ఈ బ్లాగును సెర్చ్ చేయండి

6, ఆగస్టు 2013, మంగళవారం

పోలవరం



      పోలవరం ప్రాజెక్టును చేపట్టాలి
ఆంధ్రప్రభ 6-10-1990                                             ఎన్. రహంతుల్లా
ఏలూరు

పశ్చిమ గోదావరి జిల్లాలో కొవ్వూరు నుండి పోలవరం వరకు గోదావరి గట్టుపై తారు రోడ్డు వేశారు. అయితే ఈ రోడ్డు నిర్వహణ సరిగా లేనందువల్ల వరద సమయంలో తాళ్ళపూడి నుండి పోలవరానికి బస్సుల రాకపోకలు బంద్ అవుతుంటాయి. తారు రోడ్డుకు  పక్కగా గోదావరి గట్టును ఎత్తు చేశారు. అది మట్టితో పోసిన కట్ట. దానికి సిమెంట్ లైనింగ్ చేయనందువల్ల ఆ మట్టి అంతా వర్షాలకు కరిగి తారు రోడ్డు  మీద పరుచుకుపోతుంది. టైర్లు జారిపోతాయని ఆర్టీసీ  బస్సులను నడపడం ఆపివేస్తారు.

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని తియ్యని కబుర్లు చెప్పే నాయకులు 1950 నుండి ఈ ప్రాజెక్టు కోసం ఏమీ చెయ్యలేదు. కోస్తా ప్రాంతాన్ని వరదల బారి నుండి రక్షించడమే గాక, వేలాది ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆరంభించాలి. దీనిపై అంతరాష్ట్ర వివాదాలు కూడా ఉండవు. ఈ ప్రాంతాల్లో వంతెనలు, తారు రోడ్ల అవసరం ఎంతో ఉంది. పాపికొండలను పిండి చేసి గోదావరి కోస్తా అంతటా రాతి రోడ్డు నిర్మించవచ్చు. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే గోదావరి మీద రాకపోకలకు భారీ వంతెన కూడా నిర్మితమవుతుంది. ప్రతి ఏటా వరద బాధితుల సహాయం కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేసే బదులు ప్రభుత్వం ప్రాజెక్టు పనికి నడుం బిగించాలి.



పోలవరం ప్రాజెక్టు
జనవాక్యం 16-9-1990                                            ఎన్. రహంతుల్లా
ఏలూరు

పోలవరం ప్రాజెక్టు కోసం ఆందోళన చేపట్టనున్నట్లు రాష్ట్ర బి.జె.పి. అధ్యక్షుడు శ్రీ వెంకయ్య నాయుడు ప్రకటించడం హర్షదాయకం. ఆందోళన చేయనిదే ఏ ప్రాజెక్టూ సిద్ధించదనేది చరిత్ర నేర్పిన పాఠం. రాష్ట్రంలోని ఇతర పార్టీలన్నీ ఏకమై గోదారి వరద నివారిణి, వేలాది ఎకరాల సేద్య సంరక్షిణి అయిన పోలవరం ప్రాజెక్టు కోసం ఉద్యమించాలి. పోలవరం ప్రాజెక్టును అడ్డు పడే శక్తులను బట్టబయలు చేయాలి.


అభివృద్ధికి నోచుకోని పోలవరం
ఆంధ్రజ్యోతి 2-9-1990                                             ఎన్. రహంతుల్లా
పోలవరం

పోలవరం మండల కేంద్రం అయినప్పటికీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఇక్కడ ఎలాంటి ప్రాధమిక సౌకర్యాలు లేవు. కొద్దిపాటి వర్షానికే బస్సులు రద్దయ్యే పరిస్థితి ఉంది. వరదల నివారణకే కాక, వేలాది ఎకరాల సాగుబడి కోసం పోలవరం ప్రాజెక్టును వెంటనే నిర్మించాలి. కొవ్వూరు నుంచి పోలవరం మీదుగా భద్రాచలానికి ఒక రైలు మార్గం నిర్మించాలి. పోలవరం దగ్గర గోదావరి మీద ఒక వంతెన నిర్మిస్తే ఏజన్సీ ప్రాంతాలకు అది ముఖ ద్వారంగా ఉంటుంది. పోలవరంలో ఒక బస్సు డిపో నిర్మించాలి.



క్షీణించిన పారిశుధ్యం
ఆంధ్రజ్యోతి 11-9-1990                                                      
                                                                       
          పోలవరం గ్రామంలో పారిశుధ్యం క్షీణించింది. రోడ్ల మీద పశువులను కట్టేస్తున్నారు. ఈ పశువుల సంచారం వల్ల తారు రోడ్లన్నీ పేడ మయంగా ఉన్నాయి. జూనియర్ కాలేజీకి వెళ్ళే రోడ్డు మీద కుక్కులు కూడా సంచరిస్తున్నాయి. వీటిని నిరోధించడానికి ఏ అధికారులు ముందుకు రావడం లేదు. కాబట్టి సంబంధిత అధికారులు పోలవరంలో తగు చర్యలు తీసుకోవాలని మనవి.



ఇన్నాళ్ళయినా గట్టెక్కని పోలవరం
ఈనాడు 19-9-1990                                               నూర్ బాషా రహంతుల్లా
ఏలూరు
పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం 3,030 కోట్ల రూపాయలకు చేరిందనే వార్త చాలా బాధాకరంగా ఉంది. మనం చేసే జాప్యం వల్ల, మేలు చేసే నదులే ప్రళయకారకమై ఎంతో నష్టం కలిగిస్తున్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్ధి సాధించామని గొప్పలు చెప్పుకోవటం వట్టి ఆత్మవంచన మాత్రమేననిపిస్తున్నది. సరైన సమయంలో తక్కువ ఖర్చుతో ప్రాణాధారమైన ప్రాజెక్టుల్ని కట్టుకోకుండా ప్రజల ప్రయోజనాలను స్వార్ధరాజకీయాలకు పణంగాపెట్టి, వరదలు ముంచెత్తినప్పుడు మొసలి కన్నీరు కార్చడం శోచనీయం. ఆంధ్రప్రదేశ్ నుండి ఎంతోమంది ఢిల్లీ వెళ్ళి ఏమి ప్రయోజనం సాధించారో తెలియడంలేదు. పోలవరం ప్రాజెక్టు కోసం ఆందోళన చేపడతామని బి.జె.పి. నాయకులు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు సమష్టిగా ఈ ప్రాజెక్టును సాధించాలి. ఖర్చు ఇప్పటికే తడిసి మోపెడైంది. ఇంకా కాలయాపన చేయటం అనర్ధదాయకం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి