ఈ బ్లాగును సెర్చ్ చేయండి

16, ఏప్రిల్ 2020, గురువారం

లాక్ డౌన్ కాలంలో ఆహార సరఫరా పెంచాలి !

లాక్ డౌన్ కాలంలో ఆహార సరఫరా పెంచాలి !(గీటురాయి 1.5.2020)
కరోనా అంటు రోగానికి అమెరికా 27 వేల ప్రాణాలను పోగొట్టుకొంది. ఆరోగ్యం కన్నా ఆర్థిక వ్యవస్థే ముఖ్యం అన్న ట్రంప్‌ వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా చితికిపోయింది. ఆర్ధికవ్యవస్థ బాగుండాలంటే ప్రజల ఆరోగ్యం బాగుండాలి. చైనా మాస్క్‌లు, వైద్య ఉపకరణాలను అమెరికా హైజాక్‌ చేసి తీసుకుపోయింది.మలేరియా మందు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ను, కరోనా యాంటీ బయాటిక్‌ అజిత్రోమైసిన్‌ మందులను అమెరికాకు ఎగుమతి చేయాలని భారత దేశాన్ని ట్రంప్‌ ఆదేశించి తీసుకెళ్ళాడు. కరోనాతో తీవ్రంగా దెబ్బతిన్న అమెరికా, స్పెయిన్, బ్రిటన్, ఇటలీలు ప్రయివేట్‌ హాస్పిటళ్ళ నెలవు. ట్రంప్‌ అమెరికాలోని మొత్తం ఇన్సూరెన్స్‌ మార్కెట్‌ని ప్రైవేట్‌ కంపెనీల పరం చేశాడు కానీ ప్రైవేటు ఇన్సూరెన్సు కంపెనీలు కరోనా లాంటి వ్యాధులకు ఏమీ చెయ్యవు. బ్రిటన్‌ మాత్రమే లాక్‌ డౌన్‌ లో ఉద్యోగాలు పోయినవారి 80 శాతం వేతనాలను చెల్లిస్తానంది. రోగుల నుండి వచ్చే లాభాల మీదే ప్రైవేటు హాస్పిటళ్ళు నడుస్తాయి. ఈ ప్రైవేట్‌ ఆసుపత్రుల వ్యాపారానికి ఇప్పుడు గండిపడింది. డబ్బులున్న అగ్రదేశం కాబట్టి చెల్లింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌, శ్రీలంక, గాంబియా, అంగోలా, కాంగో, ఘనా, లెబనాన్, కామెరూన్, లావోస్‌ లాంటి పేద దేశాలు డబ్బుల్లేక అల్లాడుతున్నాయి. కరోనా అంతరించేసరికి ప్రపంచ జనాభాలో సగంమంది పేదరికంలో మగ్గుతారట. కరోనా పరీక్ష ఫీజు తగ్గాలి అని కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి కె.సుజాతారావు అన్నారు. చైనా లాగా మనమూ కొత్త ఆసుపత్రులు కట్టాలి. కరోనా నిర్ధారణకు అవసరమైన టెస్టింగ్‌ కిట్లను , సిబ్బందికి అవసరమైన వ్యక్తిగత రక్షణ పరికరాలను (పిపిఇ), రోగులకు అత్యవసరమైన వెంటిలేటర్లను ఏర్పాటు చేయాలి.ఆనాడు ముషీరాబాద్‌ జైలు స్థలంలో కట్టిన గాంధీ ఆప్పత్రి ఈనాడు కరోనా రోగులకు నివారణా కేంద్రంగా పనికొచ్చింది.
130 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ కొంతమేరకు ప్రైవేట్‌ చేతుల్లోకి కూడా వెళ్లింది. ప్రైవేట్‌ ఆసుపత్రులు బాగా పెరిగాయి. జనాభాలోని 55 శాతం మంది పేదలు, కార్మికులకు పేలవంగా ఉంటున్న ప్రభుత్వ ఆసుపత్రులే దిక్కు. కరోనాలో డాక్టర్లంతా యుద్ధసైనికులే.ప్రైవేటు డాక్టర్లు, నర్సులు ప్రస్తుతం ఇంటి దగ్గర కూర్చుంటున్నారు కాబట్టి వీరి సేవలను తీసుకోవాలి.ఎక్కువ వేతనం ఇచ్చైనా సరే. సైన్యం, పోలీసుల్లాగే డాక్టర్లు కూడా జాతీయ రోగనివారణ విధుల్లో పాల్గొనాలి. ప్రపంచంలో ఏ పెద్ద దేశమూ కూడా ఏకంగా నలభైరోజుల లాక్‌డౌన్‌లో లేదు. నాలుగు గంటల ముందస్తు హెచ్చరికతో లాక్‌డౌన్‌ తో ఎక్కడికక్కడే అరెస్టయ్యారు కార్మికులు. బాంద్రా రైల్వేస్టేషన్‌ దగ్గర వేలాదిమంది వలస కార్మికులు గుమిగూదారు.మోడీ సప్తసూత్రాలలో వృద్ధుల సంరక్షణ, పేదలకు చేతనైనంత సాయం, వైద్య సిబ్బందిని గౌరవించడం, యాజమాన్యాలు ఉద్యోగులకు అండగా ఉండటం, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం వంటి సూత్రాలు మంచివే.ఆదాయం లేకపోయినా ఆకలి నివారణ సూత్రాలు కూడా ఉంటే బాగుండేది.మనదేశంలో లాక్డౌన్ ను 3.5.2020 వరకు పొడిగించారు. నగరాల్లోనే వుండిపోతే తమకు ఆకలి చావులు తప్పవన్న భయాందోళనలతో లక్షలమందికార్మికులు,కూలీలు స్వస్థలాలకు నడుచు కుంటూ వెళుతున్నారు. మనిషికి బ్రతకడం ముఖ్యం. నిరుపేద వర్గాలకు ఆహార పదార్థాల సరఫరా నగదు బదిలీ జరగాలి. మందులు ఉత్పత్తి చెయ్యాలంటే లాక్‌డౌన్‌ సడలించాలి కర్మాగారాలు పనిచేయాలి , పండించిన పంటను రైతులు అమ్ముకొనేలా రవాణా మార్గాలు తెరవాలి. పెట్రోలు, గ్యాస్‌ రేట్లు తగ్గించాలి.
దాతలు కోటీశ్వరులు ఇచ్చిన విరాళాలు కలుపుకొని ప్రభుత్వ నిధులతో ప్రజా ఆహారానికి ఎక్కువగా ఖర్చు పెట్టాలి. కరోనాకు మందు లేదు. వ్యాక్సినూ లేదు. జబ్బు నివారణే మార్గం. కార్పొరేట్‌ వ్యాపారులు సెలబ్రెటీలు లాభాపేక్షతో దేశాదేశాన విహరిస్తు వ్యాధులు వ్యాప్తి చేయటం తగ్గాలి.తబ్లిక్ భక్తుల కల్లోలం మరువకముందే మధ్య్రపదేశ్‌ లో పల్లవి జైన్ అనే ఐఏఎస్‌ ఆఫీసర్‌ కుటుంబ సభ్యులకు అంటించి కూడా వైద్యశాలకు పోవడానికి కూడా నిరాకరించారు. నెల్లూరు డాక్టర్‌ లక్ష్మీనారాయణ రెడ్డి విదేశాల నుంచి వచ్చి కరోనాతో మద్రాస్‌ అపోలోలో చనిపోయారు. ముంబయిలో గాయని కనికా కరోనాతోనే విందు ఇచ్చారు. క్యూబా లాంటి చిన్న దేశంలో ఎంతోమంది డాక్టర్లు తయారై ఆరోగ్య అవగాహన పెంచారు.మలేరియా భయంతో మనం ఈనాడు వాడుతున్న దోమల బ్యాట్లు చైనావే. ఆ బ్యాట్లను మనం మానలేము.ఏదేశంలోనైనా మెరుగైన మంచి వైద్యవిధానం వస్తే దాన్ని మనమూ ఆహ్వానించాలి. క్యూబా, చైనాల లాగా మనంకూడా కరోనా రోగులకు ప్లాస్మా వైద్యం చేయించాలి. కరోనా నుంచి కోలుకున్న రోగి రక్తములోని ప్లాస్మాను కరోనా రోగికి ఎక్కిస్తే, ఆ రోగిలో వ్యాధి నిరోధకత ,రోగ విరుగుడు పెరుగుతుందట.ఈ ప్లాస్మా అంటువ్యాధి కారకాలను నిర్వీ ర్యం చేసి రోగిలోని మంచి జన్యువుల్ని కాపాడి, హానికారకమైన జన్యువుల్ని నాశనం చేస్తాయట .
లాక్‌డౌన్‌ వల్ల ఉపాధి కోల్పోయిన వలస కూలీలు, వ్యవసాయ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లకు సాయం అందించాలి . ఈ కార్మికులందరికీ కేరళలో 5 వేల రూపాయలుఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం రూ.500 ఇస్తానంటుంది. ఎవరినీ పని నుంచి తొలగించ వద్దని మోడీ కోరారు. వారి వేతనాల్లో కొంత భాగం ప్రభుత్వం భరిస్తుందని ప్రకటిస్తే యాజమాన్యాలకు బాగుండేది. వలస కార్మికుల ఖర్చు బాధ్యత కేంద్రం కూడా భరించాలి. సాయం జరుగుతుందంటే చప్పట్లు కొడతారు, లైట్లు ఆర్పి దీపాలు వెలిగిస్తారు ఇలాంటి ఖర్చు లేని పనులు ప్రజలు ఎన్నయినా చేస్తారు. కరోనాలో కార్మికుల పని గంటలను 8 నుంచి 12 గంటలకు పెంచారు.ఎక్కువ సేపు పనిచెయ్యాలన్నా , రోగనిరోధక శక్తి కావాలన్నా మళ్ళీ మంచి తిండే కావాలి.అయితే లాక్‌డౌన్‌ తో మనుషులు తినే ఆహారం తగ్గిపోతుంది. ఆహార గిడ్డంగుల్లోని 7.5 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను బయటకు తీసి ప్రజలకు పంచిపెట్టాలి. మళ్లీ రైతుల నుంచి కొత్త పంటను కొనుగోలు చేయాలి. ప్రలందరికీ ఆహారం పెరగాలంటే వ్యవసాయ, ఆక్వా, ఉద్యాన పంటల మార్కెటింగ్, పారిశ్రామిక రంగాలకు లాక్ డౌన్ సడలించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ప్రధానికి మంచి సూచన చేశారు. ఏప్రిల్ 20 తరువాతన్నా ఈ వ్యవసాయ సడలింపులు ఇస్తే మంచిది.
---నూర్ బాషా రహంతుల్లా , విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్ల్టర్ ,6301493266


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి