ఈ బ్లాగును సెర్చ్ చేయండి

11, సెప్టెంబర్ 2020, శుక్రవారం

పెళ్లి వయస్సు పెంచితే నిరుద్యోగం ఆగుతుందా ?

పెళ్లి వయస్సు పెంచితే నిరుద్యోగం ఆగుతుందా ? (గీటురాయి 11.9.2020) పేదరికాన్ని ఆకలిని యుద్ధాలను నిరుద్యోగాన్ని ఆపటానికి ప్రసూతి మరణాల రేటు తగ్గించటానికి ఆడపిల్లల పెళ్లి వయస్సు పెంచాలని సుప్రీంకోర్టు 2017లోనే సూచించింది. ప్రస్తుతం యువతుల వివాహ వయసు 18 ఏళ్లు , యువకులకు 21 ఏళ్లు. ప్రసూతి మరణాలు తగ్గాలని ఐక్యరాజ్య సమితి లక్ష్యం. ఆడపిల్లలు డిగ్రీలో చేరేనాటికి పెళ్లి చేయటంవల్ల చదువు మానేస్తున్నారు కాబట్టి వారి వివాహ వయసు పెంచాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కోరింది.మగపిల్లల వయసును 18 ఏళ్లకు కుదిస్తే జనాభా నియంత్రణ లోకి రాదని హెచ్చరించింది. కానీ ఆడపిల్లలు 21 ఏళ్ల వయసులోపే లైంగికంగా చురుగ్గా వుంటారని , వారి వివాహ వయసు పెంచితే బాల్య వివాహాలు పెరుగుతాయని ఆరోగ్యమంత్రిత్వ శాఖ వాదించింది. అయితే 20 ఏళ్లు దాటాకే ఆడపిల్ల శరీరం గర్భధారణకు అన్నివిధాలా అనువుగా వుంటుందని,పద్దెనిమిదేళ్లకే పెళ్లయితే ఆడపిల్ల కుటుంబ ఒత్తిళ్లను తట్టుకోలేదని . చిన్న వయస్సులో గర్భం ధరించడం వల్ల ఆమె ఆరోగ్యం దెబ్బతింటుందని , ప్రసవ మరణాలకు చిన్నవయసులో గర్భాలే కారణమని . ఆడపిల్ల ఇష్టాయిష్టాలను కూడా గమనించి మంచి చదువు చదివించాలని . ఆమె విద్యాధికు రాలయ్యేలా ప్రోత్సహించాలని వైద్యులు అన్నారు. జ్యోతిరావు ఫూలే, సావిత్రీబాయ్‌ ఫూలే దంపతులు ఆడపిల్లల్ని కూడా మగపిల్లలతో సమానంగా చదివించాలని 170 ఏళ్లనాడే కోరినా ఎంతోమంది ఆడ పిల్లల్ని చదివించటంలేదు.మగపిల్లల్లో అక్షరాస్యత 75 శాతమైతే ఆడపిల్లల్లో అక్షరాస్యత 54 శాతం మాత్రమే. ఆడపిల్లల్ని చదివిస్తే జీడీపీ గణనీయంగా పెరుగుతుంది. డిగ్రీ విద్య నాలుగేళ్లకు పెంచినట్లు ఆడపిల్లల వివాహ వయసు కూడా పెంచాలి. ఆడపిల్లలకు సరైన పోషకాహారం అందాలి. వారి విద్యకు ఆర్థికంగా తోడ్పడాలి. ఆడ పిల్లలు బాగా చదువుకోవడానికి, ప్రతి విద్యాసంస్థలోనూ మంచి టాయిలెట్లు కట్టాలి. పేదరికం వల్ల రక్తహీనత పౌష్టికాహారం పొందలేని గర్భిణీల శాతమూ ఎక్కువగా ఉంది. బాల్యవివాహాల వల్ల ప్రసూతి, శిశుమరణాలు, రక్తహీనత వంటివి సంభవిస్తున్నాయి . జమ్ము, కాశ్శీర్‌, మిజోరాం, మణిపూర్‌, గోవా, కేరళ రాష్ట్రాలలో సగటు వివాహ వయస్సు మహిళలలో 25 సంవత్సరాలు. యు.పి లో 18 సంవత్సరాలు. ఫీజుల రూపంలో బోలెడు చెల్లించి కష్టపడి చదివి పట్టా తెచ్చుకున్న తరువాత నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు దొరకటంలేదు.కన్నవాళ్లకు భారం కాకూడదని ప్రైవేటు సంస్థల్లో చేరితే అత్తెసరు జీతం.దేశంలో 3 కోట్లమంది వరకూ నిరుద్యోగులు ఏటా పరీక్షలు రాస్తారు. వీళ్ళంతా ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వేర్వేరు ఉద్యోగాలకు విడిగా దరఖాస్తు చేసుకోవడం, శిక్షణ తీసుకోవడం, దూరప్రాంతాలకు పరీక్ష రాసేందుకు పోవడం తప్పడం లేదు. ప్రతి ఉద్యోగానికీ రుసుము చెల్లించడం దరఖాస్తుల కే వందలాది రూపాయలు ఖర్చుపెట్టవలసి వస్తోంది. గజిటెడ్,స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌, రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు , బ్యాంకింగ్‌ , నాన్‌–గెజిటెడ్‌ పోస్టులన్నిటికీ కలిపి ఉమ్మడి అర్హత పరీక్ష పెడితే ఖర్చు తగ్గుతుంది.ఈ పరీక్ష నిర్వహణ కోసం జాతీయ రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీ(ఎన్‌ఆర్‌ఏ) సంస్థ ఏర్పాటు కావాలి.ఇందులో వచ్చే స్కోరు మూడేళ్లపాటు చెల్లుబాటు అవుతుంది.జిల్లాకొక పరీక్షా కేంద్రం ఏర్పాటు చేస్తారు. పూర్వం పదో తరగతి పాసైన నిరుద్యోగులు ఉపాధి కల్పనా కేంద్రాలలో పేర్లు నమోదు చేయించుకునేవారు. విద్యార్హతలు పెరుగుతున్నకొద్దీ వాటిని అదనంగా చేర్పించుకునేవారు. జీవితంలో ఒక్కసారి కూడా కాల్ లెటర్ రాకపోవడం చాలామందికి అనుభవమే. ఉపాధి కల్పన శాఖ ద్వారా నోటిఫికేషన్‌ ఇచ్చాకే ప్రభుత్వోద్యో గాలను భర్తీ చేయాలన్న నిబంధనను సుప్రీంకోర్టు గతంలో కొట్టేసింది. అందువలన ఉపాధి కల్పనా కేంద్రాలపై నిరుద్యోగులు ఆశలు వాదులుకున్నారు. 1978లో నాకు ఎంప్లాయ్ మెంట్ ఎక్స్ఛేంజీ ద్వారా ఎల్.డీ.సీ.పోస్టు కోసం ఇంటర్వ్యూకార్డు వచ్చింది. అదే చివరి సంవత్సరమట.తరువాత ప్రస్థానానికి ఆ ఉద్యోగమే నాకు ఆర్ధిక ఆసరా అయ్యింది.ఉద్యోగం వచ్చింది కాబట్టి వివాహమూ అయ్యింది.ఇద్దరు పిల్లలు చదువుకున్నారు.అందువలన ఉపాధి కల్పనా కేంద్రాలద్వారా చిన్న చిన్న ఉద్యోగాలు రావాలి.ఉద్యోగాలు రాకపోతే ఎక్స్ఛేంజీలలో నమోదవుతున్న నిరుద్యోగుల సంఖ్య వెక్కిరిస్తూఉంటుంది.చదువుకున్నవారిలో నిరుద్యోగం 18 శాతానికి చేరుకుంది.చదువు పెరిగేకొద్దీ నిరుద్యోగం ఎక్కువవుటోంది.ప్రభుత్వ విభాగాల్లో నియామకాలు నానాటికీ తగ్గిపోతున్నాయి . రిటైరవుతున్నవారి ప్రభుత్వ ఉద్యోగుల స్థానాలను ఎప్పటికప్పుడు భర్తీ చేయడంలేదు.కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ నియామకాలు మాత్రమే చేస్తున్నారు. ఉద్యోగం ఉన్నా జీవితంలో ఎప్పుడు స్థిరపడతారో తెలియదు. ప్రభుత్వోద్యోగులకు వేతన సవరణలు , జీతాల పెంపు వుంటుంది. రిటైరయ్యాక పెన్షన్‌ వుంటుంది.కంట్రిబ్యూటరీ పెన్షన్ వద్దు పాత పద్ధతిలో రెగ్యులర్ పెన్షన్ ఇవ్వండి అని కోరుతున్న వారికి ఉద్యోగ సంఘాలు మద్దతిస్తున్నాయి. ప్రైవేటు ఉద్యో గాల్లో ఇవన్నీ లేవు.చాలా తేడా.దేశ జనాభాలో 35 శాతం యువకులే ఉన్నారు. రాష్ట్రంలో కరోనా మరణాలు నాలుగు వేలు దాటాయి. దేశంలో 66 వేలు దాటాయి.రైతులు ఎంతోమంది ప్రాణాలు తీసుకున్నారు. కష్టజీవుల ఆత్మహత్యలు ఏటికేడు పెరిగిపోతున్నాయి. జీవించే హక్కు మానవ హక్కు అని సుప్రీంకోర్టు తేల్చింది. సంపదను సృష్టించేది శ్రమజీవులే . నవ రత్నాలు ఉచిత విద్యుత్‌ లాంటి సంక్షేమ పథకాల గురించి పేదలు ఆశిస్తున్నారు. కార్పొరేట్లకు సంపద బదిలీ సాగుతోంది . పేదరికం మాత్రం తగ్గడంలేదు.1957 లోనే శ్రామికునికి కనీసవేతనం ఎంత ఇవ్వాలో సుప్రీం కోర్టు తీర్పుల్లో తెలియజేసింది. కనీసవేతనాల చట్టాల ప్రకారం కార్మికులకు యజమాని చెల్లించవలసిన వేతనాన్ని చెల్లించేలా చట్టాలు కూడా చేశారు. ప్రపంచ దేశాల్లో సంభవిస్తున్న మరణాల్లో దాదాపు సగం ఈ దేశాల్లోనే జరుగుతున్నాయి.గర్భధారణ సమయంలో మహిళలకు అవసరమైన పోషకాలు దొరకాలంటే ఉపాధి ఉండాలి. ఆరోగ్య ఉప కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలి.ప్రసవాల కోసం నేటికీ మంత్ర సానులను ఆశ్రయిస్తున్నారు. ప్రజాసంక్షేమము,కార్పొరేట్ల సంక్షేమము, ప్రభుత్వానికి ఎదురౌతున్న రెండు పరస్పర విరుద్ధ అంశాలు. మంచుపొగలు ముసిరితే సూర్యోదయమాగునా? మనసుపొరలు కమ్మితే అసలు నిజం దాగునా? ఆ కిరణాలుదయిస్తే , ఆ నిజమే ఋజువైతే కమ్ముకున్న తెరలన్నీ కరిగిపోక ఆగునా ? అని 1973 లో డబ్బుకులోకం దాసోహం లో సినారె గారు అన్నట్లు పెళ్లి వయస్సు పెంచితే నిరుద్యోగం తగ్గుతుందా ? --- నూర్ బాషా రహంతుల్లా,రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ ,6301493266

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి