ఈ బ్లాగును సెర్చ్ చేయండి

6, ఆగస్టు 2013, మంగళవారం

ఆనందపూర్ తీర్మానం





ఆనందపూర్ తీర్మానం అభ్యంతరకరమా ? 
 ఆంధ్రప్రభ 9-1-1990                          నూర్ బాషా రహంతుల్లా హైదరాబాద్

ఆనందపూర్ సాహిబ్ తీర్మానాన్ని తమ పార్టీ నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నదని ఈ తీర్మానాన్ని అంగీకరించడమంటే భారతదేశంలో మతరాజ్య సృష్టికి అంగీకరించడమేనని బి.జె.పి. అధ్యక్షుడు శ్రీ అద్వానీ అన్నాడు. ఇలాగైతే ఆ తీర్మానం విషయంలో కాంగ్రెస్ కు బి.జె.పి.కి ఏకాభిప్రాయం ఉన్నట్లే అనుకోవాలి. ఆనందపూర్ సాహిబ్ తీర్మానం అంటేనే జనం హడలిపోయేలా ప్రచారం జరిగింది గాని అందులోని విషయాలు చాలా మందికి తెలియవు. తెలిస్తే ఆ తీర్మానాన్ని ఎంతోమంది హర్షిస్తారు. అందులో మొత్తం 12 డిమాండ్లు ఉన్నాయి. స్ధూలంగా అవి ఇవి :
1.    ఫెడరల్ విధానం అభివృద్ధి చెందేలా రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు ఇవ్వాలి.
2.    చండీగఢ్ ను పంజాబ్ కు ఇవ్వాలి. పంజాబీ మాట్లాడే ప్రాంతాలన్నీ పంజాబ్ లో కలపాలి. రావి బీయాస్ నదీ జలాల పంపకం ఒప్పందాన్ని అమలు చేయాలి. సైన్యంలో సిక్కుల నియామక శాతాన్ని తగ్గించకూడదు.
3.    కనీస వేతనం పెంచాలి. ధనికుల మీదనే పన్ను వేయాలి. జాతీయాదాయం రాష్ట్రాల మధ్య న్యాయంగా పంచాలి. లూధియానాలో స్టాక్ ఎక్స్చేంజి, అమృత్ సర్ లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చెయ్యాలి. షెడ్యూల్డ్ కులాల వారికి ఉచిత గృహాలు నిర్మించాలి. భూసంస్కరణల చట్టంలోని లోటుపాట్లు సవరించాలి. వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు, మోటార్లు రైతులకు తక్కువ ధరలకు ఇవ్వాలి.
4.    హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, హర్యానా, ఢిల్లీలో పంజాబీకి రెండవ అధికార భాష హోదా ఇవ్వాలి.
5.    దేశ విభజన కాలంలో కాశ్మీర్ కు పారిపోయిన పంజాబీ శరణార్ధుల కోర్కెలు తీర్చాలి.
6.    పబ్లిక్ సర్వీసుల్లో సిక్కుల జనాభాకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలి.
7.    వ్యవసాయ యంత్రాల మీద ఎక్సైజు డ్యూటీ తొలగించాలి.
8.    శ్రామికుల ఆర్ధిక పరిస్ధితులు మెరుగు పరచాలి.
9.    స్వర్ణదేవాలయంలో ఒక రేడియో కేంద్రం పెట్టాలి. అన్ని రేడియో కేంద్రాల నుండి గుర్బానీ కీర్తనలు రిలే చెయ్యాలి. అందుకయ్యే ఖర్చును ఖల్సావంద్ భరిస్తుంది.
10. స్త్రీకి మామగారి ఆస్తిలో తల్లితండ్రుల ఆస్తిలో భాగం పొందేహక్కు ఇవ్వాలి. వ్యవసాయ భూముల్ని ఎక్సైజు డ్యూటీ నుండి మినహాయించాలి.
11. షెడ్యూల్డ్ కులాల జనాభాను బట్టి బడ్జెట్ కేటాయింపులు జరపాలి. వారి కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చెయ్యాలి.
12.  రావి, బీయాస్ నదీజలాల పంపిణీలోని అవకతవకలు సరిదిద్దాలి. పంజాబ్ లో ఆరు చక్కెర మిల్లులు, నాలుగు వస్త్రాల మిల్లులు స్థాపించాలి.
1973 లో చేసిన ఈ తీర్మానంలోని మతపరంకాని కోర్కెల్ని తీరుస్తామని శ్రీమతి ఇందిరాగాంధీ వాగ్ధానం చేసి కూడా వాటిని తీర్చలేదు. ఈ తీర్మానంలో ఖలిస్తాన్ డిమాండు లేదు. ఖలిస్తాన్ కోసము, ఆనందపూర్ సాహిబ్ తీర్మానం అమలుకోసం భీష్మించుకొని కూర్చోము అని అకాలీదళ్ (మాన్) అదికార ప్రతినిధి గురుతేజే సింగ్ అంటున్నారు గనుక మతపరంకాని కోర్కెలన్నిటినీ అమలు పరచటానికి కేంద్ర ప్రభుత్వం పూనుకోవాలి. అలాచేస్తే బి.జె.పి. అధ్యక్షుడు భయపడుతున్నట్లు మతరాజ్యం సృష్టికాదు. పైగా అన్ని రాష్ట్రాలకూ మేలు జరుగుతుంది.


పంజాబ్ లో ఎన్నికలు జరపాలి 
 ఈనాడు 25-12-1990              ఎన్. రహంతుల్లా   ఏలూరు
                                                               
          గత నెల 28 నాటి సంపాదకీయంలో పంజాబ్ సమస్యపై చంద్రశేఖర్ ప్రభుత్వ విధాన రాహిత్యాన్ని చక్కగా వివరించారు. విశ్వ హిందూపరిషత్, బి.జె.పిల పట్ల సిక్కుల సమావేశం పట్ల కేంద్రం చూపిన విచక్షణాపూరిత ధోరణిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఆనంద్ పూర్ సాహిబ్ తీర్మానంలో సిక్కులు కోరిన డిమాండ్లు ఆనాడే తీర్చి ఉన్నట్లయితే ఈ నరమేధం కొనసాగేది కాదు. ఆ తీర్మానంలో వాళ్ళేమడిగారు ? రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు, ఇప్పటి చండీఘడ్ ను పంజాబ్ కు బదిలీ చేయడం, జాతీయవాదాన్ని రాష్ట్రాల మధ్య న్యాయంగా పంచడం, లూథియానాలో స్టాక్ ఎక్స్చేంజి ఏర్పాటు, రావి, బియాస్ నదీ జలాలను సరిగా పంపిణీ చేయడం, వ్యవసాయ యంత్రాల మీద ఎక్సైజ్ డ్యూటీ తొలగించడం లాంటి 12 కోర్కెలు. వీటిలో ఖలిస్తాన్ డిమాండ్ లేదు. 1973 లో ఈ కోర్కెలు తీరుస్తామని చెప్పిన ఇందిరాగాంధీ చివరికి పరిస్థితిని బ్లూ స్టార్ ఆపరేషన్ వరకు తీసుకెళ్ళారు. రాష్ట్రపతి పాలనతో కాలం గడపడం ప్రజాస్వామ్యాన్ని మంటగలపడమే అవుతుంది. కనుక పంజాబ్ లో ఎన్నికలు జరపాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి