ఈ బ్లాగును సెర్చ్ చేయండి

23, జనవరి 2020, గురువారం

2 వేల కుబేరులు - 460 కోట్ల కుచేలులు (సూర్య 26 1.2020)


2 వేల కుబేరులు - 460 కోట్ల కుచేలులు


“మాకండలు ఒడిసిన రుధిరం
 మీ గుండెలు నిండిన మధురం
మీ మోటారు లేపిన గాలి
 మా మోమున పోసేను ధూళి
పైకిపోవు మేడలు మీవి
కూలిపోవు గుడిశలు మావి”
ఈ గేయం ఎవరురాశారో గానీ నిజమేకదా అని నాకు మనసులో ముద్రపడ్డాయి.

“ కలిగినవానికే యియ్యబడును
వానికి సమృద్ధి కలుగును;
లేనివానికి కలిగినదియు
వానియొద్దనుండి తీసి వేయబడును” (మత్తయి 13:12)
అనే వాక్యం చదివినప్పుడు దేవుడికి ఇది న్యాయమేనా ? అనిపించిది.

నిజానికి మేడిపండు లాగా ఉంది మన ఆర్ధిక వ్యవస్థ. ఎందుకంటే కార్మికుల ఆదాయం 2 శాతం పెరిగితే సంపన్నుల ఆదాయం 600 శాతం పెరుగుతోందట. ఒక పక్క కుబేరులు మరోపక్క కుచేలులు.ఈ ఆర్ధిక అసమానతలను రూపుమాపటంకోసం ఉపాధిహామీ,జన్ ధన్,దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ నైపుణ్య యోజన,స్టాండ్ అప్ ఇండియా లాంటి ఎన్ని పథకాలు అమలుచేసినా అంతరాలు తొలగటమే లేదని ఐరాస రిపోర్టు . ప్రపంచ సంపద పెరిగిందట.ఆ సంపాదనంతా 2,153 మంది శత కొటీశ్వరుల దగ్గర పోగుపడిందట. ప్రపంచ జనాభాలో 60 శాతం అంటే 460 కోట్ల మంది దగ్గర ఉన్న సంపదతో ఇది సమానం.ఇండియాలో అయితే 63 మంది కుబేరుల చేతిలో 24 వేల కోట్ల సంపద పోగుపడిందట.ఇది భారతీయ బడ్జెట్ మొత్తంతో సమానం.96 కోట్ల మంది కుచేలుల సంపద కంటె నాలుగు రెట్లు ఎక్కువ. ఒక వైపు కుబేరులు అపర కుబేరులుగా మారుతుంటే, మరో వైపు కోటానుకోట్ల పేదలు కటిక దరిద్రులుగా మారుతున్నారు. కర్షకులు, శ్రామికులు పేదరికంలో మగ్గుతూ ఉంటే, ఆర్థిక మాంద్యంలో కూడా కుబేరులు ఎన్ని తరాలు తిన్నా తరగని ఆస్తులను సంపాదిస్తున్నారు.సంపన్న వర్గాల మహిళలతో పోల్చితే నిరుపేద మహిళల ఆయుఃప్రమాణం 15 ఏళ్లు తక్కువట. జీవనోపాధికి లంచం కట్టాల్సి వస్తోంది.కష్టార్జితంలో విద్య, వైద్యాలకే సగం పోతున్నది.ఫీజులు, చార్జీలు, పన్నులు. పెరుగుతున్నాయి. ఇవి తగ్గించని ప్రభుత్వాలు కార్పొరేట్లకు, సంపన్నులకు భారీ రాయితీలు ఇస్తున్నాయి. పన్ను ఎగవేసినా ఆమ్నెస్టీ స్కీమ్‌ క్షమాభిక్ష పథకం ఇస్తూ ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్లకు అమ్మేస్తూ ఉంది. కుబేరుల వద్ద పోగుపడుతున్న ఈ సంపదంతా కార్మికుల శ్రమ దోపిడీ వల్ల వచ్చిందేనట.
నిరుద్యోగులు 50 కోట్ల మందట.స్వాతంత్య్రం వచ్చి 73 ఏళ్లు కావస్తున్నా పేదరికం, నిరుద్యోగం, దేశాన్ని వదలలేదు. మన తరువాత రెండేళ్లకు స్వాతంత్య్రం పొందిన, మనకంటే ఎక్కువ జనాభా కలిగినా చైనా మానవాభివృద్ధి సూచికల్లో మనకంటే మెరుగైన సామర్థ్యం కనబరుస్తున్నది.అనేక వస్తువులు ఇప్పటికీ చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం.దేశ ప్రజలకు విస్తృత సేవలందించిన ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ లాంటివెన్నో ప్రైవేటు పాలయ్యాయి.'మాట్లాడుతూనే ఉండండి' అంటూ ప్రైవేటు సంస్థలు ప్రజలను ఆకట్టుకొని బలిసిపోయ్యాయి. ప్రభుత్వానికి కట్టవలసిన 92 వేల కోట్లు కట్టకుండా సుప్రీంకోర్టును క్యురేటివ్‌ పిటిషన్ల ద్వారా గడువు కోరుతున్నారు.మరిన్ని రాయితీలు కావాలట. ఇన్నిరాయితీలు ప్రభుత్వ సంస్థలకే ఇచ్చి ఉంటే బాగుండేదికదా? ప్రైవేటు టెలికాం కంపెనీలేవీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తాన్ని కట్టలేదు. ప్రైవేటు టెలికాం సంస్థలు ప్రభుత్వ అంతరిక్ష ప్రయోగాల ఫలితంగా లభించిన అత్యున్నత సాంకేతికతను,5జి స్పెక్ట్రమ్‌, జి.పి.ఎస్‌ వంటి ఎన్నో ప్రయోజనాలను ఊరికే వాడుకుంటున్నాయి.ప్రజలకు మాత్రం రీఛార్జ్‌ చేయకుండా ఒక్క నిమిషమైనా అవి ఉచితంగా సేవలందించవు.ఇప్పుడు జనాభాతో సమానంగా మొబైల్‌ ఫోన్లు ఉన్నాయి.కాలం గడిచేకొద్దీ దేశ జనాభా కన్నా ఫోన్ల సంఖ్య ఎక్కువవుతోంది. ఫోన్ల వినియోగం పెరుగుతున్న కొద్దీ పెరిగే ఆదాయమూ ప్రైవేటు సంస్థలదే! అయినా తాము చెల్లించవలసిన బకాయిలను చెల్లించడంలేదు.పన్ను బాకీలు కట్టకపోతే సమాజానికి అన్యాయం చేసినట్లేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వాపోయారు. పైగా 5జి స్ప్రెక్టమ్‌కు పోటీ పెడుతున్నారు.డిజిటల్‌ ఇండియా ఆగిపోతుందని హెచ్చరిస్తున్నారు.కార్పొరేట్‌ న్యాయం అంటే ఇదేనా? జిడిపి పెరుగుదల దెబ్బ తిని పోతుందంటున్నారు! కార్పొరేట్లు కట్టాల్సిన రుసుములు కట్టకపోతే దేశ ఖజానాకి కన్నం పడదా? కార్పొరేట్ల దేశభక్తి ఇదేనా?
దారిద్య్రం, నిరుద్యోగ నిర్మూలన, సంపన్నులు పేదల మధ్య అసమానతల తొలగింపు ఎలా జరుగుతుంది? నిరుద్యోగులు చేయడానికి పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడటం సామాజిక అశాంతికి దారి తీస్తుంది.రానున్న రోజుల్లో మరిన్ని కష్టాలు తప్పవు.ఈ ఏడు నిరుద్యోగులు మరో 25లక్షలు పెరుగుతారట. మాంద్యం అంటే కూలీలు పెరుగుతారు, మార్కెట్‌లో తగినన్ని ఉద్యోగాలు ఉండవు.శ్రేయోదాయక రాజ్యంలో కూలీలందరికీ తగిన పని ,మెరుగైన జీవితాలు, సామాజిక న్యాయాన్ని కల్పించాలి,మంచి కార్మిక ప్రమాణాలను రూపొందించాలి. 28.5 కోట్ల మంది తమ సామర్థ్యానికి తగిన పని దొరక్క ఉసూరుమంటున్నారు. 50 కోట్ల ప్రపంచ నిరుద్యోగులలో 27 కోట్లమంది 25 సంవత్సరాలలోపు వయస్కులేనట. వీళ్ళు ఉపాధి శిక్షణాకోర్సులలో గానీ, వృత్తివిద్యకోర్సులలో గానీ ఎటువంటి నైపుణ్య శిక్షణ పొందలేదట.60 శాతం కూలీలు రోజుకు రూ.200 లోపు ఆదాయంతో అసంఘటిత రంగంలో ఉన్నారు. 36 కోట్లమంది పేదరికంతో బతుకులీడుస్తున్నారు. ఇక మనదేశ నిరుద్యోగ రేటు 7.5 శాతం.చదువుకున్న యువతలో నిరుద్యోగ రేటు 9 శాతం. గ్రామీణ భారతంలో నిరుద్యోగ రేటు 6.8 శాతం.నిరుద్యోగం గ్రామీణ భారతంలో 66 శాతం. పట్టణ యువతలో చదువుకున్న వారిలో నిరుద్యోగరేటు 37 శాతం. నిరుద్యోగులుగా వున్న గ్రాడ్యుయేట్లు 60శాతం. కోటి విద్యలూ కూటికొరకే అని పెద్దల సామెత.రానురానూ చదువు కున్న నిరుద్యోగులు పెరిగిపోతున్నారు. ఇలాంటి వాళ్ళకు సరైన ఉద్యోగాలు ఎప్పుడు దొరుకుతాయి?అసలు ఇప్పుడున్న నిరుద్యోగులకు ఉద్యోగకల్పనా దిశగా ప్రభుత్వ ప్రణాళికలు ఏమిటి? నీవునేర్పినవిద్యయే నీరజాక్షీ అన్నట్లు నిరుద్యోగులు ఇంగ్లీషులో దబాయిస్తున్నారు. ఈ నిరుద్యోగుల పెరుగుదల సామాజిక అశాంతికి దారితీస్తుందని ఐఎల్‌వో అభిప్రాయపడింది.దేశంలో ఇప్పటికే పౌరసత్వసవరణ చట్టాల వ్యతిరేక ఉద్యమాల వల్ల అశాంతి ఉంది. అగ్గిమీద గుగ్గిలంలా ఈ నిరుద్యోగ సమస్య తోడయ్యింది.దారిద్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలన్నీ తమ దరిద్రాన్నీ,నిరుద్యోగ సంతానాన్నీ , తమ తలరాతగా భావిస్తూ విధాతను తిట్టుకుంటున్నారు. తమ పక్కనే విలాసజీవితాలు గడుపుతున్న కుబేరులను చూసి కుళ్లుకుంటున్నారు. సామాన్య ప్రజలు ఏమీ చేయలేని పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది.పేదలలో ఉపాధి కోసం పరమేశా గంగ విడుము పార్వతి చాలు! లాంటి వేడుకోళ్ళు దేశంలో నలుదిశలా వెల్లువెత్తుతున్నాయి. కాబట్టి ఉన్నవాళ్ళు లేనివాళ్లను చూడాలి.సంపన్న దేశాల దాతృత్వం పెరగాలి.మనదేశంలో కూడా సంపన్నుల దాతృత్వం పెరగాలి. ఇక్కడ సంపాదించి విదేశాలకు పారిపోయినవారి ఆస్తుల్ని ,నల్లధనాన్ని పట్టుకొచ్చి మన పేదలకు పంచాలి.మన నాయకులు అధికారులలో అవినీతి,దుబారా తగ్గాలి.పొదుపు పెరగాలి. స్పందన ,ఇంటికే పెన్ షన్,ఆరోగ్యశ్రీ,మద్యనిషేధం లాంటి పథకాలు పెరగాలి. మీరు ఎక్కువమంది పిల్లల్ని కనండి ఉద్యోగాలు ఇస్తాం లాంటి దొంగవాగ్ధానాలు చెయ్యకుండా , దేశ ప్రజల క్షేమం సౌభాగ్యం కోసం ఇంటికి ఒక్క బిడ్డ చాలు అనే కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ఖచ్చితంగా అమలుచెయ్యాలి.
 నూర్ బాషా రహంతుల్లా ,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్,6301493266

1 కామెంట్‌: