ఈ బ్లాగును సెర్చ్ చేయండి

6, ఆగస్టు 2013, మంగళవారం

జనాభా లెక్కలు,కులం,జాతి,మతం



ప్రార్థనాలయాలు
         

        ఆంధ్రప్రభ 11-9-1987                                                                                                                               
                   ప్రభుత్వ స్థలాలలో బహిరంగ స్థలాలలో ప్రార్థనాలయాలు ఉండటం   అవసరమా? అనే అంశాల మీద ఆగస్టు 21 వ తేదీన నగరంలో ఒక సదస్సు        జరిగింది. అందులో జాగృతి, గీటురాయి పత్రికల సంపాదకులు అలాంటి చోట్ల   ప్రార్థనాలయాలు ఉండి తీరవలసిందేనని చెప్పగా, మల్లాది సుబ్బమ్మగారు,     ఎస్. కె. ఆచార్య గారు వాటిని తరలించవచ్చునని అభిప్రాయపడ్డారు.        వక్తలందరూ వారి వారి రంగాలలో నిష్ణాతులైనందున ఈ సదస్సు వల్ల ఇరు పక్షాల వారి వాదాలు ప్రజలకు తెలిశాయి. భిన్నాభిప్రాయాలలో ఒక   మధ్యమార్గం సాధించటానికి ఇలాంటి సదస్సులు! ఉపకరిస్తాయి. రోడ్లు        వెడల్పు చేసేటప్పుడు ప్రార్థనాలయాలు అడ్డం వస్తే ఏమి చెయ్యాలో పాలు       బోక ప్రభుత్వం నిస్సహాయత వ్యక్తం చేస్తున్నది. ప్రజలు ఇలాంటి సదస్సులు     విరివిగా జరిపి తీర్మానాలను ప్రభుత్వానికి పంపితే బాగుంటుంది.


కమ్యూనిస్టుల మతమేది?
         

        ఆంధ్రజ్యోతి 14-9-1989                                                                                                                            
                   మన దేశంలో 1981 జనాభా లెక్కల్లో తమకు ఏ మతమూ లేదని      చెప్పిన వారి        సంఖ్య 60, 217 గా నమోదు అయింది. అంటే మత        రహితుల శాతం 0.001 శాతం        అన్నమాట. 28 పార్లమెంటు సీట్లను   గెలుచుకున్న ఉభయ కమ్యూనిస్టు పార్టీలు        సభ్యులు ఏదో ఒక మతంలో    నమోదు చేయబడ్డారు. కమ్యూనిస్టులు మౌలికంగా        మతరహితులై     ఉండాలి. కాని జనాభా లెక్కలలో మాత్రం ఈ దేశంలోని కోట్లాది        కమ్యూనిస్టులు ఏదో ఒక మతస్తులుగా నమోదు కావడం వారు నమ్మే      సిద్ధాంతానికి        వ్యతిరేకంగాను, ఆత్మహత్యా  సదృశ్యంగాను ఉంది. 1991 జనాభా లెక్కలలోనైనా మత        రహితులు అసలు సంఖ్య వెల్లడి కావడం    కోసం కమ్యూనిస్టులు తమ నిజమైన        మతమేదో సరిగ్గా నమోదు      చేయించుకోవాలి.


విశ్వ హిందూ పరిషత్ మా మనవి మన్నిస్తుందా?
అంధ్రప్రభ 5-10-1986                                                
      25-9-1986 నాటి 'ఆంధ్రప్రభ' లో హిందువుల కర్తవ్యంఅనే శీర్షికతో శ్రీ  నర్రా సుబ్రహ్మణ్య శర్మ గారు వ్రాసిన లేఖ నాలో చాలా ఆలోచనలను  రేకెత్తించింది. శర్మ గారు చెప్పినట్లు దూదేకుల సాహెబులను హిందువులు  పరాయివారు గానే చూస్తున్నారు. వాస్తవానికి దూదేకుల సాహెబులు    హిందూ ముస్లిం మతాలకు మద్యస్తంగా ఉన్నారు. వీరిని నిజానికి హిందువులని పిలవాలో, ముస్లిములని పిలవాలో కొన్నిసార్లు అర్థం కాదు. హిందువులు, ముస్లిములు కొట్టుకొని చస్తుంటే, వీళ్ళు ఇద్దరి చేత   వాడుకోబడి ఈసడించబడుతున్నారు. మనసా వాచా కర్మణా   హిందువులుగా మారదామనుకుంటున్న వారిని విశ్వహిందూ పరిషత్  సాదరంగా ఆహ్వానించడం హర్ణణీయమే.అలా మారదామనుకొంటున్న వారిలో కొన్ని లక్షల మంది దూదేకుల వారున్నారు. నేను కూడా అదే కులస్థుడను గనుక వాస్తవం  తెలియజేస్తున్నాను. దూదేకుల సాహెబులను నూర్ బాష, లదాఫ్,  పింజారీలను కూడా పిలుస్తారు. నేను పర్యటించిన ప్రాంతాలలో దూదేకుల   వారు సున్నతి, పెండ్లి, సమాధి మినహా మిగతా జీవితమంతా హిందూ   ఆచారాలను పాటిస్తున్నారు. చివరికి పేర్లు గూడా హిందూ ముస్లిం మతాల     సాంకర్యాన్ని కలిగి ఉంటాయి. ఉదాహరణకు షేక్ పద్మావతి, షేక్      కోటేశ్వరరావు లాంటివి. ఇలాంటి వారంతా హిందువులుగా మారటానికి సంసిద్ధులై ఉన్నారు.
         అయితే ఇక్కడ ప్రధానమైన ఆటంకం ఏమిటంటే హిందువులుగా  మారితే వారిని ఏ కులంలే చేర్చుకుంటారో తెలియటం లేదు. ఎందుకంటే    కులమే సంఘంలో గౌరవానికి సూచికగా ఉంటున్నది. హిందూ మతం లోని  ఏదైనా గౌరవప్రదమైన అగ్రకులంలో చేర్చుకుంటే కొన్ని లక్షల మంది  దూదేకుల సాహెబులు హిందువులుగా మారగలరు. అందులో నేనే మొదటి     వాడినవుతాను. విశ్వ హిందూ పరిషత్ వారు హిందూ ధర్మ రక్షణ సంస్థ వారు, ఈ విషయాన్ని కూలంకషంగా పరిశీలించి దూదేకుల సాహెబులకు     స్వాగత ద్వారాలు తెరువగలరని ఆశిస్తున్నాను.


మేలు చేస్తున్న సెక్యులరిజం
ఈనాడు లేఖలు 9-1-1987                                        
              ముస్లిం  సోదరులకు మనవి అనే సంపాదకీయం సరైన      సమయంలో వెలువడింది. రిపబ్లిక్ డే ను బహిష్కరించాలన్న షాబుద్దీన్     ప్రభృతుల ఉద్భోధను దేశంలోని మెజారిటీ ముస్లింలు ఖాతరు చేయడం   లేదు. దేశం సెక్యులర్ ప్రజాస్వామ్యాన్ని అనుసరిస్తూ ఉండటం   ముస్లిములకు ఎంతో మేలు. ఇదే హిందూ ప్రభుత్వం అయినట్లయితే దేశ విభజన నాటి నుంచి ముస్లిముల పరిస్థితులు చాలా భయంకరంగా ఉండేవి.  సెక్యులర్ విధానం అన్ని మతాల వారిని రక్షిస్తున్నది. మెజారిటీ ప్రజలు ఒక    మతానికి చెంది ఉన్నప్పుడు మైనారిటీలకు కొన్ని సమస్యలు రాకతప్పవు.   అయితే వాటిని రాజ్యాంగానికి లోబడి, సామరస్య ధోరణిలోనే    పరిష్కరించుకోవాలి. ఎందుకంటే ముందు మనం భారతీయులం. ఆతరువాత మనం భారతీయ ముస్లిములము. మతం మారణహోమం        చెయ్యమని చెప్పదు. మన సమస్యకు కారణం మనతోటి భారతీయ సోదరులే ఒక కుటుంబసభ్యులు తమ తగాదాలను ఎలా తీర్చుకుంటారో    అలానే తీర్చుకోవాలిగాని ఆ కుటుంబాన్ని తగలబెట్ట కూడదు. సహనం కోల్పోతే శిక్ష ఎవరికి పడుతుందో, మెజారిటీ ప్రజల ఆగ్రహానికి గురైన ప్రతిసారీ ఎవరు బలైపోయారో మనకు తెలుసు. అందువలన ఈ దేశంలో  ఉన్నంత వరకు ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందే. కట్టుబడి  ఉండాల్సిందే. మతంలో ఎలాంటి నూతనత్వానికి మార్పుకు చోటివ్వని     కొందరు ఛాందసులు మాత్రమే పరదేశీయులు లాగా ప్రవర్తిస్తున్నారు. కాని ఈ గడ్డ మీద తరతరాలుగా నివసిస్తూ తమ తనువులు ఇక్కడే  రాలిపోవాలని కోరుకుంటున్న కోట్లాది ముస్లింలు సారే జహాసే అచ్చా హిందూస్థాన్ హమారా అంటారు. రిపబ్లిక్ దినోత్సవాలలో మన:పూర్తిగా   పాల్గొంటారు.


మతం వేరైనా జాతి ఒక్కటే !
భాష వేరైనా భావ మొక్కటే!!
అంధ్రప్రభ 17-1-1987                                                  
         మదపిచ్చి కంటే మత పిచ్చే ప్రమాదకరమైనదని కొందరు పండితులు        అంటుంటారు. అది అక్షరాలా సత్యం. చెరువు మీద అలిగి ఏదో చేసినట్లుగా శ్రీ       షాబుద్దీన్ లాంటి వారు ప్రవర్తిస్తున్నారు. అలాంటి వ్యక్తులే భారతీయ      ముస్లింలందరికీ ప్రతినిధులన్నట్లుగా కొన్ని పత్రికలు బోలెడంత    ప్రచారమిస్తున్నాయి. అయినా బహిష్కరించడానికి వందలాది హిందువుల పండుగలుండగా శ్రీ షాబుద్దీన్ గారికి రిపబ్లిక్ దినోత్సవమే దొరికిందా? ఒక    విధంగా చెప్పాలంటే శ్రీ షాబుద్దీన్ చాలా దురదృష్టవంతుడు. ఆయన   పిలుపునకు భారతీయ ముస్లిం సమాజంలో పదవ వంతు కూడా     స్పందించలేదు. మతాలు వేరైనా మన జాతి ఒక్కటే, భాషలు వేరైనా మన     భావ మొక్కటే అనే సందేశం భారతదేశంలోని ముస్లింలందరికీ తెలుసు.భారతీయ ముస్లింలు పాకిస్తాన్ పౌరులు కారు. వారూ భారతీయిలే! సమస్త ఇతర మతాల సోదరులతో పాటు వారు కూడా ఈ దేశ వారసులే! జాతీయ   పండుగలలో ముస్లింలంతా తప్పకుండా పాల్గొంటారు. అలా పాల్గొనవద్దని  చెప్పే అధికారం ఎవ్వరికీ లేదు. ఒకవేళ ఎవరైనా చెప్పినా శిరసా వహించేంత       అజ్ఞానులిక్కడ లేరు.


మంచి సూచన  
అంధ్రప్రభ 17-11-1987                                                 
              ఆర్.యస్.యస్. లో చేరే హైందవేతర మతాల వారిని భారతీయులుగా        పిలవాలని శ్రీ జనార్థన్ గారు 22-9-1987 న చేసిన సూచన బాగుంది.        ఎందుకంటే 'హిందూ' అనేది మతాన్ని సూచిస్తున్నది గాని 'భారతీయత'    అనేది మతప్రవక్త లేకుండా జాతిని సూచిస్తున్నది. భారతీయ క్రైస్తవులు, ముస్లిములు తమ మతాలను వీడకుండా ఆర్.యస్.యస్. లో చేరగలగాలంటే అది హిందూ దృక్పథాన్ని విడనాడి 'భారతీయ' దృక్పథానికి  రావాలి. మతతత్వాన్ని విడిచి జాతి తత్వాన్ని వంటబట్టించుకోవాలి. మతాలు వేరయినా మన జాతి ఒక్కటే. భాషలు వేరయినా మన  భావమొక్కటే అనే సిద్ధాంతాన్ని ఆచరణలోకి తేవాలి. ఏ కులస్థుడైనా, ఏ    మతస్థుడైనా భారతీయుడు భారతీయుడే! ఆర్.యస్.యస్ 'హిందూ జాతి' అని ఉంచితే చాలు. అది ఒక గొప్ప సంస్థ అవుతుంది. దాని పరిధి    విస్తృతమవుతుంది.


జనాభా లెక్కలు - మత రహితులు                 
ఆంధ్రప్రభ 1-7-1990  
నూర్ బాషా రహంతుల్లా,ఏలూరు


జనాభా  లెక్కల్లో మత రహితులను నమోదు చెయ్యాలనే నళిని మోహన్ కుమార్ లేఖతో ఏకీభవిస్తున్నాను. (ఉత్తరప్రభ 23-6-1990). ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసి 1989 లోక్ సభ ఎన్నికలలో 43 పార్లమెంటు సీట్లు గెలుచుకున్నాయి. కమ్యూనిస్టులు మౌలికంగా నాస్తికులై ఉంటారు. వారికి ఏ మతమూ ఉండదు. అయితే ఈ దేశంలోని కోట్లాది కమ్యూనిస్టులు ఏదో ఒక మతంలో తమ పేర్లను నమోదు చేసుకొంటున్నారు.

అలాగే డి.ఎం.కె. సభ్యులు కూడా ఇంకా అన్ని పార్టీలలో నాస్తికులున్నారు. వీరంతా జనాభా లెక్కల్లో మత రహితులుగా నమోదు కావడం లేదు. మన దేశంలో మత రహితుల జన సంఖ్య కచ్చితంగా రికార్డులకెక్కితే అన్ని మతాల బలాబలాలలో గొప్ప మార్పు వస్తుంది. మత మౌఢ్యాన్ని కలహాలను తటస్థీకరించే తృతీయ శక్తిగా మతరహితుల బలం పనిచేస్తుంది. 



జనాభా లెక్కలు
ఆంధ్రజ్యోతి 6-11-1985                                 ఎన్. రహంతుల్లా
                                                              తెలుగుగంగ
                                                              నెల్లూరు     
              మనదేశంలో అభివృద్ధి కేటాయింపులన్నీ పంచవర్ష ప్రణాళికల ప్రకారం       చేస్తాడు. పార్టీల అధికారానికి కూడా పంచవర్షాలే కాలపరిమితిగా ఉన్నాయి.   అయితే జనాభా లెక్కల సేకరణ మాత్రం దశవర్షాల కోసారి జరుగుతున్నది.       అందువల్ల ఆరవ ఏటి నుంచి పదవ ఏటి వరకు జరిగే కేటాయింపులు,   ఫలితాలు వాస్తవాలకు దగ్గరగా ఉండవు.
              ఉదాహరణకు ఉద్యోగులకు జనాభా సంఖ్యను బట్టి ఇంటి అద్దె అలవెన్స్ ఇస్తారు. ఒక పట్టణ జనాభా 1981 లో కంటే 1986 లో నిశ్చయంగా      ఎక్కువ ఉంటుంది. కాని 1991 వచ్చే వరకు ఆ పట్టణానికి వాస్తవంగా       రావలసిన అలవెన్స్ రాదు. పంచవర్ష ప్రణాళిక మదింపు కూడా వాస్తవంగా ఉండదు. కనుక, ప్రతి పంచవర్ష ప్రణాళికకు ఒక సంవత్సరం ముందు        జనాభా లెక్కలు తీయాలి.




జాతి - మతం
ఆంధ్రప్రభ 19-1-1990       నూర్ బాషా రహంతుల్లా,హైదరాబాద్

       పంజాబ్ అఖిల పక్ష ర్యాలీలో పాల్గొన్న సి.పి.యం నాయకుడు హరికిషన్ సింగ్ సూర్జిత్ 'జాతికి మతం ప్రాతిపదిక కాదు అనే వాజ్ పేయ్ వాదనతో ఏకీభవిస్తున్నానుఅన్నారు. మతాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే ఒక హిందూ దేశం, మరో పాకిస్తాన్, ఒక క్రైస్తవ దేశం ఏర్పడతాయని ఆయన హెచ్చరించారు. ఆయన చెప్పింది బాగానే ఉంది కాని, మతం పేరుతోనే మనకు హిందూ దేశం కావాలనే బి.జె.పి. కి చెందిన వాజ్ పేయి గారు జాతికి మతం ప్రాతిపదిక కాకూడదు అని ఎలా అన్నారో అర్ధం కావడంలేదు. ఒకవేళ ఆయన అలా అని ఉంటే బి.జె.పి. కి. హిందూ మతతత్వం లేదని, అన్ని మతాలకు చెందిన భారతీయులను ఒకే జాతిగా అంగీకరిస్తూ లౌకిక తత్వాన్ని ఆ పార్టీ అవలంబిస్తున్నదని మనం గ్రహించవచ్చు. దామాషా పద్దతిపై ఏకాభిప్రాయాన్ని వెల్లడిస్తున్న బి.జె.పి, సి.పి.ఎం లు 'జాతి' విషయంలో కూడా ఏకాభిప్రాయానికి రావడం ముదావహం, హర్షదాయకం. 



నందినాజీ!
ఆంధ్రభూమి 5-2-1990                                      ఎన్. రహంతుల్లా
                                                                               ఏలూరు
                                                               
       డిసెంబర్ 3 వ తేది ఆంధ్రభూమిలో ఎన్.ఆర్. నంది గారి 'క్రూడాలోచన' చాలా క్రూరంగా ఉంది. హిందూ మతంలోని కులవ్యవస్థను కూలగొట్టలేక దానికి కూడా ముస్లిములే కారణం అనటం అన్యాయంగా ఉంది. హిందూ మతంలో ఎంతో కాలం మంచి అంటరాని కులాలు ఉంటూ ఉండగా ముస్లిములు ఈ దేశానికొచ్చాకనే దళితులు ఏర్పడ్డారని నంది గారు అనటం ఆధారరహితమైన ఆరోపణ మాత్రమే. అయోధ్యలో మసీదు పడగొట్టి ఆలయం కట్టితే, ఆలయాలు పడగొట్టి బౌద్ధ ఆరామాలుగా మలుస్తామని దళిత నాయకుడు సవాలు చేశారు. అతను కూడా ముస్లిమే అని నంది గారు లేనిపోని అనుమానం వెలిబుచ్చారు. ఇలాంటి క్రూడాలోచనలు మానుకోవటం ఆయన ఆరోగ్యానికి మంచిది. అసలే దేశం మతకలహాల్లో మాడిపోతుంటే, సామరస్య భావాలను వెల్లడించాల్సింది పోయి, నాజీ భావాలను వ్యక్తం చేయడం దురదృష్టకరం.



పాలకులదే ఈ పాపమంతా
ఈనాడు 23-1-1992                                                  

'కంటితుడుపు పర్యటన' సంపాదకీయం కంటతడి పెట్టించింది. మైనారిటీ ప్రజల్ని ఇలా ఏరి ఏరి హతమారుస్తూనే మరోపక్క వారిని జాతీయ జీవన స్రవంతిలో కలవండని పిలుపునివ్వడం పాకిస్తాన్ ను వంక చూపి ఇక్కడ ముస్లిములను వేధించడం జాతి సమైక్యత, సమగ్రతలకు గొడ్డలి పెట్టు. ప్రధాని పి.వి. కంటితుడుపు చర్యలు చేపడుతున్నారు తప్ప ఆ కన్నీళ్ళకు కారణాలు అన్వేషించి సమస్య పరిష్కారానికి కృషి చెయ్యడం లేదు. తలగడ తిరగేస్తే తలనొప్పి పోతుందా? మంత్రుల్ని మారిస్తే మత కలహాలు ఆగుతాయా? అయోధ్యతో ఆగకుండా మధుర, వారణాసి మసీదులను కూడా కూలగొడతామని తొడగొట్టి సవాలు చేస్తున్న హిందూ మతోన్మాదులకు జోహుకుం అంటున్న పాలకులదే ఈ పాపమంతా.



       ప్రమాదకరమైన ప్రతిపాదన
ఆంధ్రభూమి 21-11-1990                                     ఎన్. రహంతుల్లా
                                                                               ఏలూరు
                                                               
       ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ కలిసిన అఖండ భారతదేశం వైశాల్యం 4,152 వేల చ.కి.మీ. ఉంది. ఇందులో 1990 నాటికి 106 కోట్ల జనాభా ఉన్నారు. ఈ జనాభాలో 69 కోట్లు హిందువులు, 31 కోట్లు ముస్లిములు, 3 కోట్లు క్రైస్తవులు, 2 కోట్లు శిక్కులు, 1 కోటి బౌద్ధులు ఉన్నారు. ఎవరి మతం వారికి గొప్ప గనుక ఎవరూ మరో మతాన్ని సహించక అంతర్యుద్ధాలకు పాల్పడుతున్నారు గనుక ఆయా మతాల మద్య అఖండ భారతాన్ని విడగొట్టి ఇస్తే నిజమైన మత రాజ్యాలు స్థాపించుకోవచ్చు. జనాభా లెక్కల్ని బట్టి హిందూ రాజ్యానికి 27 లక్షల చ.కి.మీ., ముస్లిం రాజ్యానికి 12 లక్షల చ.కి.మీ., క్రైస్తవ రాజ్యానికి 1 లక్ష చ.కి.మీ., శిక్కు రాజ్యానికి 65 వేల చ.కి.మీ., బౌద్ధ రాజ్యానికి 37 వేల చ.కి.మీ. భూమి కేటాయిస్తే సరిపోతుంది. దేశమంటే మనుషులు కాదు మట్టే అనే తత్వం బలపడి గుళ్ళూ గోపురాలకోసం జనం తన్నుకుంటున్నారు గనుక మత రాజ్యాలుగా విడిపోవటమే శాంతి కారకమౌతుందేమో!


అర్హులయిన ముస్లిములకూ అవకాశం ?
ఈనాడు 18-7-1986                                      
              కేవలం ఒకానొక కులం వారే – అదీ వంశపారంపర్యంగా అర్చకత్వం    నిర్వహిస్తూ ఉండడం దేవుని దృష్టిలో మానవులందరూ సమానులే అనే సూక్తిని కాలరాస్తున్నది. చల్లా కొండయ్య కమిషన్ ఎల్ల కులాలవారు        అర్చకులయ్యే అవకాశం కల్పించింది. శ్రీరంగం దేవస్థానంలో ఎన్నో ఏళ్ళ        నుండి నాదస్వరం వాయిస్తున్న షేక్ చిన మౌలానా సాహెబ్, భద్రాచలం శ్రీ       సీతా రామచంద్రస్వామి ఆలయంలోని నాదస్వర విద్వాంసుడు షేక్        బందూసాహెహ్ ప్రభృతులు ముస్లిములయినప్పటికీ ఆయా హిందూ దేవుళ్ళ భక్తులే. అర్చకులు కావటానికి ఇష్టపడే అర్హులయిన ముస్లిములకు     కూడా అలాంటి అవకాశం కల్పిస్తే హిందూ మతం యొక్క సర్వ మానవ       సౌభ్రాతృత్వం వెల్లివిరుస్తుంది.


కళ్ళు తెరిపించే కచేరీ
       ఆంధ్రప్రభ     28.5.87                                                                
              25-5-1987 వ తేదీన 'రవీంద్రభారతి' లో మతోన్మాదులకు కనువిప్పు    కలిగించగల ఒక సంఘటన జరిగింది. ఆనాటి సాయంత్రం బాపట్ల తాలూకా       కంకటపాలెంకు చెందిన శ్రీ షేక్ మీరా ఖాన్ బృందం క్లారినెట్ వాద్య కచేరీ    జరిపారు. మీరట్ లో తయారైన క్లారినెట్ నే శ్రీ షేక్ మీరాఖాన్  ఉపయోగించారు. ఆ సమయంలో మీరట్ లో మత కల్లోలాలు జరుగుతున్నాయి. ఈయన ఏ ఖవాలీలో హిందుస్థానీ, రాగాల్లో వాయిస్తాడని అంతా అనుకున్నారు. కాని 'మహాగణపతిం మనసాస్మరామి', 'మానస   సంచరరే', 'అదిగో, అల్లదిగో శ్రీహరి వాసము', 'సామజవరగమన',       'మువ్వగోపాలుడే' వంటి భక్తిరస ప్రదాన కీర్తనలను పరవశులై క్లారినెట్ మీద మ్రోగిస్తుంటే ప్రేక్షకుల చప్పట్లతో హాలు మారు మ్రోగిపోయింది.



'ఇదేమి సంస్కృతి' బాగుంది
ఆంధ్రజ్యోతి17-11-1987                                               
              ఇదేమి సంస్కృతి? అనే శీర్షికతో వెలువడిన 12-11-1987 నాటి 'ఆంధ్రజ్యోతి' సంపాదకీయం ఆలోచనాత్మకంగా ఉంది. చిరుతపులి తన       మచ్చలను పోగొట్టుకోలేనట్లే ఒకానొక సంస్కృతికి అలవడిన వ్యక్తి తన   లక్షణాలను పోగొట్టుకోలేదు. అతను ఎక్కడికిపోయినా తన సంస్కృతీ     చిహ్నాలను వెంట బెట్టుకునే పోతాడు. కొత్త వాతావరణంలో ప్రవేశించి పాత        సంస్కృతినే ప్రతిఫలిస్తే ఇదేమిటీ? అని ఆశ్చర్యపోగూడదు. ఇంగువ కట్టిన        గుడ్డలాగా అతను పాత వాసనలనే వెదజల్లుతున్నందుకు పాత    యజమానులంతా ఆనందించాలేగాని అబ్బురపడకూడదు.  



ఎవరి మతం వారిది
ఉదయం 28-3-1986                                   ఎన్. రహంతుల్లా
                                                              దిల్ సుక్ నగర్
              ముస్లిం మతచాందసులకు శ్రీ రాజీవ్ గాంధీ లొంగిపోయారని హిందు సోదరులు గగ్గోలు పెట్టడం భావ్యంగా లేదు. ఇప్పుడాయన హిందువుల  కోర్కె    మేరకు ముస్లిం స్త్రీల హక్కుల పరిరక్షణ బిల్లును బుట్టదాఖలు చేస్తే ఆయన   హిందువుల కొమ్ము కాస్తున్నాడని మేము అనుకోలేమా? ఎవరి మత     ఆచారాలను వాళ్ళు తప్పనిసరిగా నిలుపుకోవాలి. దేవుని మీద నమ్మకం     ఉన్నవారు దేవుడు చెప్పిన మాట ఎంత అసహేతుకంగా ఉన్నా        నెరవేర్చుతాడు. ఆచరిస్తాడు. ఇస్లాం అంటేనే విధేయత. షరియత్ ఇష్టం లేని        వాళ్ళు ఇస్లాం నుంచి తొలగిపోవచ్చు. ఆ స్వేచ్ఛ వారికే ఉంది.    అవిధేయులెవరూ ముస్లింలు కాలేరు. తలాకులు పొందటం ఇంత తేలికా     అని ఆశ్చర్యపోకుండా ఆలోచించండి. కట్నం తేలేదని, రూపవతి కాదని   భార్యను తగులబెట్టే అవసరం ఇస్లాంలో రాదు. కొజ్జా భర్తను, కష్టు భర్తనూ        జీవితాంతం సేవించే దౌర్భాగ్యం ఇస్లాంలో రాదు. స్త్రీ అమూల్యమైన సంపద. అలాగే పురుషుడు కూడా, బహుభార్యత్వం ఎవరిలో ఎక్కువ ఉందో సర్వే     జరిపి తెలుసుకోండి. 



మత విముక్తి
ఆంధ్రభూమి 4-11-1990                                     నూర్ బాషా రహంతుల్లా
                                                                ఏలూరు
                                                                       
          'మొదట తన మతము వదలక
       తుదు నెవ్వరి మతము దైన
       దూషించకయున్ బదిలుడయి
       కోర్కి గోరక ముదముల
       జరియించువాడే ముక్తుడు వేమా'

       అనే సూక్తిని భారతీయులంతా పాటించి ముక్తునై దేశాన్ని మత కలహాల నుంచి విముక్తి చేస్తారని మనవి చేస్తున్నాను.



వీర హిందువులకో విన్నపం
ఆంధ్రభూమి 30-12-1990                                   
                                                               
          మైనారిటీ మతస్తుల పట్ల విద్నేషాన్ని వెళ్ళగక్కుతూ ఈ మధ్య కొంతమంది  హిందూ పాఠక వీరులు కచేరీలు చేస్తున్నారు. ఇది ఎర్ర గురుగింజ సామెతను గుర్తు చేస్తున్నది. వాస్తవానికి ఈ దేశంలోకి ఇస్లామ్, క్రైస్తవ మతాలు ప్రవేశించక ముందు ఇక్కడి వాళ్ళంతా ఎవరు ? హిందూ మతంలో కోరలు చాచిన కుల వ్యవస్థ సాంఘిక అసమానతలు, అంటరానితనం మొదలైన దురాచారాల వల్లనే గదా వాళ్ళంతా ఇతర మతాలను స్వీకరించింది ? హిందూమతంలో నుండి ఆ రుగ్మతలు ఇంకా పోలేదు. పైగా కుల సంఘాలు, కుల రాజకీయాలు పెరిగాయి. భారతీయుడు ఏ మతస్తుడైనా భారతీయుడే. హిందూ అనేది జాతి అయితే నేను హిందువునే అంటాను. ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు అనుసరించండి. ఒకరినొకరు తిట్టుకోవడం అనాగరిక లక్షణం. దయచేసి దేశ శ్రేయస్సు కోసం ఐక్యతా బీజలు నాటండి. 



      సమైక్యతనే కాంక్షిస్తున్నారా?
జనవాక్యం 2-10-1990                                      
                                                                       
          సెప్టెంబర్ 25 నాటి 'ఆంధ్రజ్యోతి' సంపాదకీయంలో బి.జె.పి. చేపట్టిన మత విద్వేషపూరిత సంఘర్షణా వైఖరిని చక్కగా బట్టబయలు చేశారు. అటు కోర్టు తీర్పుకూ కట్టుబడక, ఇటు చర్చలలోను పాల్గొనక, ఆరు నూరైనా సరే రామాలయం నిర్మిస్తామనడం, రథయాత్రలు మొదలు పెట్టడం సంఘర్షణ మార్గం కాక మరేమిటి? జాతి సమైక్యత కోసమే రథ యాత్ర అని అద్వానీ గారు చెపుతున్నారు. అది ఏ జాతి? భారత జాతా లేక హిందూ జాతా?

       నిజంగా భారతీయుల సమైక్యతను బి.జె.పి. కాంక్షిస్తే, మద్రాసులో జరిగిన జాతీయ సమైక్యతా మండలి సమావేశాన్ని బహిష్కరించేది కాదు. స్వరాజ్యం కంటే గోరక్షణ  ముఖ్యమనీ, రక్తాన్నయినా చిందించి రామాలయం నిర్మిస్తామని ఉద్రేకపూరితమైన నినాదాలు చేస్తున్నారు. తన రథయాత్రను గాంధీగారి గోరక్షణ యాత్రతోను, తిలక్ గారి గణేశ్ ఉత్సవాలతోను అద్వానీగారు పాల్చడం మత మౌఢ్యాన్ని పెంచేదిగా ఉంది. చివరికి బలం గల వాడిదే రాజ్యం అనే సూక్తి నెరవేరేట్టయ్యింది. మెజారిటి మతతత్వం హింసాకాండతో రాజ్యమేలుతుంటే, ఇక ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి, మైనారిటీ మతస్థులకు రక్షణ ఎక్కడ?



అసమంజసమైన సూచన
ఆంధ్రప్రభ 31-8-1986                                  
              27-8-1986 ఆంధ్రప్రభ శ్రీ కె.బి.సోమయాజులు గారు వ్రాసిన లేఖ చాలా        ఆశ్చర్యకరంగా ఉంది. గడిచిపోయిన కాలంలోని భక్తులు, పరిపాలనా దక్షుల       గురించి మనం గొప్ప అభిప్రాయాలు కలిగి ఉండాల్సిందే. ఔరంగజేబు మీద     అక్కసుతో గోల్కొండను రామదాసు పీఠంగానో, దాన సాహిత్య కేంద్రంగానో         చేయాలనటం సమంజసంగా లేదు. హుసేన్ సాగర్ ను వినాయక్ సాగర్ అని పిలవటం కూడా అలాగే ఉంది. భక్త రామదాసు గారికి గోల్కొండ మీద    మమకారం ఉంటే రామాలయాన్ని భద్రాచలంలో కాకుండా గోల్కొండ మీదే        కట్టేవాడు. గోల్కొండ జైల్లో ఉన్నాడనే సాకుతో భద్రాచలం రామదాసును     గోల్కొండ రామదాసు అని పిలువమంటారా! రామదాసుకు సంబంధిచిన దానికంతటికీ గోల్కొండ రంగస్థలం కావాలనటం సరైన సలహా కాదు.     గోదావరి వరదలకు మునిగిపోతున్న భద్రాచలం దేవాలయాన్ని గోల్కొండకు     మార్చాలి అని సలహా ఇస్తే ఎలా ఉంటుందో ఇదీ అలానే ఉంది. రామదాసు జీవితం భద్రాద్రి తోనే ముడివేసుకొని ఉంది. ఇది ఎవర్ని అడిగినా చెబుతారు.        భద్రాచలం నుంచి బదిలీ అయ్యాడంటే ఇక ఆయన్ని గోల్కొండ రామదాసు అనే పిలవాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి