ఈ బ్లాగును సెర్చ్ చేయండి

9, ఏప్రిల్ 2020, గురువారం

క్రికెట్ ను ఆపండి ! వ్యవసాయాన్ని ఆపకండి !


క్రికెట్ ను ఆపండి ! వ్యవసాయాన్ని ఆపకండి ! 
వ్యవసాయంలో సాయం ఉంది.రైతులు కష్టపడితేనే మనకు అన్నం దొరుకుతుంది.మన దేశంలో అరవై శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డారు. ఆర్థిక మాంద్యానికి కరోనా లాక్ డౌన్ తోడయ్యింది. లాక్ డౌన్ పొడిగించమని రాష్ట్రాల ముఖ్యమంత్రులు.అఖిల పక్ష రాజకీయనేతలు ప్రధానిని కోరినా కేరళ, పంజాబ్‌ మాత్రం దశలవారీ ఉపసంహరించాలనీ, పంటల కోత, దిగుబడుల తరలింపు, మార్కెటింగ్‌ కోసం రవాణా మినహాయింపులివాలని కోరాయి. కేంద్రం మొదట్లో 170 లక్షల కోట్ల రూపాయల కరోనా ప్యాకేజీని పారిశ్రామికవేత్తలకిచ్చింది. తరువాత మధ్య చిన్న తరహా పారిశ్రామిక వేత్తల ఉద్దీపన కోసం 15 వేల
కోట్ల రూపాయలు నిధులు ఇచ్చింది. రైతులకు కిసాన్‌ పథకం కింద 2000 అడ్వాన్స్‌ దొరుకుతుంది.కౌలు రైతులకు అసలేమీ దొరకదు. లాక్‌డౌన్‌ వల్ల రవాణా, మార్కెట్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.పంటలను అమ్ముకోలేని దుస్థితి రైతులకు దాపురించింది.పంట కోయలేక కోసినా అమ్మలేక రైతులు అల్లాడిపోతున్నారు.ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేవు .కనీస మద్దతు ధర లేదు. ధరలు తగ్గి రైతుల ఆదాయాలు దారుణంగా పడిపోయాయి.కరోనాకు తోడు అకాల వర్షాలు, పిడుగులు, వడగళ్ళ బీభత్సం వల్ల పంటలు పొలాల్లోనే పాడైపోయాయి. దళారులు, వ్యాపారులు రైతులకు ధరలు దిగ్గోసి దోపిడీ చేస్తున్నారు. ఆహార ధాన్యాలను రైతుల నుంచి తక్కువకు కొనుగోలు చేసి, అక్రమంగా దాచిపెట్టి, బహిరంగ మార్కెట్‌లో రేట్లు పెంచి ఇష్టారీతిన దోచుకుంటున్నారు. దేశంలో వ్యవసాయం వదిలేస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. సొంతభూమి ఉన్న రైతులు కూడా సేద్యంకన్నా కూలిపని నయం అనుకోని సాగుకు స్వస్తి చెబుతున్నారు. దేశంలో ఏటా సుమారు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలకు పైగా పంట రుణాలిస్తున్నా 42 శాతం కౌలురైతులకు బ్యాంకులేవీ అప్పులివ్వడం లేదు. ఎకరా కౌలుకు కోస్తాలో సగటున రూ.30 వేల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. దీంతో కౌలురైతుకు మిగిలేదేమీ ఉండటం లేదు.రెండో హరిత విప్లవం సాధించాలని డాక్టర్‌ స్వామినాథన్‌ వంటి శాస్త్రవేత్తలు పిలుపు ఇచ్చారు. అన్నదాతలకు ఆర్ధిక ఇబ్బందులు పెరిగాయి కాబట్టి పరిష్కారాలను కూడా సత్వరమే చూపాలి. పంటలను ఎక్కువకాలం నిల్వ చేయలేరు.గిట్టుబాటుధారలిచ్చి ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా పంటలు కొనాలి. ఎఫ్‌సిఐ గోదాముల్లో నిల్వ చేసిన నిత్యావసరాలు ఆహార ధాన్యాలను తక్కువ ధరలకు ప్రజలకు అందించాలి. ఖాళీ అయిన గోదాముల్లో కొత్తగా సేకరించిన పంటలను నిల్వ చేయాలి. ప్రైవేట్‌, కార్పొరేట్ల మార్కెట్‌ వల్ల ధరలు పెరుగుతాయి.చివరికి ఆహార కొరత కూడా రావచ్చు.ఆహార పంటలే కాకుండా కమర్షియల్‌, ఉద్యానవన, డెయిరీ, ఆక్వా ఉత్పత్తులకు ధరలను పెంచాలి. పంటపొలాలకు దగ్గరలో నూర్పిడి కల్లాలు,కోల్డ్ స్టోరేజీలు కల్పించాలి. రైతులు,కౌలురైతులు, వ్యవసాయ కూలీలు అప్పులపాలై ఆత్మహత్యలబాట పడుతున్నారు. రుణమాఫీ అక్కరలేదు.వడ్డీ మాఫీ కావాలి .రైతుకు వ్యవసాయ పెట్టుబడి కావాలి.అవి దొరక్కనే రైతులు చచ్చిపోతున్నారు. అన్నదాతపై అభాండాలువేయటం తగదు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవటం ఒక ఫ్యాషన్ అయిపోయిందని గతంలో ఎంపీ గోపాల్ శెట్టి వ్యాఖ్యానించారు.రైతులు దయ్యాలవల్లే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మధ్యప్రదేశ్ హోమ్ మంత్రి భూపేంద్ర అనుభవపూర్వకంగా చెప్పారు.రైతు ప్రసాదించే తిండి లేకపోతే మనం బ్రతకటం ఎలా? ఆహారం కావాలంటే పంటల ఉత్పత్తి, రవాణా ఏర్పాట్లు చెయ్యాలి. ఆహార కొరత రాకూదదంటే వ్యవసాయం మానకూడదు. సౌకర్యాలనిచ్చి కొనసాగించాలి.
కరోనా దెబ్బకు ప్రపంచం ఆర్ధిక మాంద్యంలో కూరుకుపోయింది.అన్నిరంగాలలో ఉద్యోగాలు పోతున్నాయి.చైనాది పైచేయి అవుతుందేమోనని భయపడి ట్రంప్ న్యూయార్క్ ను షట్ డౌన్ చేయ లేదు.ప్రపంచవ్యాప్తంగా 125 కోట్లమంది శ్రామికుల జీవనోపాధికి ముప్పు ఏర్పడిందని అంతర్జాతీయ కార్మిక సంస్థ వెల్లడించింది.అసంఘటితరంగంలోని 20 కోట్ల ఉద్యోగాలు పోతాయని 40 కోట్లమంది కార్మికులు దుర్భర దారిద్యంలో కూరుకుపోతారని వాపోయింది.ఇండియా వచ్చిన ట్రంప్ సభకు 100 కోట్లు ఖర్చు అయ్యింది. మీ లిబర్టీ విగ్రహం బాగుందని మెూడీ అంటే , మీ పటేల్ విగ్రహం బాగుందని ట్రంప్ పరస్పరం పొగుడు కున్నారు. మోడీ తో 3 వేల కోట్ల రక్షణ పరికరాల కాంట్రాక్టు గురించి మాట్లాడుకున్నాడు గానీ ట్రంప్ మన విద్యార్ధుల ఉపాధి ఉద్యోగాల గురించి మాట్లాడలేదు. పైగా అమెరికాలో స్థిర పడ్డ మనదేశ వీసాదారుల్ని కూడా వెళ్లిపొమ్మంటున్నాడట. వాళ్ళంతా ఉద్యోగాలుపోగొట్టుకొని తిరిగొస్తే మన దేశంలో ఉపాధి కల్పించగలమా? తమకు కావలసిన ఆయిల్ ను ఆరబ్ దేశాలను భయపెట్టి తీసుకున్నట్లే అమెరికా ఇండియానుండి క్లోరోక్వీన్ మందు కావాలంది. అమెరికాకు ఇవ్వకపోతే ప్రతీకారం తీర్చుకుంటామని ట్రంప్ మొదట నోరు జారాడు.మందు అందాక శుభాకాంక్షలు చెప్పాడు. ట్రంప్ తన వైద్య సిబ్బందిపై కూడా రంకెలు వేస్తాడు. కరోనా వినాశంలో కూడా మోడీ లాంటి మిత్రులనూ ప్రతీకారధోరణితో బెదిరిస్తాడు. స్నేహంలో ప్రతీకారాలు ఉండవని రాహుల్ గాంధీ లాంటివాళ్లు అంటున్నా వినడు. ఈమధ్యే వేరే దేశం కోసం చైనా సిద్ధం చేసిన మాస్క్‌లను అమెరికా తన్నుకుపోయిందట.ఈ ఔషధాన్నే ఇంకా 30 దేశాలూ కోరుతున్నాయి. ఇంకెవరికీ ఇవ్వకూడదట.అమెరికాకు కావలసిన హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ అవసరాల్లో 47శాతం మన ఫార్మా కంపెనీలే తీర్చాయి. ఆకాశమూ మాదే , అంతరిక్ష వనరులన్నీ అమెరికావే నంటాడు ట్రంప్. తనకు మాలిన ధర్మాన్ని ఏ దేశమూ చేయలేదు.మోడీ మందుల దౌత్యంతో అమెరికాలో స్థిరపడ్డ భారతీయులు తెగ సంతోషించారట. ట్రంప్ వచ్చినప్పుడు జరిగిన అల్లర్లలో యోగి ఆదిత్యనాథ్‌ ప్రాణాల మీద ఆశ వుంటే ఆందోళనలకు పాల్గొనవద్దని బెదిరించాడు. కానీమోడీ కరోనా అన్నార్తులను ఆదుకొని సాయం చెయ్యమన్నాడు.ఆనాడు కరోనాఅని తెలియకపోయినా పరోపకార బుద్ధితో ఢిల్లీ ప్రజలు, లౌకిక శక్తులు మసీదుల్లో హిందూ కుటుంబాలకు, దేవాలయాల్లో ముస్లిం కుటుంబాలకు రక్షణ కల్పించారు.భారతీయుల జీవితం అల్లర్లు ,బెదిరింపుల మధ్యలోనే బ్రతకడమెలాగో నేర్పింది.కరోనాకు మతం రంగు పులమ వద్దని కొందరు తబ్లిగీలు చేసిన తెలివితక్కువ పనికి అందరు ముస్లింలను నిందించ వద్దని చాలామంది పెద్దలు విజ్నప్తి చేశారు. నిజాముద్దీన్ వెళ్ళి వచ్చిన తబ్లీక్ యాత్రికులను పట్టుకొని నిర్బంధ వైద్యం చెయ్యాలని తోటి ముస్లిం లే కోరారు.వారిని మానవ బాంబులతో పోల్చారు దేవేంద్ర ఫద్నవీస్.మధ్యప్రదేశ్ చీఫ్ సెక్రటరీ పల్లవి జైన్ ఈ రోగాన్ని దాచిందట.ఏ మత భక్తులైనా కరోనా బారిన పడక తప్పదు.షబే బరాత్ ,గుడ్ ఫ్రైడే లన్నీ ఇళ్లలోనే.దేవుడి గుడులన్నీ మూశేసారు.అమెరికా ఈనాడు 16 వేల కరోనా మరణాలతో ప్రపంచదేశాలన్నిటికన్నా ముందుంది కాబట్టి ఏ మతాన్నీ నిందించవద్దు. తనతల్లి చైనా దేశస్తురాలు కావటం వల్ల తనను హాఫ్ కరోనా అని కొందరు జాత్యహంకారపు కారుకూతలు కూస్తున్నారని గుత్తా జ్వాల బాధపడింది. సేవ చేసే వైద్యులపై దాడి చేసే వాళ్ళు,మద్యం అమ్ముతున్న దుర్మార్గుల కంటే బుద్ధిలేని హీనులు.కరోనాపై పోరులో కుల, మత భేదాలకు తావు లేకుండా అందరినీ కలుపుకు పోవాలి.
మామూలుగా ఒక కరోనా రోగి నెలకు 406మందికి అంటిస్తే ,లాక్‌డౌన్‌ కాలంలో ముగ్గురికి మాత్రమే పరిమితమవుతాడట. లాక్ డౌన్ వల్ల వాహనాల రాకపోకలు ఆగిపోయి, కాలుష్య కారక పరిశ్రమలు మూతబడి వాతావరణ కాలుష్యం, నదుల కాలుష్యం తగ్గింది. నగరాలప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చుకున్నారు.పెంపుడు జంతువులకూ మాస్కులు వేశారు.పంటలకు కాయలకు కరోనాలాంటి తెగుళ్లు సోకకుండా కాపాడాలి.
గాడిదలాగా పరుగెత్తావెందుకురా అంటే గుంపులో చేరబట్టి నాబెదురు తీరింది అన్నాడట ఒకడు, నాకడుపు కక్కుర్తి నీకేమితెలుసు అన్నాడట మరొకడు.కాసుల కక్కుర్తితో వాయిదా పడిన ఐపిఎల్‌ మ్యాచ్‌లను నిర్వహిస్తారట. ఒక్క సిరీస్‌ తో ఆ క్రికెట్ సంస్థకు రూ.3,269 కోట్లు వస్తాయట . ఆటలపోటీలకు కరోనా సమయమే దొరికిందా? ఒలింపిక్స్ ను జపాన్ మానుకోండి. రగ్బీ పోటీలను రగ్బీ యూనియన్‌ వాయిదా వేసింది. బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ క్రీడాకారులకు సెలవు ఇచ్చింది. ప్రపంచమంతా కరోనా రక్కసి ధాటికి విలవిలలాడుతున్న వేళ ఆటలాడి సంబరాలు జరుపుకోవాలా? క్రికెట్ ఆట ప్లాణాలను కాపాడలేదని,ఇలాంటి ఆటలపోటీల డబ్బు దేశానికి అక్కరలేదని కపిల్ దేవ్ అన్నాడు.పాకిస్తాన్ కు పదివేల వెంటిలేటర్లు ఇప్పించాలని భారత్ ను అభ్యర్థించాడు అఖ్తర్. విదేశాల నుండి వచ్చే క్రీడాకారుల ద్వారా కూడా కరోనా వ్యాపించ వచ్చు కాబట్టి కరోనా తగ్గేవరకు క్రికెట్ మానుకుందాం. తిండి మానలేముకదా ? ప్రజలకు ఎప్పుడూ కావలసింది తిండి.అందువలన వ్యవసాయానికి లాక్ డౌన్ సడలించి ప్రజలకు ఆహార సరుకుల రవాణా పెంచాలి!
--- నూర్ బాషా రహంతుల్లా, విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ , 6301493266

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి