ఈ బ్లాగును సెర్చ్ చేయండి

13, అక్టోబర్ 2013, ఆదివారం

కోస్తా అభివృద్ధికి కొన్నిచర్యలు



కోస్తా అభివృద్ధికి కొన్నిచర్యలు
నూర్ బాషా రహంతుల్లా 9948878833

                  
ఒక పక్క తుఫానుల బాధలు, మరోపక్క రాష్ట్ర విభజన వార్తలతో కోస్తాంధ్ర ప్రాంతం అల్లాడిపోతోంది. రాయలసీమ నాయకులు కొందరు కోస్తావాళ్ళను మేము నమ్మలేము,వారితోకలిసిఉండలేము,రాజధానినికర్నూలులోపెట్టాలని,అంటున్నారు. 
తెలంగాణావాళ్ళూతెగతెంపులుచేసుకుంటున్నారు.ఇంతమందికీ కోస్తా వాళ్ళే ఎందుకు కంటగింపు అయ్యారు?  ఎందుకిలా? కోస్తా ప్రజలు చేసిన నేరమేమిటి? 

 972 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరప్రాంతమున్న కోస్తాలో రోడ్లు వేసి రవాణా మార్గాలు అభివృద్ధి చేస్తే ఎన్నో రుషి కొండలు, మరెన్నో రామకృష్ణాబీచ్ లు తయారయ్యేవి..అభివృద్ధి ఖర్చంతా హైదరాబాదు,విశాఖపట్టణం లోనే పెట్టారు.మిగతా కోస్తా బారుకీ పేద మురికి సముద్రముంది గానీ అందాలకు నోచుకోలేదు.కటిక పేదరికం తాండవిస్తోంది.సెజ్ లు వచ్చాక తీరంలోని ఇసుక దిబ్బలు,సరివి తోటలు గ్రామాలకు గ్రామాలే  క్రమంగా మాయమైపోతున్నాయి.తెలంగాణా రాయలసీమ కోస్తాకు పై భాగంలో ఉన్నాయి.ఆ ప్రాంతాలనుంచి వదిలే మురుగునీరు, వరదలు కోస్తా ప్రాంతమే మొయ్యాలి.తుఫానుల మొదటి దెబ్బ కోస్తావాళ్ళే కాయాలి.వాగులపై వంతెనలుండవు.కోస్తావాసుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు.కోస్తా కష్టాలు తీర్చటానికి ఇకనైనా పధకాలు సిద్ధం చెయ్యాలి.

తుఫానులు వరదలు వచ్చినప్పుడు ఉన్నతాధికారులు కోస్తాను దర్శించిపోవటం కాకుండా కోస్తా ప్రాంతాభివృద్ధికోసం శాశ్వత ప్రాంతీయ కార్యాలయాలు  ఏర్పాటుచెయ్యాలి.ప్రయాణం అనుత్పాదక వ్యయం.రాజధానికి జిల్లా కేంద్రాలకూ ప్రయాణించే అవసరం కోస్తా ప్రజలకు గణనీయంగా తగ్గించి కోస్తా ప్రాంతానికి మేలు చేయాలి.ఒక్కచోటే పేరుకుపోయిన పరిశ్రమలను మిగతా ప్రాంతాలకు తరలించకపోతే కోస్తా ఎడారికాక ఏమౌతుంది? ఎన్టీ రామారావు గారు మండలాలు పెట్టి ప్రజలకు మహోపకారం చేశారు.అలాగే కొత్తజిల్లాల ఏర్పాటుపై దృష్టి సారిస్తామన్నారు.పార్లమెంటు స్థానాలన్నీ జిల్లాలుగా మారాలి.విజయవాడ,తిరుపతి, రాజమండ్రి ,భద్రాచలం లాంటి కీలక కేంద్రాలను ఈనాటికీ కనీసం జిల్లా కేంద్రాలుగా కూడా ఎదగనీయకపోవటం ధర్మమేనా?

తుఫానులు వరదల సమయంలో ఎంతకాలమీ అలవిమాలిన పెద్దజిల్లాలతో కోస్తా ప్రజలు  అవస్థ పడాలి?తీరప్రాంతాలలో కోట్ల మంది ప్రజలు సరైన రవాణా వ్యవస్థ లేక నదులు,వాగులు,మురుగుకాలవలుదాటలేకఅవస్థలుపడుతున్నారు.తలదాచుకోటానికి పాత కాలం నాటి చర్చీలు,గుడులు,తుప్పుపట్టిన ఊచలు బయటకు కనిపిస్తున్న తుఫాను షెల్టర్లలో ఆశ్రయం పొందటం  మరింత యంకరంగా ఉంది.కోస్తాలో మెరకతోలిన స్థలాల్లో ఎవరి పక్కా బిల్డింగ్ వారికి ఖచ్చితంగా కట్టించి ఇవ్వాలి.కోస్తా జిల్లాలలోని మన యువకులంతా మరో దిక్కు లేక రాజధానికి వెళ్ళిపోతున్నారు.కోస్తా జిల్లాలు వృద్ధాశ్రమాలలాగా తయారయ్యాయి.ముసలోళ్ళకు మందుబిళ్ళ తెచ్చిచ్చేవాళ్ళుకూడా లేరు.భారీ వర్షాలు,తుఫానుల సమయంలో కోస్తా వృద్ధులు అనాధల్లా విలవిలలాడుతున్నారు.మన పిల్లలకు మన ఊళ్ళలోనే ఎక్కడికక్కడ దగ్గరలో ఉద్యోగాలు దొరకాలంటే పరిశ్రమల వికేంద్రీకరణ తప్పదు.

వికేంద్రీకరణలో దూరం భారం తగ్గించే మానవత్వం ఉంది.మిగతావారికీ ఫలాలు సమానంగా దక్కాలని చేసే త్యాగం ఉంది.కేంద్రీకరణలో అంతా నాకే కావాలి అనే స్వార్దం,అంతా నాదే అనే నిరంకుశత్వం ఉంది.అవినీతి ఉంది.విభజనవాదానికి విరుగుడు,సమైక్యత సాధించే సాధనం అభివృద్ధి కేంద్రాల వికేంద్రీకరణ.

స్థానిక నాయకులకు బలంలేకపోయినా,ప్రజా సమశ్యలు పట్టించుకోకుండా పదవీకాలం గడిపినా ప్రజల దుస్థితి ఇంతే.గ్రామాల అవసరాలపట్ల ఐక్యత లేకపోవటం,కులాలూ మతాలూ పార్టీలవారీగా పనులు నిరాకరించటం,కీర్తి తమకుమాత్రమే దక్కాలని ఒకరు తెచ్చిన పనికి మరొకరు అడ్డంపడటం,..ఇలా ఎన్నో కారణాలతో కోస్తా వాసులు బాధలు పడుతున్నారు.విమానం ఎక్కగలిగేవాళ్ళకు ఈ కష్టం తెలియకపోవచ్చుగానీ ఆర్టీసీ బస్సులతో అవస్థలుపడేవాళ్ళకు బాగా తెలుసు.సముద్ర తీరప్రాంత వాసుల సమశ్యలు ప్రత్యేకమైనవి.
తుఫాను దెబ్బ తిన్న ప్రాంతాలను సందర్శించాక కేంద్రప్రభుత్వ ప్రతినిధులుగానీ, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులుగానీ  ప్రతిపాదించే పథకాలు మన రాష్ట్రానికి ఎలాంటి మేలు చేసేవిగా కనిపించడం లేదు.చ్చే నిధుల్ని స్థానిక అవసరాలకు అనుగుణంగా మన ఇష్టం వచ్చినట్లు వాడుకొనే స్వేచ్ఛను మనకు ఇవ్వకుండా వాటిని ఎలా వాడాలి. ఏ పనులకు వాడాలి అనే షరతులు కూడా వాళ్ళే విధించడం శోచనీయం. ఉదాహరణకు తుఫాను సమయాలలోముంపునకు గురి అవుతున్న ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలను చూసిన ప్రపంచ బ్యాంకు బృందం కోస్తా జిల్లాలలో చేపట్టవలసిన పనుల్ని కూడా సూచించింది. ఆ పనులు ఏమిటంటే – (1) ఎగువ ప్రాంతాలలోని వర్షపు నీరు ఒక్కసారిగా తీర ప్రాంతాలపై విరుచుకుపడకుండా మధ్యలో ఒక పెద్ద అడ్డు కట్ట నిర్మించడం, (2) మిగులు నీరు త్వరగా సముద్రంలోకి వెళ్ళేందుకు మరిన్ని మురుగు కాలువలు తవ్వడం.ఈ రెండు పనులూ ఈ నాటికీ జరగలేదు.
       వివిధ పార్టీల నాయకులు, ఆయా జిల్లాల అధికారులు ఈ ముంపు నివారణకు, తుఫాను వల్ల కలిగే నష్టాల తగ్గింపునకు ఇంకా చక్కని సూచనలు చేశారు. మధ్యలో పెద్ద సైజు అడ్డుకట్ట నిర్మించే బదులు ఎగువ ప్రాంతాలలో ఎక్కువ సంఖ్యలో చిన్న చిన్న రిజర్వాయర్లు నిర్మిస్తే – ఎక్కడి నీరు అక్కడే నిలవ ఉంటుందనీ, దిగువ ప్రాంతాలకు ముంపు బెడద తప్పడమే గాక, ఎగువ ప్రాంతాలలో ఎంతో భూమికి నీటి పారుదల, మంచినీటి సౌకర్యం కలుగుతుందని చెప్పారు.లాగే మురుగు కాలువల పూడిక తీయించి వాటి గట్లు పటిష్టం చేసి- నదులు, కాలువల గట్ల మీద తారు రోడ్లు వేసి రవాణాకు వాడుకోవచ్చునని తెలిపారు. కాని వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినా , మనకు ఉపయోగించకుండా పోయే పథకాలను  బృందాలు నిర్ణయించాయి. ప్రపంచ బ్యాంక్ నుంచి తీసుకునే అప్పు మీద మనం  వడ్డీ కడతాము. అప్పు తిరిగి తీరుస్తాము. అలాంటప్పుడు ఆ డబ్బుతో మన స్థానిక అవసరాలను తీర్చుకునే పథకాలను మనమే నిర్ణయించుకునే స్వేచ్ఛ కూడా లేకుండా చేయడం ఏం భావ్యం?
       అప్పట్లో ముఖ్యమంత్రి  చెన్నారెడ్డి ప్రపంచ బ్యాంకు సహాయంతో చేపట్టే ప్రాజెక్టులన్నింటి కోసం ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు ఆయన కుమారుడే ఈనాటి జాతీయ విపత్తుల నివారణ నిర్వహణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధరరెడ్డి .ఒక తరం గడిచిందిగానీ కోస్తాకు పెద్దగా ఒరిగిందేమీ లేదు.ఆంధ్ర కర్నాటకలకు కలిపి NDRF(National Disaster Response Forse) బెటాలియన్ ను మాత్రం మంగళగిరిలో పెట్టారు.ఇప్పుడైనా కోస్తా బాధల నివారణ కోసం కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలి. 
తొమ్మిది కోస్తా జిల్లాలలో చేపట్టదగిన పనుల్ని ఒకటికి పదిసార్లు ఆలోచించి, శాశ్వత ఫలితాలనిచ్చే వాటిని మాత్రమే అంగీకరించాలి. ఏదో ఒక పని జరిగితే చాలులే అనుకోకుండా, శాస్త్రీయ దృక్పథంతో కోస్తా జిల్లాల సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ- రాజకీయ ఆవేశాలకు అతీతంగా ఆలోచించాలి. మన రాష్ట్రానికి 972  కిలో మీటర్ల సముద్ర తీర ప్రాంతం  తొమ్మిది జిల్లాలలో ఇలా ఉంది :
1.    నెల్లూరు            -        160 కి.మీ
2.    ప్రకాశం             -        100 కి.మీ
3.    గుంటూరు          -        62  కి.మీ
4.    కృష్ణా               -        95 కి.మీ
5.    పశ్చిమ గోదావరి  -        50 కి.మీ
6.    తూర్పు గోదావరి  -      170  కి.మీ
7.    విశాఖపట్నం      -        130 కి.మీ
8.    విజయనగరం      -      45 కి.మీ
9.    శ్రీకాకుళం          -        160   కి.మీ
ఇక ఈ తొమ్మిది జిల్లాలో ప్రవహించే నదులు, ఉప నదులు, వాగులు, కాలువలు అన్నీ లెక్కబెడితే 53 వచ్చాయి. అంటే వరద ప్రమాదం కలిగించే అవకాశం ఉన్నవి మాత్రమే 53. నెల్లూరు జిల్లా నుంచి ప్రారంభించి శ్రీకాకుళం వరకు ఉన్న ఈ దుఖ:దాయినుల పేర్ల చిట్టాను పరిశీలించండి:
       "మున్నేరు, ఉప్పుటేరు, పిల్లలేరు, స్వర్ణముఖి, కండలేరు, పెన్న, జింపలేరు, ఎనుములేరు, మూసీ, పాలేరు, జర్రివాగు, డిండి వాగు, చంద్రవంక, జయంతి, కట్టలేరు, ఇప్పలవాగు, తెల్లేరు, బల్లలేరు, నడిమేరు, తమ్మిలేరు, ఎర్రకాలువ, బైనేరు, కొవ్వాడ కాలువ, జూలేరు, రాళ్ళమడుగు, గుండేరు, కొల్లేరు, ఉప్పుటేరు, గోదావరి, ఏలారు, వశిష్ట, గౌతమి, తాండవ, మేఘాద్రి గడ్డ, నరుగుడు గడ్డ, వరాహ, మాచ్ ఖండ్, శారదా, వేగావతి, గోముఖ, సువర్ణముఖి, చంపావతి, గోస్తనీ, బాహుదా,నాగావళి, వంశధార."

       ఈ ఏరులు, వాగులు, నదులు ఆయా జిల్లాలలో ఎన్ని కిలోమీటర్ల పొడవుతో ఉన్నాయి. వాటి వలన ప్రమాదం కలిగే అవకాశం ఎంత, వీటి మీద వంతెనలు కట్టవలసిన చోట్లు మొదలైనవన్నీ సవివరంగా పరిశీలనలు చేయాలి. అరవై ఏళ్ళ అనుభవం ఉన్న మన రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ, నీటి పారుదల శాఖ తలుచుకుంటే ఈ వివరాలుకేవలం పది రోజుల్లో సమకూర్చగలవు. అలా సమకూర్చిన వివరాల ఆధారంగా – ఆయాజిల్లాల తీర ప్రాంతం పొడవు. ఆ జిల్లాల్లో వచ్చిపడే నీటి పరిమాణం, తుఫానులు ఎప్పుడెప్పుడు సంభవించేది, వర్షపాతం, వేడి, రహదారుల లభ్యత మొదలైన విషయాలను నిర్ధారణ చేసి ఒక్కో జిల్లాకు అవసరమైన పనులు ప్రారంభించాలి. కోస్తా జిల్లాల ప్రత్యేక అవసరాలను గుర్తించి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి యేటా బడ్జెట్ లో కోస్తా అభివృద్ధి కోసం నిధుల్ని కేటాయించాలి. ఆంధ్ర కోస్తా అభివృద్ధి చెంది నిరపాయకరంగా ఉండాలంటే ఈ క్రింది చర్యలు చేపట్టాలి –
(1)  ఈ 53 వాగులు వంకల రెండు గట్లను తారు రోడ్లుగా మలిచి రవాణాకు ఉపయోగించాలి. ఎక్కడెక్కడైతే కాలువలు దాటడం కోసం బల్లకట్టులు, పడవలు ఉపయోగిస్తున్నారో,వాగులు దాటుతూ ఎక్కడ జనం చనిపోతున్నారో  అక్కడల్లా వంతెనలు నిర్మించాలి. కాలువల పూడిక తీయించి జల మార్గాల రవాణాను ప్రోత్సహించాలి. గట్లు పటిష్టపరచడం కోసం లైనింగ్ పనులు చేపట్టాలి.
(2)  ప్రతి వాగు, ఏరు, నదుల ఎగువ ప్రాంతాలలో రిజర్వాయర్లు నిర్మించాలి. 150 మిలియన్ ఎకరా అడుగుల నీరు ప్రతి యేటా బంగాళా ఖాతంలో వృధాగా కలుస్తోంది. అంటే ఇండియాలోని నదులన్నింటి నీటిలో 15 శాతం అన్నమాట. గోదావరి నది మన రాష్ట్రంలో 772 కిలోమీటర్లు, కృష్ణా నది 670 కిలో మీటర్లు ప్రవహిస్తున్నాయి. పెన్నా నది 568 కి.మీ ప్రవహిస్తోంది. ఈ మూడు నదుల వల్లనే 75 శాతం నీరు రాష్ట్రం లోకి వచ్చిపడుతున్నది. నాగావళి 115 కి.మీ. వంశధార 90 కి.మీ మన రాష్ట్రంలో ప్రవహిస్తున్నాయి. ప్రతి 50 కిలో మీటర్లకు ఒక రిజర్వాయర్ నిర్మిస్తే చుక్క నీరు కూడా సముద్రంలో కలవదు. 20 మంది పార్లమెం టు సభ్యులు కోస్తా జిల్లా నుంచే  ఢిల్లీ వెళ్ళారు. పార్టీలతో ప్రమేయం లేకుండా వారంతా కోస్తా ప్రాజెక్టుల కోసం కేంద్రాన్ని అడగాలి.
(3)  కోస్తా జిల్లాలలో కొత్త రైలు, రోడ్డు మార్గాలు నిర్మించాలి. అడుగడుక్కీ అడ్డం వచ్చే కాలువలు, నదుల వల్ల సరుకుల రవాణా కష్టమవుతున్నది. పైగా తుఫానులు వచ్చినప్పుడు నెల రోజుల పాటు జనం జలదిగ్భంధంలో ఉంటున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలిపోవడానికి కుదరడం లేదు. అందువలన తడ నుంచి ఇచ్ఛాపురం వరకు సముద్ర తీరం వెంబడే ఒక జాతీయ రహదారిని నిర్మించాలి.
           ప్రతి ఏటా వెయ్యి     కిలోమీటర్లు పొడవైన కొత్త రైలు మార్గాలు   నిర్మిస్తామని గత రైల్వే మంత్రులు చేసిన ప్రకటనలు ఒట్టి గాలి కబుర్లేనని తేలిపోయింది. కనుక కోస్తాకు మేలు చేసే కొత్త రైలు మార్గాల  కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమిని కొని తన వంతు వాటా ఇచ్చి కేంద్రాన్ని ఒత్తిడి చెయ్యాలి. సముద్రం,నదులు,చుట్టుముట్టి ఉన్న ప్రజలు త్వరితంగా సురక్షిత మెట్ట ప్రాంతాలకు తరలి పోవటానికి వీలుగా ఈ ఎనిమిది కొత్త రైలు మార్గాలను నిర్మించాలి.ఈ రైలుమార్గాల వలన రాయలసీమ తెలంగాణా ప్రాంతాలకు కూడా బాధిత జనం తరలిపోవటానికి అటువాళ్ళు ఇటు ఇటువాళ్ళు అటు రాకపోకలు జరపటానికి కూడా వీలౌతుంది.

1.    గూడూరు – రావూరు – బద్వేలు – గిద్దలూరు
2.    ఒంగోలు – పొదిలి – మార్కాపురం – మాచెర్ల
3.    బాపట్ల – రేపల్లె – అవనిగడ్డ మచిలీపట్నం
4.    తెనాలి – ఉయ్యూరు – గుడివాడ
5.    కైకలూరు-ఏలూరు – కొత్తగూడెం
6.    నర్సాపురం – రాజోలు – అమలాపురం – కాకినాడ
7.    అమలాపురం – రావులపాలెం – రాజమండ్రి – కొయ్యలగూడెం- భద్రాచలం
8.    భద్రాచలం – నర్సీపట్నం – పాడేరు – పార్వతీపురం 
              తుఫాను వచ్చినప్పుడు హైదరాబాదు నుంచి సీనియార్ ఐ.ఎ.ఎస్. అధికారులను కోస్తా జిల్లాలకు సహాయ కార్యక్రమాల కోసం పంపుతున్నారు. కోస్తా జిల్లాలన్నీ ఐదు వేల చ.కి.మీ. పైబడ్డ వైశాల్యంతోనే ఉన్నాయి. జిల్లా పరిమాణం పెద్దదై – అడుగడుగునా కాలువలు అడ్డం వస్తున్నందువలన పరిపాలన సులభంగా సాగడం లేదు. జిల్లా కార్యాలయాలకు చేరుకోవడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు కూడా ప్రజలకు చేరువగా లేరు. అందువలన పార్వతీపురం, నర్సీపట్నం, రాజమండ్రి, అమలాపురం, భీమవరం, జంగారెడ్డిగూడెం, విజయవాడ, మాచెర్ల, మార్కాపురం, బాపట్ల కేంద్రాలుగా మరో పది కొత్త జిల్లాలను ఏర్పాటు చెయ్యాలి. ఈ కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల 19 మంది ఐ.ఎ.ఎస్. అధికారులు కోస్తా ప్రాంతంలో ప్రజారక్షణ,అభివృద్ధికి పాటుపడతారు.లేదా ప్రతి పార్లమేంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసినా కోస్తాలో కొత్తగా 12 జిల్లాలు ఏర్పడతాయి.చిన్న జిల్లాలైతే  ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా జిల్లా యంత్రాంగం ప్రజలకు అతి చేరువలో ఉంతుంది కాబట్టి సహాయ కార్యక్రమాలు సులువుగా నిర్వహిస్తుంది. తీర ప్రాంతాల అభివృద్ధిలో సమ తూకం సిద్ధిస్తుంది. సముద్రం ఆటుపోట్లను తట్టుకుంటూ – అను నిత్యం ప్రకృతి భీభత్సాల భయంలో బ్రతుకుతున్న కోస్తా ప్రాంతపు ప్రజలకు కొన్ని ప్రత్యేక రక్షణలు, అదనపు సదుపాయాలు కావాలి.
(4)                       రాష్ట్ర వైశాల్యంలో కోస్తా జిల్లా వైశాల్యం 34 శాతం ఉంది. (92306 చ.కి.మీ) రాష్ట్ర జనాభాలో కోస్తా జిల్లాల జనాభా 44 శాతం ఉన్నారు. రాష్ట్రంలో సగటు జన సాంధ్రత 308  ఉండగా కోస్తా జిల్లాల జన సాంధ్రత 368 .కృష్ణా   జిల్లా జన సాంధ్రత 519 . హైదరాబాద్,రంగారెడ్డి  మినహాయించి – జన సాంద్రత 500 దాటిన జిల్లాలు కోస్తాలో తప్ప ఆంధ్రప్రదేశ్ లో మరెక్కడా లేవు. రాష్ట్రంలోని గ్రామాలలో 48 శాతం కోస్తాలో ఉన్నాయి (13,000). మున్సిపాలిటీలలో సగం కోస్తా జిల్లాలోనే ఉన్నాయి. 38 శాతం మండలాలు, 46 శాతం అసెంబ్లీ స్థానాలు కోస్తా జిల్లాలవే. పండే భూమి కూడా 44 శాతం కోస్తాదే. 58 శాతం ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తున్నది కోస్తా జిల్లాలే. అత్యధిక సగటు వర్షపాతం 1089 మిల్లీ మీటర్లు కోస్తాలోనే. కాబట్టి కోస్తాను రాష్ట్రానికి అన్నదాతగా గుర్తించి అభివృద్ధి చెయ్యాలి. 3 లక్షల టన్నుల చేపలను ఉత్పత్తి చేస్తున్నవి కోస్తా జిల్లాలు. అపారమైన పశు సంపద, పాలు, కోడి గ్రుడ్డు, మాంసం ఎగుమతి చేస్తున్నవి. కోస్తా జిల్లాలు. ఆయా అంశాల నిష్పత్తిలోనైనా ప్రతి శాఖ నుంచి నిధులు కోస్తా జిల్లాల అభివృద్ధి కోసం తరలి రావాలి. పాలకుల దయా దాక్షిణ్యాలను బట్టి కాక – కోస్తా ప్రాంతం ప్రాముఖ్యతను బట్టి నిధులు కేటాయింపు జరగాలి. తుఫానులను జాతీయ విపత్తుగా గుర్తించి కేంద్రం తన వాటాగా ప్రతి యేటా కోస్తాకు నిధులు కేటాయించాలి. కృష్ణా, గోదావరి బేసిన్ లో గ్యాసు,చమురు ప్రైవేటుపరం చెయ్యకుండా కోస్తావాసులకోసం ఉపయోగించాలి. విశాఖ  ఉక్కును కోస్తా ప్రాంతంలో భవనాలు, వంతెనల నిర్మాణం కోసం వాడాలి.వరదలు,తుఫానులు,లాంటి ప్రకృతివిలయాలతో సదా కాపురం చేసే శాపగ్రస్తమైన ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా ఆదుకోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తక్షణ కర్తవ్యం.

ఆంధ్రప్రభ,ఆంధ్రపత్రిక 21-9-1990

                                       కోస్తాను కాపాడండి (నమస్తే తెలంగాణ 17.10.2013)
http://www.namasthetelangaana.com/Editpage/article.aspx?Category=1&subCategory=7&ContentId=292017,http://epaper.namasthetelangaana.com/epapermain.aspx?edcode=9&eddate=10/17/2013%2012:00:00%20AM&querypage=4

 

కోస్తా అభివృద్ధికి కొన్ని చర్యలు (సూర్య 18.10.2013)
http://www.suryaa.com/opinion/edit-page/article-156044
http://www.suryaa.com/pdf/display.asp?edition=0&page=4


https://www.facebook.com/photo.php?fbid=648395455192448&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater

1 కామెంట్‌:

  1. దయచేసి మీరు పరకాల ప్రభకరరావుగారిని వ్యక్తిగతంగా కలిసి మీ అమూల్యమైన సూచనలు ఒక పుస్తక రూపంలో ఇచ్చి వారిని ఒక్కసారి చదవమనండి. వారు నిజంగా తెలివైన వారైతే తప్పక కనీసం కొన్నిటినైనా ప్రభుత్వముచేత అమలు చేయించగలరు. దయచేసి నా ప్రార్ధన గురించి ఆలోచించండి. మీ మేధాశక్తికి, ముందుచూపుకూ అభినందనలు.

    రిప్లయితొలగించండి