ఈ బ్లాగును సెర్చ్ చేయండి

2, అక్టోబర్ 2013, బుధవారం

అన్నదాతకి ఆహార భద్రత భూభద్రత కల్పించాలి


న్నదాతకి ఆహార భద్రత భూభద్రత కల్పించాలి
నూర్ బాషా రహంతుల్లా 9948878833

1946లో పుచ్చలపల్లి సుందరయ్యవిశాలాంద్రలో ప్రజారాజ్యంలో భూమి గురించి మూడు అంశాలు చెప్పారు:
1. జమిందార్లు,ఇనాందార్లు పేర్లతో ఉన్న మధ్య దళారీలను తొలగించాలి.  
2.  రైతుల పొలాలు అన్యాక్రాంతం కాకూడదు.సాగుచేసే వారందరికీ భూమిని సమకూర్చాలి.  
3. కౌలుదారులు,వ్యవసాయ కూలీలకు మిగులు భూములు ఇప్పించాలి.
చాలా కాలం తరువాత 2013 సెప్టెంబరులో కేంద్రం భారీ ప్రాజెక్టుల్లో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయం చేసేందుకు ప్రత్యేక భూ సేకరణ చట్టం తీసుకొచ్చింది.నిరుపేదలకు సాగుభూములు అందించేందుకు భూ గరిష్ట పరిమితి పై రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది.
కేంద్ర  ప్రతిపాదనలు :
* అన్ని రాష్ట్రాలు భూ యాజమాన్యంపై లీజులతో సహా  సీలింగ్ విధించాలి.భూ గరిష్ట పరిమితి చట్టం ప్రకారం సాగుభూమిపై 5-10 ఎకరాలు, సాగేతర భూమిపై 10-15 ఎకరాల సీలింగ్ విధించాలి. ఒక వ్యక్తి, సంస్థ, వ్యవస్థ ఏ రూపంలోనూ ఇంతకంటే ఎక్కువ భూమి కలిగి ఉండకూడదు.
*మతపరమైన, విద్యాపరమైన, థార్మిక, పారిశ్రామిక సంస్థలకిచ్చే మినహాయింపులను రద్దుచేయాలి. వీటికి యూనిట్‌కు 15 ఎకరాలకు మించకూడదు.
*మిగులు భూములను సింగిల్ విండో  పద్ధతి ద్వారా నిర్ధిష్టకాలంలో పేదలకు పంచాలి.
*బినామీ భూముల హక్కుదారులను కనిపెట్టాలి. ఎక్కువ భూమి వ్యక్తుల చేతుల్లో బందీకాకుండా ఉండేలా ప్రొహిబిషన్ ఆఫ్‌ది రైట్ టూ రికవర్ ప్రాపర్టీ చట్టం-1989ను సవరించాలి.
*మిగులు భూములు పేదలకు పంపిణీ చేసిన తర్వాత అవి పేదల యాజమాన్యంలోనే ఉన్నాయా? లేదా? అన్న విషయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలి. ఒకవేళ ఆ భూమి పేదల చేతిలో లేకుంటే వెంటనే తిరిగి వారికి అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలి. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన భూములు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాలి. పేదలు తమ విలువైన భూములు అమ్ముకోకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి.
*మిగులు భూముల జాబితాలను తయారు చేసి వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
*షెడ్యూల్డ్ ఏరియాల్లో గిరిజన గ్రామ సభ ఆమోదం, లేదా నిర్ణయం మేరకే మైనింగ్ చేపట్టాలి. మైనింగ్‌కు అనుమతి పొందిన సంస్థ తన లాభాల్లో కొంత వాటాను గ్రామానికి కేటాయించాలి.గిరిజన ప్రాంతాల్లో పీసా చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి. గిరిజనేతర ప్రాంతాల్లో గిరిజనుల భూముల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
*రాష్ట్రాలు పేదల భూములు, ప్రభుత్వ భూముల రక్షణకు భూ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఆ కమిషన్ నివేదికలను ఏటా అసెంబ్లీలో చర్చకుపెట్టాలి.
సీలింగ్ మినహా ఆమోదం
ఈ ప్రతిపాదనల్లో సీలింగ్ మినహా అన్నిటికీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 8.9.2013 న జరిగిన సమావేశంలో  ఇందుకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైసీపీ, లోక్‌సత్తా మద్దతు ఇవ్వగా వామపక్షాలు వ్యతిరేకించాయి.
రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి వివరణ :
 ఇప్పుడు ఒకరైతు 54 ఎకరాల దాకా యజమానిగా ఉండవచ్చు.కానీ భూమి సీలింగ్‌ను సాగునీటి వనరులున్న భూమికి 5-10 ఎకరాలు, వర్షాధార పంటలు పండే భూమికి 10-15 ఎకరాలకు తగ్గించా లంటున్నారు.భూ సంస్కరణల్లో భాగంగా మరింత భూమిని సీలింగ్ పరిధిలోకి తీసుకురావాలన్న కేంద్రం ప్రతిపాదనకు రాష్ట్రం అంగీకరించదు.ఇది సాధ్యంకాదు. దీనికి మేం సిద్ధంగా లేం. ఇందుకు కారణం ఉంది. సీలింగ్ వల్ల అనేక ఇబ్బందులొస్తాయి. ఓ వైపు యాంత్రికీకరణ పెరిగిపోతే, కమతాలు మరీ చిన్నవై సమస్యలొస్తాయి. చిన్న కమతాలలో యంత్రాలతో సాగు చేయలేము.పంచటానికి మిగులు భూములేమీ దొరకకపోతే పేదలకు పది సెంట్లలో ఒక చిన్న ఇల్లు కట్టించి ఇవ్వమంటున్నారు.ఇందిరా ఆవాస యోజన ఇంటి మొత్తం 75 వేల నుంచి రెండు లక్షలకు పెంచితే ఇది మాకూ ఆమోదయోగ్యమే.ఇప్పటికే 78 లక్షల ఎకరాలు పేదలకు పంచాము.ఇంకో లక్షా పదమూడు వేల ఎకరాలు పంచబోతున్నాము.వ్యవసాయ భూముల గరిష్ఠ పరిమితి చట్టం వచ్చాక 5.6 లక్షల ఎకరాలు మాత్రమే మిగులు భూమి గుర్తించబడింది.పరిమితిని ఇంకా తగ్గిస్తే ఉపయోగమేమీ లేకపోగా రైతులకు నష్టం కలుగుతుంది. ఒకవేళ రైతుల దగ్గర మిగులు భూముల్ని కొని పేదలకు పంచుదామన్నా కొత్త భూసేకరణ చట్టం వల్ల మార్కెట్ రేట్లు బాగా పెరిగిపోయాయి.భూములు కొని పంచే అంత డబ్బు ప్రభుత్వందగ్గర లేదు.''(31.8.2013)
ప్రధాన పార్టీల వైఖరి
మన రాష్ట్రంలో 1973లో చేసిన భూ గరిష్ట పరిమితి చట్టం ప్రకారం రెండు పంటలు పండే సారవంతమైన మాగాణి అయితే పది ఎకరాలు, మెట్టకు 54 ఎకరాలు గరిష్ట పరిమితి. ఈ నలభై ఏళ్లలో వ్యవసాయంలో ఆధునికత, నీటి పారుదల వనరులు, పంటల దిగుబడి పెరిగాయి. అంతే భూమిలో ఎక్కువ పంట పండుతోంది. కాబట్టి  నీటి పారుదల వసతిని బట్టి భూ గరిష్ట పరిమితిని తిరిగి నిర్ణయించాలి .తప్పుడు ద్రువపత్రాలు ఇచ్చిన కేసులను నిశితంగా పరిశీలించాలి.డెబ్బై ఎకరాల మెట్ట రైతు కూడా కొన్ని చోట్ల కూలిపనికి వెళుతున్నాడు.10 ఎకరాల పొలం అమ్మినా పట్టణంలో అయిదు సెంట్ల స్థలం రావటంలేదు.అందుకని ఇప్పుడున్న సీలింగ్‌ను తాకవద్దు. ఉన్నదాన్నే మరింత సమర్థంగా అమలు చేయాలి
కమ్యూనిస్టు వాదన
సీలింగ్ వద్దనడం అంటే పేదలకు వచ్చే సాగుభూమిని అడ్డుకోవడమే.భూములపై మరింత సీలింగ్ విధించాలి. ధార్మిక సంస్థలు, పరిశ్రమలు, ఇతర కంపెనీలకు భూ కేటాయింపుల్లో ఎలాంటి మిన హాయింపులూ ఇవ్వొద్దు.కేంద్రం మంచి ప్రతిపాదన చేసింది.మిగులు భూమి పంపిణీ ద్వారా అట్టడుగు కులాలలోని శ్రామికులకు ఎంతోకొంత భూమి దొరికి పేదలకు మేలు జరుగుతుంది.6 లక్షల కౌలుదారులు 75 లక్షల ఎకరాల భూమిని సాగు చేస్తున్నారు.1975 లో మిగులు భూమిగా ప్రకటించిన 8 లక్షల ఎకరాలలో 5.8 లక్షల ఎకరాలు మాత్రమే పంచారు.42 లక్షల ఎకరాల ప్రభుత్వ బంజరు భూముల్లో సాగుకు పనికొచ్చే మంచి భూముల్ని కూడా భూస్వాములు పెత్తందార్లు ఆక్రమించారు.పేదలకు పంచినవాటిని కూడా కొన్నిచోట్ల ఆక్రమించారు.దశాబ్దాల తరబడి కోర్టు కేసులూ తెమలటం లేదు.రాష్ట్ర ప్రభుత్వం తనంతట తానుగా భూమి పంచలేనప్పుడు కనీసం కేంద్ర ప్రభుత్వం సూచించిన మేరకైనా ఒప్పుకోవాలి. సీలింగ్‌పై కేంద్ర ప్రతిపాదలన్నింటినీ అంగీకరించాలి.
పర్యవసానం
భూ గరిష్ట పరిమితిని తగ్గించబోమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసింది.కాబట్టి ఇకమీదట పేదలకు మిగులు భూమి దొరికే అవకాశం దాదాపు లేనట్లే. భూ సంస్కరణల అమలుకు గతంలో కమిషనర్ ఉండేవారు. దాన్ని రద్దుచేశారు. రాష్ట్రం తిరస్కరించిన  ప్రతిపాదనలనే గతంలో కోనేరు రంగారావు కమిషన్ సిఫారసు చేసింది.  తోటలు, ట్రస్టులు, ఇతర సంస్థల భూములకు సీలింగ్‌ చట్టం వర్తించదన్నారు. తెల్ల కాగితాలపై చేసిన భూ యాజమాన్య మార్పిడులు చెల్లవని 1982లోనే సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా అందుకనుగుణంగా చట్టాన్ని సవరించలేదు. అసైన్డ్‌ భూములకు జిరాయితీ భూములతో సమానమైన హక్కులుంటాయని హైకోర్టు 2004లో ఇచ్చిన తీర్పుపై అప్పీలు సుప్రీంకోర్టు లో ఇంకా పెండింగ్ లోనే ఉంది.
భూ వినియోగ జోన్లు
1) గ్రామీణ, వ్యవసాయ ప్రాంతాలు = ఆహార భద్రత ప్రజల జీవనోపాధికి అవసరమైన వ్యవసాయ భూములు
2) వ్యవసాయేతర అవసరాలకు మార్పు చెందుతున్న ప్రాంతాలు = పట్టణాల శివార్లు 
3) పట్టణ ప్రాంతాలు.
4) పారిశ్రామిక ప్రాంతాలు.= పరిశ్రమలు, మౌలిక వసతుల ప్రాజెక్టులు, పారిశ్రామిక కారిడార్లు, పిసిపిఐఆర్‌, ఎస్‌ఇజెడ్‌
5) పర్యావరణ, చారిత్రక, పర్యాటక ప్రదేశాలు.= రిజర్వు ఫారెస్టులు, జాతీయ పార్కులు వన్యప్రాణి సంరక్షణ ప్రాంతాలు, కోస్టల్‌ రెగ్యులేటరీ జోన్‌తోపాటు చారిత్రక ప్రదేశాలు,పర్యాటక ప్రదేశాలు
6) అపాయకర పరిస్థితులున్న ప్రాంతాలు =ప్రమాదకరమైన పరిశ్రమలు, రసాయన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, పేలుళ్లు వంటి వాటికి అవకాశం ఉన్న ప్రాంతాలు,సునామీ, భూకంపం, వరదలు హైరిస్క్‌ గల ప్రాంతాలు
పరిశ్రమలకు ఎంత భూమి అవసరం ?
మన దేశ విస్తీర్ణంలో సాగు భూమి 46.1 శాతంకాగా 22.8 శాతం భూమిలో అడవులున్నాయి. పట్టణ ప్రాంతాలు 2.35 శాతం పారిశ్రామిక ప్రాంతం ఒక శాతం ఉంది. అయితే పెద్దఎత్తున పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, మౌలిక సౌకర్యాల విస్తరణ జరుగుతుంది కాబట్టి  మరింత భూమి కావాలాట. అమెరికా భూ విస్తీర్ణంలో పారిశ్రామిక ప్రాంతం ఒక్క శాతం కన్నా తక్కువ. అమెరికా మొత్తం భూమి 226.39 కోట్ల ఎకరాలలో  రక్షణ మరియు పారిశ్రామిక ప్రాంతంగా 2.29 కోట్ల ఎకరాలు (ఒక్క శాతం )మాత్రమే ఉంది. పారిశ్రామిక ప్రాంతాలు ఎస్‌ఇజడ్‌ల పేరిట విస్తారమైన  భూమి ఇప్పటికే  చేజారింది. వ్యవసాయ భూమిని కారుచవకగా పారిశ్రామికవేత్తలకిస్తే వారు పరిశ్రమలు పెట్టకుండా వాటిని తర్వాత రియల్‌ ఎస్టేట్‌ అవసరాలకు మళ్లిస్తున్నారు.ఆరురకాల భూ వినియోగ జోనుల్లో దేని జోలికెళ్ళినా స్థానిక ప్రజలతో పెద్దయెత్తున గొడవలు చెలరేగుతున్నందువలన ఇకమీదట పరిశ్రమలకోసం అటవీ భూములు కూడా అవసరం కావచ్చు అని పెద్దలు అభిప్రాయపడ్డారు.ఇప్పుడు అక్కడా గిరిజనులతో గొడవలు జరుగుతున్నాయి. అందువలన ఆధునిక యంత్రాలతో తక్కువ స్థలంలోనే ఎక్కువ ఉత్పత్తి చేసేలా పెద్ద పెద్ద పరిశ్రమలపై ఒత్తిడి తేవాలి.
ఏమిటి మార్గం?
గ్రామీణ పేదలకు పది సెంట్ల భూమిలో ఒక చిన్న ఇల్లు కట్టించి ఇచ్చినా అది పెద్ద ప్రయోజనమే అవుతుంది.కోనేరు రంగారావు కమిషన్‌ సిఫార్సులలో ఆమోదించిన వాటి అమలు త్వరితం చెయ్యాలి.చాలా మంది భూ యజమానులు పట్టణాల్లో,వ్యాపారాలలో,ఉద్యోగాల్లో ఉన్నారు.40 నుండి 60 శాతం వరకు భూమిని  కౌలుదారులే సాగుచేస్తున్నారు.కౌలు రేట్లు పెరిగాయి,వ్యవసాయ పెట్టుబడి పెరిగింది.గిట్టుబాటు ధర రాక వ్యవసాయం నష్టదాయకంగా తయారైంది. ఎక్కువగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.దొరికిన మేరకు మిగులు భూములను, ప్రభుత్వ భూములాను  ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసింది.మరో వినోబా రారు. వచ్చినా భూదానం చేసేవారు ఇప్పుడు లేరు.ఇక సీలింగ్ పరిమితిని కుదిస్తేతప్ప మిగులు భూమి దొరకదు.మిగులు భూమిని  భూమిలేని కౌలు రైతాంగానికి పంచినా లబ్దిదారులంతా చిన్న రైతులే అవుతారు.వాళ్ళ బ్రతుకులు పెద్దగా ఏమీ బాగుపడవు. అందువలన ఇలాంటి చిన్న రైతులందరినీ సామూహిక సహకార వ్యవసాయ క్షేత్రాల్లో సంఘాలుగా ఏర్పాటు చేసి,పంటల భీమా కల్పిస్తూ వ్యవసాయం చేయించాలి.రైతాంగాన్ని నష్టాల బారి నుంచి, ఆత్మహత్యల నుంచి కాపాడాలి. అన్నదాతను దారిద్ర్య రేఖ పైకి తేవాలి.ముందు న్నదాతకి ఆహార భద్రతతో పాటు భూ భద్రత కూడా కల్పించాలి.వ్యవసాయ కూలీలకు, సాగు చేసే వాళ్ళందరికీ ఎంతో కొంత పొలం ఉండటం శ్రేయోదాయకం.

                                                                                                    (సూర్య 4.10.2013)  
https://www.facebook.com/photo.php?fbid=640241956007798&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater
http://www.suryaa.com/opinion/edit-page/article-154917



గీటురాయి 25.10.2013

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి