ఈ బ్లాగును సెర్చ్ చేయండి

22, అక్టోబర్ 2013, మంగళవారం

రాజధాని నగరానికి ఉండాల్సిన అర్హతలేమిటి ?


రాజధాని నగరానికి ఉండాల్సిన అర్హతలేమిటి ?
నూర్ బాషా రహంతుల్లా 9948878833
కొత్త రాష్ట్రానికి రాజధానిగా చేసేందుకు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు,కర్నూలు,రాజమండ్రి, తిరుపతి లాంటి పట్టణాల పేర్లు కేంద్రం పరిశీలిస్తోందనీ విజయవాడ,గుంటూరు,కర్నూలు,ఒంగోలు,నగరాల గురించి కలక్టర్లనుండి వివరాలు కూడా సేకరించిందనీ వార్తలొస్తున్నాయి. ఆయా ప్రాంతాల నాయకులు కూడా తమకు దగ్గరలోని నగరాన్నే ఎందుకు  రాజధానిగా చెయ్యాలో వివరిస్తూ రకరకాల కారణాలు చెబుతున్నారు.అయితే కొత్తగా ఏర్పడబోతున్న  రాష్ట్రానికి మళ్ళీ హైదరాబాదు లాంటి ఒకే మెగా సిటీని మాత్రమే రాజధానిగా అభివృద్ధి చేయదలిచారా?  లేక అనేక నగరాలను వేరు వేరు రంగాలలో రాజధానులుగా ఉద్ధరించదలిచారా? గత అనుభవాలనుబట్టి ఏయే పాలనా కార్యాలయాలు ఎక్కడ ఎలా ఉంటే  మంచిదో సమగ్ర  చర్చ జరపాలి.
ఆవేశం కాదు ఆలోచన కావాలి
విభజన అనే ఊహనే తట్టుకోలేనంత ఆవేశంలో ఉన్న నాయకులు ప్రజలూ కొత్త రాజధానుల అంశాన్ని అసలు ఆలోచించటానికే ఇష్టపడటంలేదు.ఒకవేళ తప్పనిసరైతే రాజధానిని ఇక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి అని కొందరు నాయకులు  మనసు విప్పారు.కానీ రాజధాని అంటే హైదరాబాద్‌ అంత భారీ స్థాయి మెగా నగరమే ఉండాలా? రాష్ట్రమంతటికీ ఒకే పెద్దనగరం ఉండాలా? అనేక రాజధానులుండాలా? అనే ఆలోచన ప్రజాక్షేమంకోసం రాష్ట్రాభివృద్ధి కోసం ఇప్పుడన్నా శాస్త్రీయంగా  ఆలోచన చెయ్యాలి. ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయో ఎవరూ చెప్పలేకపోతున్న తరుణంలో రాజకీయాలకతీతమైన ఆచరణాత్మకమైన ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలి.  
రాజధాని సైజు,జనాభా :
రాజధానులుగా ఉన్న ప్రాంతాలు భారీ మెట్రో నగరాలే కావాల్సిన అవసరంలేదు. కేవలం పాలనాపరమైన కార్యకలాపాల నిర్వహణకు పరిమితమైతే  చాలు. దేశంలోని కొన్ని రాష్ట్రాల రాజధానులు ఆయా రాష్ట్రా ల్లోని మెట్రో నగరాలకంటే చాలా చిన్నవిగానే ఉన్నాయి . ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లక్నో కంటే  కాన్పూర్‌, అలహాబాద్‌, వారణాసి నగరాలే పెద్దవి.మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ కంటే ఇండోర్‌, ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ కంటే కటక్‌ పెద్దది.గుజరాత్‌ రాజధాని గాంధీనగర్‌ జనాభా 1.90లక్షలు కాగా  అహ్మదాబాద్‌ జనాభా 39 లక్షలు , సూరత్‌ జనాభా 33 లక్షలు. అస్సోం రాజధాని డిస్పూర్‌ జనాభా లక్షలోపే. గౌహతి మాత్రం 15 లక్షల జనాభా ఉన్న భారీ నగరం. ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌ కంటే హరిద్వార్‌, జార్ఖండ్‌ రాజధాని రాంచీ కంటే బొకారో, ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయపూర్‌ కంటే బిలాస్‌పూర్‌ పెద్దనగరాలు.దేశ రాజధాని ఢిల్లీ కంటే కూడా ముంబై, కోల్‌కతాలు పెద్ద నగరాలు.
పాతవా? కొత్తవా?
అప్పటికే పాతబస్తీలతో ఇరుకైపోయిన పాతనగరాలలోనే రాజధాని ఉండనక్కరలేదు.కొత్త పట్టణాలు కట్టవచ్చు.నయా రాయ్‌పూర్, గాంధీనగర్, భువనేశ్వర్ నగరాలను కొత్తగానే  కట్టుకున్నారు.
మౌలిక వసతులు
విమానాశ్రయం, నౌకాశ్రయం, ఓడ రేవులు, జాతీయ రహదారులు, రోడ్డు, సాగునీటి పథకాలు, నీటి సరఫరా, అండర్‌గ్రౌండ్‌  డ్రైనేజ్ వ్యవస్థ, మురుగు శుద్ధి ప్లాంట్లు, ఘన వ్యర్థాల నిర్వహణ పవర్ ట్రాన్స్‌మిషన్ డిస్ట్రిబ్యూషన్ గ్రిడ్‌లూ లాంటి మౌలిక వసతులు రాజధానికే కాకుండా ప్రతి పెద్ద పట్టణానికీ అవసరమే.వాటి కోసం కాంట్రాక్టర్లు ఎప్పుడూ పైరవీలు చేస్తుంటారు ఎంత దూరమైనా వెళ్ళి కడతారు. గానీ ఏ వసతి ఏ నగరానికి ఎంత వరకు అవసరమో హేతుబద్దంగా నిర్ణయించుకోవాలి గానీ అన్నీ వసతులూ ఒకే నగరంలో ఏళ్ళతరబడి కుప్పబోసి హైదరాబాదు లాగా ఉబ్బిపోయేలా, వలస జనవిస్పోటనంతో మహా నగరం పేలిపోయేలా చేయకూడదు.
మూలనా?మధ్యనా?
ప్రజల ప్రయాణం సుఖంగా ఉండేలా రాష్ట్రానికి రాజధాని భౌగోళికంగా మధ్యప్రాంతంలో ఉంటే మంచిది.కానీ అలా లేని రాష్ట్రాలూ ఉన్నాయి. తమిళనాడు రాజధాని చెన్నై తమిళులకంటే ఆంధ్రులకే దగ్గర. మద్రాసు నుంచి కన్యాకుమారి  900 కిలోమీటర్లు.పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతా, మహారాష్ట్ర రాజధాని ముంబై కూడా ఆ రాష్ట్రాలకు మూలల్లో అంచుల్లోనే ఉన్నాయి.అసలు మన జిల్లాల కేంద్రాలు కూడా కొన్ని జిల్లాల  మూలల్లో అంచుల్లోనే ఉన్నాయి. అలాంటి జిల్లాలలో ప్రజలు జిల్లా కేంద్రాలకు ప్రయాణమంటే భయపడుతుంటారు.ప్రజల సౌకర్యంకోసం వివిధ జీవన రంగాలకు సరిపడేలా వివిధ నగరాలను అభివృద్ధి చేస్తే మళ్ళీ విభజనవాదాలు తలెత్తవు. ఆన్ని ప్రాంతాల ప్రజలు తృప్తి  పడతారు.ఒకే నగరానికి వలసలు తగ్గుతాయి.
భూముల లభ్యత
ప్రభుత్వ స్థలాలు అందుబాటులోలేకపోతే  ప్రైవేటు స్థలాల్ని కోనాలి. భారీ వ్యయంతో కొనుగోలు చేయడం ఇష్టం లేకపోతే అటవీ భూములు దొరికినా ప్రత్యామ్నాయంగా అటవీ శాఖకు మరోచోట భూములిచ్చి అడవి భూముల్ని తీసుకోవచ్చు.లేదా అటవీ భూముల సేకరణకున్న  అభ్యంతరాలను పక్కనపెట్టి నిరర్ధకంగా పడివున్నాయి అంటూ కేంద్రమే అనుమతించవచ్చు.గనుల కోసం ప్రైవేటు కంపెనీలకు వేలాది ఎకరాల భూములు ఇస్తున్నట్లే ప్రభుత్వకార్యాలయాల నిర్మాణానికీ ఇవ్వవచ్చు.

అడవులెక్కడున్నాయి?
తూర్పుగోదావరి లో 3,232 , గుంటూరులో 1619, ప్రకాశంలో 4,424, నెల్లూరులో 2,519, చిత్తూరులో 4,520, కడపలో 5,002, అనంతపురం లో 1969, కర్నూలులో 3,515 ,శ్రీకాకుళంలో 686, విజయనగరంలో 1193, కృష్ణాలో 664, పశ్చిమగోదావరిలో 811 చదరపు కిలోమీటర్లు అటవీ భూములున్నాయి.వీటిలో రాజధాని పెడదామనుకున్న చోట భూములు ఉచితంగా  ఇచ్చి అవసరమైన భవనాల నిర్మాణానికి నిధులిస్తే సరిపోతుంది.భవనాల నిర్మాణం ఖర్చు మాత్రం ఎక్కడైనా తప్పదు. రాజధాని ఏర్పదినా తరువాత మిగిలిన మౌలిక వసతులు వాటంతటవే అభివృద్ధి చెందుతాయి.

మన నగరాలు
*విశాఖపట్నం రెండవ అతి పెద్ద నగరం. రైలు, రోడ్డు, విమానం, జలమార్గాల రవాణావ్యవస్థ బాగా  అభివృద్ధి చెందింది.మిగతా రాష్ట్రానికి  ఓ మూలగా ఉన్న పట్టణం. రాయలసీమ నుండి రావాలంటే వ్యయ ప్రయాసలకు గురి కావాలి. నీటి లభ్యత తక్కువ. సుందరమైన ప్రకృతి దృశ్యాలున్న ప్రాంతం కాబట్టి సినీ పరిశ్రమను కేంద్రీకరించవచ్చు.ఓడరేవులతో విదేశీ వాణిజ్య కేంద్రంగా ఇప్పటికే వర్ధిల్లుతోంది కాబట్టి పరిశ్రమల నగరంగా అభివృద్ధి చేయవచ్చు.ఉత్తరాంధ్ర ప్రజల వివాదాల పరిష్కారానికి హైకోర్టు బెంచి ఏర్పాటు చేయాలి. ఐటీ పరిశ్రమ కేంద్రంగా కూడా మలచవచ్చు.అసెంబ్లీ వేసవి సమావేశాలు ఇక్కడ నిర్వహించవచ్చు.   
 
*విజయవాడ - గుంటూరు : తాగునీరు పుష్కలం. ప్రభుత్వ భూములు లేవు. భూముల ధర ఎక్కువ.  గన్నవరం విమానాశ్రయం ఉంది.విజయవాడ,గుంటూరు,తెనాలి మూడూ రైల్వే జంక్షన్లే.ఈ త్రికోణం మధ్య  స్థలం రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల వారి రాకపోకలకు  అందుబాటులో ఉంటుంది.గతంలో హైకోర్టు కూడా గుంటూరులోనే ఉండేది.దానిని మళ్ళీ పునరుద్ధరించవచ్చు.విజయవాడ-గుంటూరు రాష్ట్రానికి రెండవ రాజధానిగా ఉండాలని ఎన్.జి.రంగా గారు 1953లోనే కోరారు. దక్షిణమధ్య రైల్వేలో గుంటూరు,విజవాడ రెండూ పెద్ద రైల్వే డివిజన్‌ లు . ఇప్పటికే గుంటూరు, విజయవాడ విస్తరించి జంట నగరాలుగా  దాదాపు రెండూ కలిసిపోయాయి. ఈ రెండు నగరాలలో సెక్రటేరియట్, హైకోర్టు పెట్టొచ్చు. విజయవాడ  జిల్లా కొత్తగా ఏర్పాటు చెయ్యాలి.     .
  
*ఒంగోలు చుట్టుపక్కల ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. రాయలసీమ ఆంధ్రాకోస్తా కు కూడా మధ్యేమార్గంగా అనుకూలం. నీటి లభ్యత తక్కువ.మౌలిక వసతులు లేవు . అయిదవ నంబరు జాతీయ రహదారి ఉంది. సముద్ర తీరానికి సమీపంలో 'వాన్‌పిక్‌' భూములున్నాయి. ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతమంతా 1972కు ముందు కర్నూలు జిల్లాలో అంతర్భాగమే.రైల్వే జంక్షన్ కాదు.విమానాశ్రయం లేదు.ఈ రెండూ ఏర్పాటు కావాలి.శ్రీశైలం-ఒంగోలు రైలు మార్గం కొత్తగా నిర్మించాలి.అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన ఒంగోలు గిత్తలు ,గ్రానైటు లాంటి విషయాలకు సంబందించిన పరిశ్రమలు,అధ్యయన కేంద్రాలను అభివృద్ధి చెయ్యాలి.
* కర్నూలు :ఆంధ్ర రాష్ట్రానికి మొదటి రాజధాని.వరదల భయం ఉంది. రాష్ట్రానికి ఒక మూలన కర్ణాటక దగ్గరలో ఉంది.సామాన్య ప్రజలు సచివాలయానికీ డైరెక్టరేట్లకూ వెళతారుగానీ అసెంబ్లీకి వెళ్ళరు. కాబట్టి రాజకీయంగా అక్కడి పాత చరిత్రను గౌరవిస్తూ మళ్ళీ అసెంబ్లీ అక్కడే పెట్టొచ్చు.
*తిరుపతి: చెన్నైకి దగ్గరలో రాష్ట్రానికి ఒక మూలన ఉంది . తీర్ధయాత్రా కేంద్రం.రోజూ లక్షలాది భక్త యాత్రికులతో రద్దీగా ఉంటుంది. బాలాజీ  జిల్లా కొత్తగా ఏర్పాటు చెయ్యాలి.యూనివర్సిటీలు,విమానాశ్రయం ఉన్నాయి.ఆధ్యాత్మిక కేంద్రంగానే ఉంచాలి.ఐటీ పరిశ్రమ కేంద్రంగా మలచవచ్చు.   
*రాజమండ్రి: శతాబ్దాల చరితగల సుందర నగరం.వేదంలా ప్రవహించే గోదావరి పుణ్యాన తాగునీరు పుష్కలం. 7,500 ఎకరాల అటవీ భూమి ఉంది.తెలుగు విశ్వవిద్యాలయాన్ని విస్తరించాలి.తెలుగువారి చరిత్ర సంస్కృతి లాంటి అంశాలపై  పరిశోధనలతో పాటు కంప్యూటర్లపై తెలుగు భాషను సాంకేతికంగా పరిపుష్టం చేసే విషయాలపై నిపుణుల్ని తయారుచేసే కేంద్రంగా మలచాలి.ప్రాచీన భాషా కేంద్రాన్ని మైసూరునుండి ఇక్కడికి తరలించవచ్చు. రాజమండ్రి జిల్లా కొత్తగా ఏర్పాటు చెయ్యాలి.ఓ ఎన్ జీ సీ ప్రధాన కార్యాలయాన్ని ఇక్కడికి తరలించాలి. ఇప్పటికైనా యానాం ను కాకినాడ జిల్లాలో కలపాలి.
  అన్ని ప్రాంతాలకూ సమ న్యాయం     
రాష్ట్రంలోని ఆన్ని ప్రాంతాలవారికీ ఏదో ఒక పౌర ప్రాధాన్యత గల పీఠం దక్కేలా ప్లాన్ చెయ్యాలి.సమైక్య వాదుల దే పై చెయ్యి అయ్యి రాష్ట్రం  విడిపోకపోయినా పై ప్రాంతాలలో ప్రజలకు ఈ సదుపాయాలు కలగాలి.హడావిడిగా ఏదో ఒక నగరాన్ని మాత్రమే రాజధానిగా ప్రకటించి అభివృద్ధి అంతా అక్కడే జరిగేలా ఏళ్ళతరబడి ఆన్ని ఉన్నత సంస్థలనూ  అక్కడే కుప్పపోస్తే కొన్నేళ్ళకు హైదరాబాదు అనుభవమే ఎదురౌతుంది.మనకు అనేక రంగాలలో అభివృద్ధి చెందిన అనేక రాజధాని నగరాలు కావాలి.మళ్ళీ విభజన వాదాలు తలెత్త కూడదంటే పాలకులు ఈ కోణం నుండి కూడా ఆలోచించక తప్పదు.  
http://www.suryaa.com/opinion/edit-page/article-156818 (సూర్య 24.10.2013)


https://www.facebook.com/photo.php?fbid=651535611545099&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater

గీటురాయి 8.11.2013


(సాక్షి3.4.2014)

2 కామెంట్‌లు: