ఈ బ్లాగును సెర్చ్ చేయండి

6, ఆగస్టు 2013, మంగళవారం

భాష



ఉర్దూ అభివృద్ధి కల్ల కాదు...
        ఈనాడు  26-4-1988                                            
              రాష్ట్రంలో ఉర్దు భాషాభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం అవరోధంగా ఉందని కొందరు రాజకీయ నాయకులు వ్యాఖ్యానించటం హాస్యాస్పదం. 1975 లోనే ఉర్దూకు ద్వితీయ అధికార భాష హోదా కల్పించారు. అయినా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు దాన్ని అమలు జరపలేక పోయాయి. భావపరంగా రాష్ట్రాలు ఏర్పర్చిన సమయంలో  కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉర్దూ రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేసింది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఉర్దూభాష అభివృద్ధికి చేస్తున్న ప్రయత్నాలను గమనించకుండా శ్రీ ఒవైసీ లాంటివారు చేస్తున్న విమర్శలు విస్మయం కల్గిస్తున్నాయి.


జాతీయభాష
         

        ఆంధ్రప్రభ 7-12-1986                                    
                                                                                        
                   హిందీ, బెంగాలీ మన దేశ భాషలే కానీ అవి జాతీయ భాషలు   కాజాలవు అనేది కృష్ణస్వామి వారియర్ గారి వాదన. జాతీయభాషగా      సంస్కృతం మాత్రమే అందరి చేత ఆమోదించబడగలదు. అది     మృతభాషయని, దేశభాషయని అందరూ అంగీకరిస్తున్నారు గదా. మరి దానిని జాతీయ భాషగా అంగీకరించడానికి సందేహమెందుకు?. ఇశ్రాయేల్   దేశం ఏర్పడినప్పుడు ఏ భాషను అధికార భాషగా చేసుకోవాలనే వివాదం   వచ్చింది. అప్పటికి హెబ్రూ భాష నామమాత్రంగా మిగిలి ఉంది.    అయినప్పటికీ     హెబ్రూ భాషను జాతీయభాషగా ప్రకటించుకొని నేటికి     చాలా బాగా అభివృద్ధి చేసుకున్నారు.  ప్రజల, ప్రభుత్వం ఆదరణ ఉండాలే     గాని సంస్కృతం జాతీయ భాష కావటం కష్టమేమి కాదు. మొగలాయిలు    ఉర్దూను ఇక్కడ అభివృద్ధి చేయలేదా?

              దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్అనే భావం     జాతీయగీతంలో ప్రతిఫలించాలి. భారతీయులు, భారత జాతి కీర్తించబడాలి.

              దేశ సమైక్యతను సమర్థిస్తూ వివిధ రాష్ట్రాలలోని ప్రజలంతా ఈ దేశం        మొత్తం నాది అనే భావన చూపించాలి. అయితే పంజాభ సింధు     మొదలైన ప్రాంతాలలో కలిసిన ఈ దేశం మొత్త నాది అని వెడితే పాకిస్తాన్      వాళ్ళు ఏమనుకొంటారు? జమ్మూ కాశ్మీర్ నాదేనను పాకిస్తాన్ వాళ్ళు   జాతీయ గీతం వ్రాసుకుంటే మనమేమనుకొంటాం! మన దేశం ఎల్లలు బ్రిటిష్        వారి కాలంలో లాగాలేవు. ఈ దేశం విభజించబడింది. ఆ మేరకు       జాతీయగీతం మారాలి. ఆంధ్రులు, తమిళులు, కన్నడిగులు, మళయాళీలు       మొదలైన ద్రావాడులకు తగిన వర్ణన జాతీయగీతంలో ఉండాలి ఎందుకంటే వీరు దేశంలో సగభాగం!

              అందువలన చక్కని సంస్కృతంలో భారతీయుల ఔన్నత్యమును     తెలిపే జాతీయగీతం ప్రవేశపెట్టాలి. సంస్కృతాన్ని జాతీయ భాషగా       ప్రకటించాలి.


జాతీయ గీతం
         

        ఉత్తరప్రభ 8-11-1986                                                                                                                               
                   జాతీయ గీతాలాపన నిర్బంధం కాదు అని సుప్రీం కోర్టు       వ్యాఖ్యానించిన దరిమిలా దానిని నిర్బంధం చేస్తూ రాబోయే పార్లమెంటు సమావేశాలలో తీర్మానం చేయబోతున్నట్లు ప్రధాని శ్రీ రాజీవ్ గాంధి   ప్రకటించారు. ఈ సంధర్భంగా ఈ ప్రయత్నాన్ని ప్రతిఘటించడానికి శ్రీ     కృష్ణస్వామి వారియర్ అనే సంస్కృత ప్రధానోపాధ్యాయుడు చేస్తున్న        వాదనలు సమంజసంగా ఉన్నాయి. ఆయన వాదనలో మూడు ప్రధాన        అంశాలున్నాయి.

1.    జాతీయ గీతం జాతీయ బాషలోనే ఉండాలి. హిందీ గాని బెంగాలీ కాని జాతీయ భాషలు కావు, సంస్కృతం మాత్రమే జాతీయ భాష.

2.    జాతీయ గీతం జాతిని లేదా దేశాన్ని కీర్తించాలి కాని ఈ 'జనగణమన' జాతి అధినాయకుణ్ణి, దేశపాలకుడిని మాత్రమే కీర్తిస్తున్నది.


3.    జాతీయ గీతంలో మనదేశ భూభాగాలే కీర్తించబడాలి. అన్ని భూభాగాలనకు సమానమైన వర్ణన చేయాలి. అంటే పంజాబ్, సింధు లాంటి పరదేశ భాగాలను విసర్జించి, ద్రావిడ భూభాగాలను విడివిడిగా విపులంగా వర్ణించాలి.

       ప్రస్తుతం జాతీయ భాష హోదా పొందాలని పోటీ జరుగుతున్నది. హిందీని బలవంతంగా అధికార భాషగా చెయ్యాలని ప్రయత్నం జరుగుతుననట్టు ఇతర భాషల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి వారు తమ భాష అన్యాయమైపోతున్నట్లు భాధ పడుతున్నారు.

       ఇక్కడొక చిన్న పరిష్కారం ఏమిటంటే భారత దేశంలోని అన్ని భాషలలో (ఉర్దూతో సహా  సంస్కృతం బాగా మిళితమై ఉంది. సంస్కృతాన్ని భారతీయులంతా ద్రావిడులు కూడా) జాతీయ భాషగా అంగీకరించగలరు. అందువలన సంస్కృతాన్ని జాతీయ భాషగా ప్రకటించి, ఆ భాషను వాడుకలోకు తేవలసిన అవసరమున్నది. సుప్రీంకోర్టులో సంస్కృతంలోనే ఒకాయన వాదించిన సంగతి మనకు తెలుసు. సంస్కృతాన్ని అన్ని భాషల లిపులలో వ్రాసుకొనవచ్చును. ఉచ్ఛారణ మాత్రం ఒకటే గదా! వాస్తవానికి జాతీయ భాషగా ఉండదగిన అర్హత హిందీకి గాని మరే భాషకు గాని లేదు. కేవలం సంస్కృతానికి మాత్రమే ఆ అర్హత ఉంది ప్రజలు, పాలకులూ దీనిని గుర్తించాలి.


తెలుగు మీడియం చదువు కష్టం
ఈనాడు 23-8-1993                                      
తెలుగును అధికార భాషగా అమలు చేయాలన్న సంకల్పం ఊపందుకోవడం లేదు. అన్ని సబ్జెక్టులనూ తెలుగులో బోధించాలన్న లక్ష్యంతో రూపొందించిన పాఠ్యపుస్తకాల్లో మింగుడుపడని పదాలెన్నో చోటు చేసుకొంటున్నాయి. 9వ తరగతి సైన్సు పుస్తకంలో 'లీక్ ప్రూఫ్ పిస్టన్ సిలిండర్'ను 'నిష్యందనము కాని ముషలికంతో ఉన్న స్థూపం' అని పేర్కొన్నారు. కఠినమైన సంస్కృత పదాలకు బదులు పలుకుబడిలో ఉన్న ఆంగ్లపదాలు, సరళమైన తెలుగు పదాలు వాడితే ఎంతో హాయిగా ఉంటుంది. తెలుగు మీడియంలో చదువంటేనే హడలి పోయే పరిస్థితి లేకుండా చూడాలి.


ఉమ్మడి లిపి ఆవశ్యకం
ఈనాడు 7-3-1990                                                  

దేశంలోని భాషలన్నింటికి 'జాతీయ ఉమ్మడి లిపి' గా దేవ నాగరిని వ్యాప్తి చేయగోరే వారు సోవియట్ పరిణామాలను గమనించాలని మన రాష్ట్ర గవర్నర్ శ్రీ కృష్ణకాంత్ చేసిన సూచన సబబుగా ఉంది. సోవియట్ లో వందకు పైగా జాతులున్నాయి. లిపి కలిగిన భాషలు 130 ఉన్నాయి. అక్కడ రష్యన్ భాషను ఇతర జాతులు భాషల వారి బలవంతంగా రుద్దడం వల్ల ఎంతో నష్టం జరిగిందని శ్రీ చండ్ర రాజేశ్వరరావు ఇటీవలే ఒప్పుకున్నాడు. 1632 భాషలున్న మన దేశంలో లక్ష మందికి పైగా మాట్లాడే భాషలు 33 ఉన్నాయి. భాషా ప్రాతిపదిక మీద జాతుల విభజన అనే సూత్రాన్ని మన దేశం సోవియట్ నుండే స్వీకరించింది. అక్కడ రష్యన్ భాషా రుద్దుడు ఎలాంటి ఫలితాన్ని తెచ్చిందో ఇక్కడ హిందీని బలవంతంగా రుద్దడం కూడా అంతటి ఫలితాన్నే తెస్తుంది.



రష్యా నేర్పే పాఠం
ఆంధ్రప్రభ 15-2-1990                                               

       రష్యాలోని వివిధ భాషల పట్ల అవలంబించిన వివక్ష బలవంతంగా రష్యన్ భాషను ఇతర భాషలవారిపై రుద్దడం వంటి పనుల వల్ల, జాతీయ మైనారిటీలను స్టాలిన్ ఛిన్నాభిన్నం చేసినందువల్ల ఎక్కువ హాని జరిగిందని భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ చండ్ర రాజేశ్వరరావు పేర్కొన్నారు. సోవియట్ యూనియన్ లో 15 యూనియన్ రిపబ్లిక్కులు, 20 స్వయం ప్రతిపత్తి గల రిపబ్లిక్కులు, 8 స్వయం పాలిత ప్రాంతాలు ఉన్నాయి. 130 భాషలున్నాయి. వందకు పైగా జాతులున్నాయి. 1917 అక్టోబర్ విప్లవంలో ఈ జాతులు విడిపోయి స్వతంత్ర రాజ్యాలను ఏర్పాటు చేసుకునే హక్కును లెనిన్ ప్రసాదించాడు. భాషా ప్రాతిపదిక మీద జాతుల విభజన సూత్రాన్ని మన దేశం సోవియట్ యూనియన్ నుండే స్వీకరించింది. నేటి వరకు హిందీని బలవంతంగా రుద్దడం కొనసాగుతూనే ఉంది. రేడియో, టీవీ, ప్రభుత్వ ఆఫీసుల్లో హిందీ ఆధిపత్యం సాగుతోంది. ఉత్తరాదిన కొంత ప్రాంతానికి పరిమితమైన హిందీ భాషను జాతీయ భాషగా చేయదలుస్తున్నారు. దేశంలోని మిగతా భాషలను కేంద్రం నుండి ప్రోత్సాహం కొరవడింది. సోవియట్ లో రష్యన్ భాష పట్ల పెల్లుబికిన అసంతృప్తి మన దేశంలో హిందీ పట్ల కూడా పెల్లుబుకుతుంది. కేంద్రం దీన్ని గమనించి మసలుకోవాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి