ఈ బ్లాగును సెర్చ్ చేయండి

2, జనవరి 2020, గురువారం

ఆకలి అనారోగ్య మంటలు

ఆకలి అనారోగ్య మంటలు (సూర్య 5.1.2020)
కొత్త సంవత్సరం జనవరి ఒకటిన ప్రపంచవ్యాప్తంగా 4 లక్షల మంది పుడితే అందులో 67385 మంది పిల్లలు ఇండియాలో పుట్టారట.చైనాలో 46299 మంది పుడితే మనదేశం ఆ సంఖ్యను దాటేసిందట.ప్రపంచ శిశువుల మొత్తం లో సగం మంది ఇండియా,చైనా,నైజీరియా,పాకిస్తాన్,ఇండోనేసియా,అమెరికా,కాం గో,ఇథియోపియాల వాళ్లేనట. నీతి ఆయోగ్‌ చేసిన మదింపులోదారిద్ర్యం, పోషకాహారలోపం వంటివి దేశాన్ని వెనక్కు లాగుతూనే ఉన్నాయి.ప్రపంచ ఆకలి సూచీలో భారత్‌ స్థానం దిగజారిపోయింది. 2014లో 76 దేశాల జాబితాలో మన దేశం 55వ స్థానంలో వుంది. 2017లో 119 దేశాల్లో 100వ స్థానంలోనూ, 2018లో 103వ స్థానంలోనూ వుండగా, 2019లో 117 దేశాల జాబితాలో 102వ స్థానానికి దిగజారింది. ఇండియా ఇప్పుడు పశ్చిమాఫ్రికా లోని నైజర్‌, సియెర్రా, లియోన్‌ దేశాల స్థాయికి చేరింది. ప్రపంచంలో ఆకలితో బాధపడుతున్న మెజారిటీ ప్రజలు భారతదేశంలో నివసిస్తున్నారు. దేశంలోని పేదలు నిరుపేదలుగా మారుతున్నారు. రైతన్నలు ఉరికొయ్యలకు వేలాడుతున్నారు. చిన్న, మధ్య తరహా వర్తకులు వ్యాపారాలను వదిలేస్తున్నారు. ఉపాధి లేక నిరుద్యోగులు రోడ్డున పడుతున్నారు. కార్పొరేట్ల ఆస్తులు మాత్రం రెట్టింపవుతూనే వున్నాయి.భారతదేశంలో ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న ముఖేష్‌ అంబానీ లాంటి దేశంలోని 100 మంది అత్యధిక ధనవంతుల ఆస్తి నాలుగో వంతు పెరిగింది. సిరులూరే బాబుల దాపులకైనా చేరలేని ఆకలి అగ్గిలాంటిది. అగ్గికి యేదో ఆహారం వెయ్యకపోతే మనిషినే కాల్చేస్తుంది.ఆకలి నిరుపేదల బతుకులను కాల్చేస్తోంది. ఆకలికి జాలి వుండదు. సృష్టిలో ప్రతి జీవికీ ఆకలి తీరిన మీదటే అన్నీనూ.అయిదేళ్లలోపు పిల్లల మరణాలు ప్రపంచంలో పెద్దసంఖ్య ఇండియాదే. ప్రతి సంవత్సరం సుమారు రెండు కోట్ల 60 లక్షల జననాలు శిశుమరణాలు.దేశంలో 20 శాతం మంది చిన్న పిల్లలు వారానికి ఒక గుడ్డు, రెండు వారాలకు ఒక పండు తినలేని పరిస్థి తిలో ఉన్నారు. వారి ముఖాలు ఏ విటమిన్లు లేక కళ తప్పి కనిపిస్తున్నాయి. ఎందరో శిశువులు ఆకలి తో మరణిస్తున్నారు. 117 దేశాల వరుసలో ఆకలిసూచిలో భారత్‌ 102వ స్థానం.భారతదేశ గోదాముల్లో మూలు గుతున్న ధాన్యాగారాలన్నీ ఎలుకలు, పందికొక్కులు తింటుంటే దేశంలోని అతి పేదలకు ఆహారం దొరకటంలేదు.ప్రతి సంవత్సరం రెండు కోట్ల 60 లక్షల జననాలు నమోదవుతున్నాయి. భూ సంస్కరణలను ప్రభుత్వాలు పూర్తిచేయలేదు. పేదలు వ్యవసాయంలోకి యాంత్రిక పరికరాలు రావడం వల్ల భవన నిర్మాణ కార్మికులుగా రూపొందారు. వ్యవసాయం, భవననిర్మాణం, పరిశ్రమల నిర్మాణం, పోర్టుల నిర్మాణం, సాగినప్పుడే యువతకు పని లభ్యమవుతుంది.
ప్రపంచవ్యాప్తంగా నవజాత శిశుమరణాల్లో భారత్ ది 27శాతం.అంతర్జాతీయ వ్యాధుల భారంలో అయిదోవంతు. డయేరియా, తట్టు, గవదలు, టైఫాయిడ్‌, పచ్చకామెర్లు, మలేరియా, స్వైన్‌ఫ్లూ, డెంగ్యూల తాకిడితో జనా రోగ్యానికి తీవ్రంగా తూట్లుపడుతున్నాయి. భారత రాజ్యాంగం 45వ అధికరణలో ఆరు సంవత్సరాలోపు బాలబాలికల పరిరక్షణ ప్రభుత్వానిది . 86వ రాజ్యాంగ సవరణతో ప్రభుత్వాలకు నిర్బంధ విద్య బాధ్యత కలిగించింది. భారత్‌ 16 దేశాలతో అణు ఒప్పందాలు చేసు కుంది. అణురియాక్టర్ల దిగుమతికి సులభమైన మార్గదర్శకాలను రూపొందించుకుంది.
పల్లెలూ పట్టణాలన్న తేడా లేకుండా ఇటుకబట్టీలు, రాతిక్వారీలు, గనులు, కార్పెట్లూ బీడీల తయారీ, మరమగ్గాల పనుల్లో ఎందరో బడిఈడు పిల్లలు రెక్కలు ముక్కలు చేసుకుంటూనే ఉన్నారు. బాలలెందరో రెక్కాడితేగాని డొక్కాడని దుస్థితిలో పలుగూ పారా చేతపట్టాల్సి వస్తోంది. నామమాత్ర కూలీకి ఆశపడి చాకిరి యంత్రాల్లా మారాల్సి వస్తోంది.దేశంలో ఉత్తరప్రదేశ్‌ తరవాత బాలకార్మికులు ఎక్కువగా పోగుపడ్డ రాష్ట్రం ఆంధ్రప్రదేశే. ఇక్కడ రమారమి 14లక్షలమంది పిల్లలు వయసుకు మించిన శరీర శ్రమతో కునారిల్లుతున్నారు . ప్రపంచంలోనే అత్యధికంగా ఇండియాలో సుమారు ఆరుకోట్ల మంది పిల్లలు చదువులకు దూరమై సంపాదన వనరులుగా మారి ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారు. ఎంత బీద తల్లిదండ్రులైనా సంతానం తమకన్నా మెరుగైన స్థితిలో ఉండాలనే కోరుకుంటారు. ఆకలిమంటలు చల్లారే మార్గాంతరం కానరాని దశలోనే లేతరెక్కలు సంపాదన వనరులవుతున్నాయి .
ప్రపంచ ఆకలి సూచీలో మొత్తం 119 దేశాల్లో 100వ స్థానంతో ఉత్తరకొరియా, బంగ్లాదేశ్‌ల కన్నా వెనుకబడి ఉన్నాం.అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నాం. అభివృద్ధి దిశగా అడుగులేస్తున్నాం. కానీ ఆకలిని మాత్రం జయించలేకపోతున్నాం. దేశంలో తిండికి నోచుకోని వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆకలి సూచీలో ఆఖరుకు ఉత్తరకొరియా, బంగ్లాదేశ్‌, నేపాల్‌, ఇరాక్‌ల కన్నా మన దేశం వెనుకబడి ఉంది.సహారాకు దక్షిణాన ఉన్న ఆఫ్రికాలో మాత్రమే ఇంతటి తీవ్రత ఉంది.దేశంలోని ఐదేళ్లలోపు పిల్లల్లో కనీసం ఐదోవంతు ఎదుగుదల లోపంతో బాధపడుతున్న బాలల శాతం 38.4 . ప్రపంచంలో అత్యధికంగా ఆహారాన్ని ఉత్పత్తిచేస్తున్న దేశాల్లో భారత్‌ది రెండోస్థానం. అదే సమయంలో ఎక్కువమంది పౌష్టికాహార లోపంతో బాధపడున్న వారు ఉంటున్న దేశాల్లో భారత్‌ది రెండోస్థానం.దేశంలో దాదాపు 22 శాతం మంది దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్నారు. అదే సమయంలో ప్రపంచ కుబేరుల్లో దాదాపు 84 మంది భారత్‌లోనే ఉన్నారు. భారతదేశంలోని దాదాపు సగం సంపద కేవలం ఒకే ఒక్క శాతం మంది చేతిలో ఉంది.ధనిక దేశాల జాబితాలో ప్రస్తుతం ఆరోదిగా ఉన్న భారత్‌ 2027 సంవత్సరం నాటికి బ్రిటన్‌, జర్మనీలను అధిగమించి నాలుగో స్థానానికి ఎదగనుందట. భారత జనాభాలో ఒక్కశాతం అపర కుబేరుల చేతుల్లో 22 శాతం మేర సంపద పోగుపడిందట. ఒక దేశం ఎంత సంపన్నమైందో నిర్ధారించడానికి ఇదా సరైన కొలమానం? ఆకలి అనారోగ్యాలు అంతమొందకపోగా ధనిక దేశంగా భారత్‌ పురోగమిస్తున్నదనటం క్రూరపరిహాసం! గ్రామీణుల్లో మూడొంతుల మంది నెలకు అయిదు వేల రూపాయల బొటాబొటీ ఆదాయంతో కాయకష్టంతో బతుకీడుస్తున్నవారే. మూడోవంతు గ్రామీణులకు సెంటు భూమైనా లేక ఆరు లక్షల గ్రామాలపై పేదరికం దట్టంగా ఆవరించింది. దేశంలో దాదాపు 58 శాతం పట్టభద్రులు, 62 శాతం స్నాతకోత్తర పట్టభద్రులు నిరుద్యోగులుగా నిరాశా నిస్పృహల్లో కూరుకుపోతున్నారు.
ఆరోగ్యమే మహాభాగ్యమంటారు. ఆరోగ్య ర్యాంకుల్లో స్విట్జర్లాండ్‌, ఆస్ట్రేలియా, ఫిన్లాండ్‌ తొలి వరసకు పోటీపడుతుండగా ఆ జాబితాలో ఎక్కడో అడుగున 131 స్థానంలో, జాతీయ ఆనంద సూచీలో పాక్‌, నేపాల్‌ కన్నా భారత్‌వెనకబడింది.పౌరసత్వాలు,శరణార్ధులు,మతాల గొడవల నుండి పేద ప్రజలందరికీ ఆకలితీర్చే,ఆరోగ్యం కూర్చే దిశగా దేశాన్ని నడిపించటం మంచిది.ఆనందమే జీవిత మకరందం కదా?
--నూర్ బాషా రహంతుల్లా
విశ్రాంత డిప్యూటీ కలక్టర్,6301493266
 https://www.facebook.com/williams32143/posts/2905667139465257

గీటురాయి 17.1.2020


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి