ఈ బ్లాగును సెర్చ్ చేయండి

1, ఏప్రిల్ 2020, బుధవారం

అందరికీ కావలసింది అన్నమే! కరోనా దీపాలు తప్పక వెలిగిస్తారు !


అందరికీ కావలసింది అన్నమే! కరోనా దీపాలు తప్పక వెలిగిస్తారు ! (సూర్య 5.4.2020)
లాక్‌డౌన్‌ కోట్లాది వలస కార్మికులకు జీవన్మరణ సమస్యగా పరిణమించింది. పొట్ట పోసుకునేందుకు సొంత ఊళ్లు విడిచి రాష్ట్రాలు దాటుకొని వలస వచ్చిన కార్మికులు లాక్‌డౌన్‌తో ఎక్కడికక్కడ చిక్కుపడ్డారు. ఉన్న చోట ఉపాధి లేక, తిరిగి ఇళ్లకు వెళ్లే దారి లేక నానా అవస్థలూ పడుతున్నారు. రైళ్లు, బస్సుల వంటి ప్రజా రవాణ స్తంభించాయి. నీతి ఆయోగ్‌ సైతం వలస కార్మికులను విస్మరించింది. తిండి తిప్పలు లేవు. సొంత గ్రామాలకు వెళదామంటే రవాణ సౌకర్యాల్లేవు. నగరాల నుంచి వందల కిలోమీటర్లు రహదారుల వెంట కాలి నడకన సాగుతున్న అభాగ్యుల బాధ వర్ణనాతీతం. వలస కూలీల పైనే మహానగరాల మనుగడ. లాక్‌డౌన్‌ వల్ల వారి గూడు చెదిరి, ఎక్కడా పని దొరక్క, ఎటూ కదల్లేక, ఆకలి తీరే దోవ కనబడక, కూడబెట్టుకున్న కొద్దిపాటి సంపాదన హరించుకు పోయి మహానగరాల్లోని వలసజీవులంతా తమ తమ కుటుంబాలతో వేలాదిగా స్వస్థలాలకు కాలి నడకన పయనమవుతున్నారు. కంటైనర్లలో కూర్చుని వేలాది కిలోమీటర్ల ప్రయాణానికి సిద్ధపడుతున్నారు. పోలీసులు రాష్ట్రాల సరిహద్దుల్లో అడ్డుకుంటున్నారు.కొన్ని చోట్ల ప్రయాణికుల్ని నేరస్థుల్లాగా కొడుతున్నారు,వాళ్ళను కూర్చోబెట్టి అంటురోగులపైలాగా బ్లీచింగ్ చల్లుతున్నారు.కూలీల చేరవేతకు డిల్లీ ,ఉత్తరప్రదేశ్, బీహార్,రాజస్తాన్,గుజరాత్ కిక్కిరిసిన బస్సులు నడిపాయి.కరోనాకంటే ముందు ఆకలితో చచ్చేలాఉన్నామంటూ వలసకూలీలు కన్నీటిపర్యంతమౌతున్నారు. ఢిల్లీలో ఉపాధి కోల్పోయిన 20,000 మంది బస్టాండ్‌లో పడ్డ దురవస్థలు పడుతుంటే వీరిని తీసుకుపోవటానికి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతించలేదు.ఢిల్లీ నుండి యూపీకి కాలినడకన బయలుదేరిన ఒక కార్మికుడు 200 కి.మీ. నడిచాక ఆ గ్రామ సమీపంలో ప్రాణాలు వదిలాడు. రాజస్థాన్‌ ప్రభుత్వం తమ కార్మికులను ఉచితంగా బస్సుల్లో తీసుకెళ్తే , ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం భారీ ఛార్జీలు వసూలు చేసింది. కూలీల మీద బరేలీలో పురుగుల మందు స్ప్రే చేసింది. కేరళ ప్రభుత్వం ''అతిథి'' పేరుతో లక్షన్నర మంది వలస కూలీల కోసం ప్రత్యేక పథకం పెట్టి నిధులు కేటాయించింది. వారికి నివాసం, భోజనం, ఆరోగ్య సదుపాయాలు కల్పించడానికి వేలాది రిలీఫ్‌ క్యాంపులు పెట్టింది. 21వేల రైల్వే బోగీలను కేంద్రం కరోనా కూలీల ఆశ్రయాలుగా మార్చింది. గ్రామంలో సరైన ఇళ్ళు లేకపోయినా సొంత ఊరిమీద మమకారం. మావూరికి రావోద్దు అని గ్రామాలలో వేసిన ముళ్ళకంచెలే అడ్డుగా మారాయి.వాటిని అధికారులు తీయించాల్సి వచ్చ్చింది. కూలీలను ప్రధాని క్షమించమంటూ కోరారు. విదేశాల నుండి తీసుకు రావటానికి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం, ఇక్కడ వలస కూలీల పట్ల, కనీస శ్రద్ధ కూడా పెట్టలేదు.సుప్రీంకోర్టు వాస్తవ పరిస్థితిపై తనకు నివేదిక అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.కరోనాపై చాలా మందిలో వున్న భయాందోళనలే పెద్ద సమస్యని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
వీళ్ళంతా సొంత ఊళ్ళకు పోయేది అయినవారితో కలిసి పండగ చేసు కుందామన్న యావతో కాదు. సొంత వూళ్లకు కాలినడకన పోతున్నవారికి కరోనా రాదా? కానీ అంతకన్నా వారికి గత్యంతరం ఏముంది? విదేశీ ప్రయాణాలు చేసిన విద్యావంతులే విమానం దిగి ఇంట్లో దాక్కుంటే పట్టుకోటానికి రెండు వారాలు పట్టింది. మళ్ళీ డిల్లీ నిజాముద్దీన్ తబ్లిక్ జమాత్ కు వెళ్ళివచ్చిన ముస్లిం భక్తుల్ని వెతికి పట్టుకోవాల్సి వచ్చింది.కర్నాటక ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప 3 వేల మందితో బిజెపి ఎమ్మెల్సీ కుమార్తె పెళ్లికి హాజరవటం,కదిరి ఖాద్రీ నరసింహుని రధయాత్రలో కరోనాను లెక్కచేయకుండా వేలాదిమంది భక్తులు పాల్గొనటం, పూనకం వచ్చినవాళ్లలాగా నమాజులో గుమికూడి ఎగరటం, మదరసాలో భోజనానంతరం పళ్ళాలు స్పూనులు నాకటం అనారోగ్యహేతువులే. ఎడమెడంగా ఉండమనీ ఒకేచోట గుమిగూడవద్దనీ అంటువ్యాధిలో మీటింగ్ అందరికీ హానేఅని డాక్టర్లు చెబుతున్నారు . కరోనాకు కనికా అయినా కరీం అయినా ఒకటే.అది సమవర్తి.అందుకే దేవుళ్ళ ఆలయాలు కూడా మూసేశారు.మనకు హానిచేసే క్రిములు చెడ్డగ్రహాలు,వైరస్ లన్నీ భూతాలు.అవి మన జోలికి రాకుండా దేవుని ప్రార్ధించాలి. క్షమాగుణం కలిగి ఉండాలి. ప్రతి మంచి పనికీ మనకు పుణ్యం వస్తుంది అని ఆధ్యాత్మికవేత్తలు బోధిస్తున్నారు.
ఫేడల్‌ కాస్ట్రో, చేగువేరాలు చూపిన పరోపకార బాటలో క్యూబా కరోనాను ఎదుర్కొంటూనే మిగతా దేశాలకు వైద్య సాయం చేస్తోంది. తమపై ఆంక్షలు పెట్టిన ఇటలీకి సైతం సాయం చేస్తున్న దాతృత్వం క్యూబాది. కరోనా వ్యాధిపీడితులతో ఉన్న ఒక బ్రిటిష్‌ నౌకను తన రేవుకు పిలిచి, వైద్యం అందించింది. కరోనా వ్యాపించిన దేశాలన్నింటికీ క్యూబా తమ వైద్య బృందాన్ని పంపుతూ మానవత్వాన్ని చాటుతుంటే, క్యూబా సేవలు వినియోగించుకోవద్దంటూ అమెరికా హూంకరిస్తోంది. అమెరికాతో పాటు, ప్రపంచంలో ఏ దేశం కోరినా తమ శక్తిమేరకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని క్యూబా ప్రకటించడం ఆ దేశ ఔదార్యానికి నిదర్శనం. జర్మనీలో కరోనాకు వ్యాక్సిన్‌ తయారవుతోందన్న విషయం తెలియగానే, దానిని ఇతర దేశాలకు అందుబాటులోకి రాకుండా చేయడానికి అమెరికా ప్రయత్నించింది. 1960లో క్యూబా డాక్టర్లు చిలీ భూకంప బాధితుల కోసం పనిచేశారు. 1980 లో డెంగూ కు వ్యాక్సిన్‌ తయారు చేసి ప్రపంచానికి అందించిందిక్యూబా . ఉద్యోగాలు పోయినా మమ్మల్ని అమెరికాలోనే ఉండనివ్వండి అనికోరుకుంటున్న వేలమంది హెచ్ 1 బి వీసాదారులను వెళ్లిపొమ్మంటోంది అమెరికా. ఇరాక్‌, ఇరాన్‌ లమీద కరోనా సమయంలో కూడా ఆంక్షలను సడలించకుండా అమెరికా బాంబులు వేస్తూనే ఉంది.ఒబామా కేర్ లాంటి ఆరోగ్య సేవలను రద్దు చేసిన ట్రంప్ తనదేశంలో కరోనా రాకుండా కట్టడి చేయలేదు. చైనా వైరస్ , వూహాన్ వైరస్ అంటూ ఎగతాళి చేశాడు.ఇక్కడ మనదేశంలో తబ్లిక్ జమాత్ సమావేశానికి వెల్లివచ్చిన వాళ్ళమీదకు కరోనా వాహకులనే పేరు వెళ్లిపోయింది.ఈ కరోనారోజుల్లో ఏ కష్టమొచ్చినా ఆ కష్టానికి నువ్వే కారణం అని అవతలి మతం వాళ్ళను ఈజీగా అనేస్తారు. కాబట్టి మతస్తులు జాగ్రత్తగా హద్దుల్లో ఉండాలి. సన్నెకల్లు కడగరా సయ్యదాలీ అంటే కడిగినట్టే నాకినా ఖుదా తోడు అన్నాడని ఒక పాత తెలుగు సామెత ఉంది . ఆహారం వృధా చేయకుండా మిగిలిన మెతుకులతో సహా పళ్ళెం శుభ్రంగా నాకటం మంచిదే కానీ అంటువ్యాధుల సమయంలో ఇలాంటి అలవాట్లు ఆపేయాలి. ఎక్కడో కొందరు బోహ్రా సాయిబులు పళ్ళాలు నాకే వీడియో పట్టుకొచ్చి కరోనాను వ్యాప్తి చేయటానికి నాకుతున్నారని పుకారులేపారు.కాబట్టి ఎవరూ ఏ మీటింగులకూ వెళ్లవద్దు. ఎడంగా ఉండాలనే వైద్యుల సలహాతో సామాజిక దూరం పాటించాలి. కరోనా అంటే పని మానేసి ఇంట్లోనే ఖాళీగా కూర్చో అని అర్ధమట. పాపం వలస కూలీలు మాత్రం అన్నమో అని అల్లాడుతున్నారు. ఈ కట్టుబాట్లన్నీ పాటించలేక పోతున్నారు.విప్రో అజీమ్ ప్రేమ్ జీ, లక్ష్మీ మిట్టల్ ,రాహుల్ బజాజ్,రతన్ టాటా లాంటి ఎంతోమంది దాతలు ముందుకొచ్చారు.వలస కూలీలకు ముందు అన్నదానం చెయ్యాలి.
---- నూర్ బాషా రహంతుల్లా , విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్, 630149326

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి