ఈ బ్లాగును సెర్చ్ చేయండి

23, అక్టోబర్ 2013, బుధవారం

వలస బతుకులు



వలస బతుకులు

నూర్ బాషా రహంతుల్లా 9948878833

వలసవచ్చిన వారివల్లే ఢిల్లీ మహానగరానికి ఇన్ని తలనొప్పులుఅని ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఆరోపణ. డాడీ ఏడని మా బిడ్డలు అడిగితే,మా ఆవిడ చూపించే 'డీడీయే మాబతుకు అని ఓ వలస జీవి వేదన . మహానగర నిర్మాణాల్లో వలసజీవులు కీలక పాత్ర పోషిస్తున్నారు. వారు చేస్తున్న చాకిరీ ఎంతో సంపదను సృష్టిస్తోంది. స్వస్థలానికి దూరంగా జీవనపోరాటం సాగిస్తున్నారు వలస జీవులు.వారికి  గుర్తింపు లేదు .సామాజిక రక్షణ పథకాలేవీ వారికి వర్తించవు. ఓటు హక్కుండదు, స్థానికులు కారు . వారి కోసం పోరాడే పార్టీలుండవు. చదువు ఉండదు . తమ హక్కులేమిటో, సౌకర్యాలేమిటో తెలుసుకునే పరిజ్ఞానం ఉండదు. జ్వరమొచ్చినా, ప్రమాదంలో పడినా ఆదుకునే నాథుడుండడు. వలస కార్మికులంతా స్వచ్ఛంద బానిసలే.

వలసభారతం
 ప్రపంచంలో 74 కోట్ల మంది వలస జీవులుండగా అందులో దాదాపు సగంమంది భారత్‌లోనే ఉన్నారు. స్థూల దేశీయోత్పత్తిలో వీరి వాటా 10 శాతం. రూ.1,20,000 కోట్ల వరకూ వీరంతా తమ ఇళ్లకు పంపుతున్నారు.  2013లో భారతదేశానికి 32 లక్షల మంది బంగ్లాదేశీయులు వలస వచ్చారని ఐక్యరాజ్య సమితి తేల్చింది. ఇదే సమయంలో భారత్ నుంచి అమెరికాకు 21 లక్షల మంది వలస వెళ్ళారట . యూఏఈకి 29 లక్షల మంది భారతీయులు వలసపోగా, సౌదీకి 18 లక్షల మంది భారతీయులు వలస వెళ్ళారు. మన దేశంలో 40 కోట్లమంది వలసపోతున్నారు. ప్రతి ముగ్గురు ఓటర్లలో ఒకరు వలస జీవులే . ఢిల్లీ, ముంబై నగర జనాభాలో దాదాపు సగం మంది వలసదారులే. 
చీప్‌లేబర్‌
ఒక్కో ప్రాంతం కూలీలు ఒక్కో పనికి స్థిరపడి పోయారు. ఆయా సీజన్‌లలో కాంట్రాక్టర్లు తరలించిన చోటికల్లా పోయి పూటగడుపుతున్నారు. పొట్ట పోసుకోవడానికి నిరంతరం ఈ కూలీల యాత్ర సాగుతూనే ఉంటుంది. స్థానికుల మాదిరిగా వలస కూలీలు అధిక వేతనాలు కోరరు. ఎక్కువ కాలం అక్కడే స్థిరంగా ఉండలేరు. వ్యవస్థీకృతంగా, భద్రతతో జీవించలేరు. వలస కార్మికులు ఎక్కువ పనిగంటలు పనిచేయాలి. యూనియన్‌లు ఉండవు. వలస వచ్చారు కాబట్టి స్థానికంగా వారికి దక్కే సబ్సిడీలు దక్కవు. అయితే పెద్ద ఎత్తున  వలసవస్తూ శాంతిభద్రతల సమస్య, ఆరోగ్య సమస్యలు మోసుకొస్తున్నారని స్థానికుల గగ్గోలు .

వలసలకు కారణాలు :
పేదరికం, నిరుద్యోగం, తక్కువ వేతనాలు,  స్వంత ప్రదేశాలలో  ఉపాధి లేకపోవడం,గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం లాభసాటి కాకపోవడం, చేతి వృత్తులు దెబ్బతినడం, చిన్న, మధ్యతరహా పట్టణాల్లో సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం, వంటివి  వలసలకు కారణమవుతున్నాయి.
వలస రకాలు
1.ఆర్థికంగా ఉండి, శాస్త్ర సాంకేతిక టెక్నికల్‌ నైపుణ్యత ఉండి మరింత ఎక్కువ ఆదాయం కోసం వెళ్ళే  ఇంజనీర్స్‌, డాక్టర్స్‌, ఐ.టి. ప్రొఫెషనల్స్‌
2.  సెమిస్కిల్డ్‌, అన్‌స్కిల్డ్‌, లేబర్‌వర్క్‌,కాంట్రాక్ట్‌ వర్కర్స్‌
వలసలు ఎక్కడికి?
విశ్వవ్యాప్తంగా 200 మిలియన్లకు పైగా ప్రజానీకం వలసలు వెళుతుంటే అందులో  60% అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి, 40% అభివృద్ధి చెందిన దేశాల నుండి వెళుతున్నారు.  భూభాగంలో ప్రతి 35 మందిలో ఒకరు వలసలు వెళుతున్నారు.చైనా నుంచి 22 లక్షల మంది అమెరికాకు వలస వెళ్ళారు. 20 లక్షల మంది వలసలతో ఫిలిప్పీన్స్ మూడో స్థానంలో ఉంది. ఇక ప్రపంచం మొత్తంలో దక్షిణాసియా వాసులే ఎక్కువగా వలస వెళుతున్నారు. ప్రస్తుతం ప్రపంచంలోని జనాభాలో 3.2 శాతం మంది ప్రజలు వలసల్లోనే జీవిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు 9.6 కోట్ల మంది వలస వెళ్లగా, అదే అభివృద్ధి చెందిన దేశాలకు 13.6 కోట్ల మంది వలస వెళ్ళారు. ఎక్కువ మంది యూరప్ దేశాలకు వలస వెళ్ళారు. ఎక్కువ మంది వలస ప్రజలకు అమెరికా ఆశ్రయమిస్తోంది.ఆ తర్వాతి స్థానంలో రష్యా, జర్మనీ, సౌదీ అరేబియాలున్నాయి.

క్రూర మత వలస
మతాల ప్రాతిపదికన 1947లో 'రెండు దేశాలు 'గా అన్నదమ్ముల్ని విడదీసినప్పుడు లక్షల మంది తరతరాలుగా తమ పురిటిగడ్డ అయిన సొంత ప్రాంతాన్ని వదిలేసి, అనిశ్చితమైన, అగమ్యగోచరమైన ప్రాంతానికి శరణార్థులుగా వలస పోవాల్సి వచ్చింది. జనాభా అటు నుంచి ఇటూ, ఇటు నుంచి అటూ వలస వెళ్ళారు. 53 లక్షల మంది ముస్లిమ్‌లు భారతదేశం నుంచి పాకిస్తాన్‌ కు , పాకిస్తాన్‌ నుంచి 34 లక్షల మంది హిందువులు, సిక్కులేమో భారత్ కు వలస వెళ్ళారు. ఎడ్ల బండ్లు, గాడిదల మీద, కాలినడకన  మహిళలు, చిన్న పిల్లలనూ, వృద్ధులనూ తమ భుజాల కెత్తుకొని సాగివెళ్ళారు. మార్గ మధ్యంలోనే ఎందరో తల్లులు తమ పిల్లలకు జన్మనిచ్చారు. మరెంతోమంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు కలరాతో మరణిస్తే, మరికొందరు మతోన్మాదుల దాడుల్లో ప్రాణాలు పోగొట్టుకున్నారు. చాలామంది జన ప్రవాహంలో నడిచీ నడిచీ డస్సిపోయి, రహదారి పక్కన చనిపోయారు...
ఎర్రసముద్రాన్ని దాటిన ఇజ్రాయల్‌ ప్రజల భారీ వలస కూడా భారతదేశ విభజన వలసకు సాటిరాదు. ఇది మానవ కల్పిత మైన కఠిన, క్రూర వలస.

 

ఐక్యరాజ్య సమితి వింత నివేదిక
 అభివృద్ధి కోసం వలసలను ప్రోత్సహించాలనీ , సమతుల్య అభివృద్ధికి బదులు నగరాలలోనే అభివృద్ధి పథకాలను కేంద్రీకరించాలనీ ప్రపంచ బ్యాంకు విడ్డూరమైన సూచన చేసింది. అభివృద్ధి నమూనా స్థానిక ప్రజలను ఇతర ప్రాంతాలకూ పట్టణాలకూ వలస పంపి ,అక్కడి  ప్రకృతి వనరులను యధేచ్ఛగా, చౌకగా కొల్లగొట్టడానికి  పెట్టుబడిదారుల పక్షాన పన్నిన వ్యూహమిది. ప్రపంచ బ్యాంకు ఆదేశాలే శిరోధార్యమనుకోకుండా  మన దేశమూ వాటి పర్యవసానాలను చర్చించుకోవాలి.ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయకుండా , ఏవో కొన్ని పారిశ్రామిక నగరాలను మాత్రమే అభివృద్ధి చేయాలని ప్రపంచ బ్యాంకు సూచించింది.హైదరాబాదు విశాఖ లాంటి మహా నగరాల చుట్టూ నిర్బంధంగా కుప్పగాపోస్తున్న సెజ్జులూ , అభివృద్ధి కారిడార్లన్నీ ఈ సూచనల అమలు ఫలితమే.
అమెరికా కొత్త వలస చట్టం
అమెరికా కొత్త వలస చట్టం ప్రకారం అక్కడ అక్రమంగా నివాసముంటున్న ఏకంగా 1.1 కోట్ల మందికి  ఆ దేశ పౌరసత్వం వస్తుంది. వలస ప్రజలు కట్టే పన్నుల ద్వారా అమెరికాకు లక్ష కోట్ల డాలర్ల అదనపు ఆదాయం సమకూరనుంది. శ్రమ దోపిడీతో అభివృద్ధి చెందటం , తక్కువ వేతనాలిస్తూ ఎక్కువ లాభాలు గడించడమే పెట్టుబడిదారీ విధానమని కారల్‌మార్క్స్‌ అన్నారు.
ఒకనాడు బానిసలను బలవంతంగా పట్టుకెళ్ళారు. చెరుకు, తేయాకు తోటల్లోకి కూలీలను తరలించారు. మన ఖర్చుతో శిక్షణ పొందిన నిపుణుల చాకిరీతో సంపదను పోగేసుకున్నారు. మన ప్రాంతాల వనరులను చౌకగా చేజిక్కించుకుని సెజ్‌ లు స్థాపించుకున్నారు. అంతిమ లక్ష్యం చీప్‌ లేబర్‌ను దోచుకోవడమే.

వలస కార్మికులపై దాడులు-దుర్భరమైన జీవితం దుష్పరిణామాలు 
 శ్రీ శ్రీ రాసిన పాట పట్టణంలో బ్రతుకుదామని వచ్చిన వలసకూలీ జీవితాన్ని కళ్ళకు కట్టిందిః




కూటికోసం, కూలికోసం
పట్టణంలో బ్రతుకుదామని-
తల్లిమాటలు చెవిని పెట్టక
బయలుదేరిన బాటసారికి,
ఎంతకష్టం  ఎంతకష్టం

మూడురోజులు ఒక్కతీరుగ
నడుస్తున్నా దిక్కుతెలియక-
నడిసముద్రపు నావరీతిగ
సంచరిస్తూ సంచలిస్తూ,
దిగులు పడుతూ, దీనుడౌతూ
తిరుగుతుంటే-
చండచండం, తీవ్రతీవ్రం
జ్వరం కాస్తే,
భయం వేస్తే,
ప్రలాపిస్తే-
మబ్బుపట్టీ, గాలికొట్టీ,
వానవస్తే, వరదవస్తే,
చిమ్మచీకటి క్రమ్ముకొస్తే
దారితప్పిన బాటసారికి
ఎంత కష్టం!

కళ్లు వాకిట నిలిపిచూచే
పల్లెటూళ్లో తల్లి ఏమని
పలవరిస్తోందో...?


చింతనిప్పులలాగు కన్నుల
చెరిగిపోసే మంటలెత్తగ,
గుండుసూదులు గ్రుచ్చినట్లే
శిరోవేదన అతిశయించగ,
రాత్రి, నల్లని రాతి పోలిక
గుండె మీదనె కూరుచుండగ,
తల్లిపిల్చే కల్లదృశ్యం
కళ్లముందట గంతులేయగ
చెవులు సోకని పిలుపులేవో
తలచుకుంటూ, కలతకంటూ-
తల్లడిల్లే,
కెళ్లగిల్లే
పల్లటిల్లే బాటసారికి
ఎంత కష్టం!

అతని బ్రతుకున కదే ఆఖరు!
గ్రుడ్డి చీకటిలోను గూబలు
ఘాకరించాయి;
వానవెలసీ మబ్బులో ఒక
మెరుపు మెరిసింది;
వేగుజామును తెలియజేస్తూ
కోడి కూసింది;
విడిన మబ్బుల నడుమనుండీ
వేగుజుక్కా వెక్కిరించింది;
బాటసారి కళేబరంతో
శీతవాయువు ఆడుకుంటోంది!
పల్లెటూళ్లో తల్లికేదో
పాడుకలలో పేగు కదిలింది!

ఎన్నో ఆశలతో పల్లెవాసులు పట్టణాలకు వలసవెలితే  కొన్ని గ్యాంగ్‌లు దాడులు చేస్తున్నాయి. బలవంతంగా వలస కార్మికులను తీసుకొని వెళ్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేయించుకొని చేతిలో తక్కువ కూలీ పెడుతున్నారు.
ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ గ్రామపేదలు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళడంతో చిన్నారులు బడికి దూరమవుతున్నారు. ఇంటి వద్ద కేవలం ముసలి వారిని మాత్రమే వదలి, మూటా ముల్లే  సర్దుకుని వ్యవసాయ కూలీలు, పని దొరికే ప్రాంతాలకు వలస వెళుతున్నారు.  పంటలు చేతికి అందక , చేసిన అప్పులు తీర్చుకునేందుకు మార్గమేదీ కనిపించక,వలసపోయే కూలీలతో ప్రతినిత్యం రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండులు కనిపిస్తున్నాయి. గ్రామాలలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టి ఉపాధి చూపిస్తున్నప్పటికీ, వచ్చే కూలీ సరిపోనందున, అధిక మొత్తం కూలీ  కోసం పట్టణ ప్రాంతాలకు పిల్లా పాపలతో వలస వెళ్ళక తప్పడం లేదు. పట్టణాలకు వెళ్ళి కొంత ఎక్కువ సంపాదించుకుని చేసిన అప్పులు తీర్చుకుందామని వలస కూలీలు ఆశిస్తున్నారు.
అంతంత మాత్రంగా ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు అయిన విద్యార్థుల సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది. తల్లిదండ్రులతో పాటు వారి పిల్లలు కూడా వలస వెళ్ళడంతో పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. పల్లె జనం అవకాశాలు దొరక్క పొట్ట చేత పట్టుకుని నగరాలకు వలస కూలీలుగా  వెళుతున్నారు. పల్లెలు కరువు సీమలుగా కటకటలాడుతూ ఉంటే, బడుగు జీవులు భాగ్యనగరాల బస్సులెక్కి గుర్తు తెలియని ప్రపంచంలో దినమొక గండంగా బతుకుతున్నారు. వలసలను ప్రోత్సహించడం వల్ల నగరాలలో మురికి వాడలు పెరుగుతాయి. అనుదినం దూర ప్రయాణాల వల్ల చాలా మంది పిల్లలు తండ్రి ముఖం చూడకుండానే పెరుగుతున్నారు.
పారిశ్రామిక ప్రాంతాల్లో, కుటుంబాలు అదృశ్యమై, సమాజమంటే  కేవలం కర్మాగారాలు- కార్మికులు అన్నట్లుగా మారిపోయింది . పల్లెల్లో ఉపాధి అవకాశాలు పెంచితే పట్టణీకరణ ఇంతగా పెరగదు. గ్రామీణ వ్యవసాయ సంపదే పట్టణాల ఆకలి తీరుస్తోందని గుర్తించాలి.  

వలస కార్మికుల డిమాండ్లు :
1. వలస కూలీల రక్షణ కోసం ఆయా దేశాలు ప్రత్యేక మంత్రిత్వశాఖను, చట్టాలను ఏర్పాటు చేయాలి.
2 కార్మికుల ఉపాధి కోసం దేశాల  మధ్య  ఒప్పందాలుండాలి.
3. వలస కార్మి కులకు  స్వదేశీ కార్మికులతోపాటు  సమాన వేతనం కల్పించాలి.
4. వలస కార్మికులపై దాడులు, హింసలు జరుగకుండా  కాపాడాలి.
5. వలస కార్మికుల ఆరోగ్య రక్షణ ప్రమాదాలు, చనిపోతే నష్టపరిహారం, వైద్యసహాయం, చట్టాలను రూపొందించాలి .


https://www.facebook.com/photo.php?fbid=666831796682147&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater

 http://www.suryaa.com/opinion/edit-page/article-159717 
                                సూర్య 20.11.2013
 
గీటురాయి 6.12.2013





2 కామెంట్‌లు:

  1. వలసలు లేని భారతం కావాలం టే వనరులదోపిడిదారులను అరికట్టాలి . సహజవనరులైన భూమి , నీరు , ఖనిజసంపద , లను సర్వమానవాళి జీవనోపాధికై జాతీయంచేయాలి . ఆతరహా వ్యవస్థ రూపకల్పనలో నిజాయతీ నిస్వార్ధ పరులైన ఆలోచనపరులు ప్రజల్లో చైతన్యం ను కలిగించడం కర్తవ్యంగా తీసుకోవాలి .నేడు కాకపోతే రేపైనా అటువంటి మానవసమాజం ఏర్పడితీరుతుంది . శ్రీశ్రీ లాంటి వాళ్ళు వారిజీవిత కాలంలోనే అలాటి కాలం వస్తుందని ఆశించారు , ఇంకా ఎదురు చూడడం , పరిస్థితులను సానుకూల పరచడం మనలాంటి వాళ్ళ కర్తవ్యం గా స్వీకరిద్దాం మిత్రమా !

    రిప్లయితొలగించండి
  2. అవును మోహన్.వలసలు లేని భారతం కోసం ఎదురుచూద్దాం.

    రిప్లయితొలగించండి