ఈ బ్లాగును సెర్చ్ చేయండి

16, జనవరి 2020, గురువారం

మానవహక్కుల్ని కాపాడాలి


మానవహక్కుల్ని కాపాడాలి (సూర్య 19,22.1.2020)
రాజధానిని అమరావతి నుండి తరలించవద్దని అహింసాయుత ధర్నాలతో పోరాడుతున్న వారిపై పోలీసులు బలప్రయోగం చేస్తున్నారని వారితో చర్చలు జరపాలని మానవ హక్కుల వేదిక డిమాండ్‌ చేసింది.ఇదేసమయంలో జమ్మూకాశ్మీర్ మీడియాకు మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కర్ఫ్యూ విధించకుండా 144 వ సెక్షన్ విచ్చలవిడిగా విధించకూడదనీ తెలిపింది.తెలంగాణ భైంసాలో ఇరువర్గాల ప్రజల్లో హింసాత్మక గొడవలు చెలరేగి అక్కడ 144 సెక్షన్ విధించారు. ఆ గొడవల్లో వీధుల్లో పార్క్ చేసిన వాహనాలు, బైకులు, ఆటోలు,కార్లకు,ఇళ్లకు నిప్పంటించారు. అక్కడున్న ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. డిల్లీ జేఎన్‌యూలో కలహాలను రేపిన గూండాలను,దుండగులను కఠినంగా శిక్షించకపోగా ఫోనులు,ఇంటర్నెట్ ఆపేశారట.ప్రత్యేకహోదా పోరాటం ఎటోపోయింది.ఎటుచూసినా చివరికి అమరావతి గ్రామాల్లో కూడా మానవహక్కుల పోరాటాలే కోర్టులదాకా వెళ్ళాయి. హింసలేని శాంతియుత నిరసనలపై 144 సెక్షన్,పోలీసు కవాతులు ఎందుకని హైకోర్టు ఆగ్రహించింది.దాడుల వార్తలు సుమోటోగా స్వీకరించింది.తప్పుచేసిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలంది.శాంతియుత ఉద్యమాలను అడ్డుకోవద్దు అని హితవు చెప్పింది. ఇళ్లలోకి వెళ్లి ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు , గ్రామాల్లో పోలీసులతో కవాతు ఎందుకు?ఆ గ్రామాల్లో ఏమైనా కర్ఫ్యూ విధించారా? ప్రశాంతంగా నిరసన తెలియజేస్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారు? మహిళల్ని మగ పోలీసులు అరెస్టు చేస్తారా? చట్ట నిబంధనలు ఇలా చేయమని చెబుతున్నాయా? మనం ప్రజాస్వామ్యదేశంలో ఉన్నామనేది మరిచిపోయారా? పౌరులకు నిరసన తెలిపే హక్కు ఉందన్న విషయం గుర్తుందా? నిరసనకారులపై పోలీసులు వ్యవహరించిన తీరు సీఆర్‌పీసీ సెక్షన్‌ 46కు విరుద్ధం అని హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ జేకే మహేశ్వరి బెంచ్‌ వ్యాఖ్యలు చేసింది.
పౌరుల ప్రాథమిక హక్కులను, మానవ హక్కులను పరిరక్షించేందుకు హైకోర్టు ఈ మధ్యంతర ఉత్తర్వులు,మార్గదర్శక సూత్రాలు జారీ చేసింది:
.
జీవనోపాధి నిమిత్తం ప్రజలను వారి వారి ఇళ్ల నుంచి స్వేచ్ఛగా బయట తిరగనివ్వాలి.శాంతియుత నిరసనలకు అనుమతి ఇవ్వాలి.గ్రామ దేవతలకు, ఇతర దేవుళ్లకు తమ తమ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాల ప్రకారం పూజలు చేసుకునేందుకు ప్రజల్ని అనుమతించాలి.సీఆర్‌పీసీ నిర్దేశించిన నిబంధనల మేర తప్ప, గ్రామస్థుల ఇళ్లలోకి వెళ్లి తనిఖీలు చేయరాదు.అరెస్టుల విషయంలో సీఆర్‌పీసీ సెక్షన్‌ 46ను తప్పక పాటించాలి.నిరసనకారులను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్లలో అక్రమంగా నిర్బంధించిన పోలీసులపై విచారణ జరపాలి.గాయపడినట్లు పత్రికలు, టీవీల్లో కనిపించిన వారికి తక్షణమే వైద్యసదుపాయం కల్పించాలి.అరెస్టు చేసిన వ్యక్తులను తక్షణమే సంబంధిత మేజిస్ట్రేట్ల ముందు హాజరుపరచాలి.సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, సీఆర్‌పీసీ సెక్షన్‌ 46 తదితరాలను ఉల్లంఘించిన పోలీసులపై విచారణ జరపాలి. వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి.చట్టాన్ని అమలు చేయని సహచర సిబ్బందిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో అలాగే ప్రభుత్వ చర్యలపై శాంతియుతంగా ప్రజలు నిరసన తెలియజేస్తుంటే 144 సెక్షన్‌ ఎందుకు విధించాల్సి వచ్చిందో ప్రభుత్వం కోర్టుకు వివరణ ఇవ్వాలి.
న్యాయం ఎవరికైనా ఒకటే.ఆంక్షల చట్రంలో నలుగుతున్న జమ్మూ కశ్మీర్‌కు సర్వోన్నత న్యాయస్థానంలో ఉపశమనం దొరికింది. భావప్రకటనా స్వేచ్ఛకు గ్యారెంటీ ఇస్తున్న రాజ్యాంగంలోని 19వ అధికరణ పరిధిని విస్తృతం చేస్తూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వెలువరించిన తీర్పు ఇంటర్నెట్‌ సేవల పునరుద్ధరణకు తోడ్పడింది.జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న 370వ అధికరణాన్ని రద్దు చేసి, రాష్ట్ర ప్రతిపత్తిని మార్చి కేంద్రపాలిత ప్రాంతంగా చేసినప్పుడు అక్కడ అల్లర్లు జరగొచ్చుననే సాకుతో నెలల తరబడి ఇంటర్నెట్, ఫోన్‌ సదుపాయాలను అడ్డుకొన్నారు. మొబైల్‌ సర్వీసుల పునరుద్ధరణ ఇంటర్నెట్‌ పునరుద్ధరణ ఇంతవరకూ పూర్తికాలేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు పర్యవసానంగా ఇంటర్నెట్‌ను నిలిపేసే ప్రభుత్వాల తీరు మారక తప్పదు. ప్రభుత్వాలు ఇంటర్నెట్‌ను ఆపకుండా సుప్రీం అడ్డుపడింది. 2011లో గూగుల్, యాహూ, ఫేస్‌బుక్‌ లను ప్రభుత్వ వడబోత తర్వాతే ఏ సమాచారాన్నయినా, వ్యాఖ్యలనైనా తమ సైట్లలో ఉంచాలని ఆనాటి కేంద్రమంత్రి కోరారు. శాంతి భద్రతల కోసం ఇంటర్నెట్‌ సేవలు ఎక్కడికక్కడ నిలిపేస్తున్నారు. సుప్రీం తీర్పు అలాంటి చర్యలను ప్రశ్నించడానికి పౌరులకు అవకాశం ఇచ్చింది. ఎంతకాలం ఆపుతారన్న స్పష్టత లేకుండా నిరవధికంగా ఈ సేవలను నిలిపేయడం టెలికాం నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. అవసరమా, అనవసరమా అనేదానితో నిమిత్తం లేకుండా 144వ సెక్షన్‌ విధించే తీరును కూడా ధర్మాసనం తప్పుబట్టింది.సహేతుకమైన శాంతియుత నిరసనలను ఎందుకు అణచాలి? చీటికీ మాటికీ 144 సెక్షన్‌ విధిస్తున్నారు. 144 సెక్షన్‌కు సంబంధించిన ఉత్తర్వులను కూడా వారం రోజుల వ్యవధిలో సమీక్షించాలని ఆదేశించారు. అయితే భావప్రకటనా స్వేచ్చను అలుసుగా తీసుకొని ఇంటర్నెట్‌లో దుర్వ్యాఖ్యలు, దుష్ప్రచారాలు, విద్వేషపూరిత రాతలు, వగైరా అంశాలు పెట్టినవాళ్లపై చర్యలు తీసుకొని వాటిని ఆపాలి అదుపు చేయాలి. సహేతుకమైన శాంతియుత అసమ్మతి గొంతు నొక్కకూడదు.
మూకదాడులు,హింసా ప్రవృత్తిని కఠినంగా అణచివేయాలి. కోడిపందాలు,పందుల పందాలు, జల్లికట్టు లాంటివాటికి పండుగలు సంప్రదాయాల పేరుతో రాజకీయనాయకులు సినిమానటులు కూడా వెళ్ళి పాల్గొంటున్నారు.మూగజీవాల ప్రాణాలకూ హక్కులుంటాయని గతంలోనే తీర్పులు ఉన్నప్పటికీ ఎవరూ లెక్కచేయటంలేదు.హింసతో కూడిన ప్రాణాంతకమైన బలులు, సతీసహగమనం లాంటి ఆచారాలను,సంప్రదాయాల్నీ,పనుల్ని సభ్యసమాజం ఏనాడో తిరస్కరించింది.
సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు దేశం మొత్తానికీ వర్తిస్తాయి.అన్ని మతాల పౌరుల ప్రాధమిక హక్కుల్ని కాపాడమనే కోర్టుల న్యాయ సూత్రానికి ప్రజలు జేజేలు పలుకుతున్నారు. ఇస్లాం అంటేనే శాంతి.సహనావవతు
సహనౌభునక్తు అనే ఉపనిషత్తు శ్లోకాల సారం శాంతే. మన ఇద్దరినీ దేవుడు రక్షించు గాక. మనల నిద్ధరిని పోషించు గాక. మన మిద్దరం ఎప్పుడును ద్వేషము లేకుండ ఉండెదము గాక అని. నిన్నువలే నీ పొరుగువాడిని ప్రేమించు లాంటి శాంతి మంత్రాలను ప్రజలు ప్రభుత్వము ఇద్దరూ పాటించాలి.అహింసకు పెట్టనికోటలాంటి మన రాజ్యాంగ సూత్రాలను కాపాడుకుందాం.రాజ్యాంగమే ప్రజలకు రక్ష.
-- నూర్ బాషా రహంతుల్లా,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్,6301493266



1 కామెంట్‌: