ఈ బ్లాగును సెర్చ్ చేయండి

17, సెప్టెంబర్ 2020, గురువారం

అప్పులు భవిష్యత్తులో ముప్పులే

అప్పులు భవిష్యత్తులో ముప్పులే  (సూర్య 20.9.2020)



కరోనా దెబ్బకు దేశంలో కోట్లాదిమందికి ఉపాధి పోయింది.3.7 కోట్లమంది తీవ్ర దారిద్యంలోకి వెళ్లిపోయారని బిల్ గేట్స్ ఫౌండేషన్ వెల్లడించింది.అయితే మనదేశంలో ఎంతమంది వలస కార్మికులు చనిపోయారో మన కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖకు తెలియదట.ఎంతమంది వలస కార్మికులకు ఉచిత రేషన్‌ ఇచ్చారో తెలియదట.కనీసం కూలీలకు సాయంచేసిన సంస్థలను సోనూసూద్ లాంటి దాతలను అడిగి సమకూర్చుకోవలసింది. మార్చి 24 నుంచి విధించిన లాక్‌డౌన్‌ వలన స్వగ్రామాలకు నడకదారి పట్టిన కోటి అయిదు లక్షల మంది వలస కూలీలు ఉపాధి పోయి కష్టాల్లో పడ్డారని, తిరిగి వెళ్ళిన కూలీలు ఉత్తరప్రదేశ్‌కు 33 లక్షలమంది బిహార్‌ కు 15 లక్షలమంది పశ్చిమబెంగాల్‌ 14 లక్షల మంది ఉన్నారని అంచనా. నెల రోజుల తర్వాత 63లక్షలమందిని రైళ్ల ద్వారా చేరవేశామని చెబుతున్నారు. కాలినడకన వెళ్ళిన కొందరు ఒంట్లో సత్తువ కోల్పోయి ఆకలిదప్పులకు తట్టుకో లేక మరణించారు.రోడ్డు రైలు మార్గాలపై నిద్రపోతూ కొందరు ప్రమాదాలలో కొందరు చనిపోయారు.నగరాలలో భవనాలను రహదారులను నిర్మించేది వీళ్ళే. వీరు లేకపోతే అన్ని కార్యకలాపాలూ స్తంభించిపోతాయి. వలస కార్మి కుల శ్రమ విలువ జీడీపీలో పది శాతం. ఏ రిజిస్టర్‌లోనూ, రికార్డు ల్లోనూ వీళ్ళకు చోటు దొరకదు.వారి మరణాల గురించిన లెక్కలు అసలే లేవు.తమ వద్ద డేటా లేదనే కారణంతో మరణించినవారి కుటుంబాలకు సాయం అందించరా?కరోనావల్ల అమెరికాలో 2 లక్షలమంది,బ్రెజిల్ లో 134 వేలమంది ఇండియాలో 82 వేలమంది ప్రపంచంలో 9.48 లక్షల మంది చనిపోయారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల అతివృష్టి వరదలు కొనసాగుతుంటే కొన్నిచోట్ల నీటి కరువులున్నాయి. గోదావరి, కృష్ణ శ్రీశైలం,పోలవరం,పులిచింతల,కుందూ నదులు, వాగులు,పొంగిపొర్లి పంటలను నాశనం చేశాయి.దేశ ప్రజలు ఇంట అన్నం తిని బ్రతుకుతున్నారంటే అది రైతులు,వ్యవసాయ కూలీల శ్రమ ఫలితమే.అందులో 13 కోట్లమంది ఎకరా అర ఎకరా సాగుచేసే చిన్న రైతులున్నారు.పండించే పంటలకు మద్ధతు ధర పెరగలేదు.పైగా స్వేచ్చా మార్కెట్ లో రవాణా చేసుకొని ఎక్కడైనా ఎవరికైనా ఎంతధరకైనా అమ్ముకోమని కార్పొరేట్లకు అనుకూలంగా తెచ్చిన వ్యవసాయ సంస్కరణల బిల్లులు లోక్ సభలో ఆమోదించారు.గిట్టుబాటు ధర మద్దతు ధర ప్రకటించకపోతే వ్యవసాయం పెట్టుబడిదారుల పరం అవుతుందని, స్వామినాధన్ సిఫారసుల్ని పక్కనబెట్టారని స్వపక్ష కేంద్ర ఆహార పరిశ్రమల మంత్రి హర్ సిమ్రత్ కౌర్ రాజీనామా చేశారు.విపక్షాలు బిల్లుల్ని వ్యతిరేకించాయి.కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ గతంలోనే చైనా సాగు యంత్రాలను నిషేధిస్తే మన దేశానికి నష్టమన్నారు.భారత్‌, చైనా సరిహద్దు గొడవ వల్ల చైనా యాప్‌ల తోపాటు దోమలబ్యాట్లు పవర్‌ టిల్లర్లు, వీడర్లు, స్ప్రేయర్లు లాంటి చౌక పరికరాలు కూడా ఆగిపోయాయి.పురుగు మందులు చల్లే తైవాన్‌, జపాన్‌ స్ప్రేయర్‌లు రూ.17-18 వేలుంటే, చైనా స్ప్రేయర్‌ ఆరువేలే కాబట్టి రైతులు చైనా స్ప్రేయర్లు తీసుకుంటు న్నారు. చైనా యంత్రాలను దిగుమతి చేసుకొని వ్యాపారం చేసే కార్పొరేట్లు మాత్రం లాభాల బాట పట్టారు.పేరుకు రైతు బజారు అయినా వ్యాపారస్తులదే రాజ్యమన్నట్లు ఉంది. రైతులనుండి లక్షలకోట్ల ఆదాయాన్ని దళారులు పిండేస్తున్నారు. అప్పులతో నెట్టుకొచ్చే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారాలు వేస్తాయి.కేంద్ర ప్రభుత్వం ఉల్లిపాయల ఎగుమతులను కూడా నిషేధించటం వలన ఉల్లి రైతులు నష్టపోతారు, సరుకు వ్యాపారుల చేతుల్లోకి చేరిన తర్వాత ధరలను విపరీతంగా పెంచి కార్పొరేట్లు,బడా వ్యాపారులు లాభాలు పొందుతారు.కాని వినియోగదారులకు మాత్రం తక్కువ ధరలకు ఉల్లిపాయలు దొరకవు.ఉల్లిపాయలు , ధాన్యాలు, పప్పులు, నూనెగింజలు, వంట నూనెలు, బంగాళాదుంపలను నిత్యావసర సరుకుల జాబితా నుండి తొలగించారు.వ్యాపారులు ఎంత సరుకునైనా నిలవ చేసుకోవచ్చు.పంటలు బాగా పండినప్పుడు ముందుగానే రైతుల నుండి పంటను కొని, నిల్వ చేసి, మార్కెట్‌లో కృత్రిమ కొరతను సృష్టించి, అధిక ధరలకు వినియోగదారులకు అమ్మి లాభాలను సంపాదిస్తారు.దేశంలో 2.2 కోట్ల టన్నుల ఉల్లిపాయలు ఉత్పత్తి అవుతాయి. కిలో 10 రూపాయలకు అమ్మే ఉల్లిపాయలు గతంలో 100 రూపాయలకు మించి పెరిగాయి.అప్పుడు పాకిస్థాన్‌ నుండి దిగుమతి చేసి చౌక డిపోల ద్వారా పంపిణీ చేశారు.ఉల్లిపాయల ఉత్పత్తిలో చైనాది మొదటి స్థానం , భారతదేశానిది రెండవ స్థానం. ఉల్లిపాయలను ఎక్కువ మంది రైతులు పంట చేతికి రాగానే అమ్ముకుంటారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు ఎలా చేస్తారు? ఏ పంటకైనా మద్దతు ధరలను ప్రకటించి,ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. రైతుల ఆత్మహత్యలలో రైతు కూలీలు,అప్పులు తీర్చలేని చిన్నరైతుల శాతమే ఎక్కువ. పెట్టుబడికోసం చేసిన అప్పులు తీర్చలేక వడ్డీలు చక్రవడ్డీలు వానలు వరదలు తెగుళ్లు కరువులు.ఇలా ఎన్నో కష్టాలు రైతువి.పంటకు భీమా లేదు.కౌలు రైతుకు ఏమి మిగులుతుందో నికరం లేదు.వానల్లో తడిచి ధాన్యం మొలకలొస్తే ఎవరూ కొనరు.సకాలంలో ఆరబెట్టుకోటానికి కల్లాలు ఉండవు.దళారులు,మిల్లర్లు ఇచ్చిందే ధర.దేశవ్యాప్తంగా బలవన్మరణాల మృతుల్లో కౌలురైతులే ఎక్కువ.దాటిరాలేని పేదరికమే కారణం. పేదలను కాపాడటానికి ఏమేమి చేయవచ్చు ?` రైతులకు ప్రకటించిన భరోసా సాయం మంచిదే.ఒక్కరోజులో రేషన్ కార్డు ఇవ్వటమూ మంచిదే.చేయూత సహకారమూ మంచిదే.సైకిళ్ళు తోపుడు బళ్లపై కూరగాయలు అమ్మే వీధి వ్యాపారులు,దర్జీలు,చాకలి,మంగలి,బేల్దారి పనివాళ్లకు ఇస్తున్న ఆత్మనిర్భర సాయమూ మంచిదే. ఇలాంటి పధకాలన్నీ పేదలను కాపాడతాయి. మన జిడిపి వృద్థి రేటు పడిపోయింది. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి కాబట్టి లాక్‌డౌన్‌ కాలంలో పనులు కోల్పోయిన వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి మరీ ఆహార ధాన్యాలను ,ఆహారాన్ని అందించాలి. సాయంగా డబ్బులివ్వాలి.అమెరికా తన జిడిపిలో 10 శాతం జర్మనీ 5 శాతం సహాయ కార్యక్రమాలకు కేటాయించాయి.మార్కెట్‌లో పెట్టుబడులు తగ్గిపోయాయి ఉపాధి కూడా తగ్గిపోయింది. వినిమయం కూడా తగ్గింది.నిరుద్యోగం పెరిగిపోయింది. బ్యాంకుల అప్పులు తీర్చని బకాయిదారులూ పెరిగిపోయారు.నిరర్థక ఆస్థులు పెరిగి బ్యాంకులూ దివాళా తీస్తున్నాయి. కాబట్టి ప్రజల కొనుగోలుశక్తిని పెంచాలి.ప్రభుత్వం విద్య వైద్యరంగాలలో ప్రజా పధకాల మీద కోట్లాది రూపాయలు ఖర్చు చెయ్యాలి. కేంద్రం రాష్ట్రాలకు బకాయి పడ్డ 152 వేల కోట్ల రూపాయలు జిఎస్‌టి పరిహారాన్ని చెల్లించాలి. రిజర్వు బ్యాంకు రెపో రేటుకి రాష్ట్రాలకు అప్పులివ్వాలి.ఆత్మనిర్భరం కోసం అప్పులు చేసుకోమన్నారు కానీ అప్పులు దేశానికి భవిష్యత్తులో ముప్పులే కావచ్చు.ఉపాధిని ఉత్పత్తిని పెంచే కార్యక్రమాలను ప్రకటించాలి. పేద రైతులకు అప్పులిచ్చి ఆదుకోవాలి.అన్ని నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి. పెట్రోలు,డీజిల్ పై సర్చార్జీ పన్నులు తీసేయాలి.టెలికాం కంపెనీలకు లక్షల కోట్లు మినహాహింపులిచ్చినట్లు సెల్ ఫోను డేటా రీఛార్జీలను కూడా తగ్గించాలి. విదేశీ బ్యాంకులలోని నల్లధనం పూర్తిగా తెచ్చి రోడ్ల లేన్లు త్వరగా పూర్తి చేసి టోల్ గేట్ ఫీజులు తగ్గించాలి. --- నూర్ బాషా రహంతుల్లా ,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి