,విజయవాడ 8 జిల్లాలు 3.దక్షిణకోస్తా జోను : గుంటూరు,ప్రకాశం,నెల్లూరు, బాపట్ల,నరసరావుపేట 5 జిల్లాలు
4.రాయలసీమ జోను :కర్నూలు,కడప,అనంతపురం,చిత్తూరు,తిరుపతి,రాజంపేట,హిందూపురం,నంద్యాల 7 జిల్లాలు.
నాలుగు జోనుల్లో కలక్టర్ల కంటే పైహోదా కలిగిన నలుగురు కమీషనర్లు రాజధానికి కలక్టర్లకు మధ్య వారధుల్లాగా పనిచేస్తారు.ప్రతిపనికి ప్రజలు రాజధానికి రాకుండా ఈ కలక్టర్లు,కమీషనర్లు జిల్లాలు,జోనులు వారీగా స్థానిక ప్రాంతాలలోనే ఉండి పనిచేస్తారు.కలక్టర్ల దగ్గర పనులు కానివాళ్లు కమీషనర్లను ఆశ్రయిస్తారు.దూర ప్రయాణాలు అనుత్పాదక వ్యయం.అష్టకష్టాలలో దూర ప్రయాణం కూడా ఒకటి.అలాగే రాజధానిలో కొత్త కట్టడాల కొత్త ఖర్చులను కుదించుకొని నాలుగు చోట్ల జోనల్ కార్యాలయాలను కట్టించాలి.అమరావతిలో కట్టిన భవనాలను వాడుకుంటూనే సమన్యాయం కోసం హైకోర్టుకు రెండు చోట్ల బెంచీలు పెట్టాలి.రాజధాని కోసం ప్రజలు రానక్కరలేని పరిస్తితి జోనులవల్ల వస్తుంది.రాజధాని మాకు కావాలంటే మాకని పెద్దగా పోరాడవలసిన అవసరమూ.ఆరాటమూ ఉండదు.
-- నూర్ బాషా రహంతుల్లా ,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్,6301493266

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి