ఈ బ్లాగును సెర్చ్ చేయండి

5, సెప్టెంబర్ 2020, శనివారం

కొన్నాళ్లు స్కూళ్ళు తెరవద్దు

 


కొన్నాళ్లు స్కూళ్ళు తెరవద్దు (సూర్య 30.8.2020)
మతములన్నియు మాసిపోవును, జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును అన్నాడు గురజాడ. పాఠశాల విద్య రాజ్యాంగ హక్కు. విద్య శాస్త్రీయతను ,ఆలోచనా శక్తిని వికసింపజేస్తుంది.పిల్లల మేధో వికాసానికి స్కూళ్ళు తప్పనిసరిగా కావాలి. కానీ జ్నానబోధ చేసే పాఠశాలలన్నీ కరోనా కాలంలో మూతబడినందువల్ల దేశవ్యాప్తంగా 25 కోట్లమంది పిల్లలు చదువులకు దూరమయ్యారు.పిల్లలు బడిలో గుంపుగా కూర్చోనే పద్ధతి ఇప్పుడు భయంకరంగా మారింది.మాతృభాషలలో ప్రాధమిక విద్య బోధించాలన్న కేంద్ర నిర్ణయం మంచిదే.అంగన్ వాడీలను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చటమూ,పిల్లల పూర్తి ఫీజు రీ ఇంబర్స్ చేయటము మంచి పనులే.5 ఏళ్ళ లోపు పిల్లలను బరువు ఎత్తు చూడటానికి కూడా తల్లిదండ్రులు అంగనవాడీలకు పంపటంలేదట.అందువలన పిల్లలకు బాలామృతం చిక్కీలు పాలు లాంటిపోషకాహారాలు ఇళ్లకే సరఫరా చేశారు.ఇప్పుడు చిన్నపిల్లలకు బడి ఎలా?
కరోనాకు వాక్సిన్‌ వచ్చేదాకా ప్లాస్మానే మందు.భక్తులు గుమిగూడకుండా గుడులు కూడా మోసేశారు.పండుగల ఉత్సవాలు లేవు.కళ్యాణ మండపాలు బంద్ అయ్యాయి.సమస్యలెన్నివున్నా జీవనం సాగుతూ వుండాల్సిందేనని ప్రవేశ పరీక్షలు నిర్వహిం చాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.విద్యార్థుల కెరీర్‌ అయోమయంలో పడుతుందన్న కారణంతో ప్రవేశ పరీక్షలు యధావిధిగా జరపాలంటున్నారు. పరీక్షా కేంద్రాల అధికారులు ఈ పరీక్షల్ని పకడ్బందీ జాగ్రత్తలు తీసుకుని జరుపుతామంటున్నారు.కరోనా లక్షణాలున్న అభ్యర్థుల్ని అనుమతించరు. లక్షణాలు కనబడనివారి సంగతేమిటి ?ఇలాంటివారివల్ల వ్యాధి వ్యాపించదా? లాక్‌డౌన్‌ వల్ల అనేకచోట్ల సరైన రవాణా సదుపాయాలు లేవు. హోటళ్లు ఇంకా తెరుచుకోలేదు. కరోనాకు చిక్కకుండా అందరూ సురక్షితంగా ఇళ్లకు స్వస్థలాలకు చేరతారన్న గ్యారెంటీ లేదు. ఈ పరి స్థితుల్లో విలువైన విద్యా సంవత్సరం వృథాగా పోతుందన్న ఆత్రుతలో పిల్లల ఆరోగ్యాన్ని విస్మ రించడం మంచిదికాదు. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉన్న బంధం అలాంటిది.కరోనా దెబ్బకు మనిషికీ మనిషికీ మధ్య భౌతికదూరం తప్పనిసరయింది.ఇంటివాళ్లే దూరం జరిగే పరిస్థితి. కరోనా ప్రాణాలతో పాటు కుటుంబంలోని అనుబంధాలను, రక్తపాశాలను కూడా మింగేస్తోంది.తల్లి తండ్రి తాత చనిపోయినా అయినవారే దగ్గరకు వెళ్లడానికి కూడా భయపడే పరిస్థితి వచ్చింది. చనిపోయినవారిని జెసిబిలతో ఎత్తిపడేస్తున్నారు.కరోనా కఠోరమైనదైనా బంధాలు అంతకంటే దృఢమైనవి.
పేదరిక నిర్మూలన పధకాలు ఎన్నో సాగాయి కానీ పేదలు ఇంకా తగ్గలేదు.పేదలు అతి కష్టంపై జీవనం సాగిస్తున్నారు. ఎక్కడా పని దొరకని పరిస్థితి నెలకొంది. పేదల బతుకులు చిధ్రమైపోయాయి.ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమేఉంది.కరోనా కష్టకాలంలో ఆదాయాలు తగ్గిపోయి 55 శాతం మంది ప్రజలు ముప్పూటలా తిండికి నోచుకోక అరకొర భోజనం తోనే సరిపుచ్చుకుంటూ పౌష్టికాహారానికి దూరమయ్యారు. జాతీయ ఆహార భద్రత చట్ట ప్రకారం మధ్యాహ్న భోజన పథకం, అంగన్‌వాడీ, పౌర పంపిణీ పథకాలకు ఆహారధాన్యాలు అందాలి.గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు, బియ్యము,గోధుమలు తృణ ధాన్యాలు ఉచితంగా ఇచ్చి వారి పిల్లల ఆకలి తీర్చాలి. కరోనా కాలంలో పేదరికం బాగా పెరిగిపోయింది.2 అమెరికన్‌ డాలర్లతో అమెరికాలో వచ్చేన్ని సరుకులు కొనగల వాళ్ళు పేదరికంలో లేనట్టేనని ప్రపంచ బ్యాంకు నిర్ధారించింది .2 డాలర్ల తక్కువ ఆదాయంతో అమెరికాలో మనుషులు బ్రతకగలరని ప్రపంచ బ్యాంకు లెక్క. రోజుకు 2700 క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని పొందగలిగితే ఒక వ్యక్తి పేదరిక స్థాయికంటే ఎగువన ఉన్నట్టు లెక్క. కనీస పోషక విలువలున్న ఆహారం ఖరీదు రోజుకు కనీసం 5 డాలర్లు ఉంటుంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫీజులు కట్టలేక అంత ఖరీదైన వైద్యం చేయించలేక వేలమంది రోగులు ఆగిపోతున్నారు. పేదలకు ప్రభుత్వ వైద్య శాలలే దిక్కు.
కేసీఆర్ చెప్పినట్లు బలుసాకు తినైనా బ్రతకాలనే ప్రజలు అనుకుంటున్నారు.సినిమాహాళ్ళు తెరిచినా ఇకమీదట జనం గుంపులుగా వెళ్లకపోవచ్చు అని సామాజిక కార్యకర్తలు భావించారు.కానీ క్యూలలో నిలబడి గొడుగులు వేసుకొని మరీ కరోనాలో మద్యం కొనుగోలు దిగ్విజయం చేసిన తాగుబోతులను చూశాక దేని జనం దానికి ఉంటారని తీర్మానించుకొన్నారు.చికెను,చేపలు,మాంసము కోట్ల దగ్గర గుమిగూడిన జనాన్ని విలేఖరులు కారణం అడిగితే కరోనా ను గెలవాలంటే రోగనిరోధక శక్తి బాగా పెరగాలనే ఇలాఎగబడుతున్నాము అన్నారట.మరోపక్క కొందరు ప్రైవేటు పాఠశాలల టీచర్లు ఉపాధికోల్పోయి ఏదో ఒక దుకాణం పెట్టుకొని జీవనం నెట్టుకొస్తున్నారు.కరోనా బారినపడి ప్రముఖులు చాలామంది చనిపోయారు.కొంతమంది ఇళ్లలోనే ఏకాంతవాసంచేసి బయటపడ్డారు.పరిస్తితి అందరికీ ఆందోళనకరంగానే ఉంది.
కొందరు ప్రైవేటు విద్యాసంస్థల వాళ్ళు మాత్రం ఆన్‌లైన్‌ విద్యా బోధన, పరీక్షలు మొదలుపెట్టారు. ఢిల్లీ యూనివర్సిటీ కూడా ఓపెన్‌ బుక్‌ పరీక్షా విధానాన్ని ప్రకటించింది.కేరళ ప్రభుత్వం విద్యార్థులకు స్మార్ట్‌ ఫోన్‌/ ల్యాప్‌టాప్‌/ ట్యాబ్‌ సమకూర్చి దూర విద్య ద్వారా పదో తరగతి పరీక్షలు నిర్వహించింది. కానీ దేశంలో 36 శాతం మందికి మాత్రమే ఇంటర్నెట్‌ కనెక్టివిటీ ఉంది కాబట్టి ఖరీదైన ఫీజులతో పిల్లలందరికీ ఆన్ లైన్ విద్య కష్టమే. మెజార్టీ విద్యార్థులు ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరు కాలేరు.పరీక్షలు రాయలేరు.విద్యా సంస్థల ఫీజులపై నియంత్రణలు ఉండాలి. విద్యను వ్యాపారం కానీయకూడదు.5వ తరగతి వరకు తేలికైన పిల్లల అమ్మ భాష లో పాఠ్యపుస్తకాలు తయారు చేసి పిల్లలకు పాఠాలు చెప్పాలి. ఏమి చేసినా కరోనా వాతావరణంలో పిల్లల్ని బడికి పంపాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు.ప్రభుత్వాలకు ఏమిచెయ్యాలో ఎలా చెయ్యాలో పాలుపోవటంలేదు.నిపుణులుకూడా మార్గాలు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే చిన్నపిల్లల్లో కరోనా ఇన్ ఫెక్షన్ లక్షణాలు కనపడకపోయినా రోగుల్లో కంటే వైరస్ ఎక్కువగా ఉంటున్నదట .కాబట్టి టీకా వచ్చి కరోనా అదుపులోకి వచ్చేదాకా పిల్లలైనా పెద్దలైనా గుంపులు కూడటంతగదు.ప్రస్తుతానికి పిల్లల క్షేమంకోసం స్కూళ్ళు తెరవటం మంచిది కాదు.
--నూర్ బాషా రహంతుల్లా ,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ ,6301493266


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి