ఈ బ్లాగును సెర్చ్ చేయండి

20, ఏప్రిల్ 2020, సోమవారం

సుఖ మరణమే స్వర్గం


సుఖ మరణమే పెద్ద స్వర్గం (సూర్య 26.4.2020)
కరోనా మరణం ఎంత బాధాకరంగా ఉంటుందో నెట్లో వీడియో లలో చూశాం. ఎగఊపిరితో శ్వాస ఆడక హృదయ విదారకంగా చనిపోతున్నారు.ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు లక్షలమంది ప్రజలుకొన్ని నెలల్లోనే చనిపోయారు.అమెరికాలోనే 53 వేలమంది ప్రాణాలు వదిలారు. ఇన్ని వ్యాధులకు మందులు కనుక్కున్న శాస్త్రవేత్తలు,వైద్యులు సుఖంగా యాతనలేకుండా చనిపోయే మందు ఇంతవరకు కనుక్కోలేదు.అసలు సుఖ మరణం అనే ప్రస్తావనే ఎవరూ తేవడంలేదు.రోగులు లోపల్లోపలే బోలెడంత ఆవేదన చెందుతుంటారు.బాధలు తగ్గినప్పుడు రోగులు చురుకుగా ఉంటారు. సుఖంగా బ్రతకడం ఎంత అవసరమో సుఖంగా చనిపోవటం కూడా అంత అవసరం అనిపిస్తోంది.
నిర్ణీత కాలానికి మన ప్రాణాలు దేవుని పర్మిషన్ తోనే పోతాయి.మన అనుమతి లేకుండానే పోతాయి.చావు జీవులకు తప్పదు అని అన్నిమతాల బోధ.కరోనామరణంఎన్నో ఆలోచనలు రేపింది.మరణం ద్వారా సృష్టికర్త ఎలా న్యాయం చేస్తాడు? ఏమి మేళ్ళు ఇస్తాడు?శివుని ఆజ్ఞ లేకపోతే నీవు చావలేవు తమ్ముడూ అని నాగభూషణం ఎన్టీఆర్ తో అంటాడు ఒక సినిమాలో. మతగ్రంధాలన్నీ ఇదే మాట . చనిపోయాక స్వర్గం వస్తుందని అందులో నానారకాల పండ్లు తింటామని , మోక్షంలో ఎన్నో భోగాలు ఉంటాయని అవి దొరకాలంటే నీ కర్మల మోత తగ్గించుకోవాలని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు.ఒకని జన్మదినం కంటే మరణ దినమే మేలు అన్నాడు ప్రసంగి.మరణం ఎలాగ మేలా అని మొన్న నాజన్మదినం రోజున ఆలోచించాను మిత్రులందరినీ ఆలోచనలో దింపాను.శుభమా అని పుట్టినరోజునాడు ఈ చావు ఆలోచన అవసరమా అని కొందరు వెనుదిరిగారు.ఏమైనా చివరికి చావుతప్పదుకదా అని కొందరు విజ్నులు ధీరులు మాత్రం చర్చలో నిలబడ్డారు.చెడ్డవాడు చనిపోతే పీడ విరగడ అయ్యిందని మేలుగా భావిస్తారని భావించిన మిత్రుడు మంచివాడు చనిపోతేనో అంటే మేలు ఏంటో చెప్పలేకపోయాడు. మదర్ తేరీసా లాగా మంచివాడు తన మరణ దినం వలన పదిమందికి తెలుస్తాడ ని మరో మిత్రుడు సూత్రీకరించాడు.ఎప్పటికైనా తప్పని మరణదినం గురించి శోకం మనకు లేదు. అది మేలైనది ఎలాగో ఇప్పుడే తెలుసుకుంటే మేలు కదా?అనే చర్చ సాగించాం. చనిపోయిన తర్వాత చాలా పొడవైన జీవితం చాలా దుర్భరంగా ఉంటుందట.బ్రతికి ఉన్నప్పుడే పుణ్యం చేసుకుని పాపం హరించుకొమ్మని,చనిపోయిన తర్వాత ఏ అవకాశం కూడా లభించదని జీవితం మృత్యువు కంటే చాలా విలువైంది కాబట్టి పుణ్యం సంపాదించడానికి ఇంకా జీవిత కాలం పోడిగించమని అల్లాహ్ ను వేడుకోవాలని మరో మిత్రుడు సలహా ఇచ్చాడు. చనిపోయినవారు మంచివాళ్ళని జనం పొగిడినా అన్నీ తెలిసిన దేవుడు సిఫారసుగా అంగీకరించడట.పుణ్యస్థితిలో దేవుని కి విధేయుడు గా ఉన్న సమయంలో చనిపోతే స్వర్గం లభిస్తుంది.అంతకన్నా ఎక్కువగా అల్లాహ్ దర్శన భాగ్యం కలగడం కన్నా మేలు ఇంకేం కావాలి అని ఎదురు అడిగాడు. మళ్ళీ దైవదర్శనం కోసం ఆత్మహత్య చేసుకుంటే పాపం కాబట్టి నరకం వస్తుందట. అయితే చివరికి స్వర్గంలో మేళ్ళు ఏమిటో విడిగా చెప్పలేకపోయాడు.ఇప్పుడు మనము అనుభవించే కష్టాలే నరకం, అనుభవించే సుఖాలే స్వర్గమని కొందరు తేల్చారు.మోక్షం ద్వారానే మేలు జరుగుతుందన్నారు.
కర్మ ప్రకారమే మేలు లభిస్తుంది గానీ కోరితే ఏది లభించదు.దైవము శరీరములో కార్యకర్తగా ఉండి ఎవరి కర్మ ప్రకారము వారిని నడిపిస్తుంది . శరీరములో జీవుడవై నువ్వు చేయని పని నేనే చేస్తున్నాను అని అనకూడదని మరో మిత్రుని సలహా. జననం ధర్మమనీ మరణం కర్మమనీ, తెలిసినా జనన మరణ చక్రమాగదు,పువ్వులు లలితమని తాకితే రాలునని ,తెలిసినా పెనుగాలి రాక ఆగదు,మరణం తధ్యమనీ ఏ జీవికి తప్పదనీ,తెలిసినాఈ మనిషి తపన ఆగదు,ఈ బ్రతుకు తపన ఆగదు అని దాసరి నారాయణరావు గారి పాట గుర్తుకొచ్చింది. ఒకామె ఒంటరిగా తన తండ్రికి అంత్యక్రియలు చేసింది.అప్పుడు పది మాసాలు మోశావు పిల్లలను,బ్రతుకంతా మోశావు బాధలను,ఇన్ని మోసిన నిన్ను,మోసే వాళ్ళు లేక వెళుతున్నావు అనే ఆత్రేయ గారి పాట మదిలో మేదిలింది. కరోనాభయంతో విసిరిపారేసిన వృధా కోడిగుడ్ల గుట్ట లోంచి ఎవరికీ అక్కరలేని జీవులుగా వేలాది కోడిపిల్లలు ఆశర్యకరంగా పుట్టాయి. జీవోత్పత్తి ఆగలేదు మరణము ఆగదు.అయ్యో కోడిపిల్లలది తాత్కాలిక జన్మేనా?వీటికి గింజలువేసి నీళ్లుపోసి కాపాడేదెవరు? అని బాధ పడ్డాము.ఆ చిట్టి జీవుల వీడియో నిజం కాదని మనిషి కూడా భాధాకరంగా చనిపోతున్నాడనీ మరో మిత్రుడు బాధ పడ్డాడు. కరోనా లాంటి బాధాకరమైన మరణాన్ని ఎవరుకోరుకుంటారు? మనజన్మా ఇంతేనా? అని ఆలోచనలు కలిగాయి.మేలంటే అనాయాస మరణమేననీ , మోక్షం లో దొరికే మేలు రంభ ఊర్వశి లాంటి స్వర్గ కన్యల పొందు కాదని , జన్మరాహిత్యమేనని,మళ్ళీ పుట్టకపోవటమే పెద్దమేలని మోక్షమని ఒప్పుకున్నారు.ఆకలి దప్పులు రోగాలు ఉండకపోవడమే పెద్దమేలు అన్నారు. సుఖ మరణమే పెద్ద స్వర్గం అని తేల్చారు.బాధే సౌఖ్యమనే భావన రానివ్వటం దేవదాసు లక్షణం.కానీ ఈనాడు నొప్పి లేని మరణాన్ని చాలామంది కోరుకుంటున్నారు.
సుఖ మరణాన్ని ప్రసాదించే పాలియేటివ్ కేర్ లాంటి వైద్యం మరింత వృద్ధి చెందాలి.చౌకగా దొరికాలి.మరణయాతన చెందుతున్న ముసలివారికి ,రోగులకు సుఖమరణాలను కలుగనివ్వాలి. అమ్మను బాధతో పంపిస్తే నాన్నను రోగబాధ తేలియకుండా హాయిగా ఉంచేసింది ఈ పాలియేటివ్ కేర్ వైద్యం అన్నాడు అక్కినేని నాగార్జున.క్యాన్సర్ ఒక్కటే కాకుండా నయమయ్యే అవకాశం లేని అల్జీమర్స్‌ , కిడ్నీ ,లివర్‌ లాంటి ఏ రోగంతోనైనా మరణ శయ్యపై ఉన్నవారికి నొప్పిని ఒత్తిడిని నివారించే ఈ వైద్య విదానాలకు భారీగా నిధులు కేటాయించాలి.
-- నూర్ బాషా రహంతుల్లా ,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి