ఈ బ్లాగును సెర్చ్ చేయండి

7, అక్టోబర్ 2013, సోమవారం

పుట్టేవాడికి చోటేది?



పుట్టేవాడికి చోటేది?
నూర్ బాషా రహంతుల్లా 9948878833

జనాభా పెరుగుదల కారణంగానే రేప్‌ కేసులు ఎక్కువ అవుతున్నాయని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అభిప్రాయం.మరి ఇప్పుడు ప్రపంచ జనాభా 710 కోట్లకు చేరింది.ఇది  ఇలాగే పెరిగిపోతూ 2050 నాటికి 970 కోట్లు ,ఈ శతాబ్ది అంతానికి 1100 కోట్లకు చేరుతుందట. 2050 నాటికి చైనా జనాభా 130 కోట్ల దగ్గరే ఆగిపోయి స్థిరంగా ఉంటే ఇండియా జనాభా మాత్రం ఇప్పటి 121 ోట్లనుంచి 160 కోట్లకు పెరుగుతుందట.అప్పుడు భారత్‌ చైనాను మించి పోయి ప్రపంచంలోనే అత్యధిక జనాభాగల దేశం అవుతుంది.చైనా తన జనాభాను మనలాగా పెంచుకోకుండా ఎందుకు ఆపుకుంటోంది? ఎందుకంటే ప్రపంచంలోని  129 కోట్ల మంది పేదలలో 40 కోట్ల మంది ఇండియాలో ఉంటే  17 కోట్ల మంది చైనాలో ఉన్నారట.ఆ 17 కోట్లమందిని పైకి తీసుకురావటం కోసం పక్కా ప్లాన్ అన్నమాట.పేదలులేని దేశం చైనా అనిపించుకోటానికి వాళ్ళు ఎంత త్యాగం చేస్తున్నారో చూడండి.     
ఎందుకీ త్యాగం?
అధిక జనాభా వలన  నేల, నీరు, ఆహారం దొరకక మనిషి అల్లాడిపోతాడు. ప్రకృతి వనరులు ప్రజలకు సరిపోవు.మన దేశంలో ఏడు కోట్ల మంది మురికి వాడలో నివసిస్తున్నారు. అందులో 15శాతం మంది  మన రాష్ట్రంలోనే ఉన్నారు. పల్లెలనుంచి పట్టణాలకు వలసలు  పెరుగుతున్నాయి. అలా పట్టణాలకు  వచ్చి పడుతున్న జనాభా కోసం మురికి వాడలు వెలుస్తున్నాయి.ఎంత మందికి కనీస జీవన సదుపాయాలు అమరాయన్నది పాలకులు చూడఋ. సంపదను ప్రజలందరికి సమానంగా పంచి ఇవ్వగల వ్యవస్థ లేని దేశాలలో దోపిడీ విపరీతంగా జరిగి మానవ వనరులు వ్యర్ధమౌతాయి. తమ పేద పుట్టుక ,కాటిక దారిద్ర్యం,నిరుద్యోగం అన్నీ విధివ్రాత గా ,ఖర్మగా భావించి ప్రజలు దుర్భర జీవితాలను గడుపుతారు. మత బోధకులు మాత్రం నీరుపోసినవాడే నీరూ పోస్తాడు,ఇది మీ తలరాత ,పుత్రులులేకపోతే పున్నామనరకమేగతి అంటూ ఇంకా ఇంకా జనాన్ని పుట్టించమని ప్రోత్సహిస్తారు. అన్నీ అమరినవారికి  జనవృద్ధి మంచిదే గానీ ఏమీలేని నిరుపేదకు ఎందుకీ సంతానం? అంతటా కులమత వివక్ష ,పెత్తందార్ల దోపిడీ అమలయ్యే సమాజంలో, పుట్టిన వాళ్ళందరికీ సమానన్యాయం జరుగుతుందన్న హామీలేని సమాజంలో బ్రతుకు నిరంతర పోరాటమేకదా? స్వతంత్ర దేశంలో చావుకూడా పెళ్ళి లాంటిదే బ్రదర్ అని పాడుకుంటున్న ఆకలి రాజ్యంలో అధికజనాభా సృష్టి తగునా? జనసంక్షేమానికి పెద్దపీట చైనా కూడా తన దేశంలోని అపారమైన మానవ వనరులను చాలా జాగ్రత్తగా వస్తువుల ఉత్పత్తి కోసం లాభదాయకంగా ఉపయోగించుకుంటూ కూడా ఒక్కబిడ్డే లేదా అసలొద్దు (ONE or NONE) ‘మేమిద్దరం మాకొక్కరే లాంటి కఠిన సూత్రాలతో జనాభాను గట్టిగా నియంత్రించింది. జనన మరణాలు సమాన స్థాయిలో ఉండేటట్టు చూసుకుంది. జనాభా మరీ పెరిగిపోతే దేశ భవిష్యత్తు ఎంత భయంకరంగా ఉండబోతోందో  అక్కడి పాలకులు ఖచ్చితంగా అంచనా వేశారు,దేవుడిమీద భారం వేయకుండా తమ కర్తవ్యం సరైన సమయంలో సరిగ్గా నిర్వహించారు.

మరి మన దేశంలో?
      
1970 లలో ఒక రాజ్యసభ మెంబర్ ఒకబిడ్డతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న వారికి అరఎకరం పొలంగానీ 25 వేల రూపాయల పారితోషకం గానీ ఇవ్వాలని ప్రతిపాదిస్తే కుదరదు అని ఆ ప్రైవేటు బిల్లును ఓడించారట. 1972 వినియోగ దారుల ధరల సూచిక ప్రకారం ఒక బిడ్డ సగటున 65 ఏళ్ళు బ్రతుకుతాడనుకుంటే రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంతకంటే ఇలా పేదవారికి ప్రోత్సాహకాలిచ్చి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలని వాదించాడట.పాలకులు అతనిమాట వినలేదు.చివరికి సంజయ్ గాంధీ నిర్బంధ ఆపరేషన్లకు పాల్పడితే ఏమయ్యిందో మానందరికీ తెలుసు. ఆతరువాత 1980 లలో కేంద్రం కొన్ని చిత్రమైన నిబంధనలు విధించింది. ఆ నిబంధనలు కు.ని.కార్యక్రమానికే  అవరోధంగా తయారైనాయి. ఆపరేషన్ చేయించుకునే   వారికి ఇద్దరు బిడ్డలు ఉండాలి. వారిలో చిన్న వాని వయస్సు 2 సంవత్సరాలుండాలి. ఆపరేషన్ చేయించుకునే స్త్రీకి 20 ఏళ్ళు పురుషుడుకి 25 ఏళ్ళు ఉండాలి. అందువల్ల దేశంలో 18 నుంచి 35 ఏళ్ళ మధ్య ఉన్న 30 కోట్లమందికి ఆపరేషన్ చేయలేకపోయారు. అలాగే ఇద్దరు బిడ్డలు లేని మరి కొంత మందికి కూడా ఆపరేషన్ చేయలేకపోయారు. ఇక అధిక సంతానం ఉన్న ఛాందసులైన పెద్దలు ఎలాగూ ఆపరేషన్ చేయించుకోలేదు. ఇక ప్రభుత్వం ఆపరేషన్లు      చేసేదెవరికి? ఒక పక్క ప్రచారం చేస్తూనే మరో పక్క ఇటువంటి నిర్భందాలు విధించి జనాభా తగ్గకుండా ప్రభుత్వమే కాపాడు కొస్తోంది.
మన దేశంలో జనాభా పెరగడానికి కారణాలు..
- ఎక్కువ సంతానం ఉంటే గొప్ప అనుకోవటం

- ఆడ, మగ ఇద్దరూ సమానమనే భావన లేకపోవటం, ఆడపిల్లలు పుట్టారని మగపిల్లవాడి కోసం ఆగటం
- బాల్య వివాహాలు
- నిరక్షరాస్యత
- అపుత్రస్య గతిర్నాస్తి , పిల్లలు పుట్టకుండా చేసుకోవడం మహాపాపం లాంటి మత విశ్వాసాలు మూఢనమ్మకాలు

- ఆపరేషన్ స్త్రీలే చేయించుకోవాలి అంటూ  పురుషులు కుటుంబ నియంత్రణకు ముందుకు రాకపోవటం

గులాంనబీ అజాద్ గారి సూక్తిముక్తావళి
"జనాభా నియంత్రణకు లేటు వయసు పెళ్లిళ్లే సమర్థనీయం. 30-31 ఏళ్లకు వివాహాం చేసుకునే వారికే ప్రోత్సాహకాలు ఇవ్వాలి.అధిక జనాభాతో వనరులు నానాటికీ తగ్గిపోతున్నాయి.అస్ట్రేలియా, అమెరికా వంటి దేశాలే వారి ప్రజల ఉద్యోగాల రక్షణకు భారతీయుల్ని తిప్పి పంపిస్తున్నాయి. దేశంలో జనాభా పెరుగుదల, వనరుల అభివృద్ధి మధ్య భారీ వ్యత్యాసం నెలకొంది భవిష్యత్తులో యుద్ధాలు ఉన్నవారికీ లేనివారికీ మధ్యే జరుగుతాయి.నక్సలిజం ఇందుకు ఓ ఉదాహరణ" అని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి గులాంనబీ అజాద్ దేశ ప్రజలకు హితబోధ చేశారు.కానీ ప్రోత్సాహకాలు లేకుండా ఎవరు వింటారు?

ప్రతి ఏటా జులై 11 ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.ఏటా కోటి మందికి పైగా పిల్లలుఆకలితో చనిపోతున్నారు.ప్రపంచంలో ప్రతి సెకనుకు అయిదుగురు పుడుతుంటే, ఇద్దరు చనిపోతున్నారు. అంటే సెకనుకి ముగ్గురు చొప్పున జనాభా పెరుగుతోంది.ప్రతి 40 ఏళ్లకీ జనాభా రెట్టింపు అవుతున్నారు. జనాభా నియంత్రణ మీదకంటే పాలకుల దృష్టి ఆహార భద్రత’,అక్షర దీక్ష’, వయోజనవిద్య,రాజీవ్ విద్యామిషన్,ఉన్నతవిద్య, ... లాంటి శ్రేయోదాయక స్కీములమీదనే ఎక్కువగా ఉంది.కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కు ఇచ్చే ప్రోత్సాహకం మొత్తాన్ని ఇప్పటికీ పెంచలేదు.కొన్నిచోట్ల ఆపరేషన్ చేయించుకున్న తల్లుల్ని నేలమీదే పడుకోబెట్టి సత్కరించి పంపిస్తున్నారు.బిడ్డల్ని కనకుండా ఆపరేషన్ చేయించుకుంటున్న వారు దేశభక్తులు,స్వాతంత్రసమరవీరులకంటే గొప్పవారు.ఎందుకంటే వారు తమనుతాము రక్షించుకోవటమేగాక దేశాన్ని పెద్ద ప్రమాదం నుండి,వత్తిడినుండి రక్షిస్తున్నారు.
అతివృష్టి-అనావృష్టి
రోజురోజుకీ పెరుగుతున్న జనాభాతో కొన్ని  దేశాలు సతమతమవుతుంటే జననాలు బాగా తగ్గి స్పెయిన్ దేశం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. జననాల సంఖ్య తగ్గించేందుకు అనేకదేశాలు
వగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రోత్సాహకాలు ప్రకటిస్తుంటే, స్పెయిన్ దానికి విరుద్ధంగా పిల్లల్ని కనడానికి ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఎక్కువమంది పిల్లల్ని భరించే శక్తిలేదని చాలా దేశాలు  వాపోతోంటే, పిల్లల సంఖ్య తగ్గిపోయిందని స్పెయిన్ దేశం ఆవేదన చెందుతోంది. స్పెయిన్లో జననాల రేటు పెరగడానికి కొత్తగా ఒక పాప లేదా బాబుకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, పిల్లలను పెంచుకునే తల్లిదండ్రులకు స్పెయిన్ ప్రభుత్వం 2,500 యూరోల (139500 రూపాయల) ఆర్థిక బహుమతి ప్రకటించింది. ఇండియాలో జనసాంద్రత కి.మీ. కి 937 మంది. అదే స్పెయిన్ లో 240  మంది.

మన దేశంలో కుటుంబ నియంత్రణను ప్రోత్సహించడానికి ఎస్‌సీ, ఎస్‌టీ, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు కు.ని. శస్త్రచికిత్సలు చేయించుకుంటే ట్యూబెక్టమీకి రూ.1350, వేసెక్టమీకి రూ. 1300 ప్రైవేటు ఆస్పత్రులకు ఇస్తున్నారు. మన రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వారికి ప్రోత్సహక నగదుగా మహిళకు రూ.600, పురుషుడైతే రూ.1150 ఇస్తారు. ఆశ కార్యకర్తలకు ప్రోత్సాహకంగా మహిళను తీసుకొస్తే రూ.150, మగ అయితే రూ.200 నగదును అందిస్తున్నారు. జననీ సురక్ష యోజన పథకం ద్వారా ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం చేయించుకునే మహిళకు రూ.700 నగదు ఇస్తారు. ఒక సంతానం చాలనుకునే దంపతులను లక్కీడీప్‌ ద్వారా గుర్తించి జిల్లాకు ఒక్కరికి రూ.10 వేలు నగదు ప్రోత్సాహకంగా వైద్య ఆరోగ్య శాఖ అందిస్తుంది.

జన సాంద్రత కి.మీ.కు 50 కంటే తక్కువ  ఉన్నదేశాలు

ఉరుగ్వే(49),జాంబియా,వనౌటు,న్యూజిలాండ్,పెరాగ్వే,సోమాలియా, ఫిన్ లాండ్, అర్జెంటైనా ,భూటాన్,అల్జీరియా,నార్వే,ఒమన్,బెలిజే,పాపువాన్యూగినియా,సౌదీ అరేబియా,నైగర్,కాంగో,మాలి,అంగోలా,టర్క్ మేనిస్తాన్,బొలీవియా, చాద్,రష్యా, దక్షిణ సూడాన్,మధ్య ఆఫ్రికా,కజకిస్తాన్,మార్షల్ దీవులు,లిబియా,గుయానా,బోట్స్వానా,కెనడా,మారిటానియా,ఐస్ లాండ్,సూరినామ్,ఆస్ట్రేలియా,నమీబియా,మంగోలియా,పచ్చిమ సహారా (5) .

జన సాంద్రత కి.మీ.కు 1000 కంటే ఎక్కువ ఉన్నదేశాలు

మొనాకో(30539),సింగపూర్,వాటికన్,బహరైన్,మాల్దీవులు,మాల్టా,బంగ్లాదేశ్,బార్బడోస్,తైవాన్,మారిషస్,శాన్ మారినో,దక్షిణ కొరియా,నౌరు,రువాండా,తువాలు,నెదర్ లాండ్స్,లెబనాన్ (1032)

ప్రపంచ బ్యాంకు,ఐక్యరాజ్య సమితి బాధ్యత
ప్రపంచ జనాభా దినోత్సవం (జూలై 11) సందర్భంగా అన్ని పేదదేశాల్లో ఆపరేషన్ చేయించుకున్న దంపతులకు లక్ష రూపాయల ఆర్థిక బహుమతిని వరల్డ్ బ్యాంక్ సహకారంతో ప్రకటించితే బాగుండేది. అలాగే ఐక్యరాజ్యసమితి ఆయా దేశాలను సంప్రదించి అధిక జనాభాతో బాధ పడుతున్న దేశాలనుండి వలసపోవటానికి ఇష్టపడేవారిని అల్ప జనాభాతో బాధపడే దేశాలకు తరలిస్తే ప్రపంచదేశాల్లో జనాభా సమతుల్యంగా ఉంటుంది.ప్రపంచీకరణ (గ్లోబలైజేషన్ )కు ఎంతగానో మద్దతిస్తున్న ఐక్యరాజ్యసమితి ప్రపంచ జనాభాను భూగోళమంతా సమంగా సర్దే  బాధ్యత తీసుకోవాలి. అది అమెరికా చెప్పినట్లు మాత్రమే నడుచుకున్నంత కాలం భూ గోళం మీద కొన్ని చోట్ల అధిక జనాభా ఆకలి కరువు తాండవిస్తూనే ఉంటాయి.వనరులకోసం యుద్దాలు జరుగుతూనే ఉంటాయి.

అన్ని సమస్యలకూ మూలం.. అధిక జనాభా

 ‘దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్’-అన్నారు మహాకవి గురజాడ. ప్రజలే దేశానికి నిజమైన ఆస్తి. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే  నైపుణ్యం గల మానవ వనరులు ఎంతో అవసరం. ఏ పనిలోనూ నిపుణతలేని మితిమీరిన జనాభా దేసానికి అరిష్టం. మనదేశంలో బాల్య వివాహాలు, మగ సంతానం కోసం ఎదురుచూడటం, మతపరమైన సాంఘిక అంశాలు కూడా జనాభా పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి. చైనా చాలా ముందుగానే మేల్కోని జనాభా నియంత్రణపై కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించింది. జనాభారేటును తగ్గించడానికి 1979లోనే ఏక సంతాన విధానాన్నిప్రవేశపెట్టింది. అక్కడి దంపతులు శిశు జననానికి ముందుగానే అనుమతి పొందాలి. అలా పొందిన తర్వాతే వారు బిడ్డను కనాలి. ఈ విధానానికి ఒప్పుకున్నవారికి ప్రత్యేక రాయితీలు కల్పిస్తారు. నిబంధనలకు విరుద్ధంగా ఇద్దరు పిల్లలు కలిగితే వారి ఆదాయం నుంచి పన్నులు అధికంగా వసూలు చేస్తారు. దీనిని కచ్చితంగా అమలుచేయడానికి ప్రత్యేకంగా అధికారులను కూడా నియమించారు. మన దేశంలో దొంగలు, బిక్షగాళ్ళు, పిల్లల్ని అమ్ముకునేవాళ్ళు కూడా యాదేచ్చగా పిల్లల్ని కంటున్నారు. గర్భంలో ఉన్నది ఆడపిల్లని తేలితే అక్కడే చంపేస్తున్నారు.మగపిల్లవాడి కోసం ఆగుతూ ఆడపిల్లల్ని అధికంగా కని ఆడపిల్లలను అయినకాడికి అమ్ముకోవడమో ,చదివించకుండా ఇతరుల ఇళ్ళల్లో వెట్టి చాకిరికి పెట్టడమో చేస్తున్నారు. కన్నతల్లులు కూడా ఇష్టం లేని ఆడపిల్లకు వాటాలు పెట్టి చిత్రహింసలకు గురిచేస్తున్నారు.ఇలాంటి సంఘటనలపై నిఘాలేదు.నార్వే ప్రభుత్వం లాగా మన ప్రభుత్వం కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే ఎంతోమంది దుర్మార్గపు తల్లిదండ్రులు దొరుకుతారు. కుటుంబ నియంత్రణ విషయాన్ని దంపతుల అంగీకారానికే వదలివేయడం దేశాన్ని అధోలోకంలోకి తొక్కివేయడమే అవుతుంది.బాధ్యతలేని ప్రజలు  మా బిడ్డ.. మా ఇష్టం.అంటూ తెగ కనేస్తున్నారు.అధిక సంతనానికి కంట్రోలు లేదు. ఇది గృహ సమస్య మాత్రమే కాదు. జాతీయ సమస్య , అంతర్జాతీయ సమస్య కూడా.  ఇద్దరు లేక ముగ్గురు’ ‘మేమిద్దరం-మాకిద్దరు  నుండి ఒక్కరు లేదా అసలేవద్దు ఒక్కరు చాలు స్లోగన్ కు మారాము.  నినాదానికి చట్ట రూపం తేవాలి.లేకపోతే అధిక జనాభా దేశానికి పెను భారంగా మారుతుంది. దేశము  అభివృద్ధి చెందదు.మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అన్నట్లు వ్యవసాయ భూములపై ఒత్తిడి పెరిగి, కమతాల పరిమాణం తగ్గి వనరుల కొరత ఏర్పడుతోంది.జనాభా నియంత్రణ కోసం ప్రభుత్వం, ప్రజలు కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు.ఇప్పుడున్న వారికీ  భావితరాల వారికి కూడా మంచి సౌకర్యవంతమైన జీవితాన్ని అందించటం మనందరి బాధ్యత.పుట్టే బిడ్డలకు హక్కులేమీ ఉండవా?వారిని సరిగా పోషించలేని వాళ్ళు పసిబిడ్డల చాకిరితో బ్రతికేస్తామని ఆశించి కనటం దుర్మార్గం కాదా?  
వైద్యసేవల వలన మానవుని సగటు జీవనం 60నుంచి 70యేళ్లకు పెరిగింది. జనాభా ఎంత పెరిగినా  భూ విస్తీర్ణం మాత్రం అంతే వుంటుండి. ఇలాగే వుంటే గాలి కూడా కొనుగోలు చేయాల్సి వస్తుంది . మనదేశంలో  45సంవత్సరాల నుంచి కుటుంబ సంక్షేమకార్యక్రమాలు అమలు జరుగుతున్నా 40 కోట్లున్న జనాభా 121 కోట్లకు పైగా పెరిగింది. అధిక జనాభా వల్ల గాలి, నీటి కాలుష్యం, నేల, పెట్రోల్, డీజిల్ దొరకక అన్నీ సమస్యలుగా మారాయి. దేశంలో పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం విలయ తాండవం చేస్తున్నాయి.
చిన్న కుటుంబాల సాధన లో ఎందుకు విఫలమౌతున్నాం?
రోజు రోజుకు జనాభా పెరిగిపోతోంది. ప్రజలకు కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ వంటి సౌకర్యాలు అందడం లేదు. ప్రభుత్వం జనాభా నియంత్రణ కార్యక్రమాలు తూతూమంత్రంగా నిర్వహిస్తోంది. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం,పరిమిత కుటుంబం ప్రగతికి సోపానం అని నినాదాలు వినటానికి బాగానే ఉన్నాయి గానీ చట్టం తేలేకపోతే ఎవరూ ఆచరించరు.ఆధునిక విజ్ఞానం ఫలితంగా తెలివైన మంచి ప్రజలు చాలావరకు కుటుంబ నియంత్రణ పాటిస్తున్నారు. అయినా జనాభా పెరిగిపోతోందంటే  ఏరకం జనం దానికి కారణమౌతున్నారో విశ్లేషించి ఆయా ప్రజలమీద దృష్టి నిలపాలి.బంగారుతల్లి లాంటి పధకాలు ఎన్నో రావాలి .ఒక్కబిడ్డ చాలు అనేదే ఇప్పుడు చట్టబడ్డం కావాలి.రెండో బిడ్డ కావాలనుకునేవాళ్ళు దేశ శ్రేయస్సు కోసం  అనాధ బాలలను దత్తత తీసుకొని పెంచుకోవాలి.దేశ క్షేమం కోసం తప్పదు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వారికి పాతిక వేలిస్తామంటే పరిగెట్టుకొచ్చే పేదలు నేటికీ లక్షల్లో ఉన్నారు.ప్రోత్సాహక మొత్తాలను పెంచటం ఉభయతారక మంత్రం.ప్రభుత్వం ఆలోచించాలి.

సూర్య 11.10.2013

 https://www.facebook.com/photo.php?fbid=643786715653322&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి