ఈ బ్లాగును సెర్చ్ చేయండి

6, ఆగస్టు 2013, మంగళవారం

కులాలు-కులాంతర వివాహాలు



నీరుకొండ దురంతం
అంధ్రప్రభ 11-8-1987                                                
              మేకలను బలిస్తారు. సింహాలను కాదుఅనే అంబేద్కర్ సూక్తితో 5-  8-87 న ఆంధ్రప్రభ లో నీరుకొండ దురంతాన్ని గురించి వచ్చిన వ్యాసంలో   మంచి పరిష్కార మార్గాలు సూచించారు. అవి:
1.    వర్ణాంతర వివాహాలు విరివిగా జరగాలి.
2.    హరిజనులు విద్యావంతులు కావాలి.
3.    హరిజనులు అత్మరక్షణ సమర్థతను పెంపొందించుకొని, వీరుల వలె బ్రతకటం, చావడం నేర్చుకోవాలి.
4.    బలపడిన హరిజనులు మిగిలిన వారికి చేయూతనివ్వాలి.
      
       హరిజనుల ఊరేగింపులు తమ వీధుల గుండా రానివ్వని వారు, హరిజనులను తమ వీధి కొళాయిలలో నీరు త్రాగనివ్వని వారు వారితో వర్ణాంతర వివాహాలకు సిద్ధపడతారా? కారంచేడు బాధితులు చీరాలలో, నీరుకొండ బాధితులు మంగళగిరిలో నివసించటానికి ఇళ్ళు కట్టించి ఇమ్మని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. హంతకుల ముందుకు మళ్ళీ పోయి నివసించాలని ఏ మనిషీ కోరుకోడు. హంతకుల ఇళ్ళలో, పొలాలలో కూలి చేయలేడు. ప్రభుత్వంపై హరిజనులకు మంగళగిరిలోనే ఇళ్ళు కట్టించి ఇవ్వాలి.


కులాంతర వివాహాలు
ఆంధ్రపత్రిక 28-11-1985                                      ఎన్. రహంతుల్లా
                                                              పులికల్లు
                                                              పొదలకూరు మండలం
              ఆర్యా, ఈ మధ్య మన నాయకులు మన దేశానికి ఉపయోగించే కొన్ని        ముఖ్యమైన సూచనలు చేశారు. అవి ఏవంటే:
              ప్రతి మండల కేంద్రం నుండి అన్ని గ్రామాలకు రోడ్లు, ఆర్.టి.సి. బస్సులు    ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ రామారావుగారు కోరారు.     గ్రామాలను అభివృద్ధి చేయాలని లోకాయుక్త శ్రీ ఆవుల సాంబశివరాను       గారు కోరారు.
              ఇంకా పెళ్ళి కాని గజిటెడ్ అధికారులు, మంత్రులు, శాసనసభ్యులు    కులాంతర వివాహాలు చేసికోవాలి. కులాంతర వివాహాలకు ప్రోత్సాహకాలు పెంచాలని శ్రీ చరణ్ సింగ్ గారు కోరారు. ఇవి నిశ్చయంగా దేశానికి మేలు    చేసే సూచనలు. వీటిని అమలు జరపటంలో ప్రభుత్వాధికారులు శ్రద్ధ వహించాలి. మరో విషయం ఏమిటంటే మండల కేంద్రాల నుండి అన్ని        గ్రామాలకు వేసే రోడ్లు మట్టి, కంకర రోడ్లు కాకుండ తారు రోడ్లు వేయాలి.     ప్రైవేటు బస్సులను రద్దుచేసి ఆర్.టి.సి. బస్సులు నడపాలి. ప్రతి గ్రామానికి   బస్సు అనే పథకం అమలు చేయాలి.
              ఇక కులాంతర వివాహాలు చేసికొనే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి. కులాంతర వివాహాలు చేసికొనే కూలిపని వారికి రెండు ఎకరాల పొలం ఇవ్వాలి. ఆ కులాంతర వివాహాలు అగ్రవర్ణాలకు, తక్కువ కులాలుగా వర్గీకరించబడిన వారి మధ్యే జరగాలి.


కులాంతర వివాహాలకు ప్రోత్సాహం
ఈనాడు 24-12-1994                                          
                                                 
కులం, మతం అడ్డుగోడలను అధిగమించి వివాహాలు చేసుకునే దంపతులకు అండదండలందించడం అందరి కర్తవ్యం. అలాంటి దంపతులకు ఆర్ధిక సహాయం అందించి ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత. ఇందుకోసం పారితోషికం ఇస్తున్నారు. కాని ఈ మొత్తం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటోంది. ఈ అసమానతలు తొలగించేందుకు అన్ని రాష్ట్రాలు పారితోషికాన్ని 25 వేలకు పెంచాలని కేంద్ర సంక్షేమ శాఖ సలహా ఇచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రబుత్వం మూడువేల నుంచి పదివేలకు మాత్రమే పెంచింది. సామాజిక నిబంధనలు ధిక్కరించి కులాంతర వివాహాలు చేసుకున్న జంట తమ కాళ్ల మీద తాము నిలబడడానికి ఈ మొత్తం చాలదు. అందువల్ల ప్రభుత్వం, కేంద్ర సంక్షేమ శాఖ సూచన మేరకు పాతిక వేలకు పెంచాలి. తద్వారా కుల, మత విభేదాలను రూపుమాపి దేశ సమగ్రత, సమైక్యతలను ప్రోది చేసేందుకు వీలవుతుంది.




       Inter – Caste weddings
Indian Express 21-12-1994                                     N.Rahamthulla
                                                                               Palakollu
                                                                            
Sir,

The Center has suggested to all the states to enhance the incentive award for inter-caste and inter-religious couples to Rs. 25,000. But the state government increased it to only Rs. 10,000.

As inter- religious and inter caste marriages are effective instruments for real social integration. The state governments should realize their importance and enhance the incentive award to Rs. 25000.




      అంతా ఒకే కులం
ఆంధ్రభూమి 20-9-1990                                   
                                                                       
          కాపులు, రెడ్లు వేరు వేరు కులస్తులు కాదనీ, ఇప్పటికీ రెడ్లు తమ కులం 'కాపు' గా పేర్కొంటారని చేగొండి జోగయ్య గారు అన్నారు. అయితే కమ్మ, కాపు, రెడ్డి మూడూ కూడా ఒకే కులమని చారిత్రక గ్రంధాలు చెబుతున్నాయి. 1920 లో నిజాం రాజ్యంలో కులాలు తెగలుఅనే గ్రంధం వ్రాసిన సయ్యద్ సిరాజుల్ హసన్ కాపులంతా ఆదిరెడ్డి యొక్క ఏడుగురు కొడుకుల సంతానం అని పేర్కొన్నారు. కాపు, కుంబి, రెడ్డి అనే వారు ద్రావిడ జాతికి చెందిన వ్యవసాయదారులు. కాపులు 10 ఉపకులాలుగా చీలి పోయారు. వారు 1. పంచ రెడ్లు(మోటాటి, గోదాటి, పాకనాటి, గోనె, గిట్టాపు) 2. యాయ 3. కమ్మ 4. పత్తి 5. పడకంటి 6. శాఖమారి 7. లింగాయత 8. రెడ్డి 9. పెంట 10. వెలమ. వీళ్ళంతా వ్యవసాయం ప్రధాన వృత్తిగా గల ప్రజలు. వీరి సంస్కృతి ఆచారాలు ఒక్కటే. కులాల సంఖ్య అధికమై అనైక్యత, అరాచకం ఆందోళనలు పెరిగిపోతున్న ఈనాడు ఈ పదికులాల వారు పరస్పరం వివాహాలకు సిద్దపడి ఒకే కులంగా సంఘటితమైతే దేశం బలపడుతుంది. కుల పోరాటాలు ఆగిపోయి ఐక్యత సిద్ధిస్తుంది.



    కులాల సంఖ్య తగ్గితే మేలు
ఆంధ్రప్రభ 9-10-1990                                                నూర్ బాషా రహంతుల్లా
                                                                  ఏలూరు
                                                                                                           
       కాపులు, రెడ్లు నేడు వేరు కులాల వారు కాదు. వారిద్దరూ ఒకే కులస్తులు. ఇప్పటికీ రెడ్లు తమ కులం కాపు అని పేర్కొంటారుఅని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి శ్రీ చేగొండి హరిరామ జోగయ్య ఇటీవల అన్నారు.

       అయితే కమ్మ, కాపు, రెడ్డి ఈ ముగ్గురు కూడా ఒకే కులస్తులని, క్రమేణా వీరు అనేక తెగలుగా చీలిపోయారని చారిత్రక గ్రంథాలు చెబుతున్నాయి. నిజాం రాజ్యంలో 'కులాలు తెగలు' అనే గ్రంథంలో సయ్యద్ సిరాజుల్ హసన్ ఈ కాపు కులాన్ని గురించి సవివరంగా రాశారు. 1920 లో ప్రచురితమైంది. అందులో 306 నుంచి 319 పేజీలలోని సారాంశం ఇది :

       కాపు, కుంబి, రెడ్డి – ద్రావిడ జాతికి చెందిన వ్యవసాయదారుల కులం. కాపు అంటే సంరక్షకుడు లేక అన్నదాత. ఆదిరెడ్డి అనే ఆయనకు పుట్టిన ఏడుగురు కొడుకుల నుంచి కాపు కులం అవతరించిందని చెబుతారు. కాపులు 10 ఉప కులాలుగా విడిపోయారు. అవి (1) పంచరెడ్లు (మోటాటి), గోదాటి, పాకనాటు, గిట్టాపు, గోనెగండ్లు (2) యాయ (3) కమ్మ (4) పత్తి (5) వడకంటి (6) శాఖమారి (7) వక్లిగర్ (లింగాయత్) (8) రెడ్డి (9) పెంట (10) వెలమ.
       మోటాటి చౌదరీలు మోటాటి కాపుల ఆడ పిల్లల్ని పెళ్ళి చేసుకుంటారు. కానీ తమ ఆడ పిల్లల్ని వారికివ్వరు. చిట్టావు కాపులు మాంసం మద్యం ముట్టరు. గోదాటి కాపు స్త్రీలు, పైట కుడి వైపుకు వేస్తారు. వారిలో వితంతు వివాహాలున్నాయి. అయితే గోనె కాపుల్లో వితంతు వివాహాలు నిషిద్ధం. కమ్మ కాపుల్లో ఇల్లో చెల్లమ్మ కమ్మ, గంపకమ్మ అని రెండు తెగలు. ఇందులో మొదటి వారు స్త్రీలకు పరదా పాటిస్తారు. కాని రెండవ తెగ స్త్రీలు పాటించరు.

       లింగాయత్ కాపులు జంగాన్ని గురువులుగా ఎంచుతారు. వాళ్ళు ఏ మత కార్యానికి బ్రాహ్మణుల్ని పిలవరు. వడకంటి కాపులు వధువుకు నల్లపూసల దండ బదులు పసుపు త్రాడు కట్టిస్తారు. లింగాయత్ కాపు తన భార్య బ్రతికి ఉండగానే ఆమె చెల్లెల్ని చేసుకోవచ్చు గాని ఆమె అక్కను చేసుకోరాదు. ఆ కులంలో ఇతరుల్ని చేర్చుకోరు.

       రెడ్డి కాపుల్లో విడాకులు అనుమతిస్తారు. విడాకులు పొందగోరే స్త్రీ కుల పంచాయితీ ముందు హాజరై విడిపోవడానికి గుర్తుగా ఒక గడ్డిపరకను తుంచాలి. కాపులు మతపరంగా శైవులు, వైష్ణవులుగా చీలి ఉన్నారు. నామధారులు అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తే విభూతిధారులు పంచాక్షరి మంత్రాన్ని జపిస్తారు. వారు సాతాని అయ్యరు గారి సమక్షంలో శవాలను దహనం చేస్తే వీరు జంగం సహాయంతో శవాలను పూడ్చివేస్తారు. అయితే వివాహ విధులు – నిశ్చితార్ధం, వర నిశ్చయం, పోచమ్మ కొలువు, ప్రదానం, అయిరేని కుండలు, లగ్నం, పదఘట్టనం, జీరగూడం, కన్యాదానం, పుస్తె మెట్టెలు, తలంబ్రాలు, బ్రహ్మముడి, అరుంధతీ దర్శనం, నాగవేలు, పానువు, వప్పగింత, మొదలైనవన్నీ అందరిలోనూ ఒకే రీతిగా ఉంటాయి.

       అందువలన కులాల సంఖ్య అధికమై అనైక్యతకు అరిష్టానికి, దేశం గురౌతున్న ఈనాడు ఒకే తరహా జీవన విధానం, సంస్కృతీ కలిగి ఉన్న ఈ 10 కులాల ప్రజలు సంఘటితమై ఒకే కులంగా భావిస్తే బాగుంటుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి