ఈ బ్లాగును సెర్చ్ చేయండి

6, ఆగస్టు 2013, మంగళవారం

నిరుద్యోగులు-పరీక్షలు



సుప్రీంకోర్టు సూచన అమలు పరచాలి       

                                                                       
                   రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్వరలో గ్రూప్ – 1సర్వీసులకు మెయిన్ వ్రాత పరీక్ష నిర్వహించనున్నది. వ్రాత పరీక్షకు 1200 మార్కులయితే, ఓరల్       టెస్టుకు మరో 300 మార్కులు కేటాయించారు.

              ఓరల్ టెస్ట్కు ఎక్కువ మార్కులు కేటాయిస్తే అన్యాయాలు      జరుగుతున్నందున సుప్రీమ్ కోర్టు అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు   ఒక మంచి సూచన చేసింది. అదేమిటంటే "మొత్తం సెలెక్షన్ కు అవసరమైన     మార్కులలో ఓరల్ టెస్ట్ మార్కులు 12.2 శాతం మించరాదు" అని. కాబట్టి        ప్రస్తుతం ఓరల్ టెస్టుకు కేటాయించిన 300 మార్కులను 150 కి తగ్గించాలి.        సుప్రీంకోర్టు సూచనను అమలుపరచి ఇకనైనా రాజకీయ నాయకులను     ఇంటర్వ్యూ బోర్డు నుంచి తొలగించాలి. ఇంటర్వ్యూలను టేప్ రికార్డు చేయాలి.


మానవత కావాలి
           

        ఆంధ్రప్రభ 28-3-1985                                     
                   ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు గ్రూప్ 2 ఎ పరీక్షకు 65 వేల        మంది వెళితే, 6 వేల మందిని మెయిన్ పరీక్షకు, అందులో నుంచి 900       మందిని ఇంటర్వ్యూకు పిలిచి, 300 మందిని సెలక్ట్ చేశారు. మొత్తం 3     సంవత్సరాలు పట్టింది. ఉద్యోగం రాని ఆ 600 మంది మెయిన్ పరీక్ష    పాసయిన ప్రజ్ఞావంతులే. సుదూర ప్రాంతాల నుండి ఇంటర్వ్యూకు        హైదరాబాద్ లో హాజరయి, మూడేళ్ళపాటు శ్రమించిన ఈ అభ్యర్ధులకు       మానవతా దృష్టితో గ్రూప్ 2 బి ఉద్యోగం యిస్తే వారి శ్రమకు ఫలితం దక్కినట్లువుతుంది.


పబ్లిక్ సర్వీసు కమీషన్ ఇంటర్వ్యూలు
           

        ఆంధ్రజ్యోతి                                                    
         ఆంధ్రప్రదేశ్  పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల నిర్వహించిన గ్రూప్ -2        ఇంటర్వ్యూలలో చాలా అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఒక        అభ్యర్ధి తాను ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలలో పాసయి ఇంటర్వ్యూలో చక్కగా జవాబులిచ్చినప్పటికీ సెలెక్షన్ రాలేదని హైకోర్టు న్యాయమూర్తి శ్రీ జీవన్ రెడ్డి గారికి లేఖ పంపించారు. ఆ లేఖనే రిట్ పటిషన్ గా స్వీకరించిన జీవన్ రెడ్డి గారు అభినందనీయులు.
      
 సర్వీస్ కమిషన్ లో జరుగుతున్న ఈ అన్యాయాలకు బాధ్యులను    గుర్తించి, తీవ్రంగా శిక్షించాలి. ఇకనైనా రాజకీయ నాయకులను కమిషన్ సభ్యులుగా తీసివేయాలి. ఇంటర్వ్యూలను టేపు రికార్డు చేయాలి. హాలు      టికెట్లు, ఇంటర్వ్యూ కార్డులను రిజిస్టరు పోస్టులో పంపాలి. ఇంటర్వ్యూ   బోర్డులో ఇద్దరు న్యాయమూర్తులను నియమించాలి.


పంచాయితీ ఈవోలు
           

        ఆంధ్రప్రభ 2-6-1989                                            
                   జిల్లాల్లో కలెక్టర్లు, డి.డి.వో లు, మండలాలలో ఎమ్.డివో లు గ్రామాలలో      ఇ.వో లు గవర్నర్ల పాత్రను నిర్వహిస్తూ ప్రజా ప్రతినిధుల అధికారాలను హరంచి వేస్తున్నారని శ్రీ ముద్రగడ పద్మనాభం అన్నారు. గ్రామాలకు నేరుగా    నిధులు అందజేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించాలి.       పంచాయితీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా నడుచుకుంటూ    గవర్నర్లలాగా ప్రవర్తిస్తున్నారని దీని అర్ధం. పంచాయితీ రాజ్        ఉద్యోగులందరినీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చి వారి జీత భత్యాలను కూడా కేంద్రమే భరిస్తుంటే దేశవ్యాప్తంగా ప్రతి ఊరిలోనూ ఈ గవర్నర్ల వ్యవస్థ   సుస్థాపితం అవుతుంది. కేంద్ర ప్రభుత్వానికి దేశం మీద మంచి పట్టు        దొరుకుతుంది. మన రాష్ట్రంలో 20 వేల పంచాయితీ గ్రామాలుండగా కేవలం   రెండు వేల మంది ఎగ్జిక్యూటిన్ అధికారులున్నారని, వీరు జవాహర్ రోజ్ గార్   యోజనను సరిగా నిర్వహించలేరని ముఖ్యమంత్రి శ్రీ ఎన్.టి.రామారావు     గారు అన్నారు. దేశంలో 2,12,248 గ్రామ పంచాయితీలు ఉండగా 1,80,000       పంచాయితీలకు ఎగ్జిక్యూటివ్ అధికారులు లేరు. కేంద్రం యు.పి.ఎస్.సి     ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేస్తే బాగుంటుంది.


దగాపడ్డ తమ్ముళ్ళు
           

        ఈనాడు 29-4-85                                       
                   ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల నిర్వహించిన గ్రూప్       రెండు (ఎ) ఇంటర్వ్యూలలో అనేక అవకతవకలు జరిగినట్లు   ఆరోపణలొచ్చాయి. వీటి పట్ల హైకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తపరిచింది. ప్రిలిమినరీ,       మెయిన్ పరీక్షల్లో పాసయి, ఇంటర్వ్యూ బాగా చేసినా సెలెక్ట్ రాలేదని, ఒక      అభ్యర్ధి రాసిన లేఖనే హైకోర్టు రిట్ పిటిషన్ గా స్వీకరించింది. అవకతవకలపై        విచారణ జరపటమే కాదు, బాధ్యులయిన వారిని తీవ్రంగా శిక్షించటం అవసరం. సర్వీస్ కమిషన్ లో ఇక ముంది రాజకీయ నాయకులకు స్థానం        కల్పించకుండా ఉండటం అంతకంటే అవసరం. ఏదయినా అవకతవకలు   జరిగితే ప్రభుత్వం పార్టీ ప్రయోజనార్ధం పక్షపాతరహితంగా చర్యలు      తీసుకోవడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది. కనుక నిరుద్యోగుల భవిష్యత్తును నిర్ణయించే కమిషన్ లో నిజాయితీ పరులయిన అధికారులనే కాక ఇంటర్వ్యూ సమయంలో హైకోర్టు న్యాయమూర్తులు ఒకరిద్దరిని       నియమించితే అభ్యర్ధులకు సర్వీస్ కమిషన్ మీద ఉన్న దురభిప్రాయం     తొలగిపోయే అవకాశం ఏర్పడుతుంది.


కంప్యూటర్ల ద్వారా ఉద్యోగ నియామకాలు        

                                                                       
    గ్రూప్ -4 ఉద్యోగాల రిక్రూట్ మెంట్ ను పబ్లిక్ సర్వీసు కమిషన్ పరిధి        నుంచి తొలగించడం మంచిదే కాని జిల్లా సెలక్షన్ బోర్డులకు అప్పజెప్పడం   మంచిది కాదు. ప్రతి జిల్లా ఎంప్లాయ్ మెంట్ ఎక్స్చేంజీలో ఒక కంప్యూటర్ ను        పెట్టి వయస్సు, సీనియారిటీ, అర్హతలను బట్టి ఉద్యోగాలలో నేరుగా  నియామకపు ఉత్తర్వులను జారీ చేయించాలి.
 గ్రూప్ -4 ఉద్యోగాలకు ఇంటర్వ్యూ అవసరమట. పైగా జిల్లా సెలక్షన్ బోర్డులలో ఎం.ఎల్.ఎ., లు కూడా సభ్యులుగా ఉంటారట, ఇదంతా చివరికి అన్యాయాలకు, గందరగోళానికి దారి తీస్తుంది. అందుకని పదవ తరగతి పాసై  ఉద్యోగం కావాలనుకొనే ప్రతి అభ్యర్ధి తన సొంత జిల్లా ఎంప్లాయిమెంట్     ఎక్స్చేంజీ కేంద్రంలో పేరు నమోదు చేయించుకోవాలి. ఎంప్లాయిమెంటు     ఆఫీసు నుంచి ఇంటర్వ్యూ కార్డులకు బదులు అపాయింట్ మెంట్ ఆర్డరే   రావాలి. ఆ పని వయసు, సీనియారిటీ అర్హతలను బేరీజు వేసిన తర్వాత కంప్యూటర్లు మాత్రమే చేయాలి. మానవ ప్రమేయం ఉండకూడదు.


ఉన్న వనరులను వాడుకోండి
           

        ఈనాడు 12-7-85                                                      
                   రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి నాల్గవ గ్రూప్ ఉద్యోగాల    నియామక అధికారాలను తొలగించి జిల్లా సెలక్షన్ కమిటీలకిచ్చిన ప్రభుత్వ       ఉత్తర్వులను హైకోర్టు సస్పెండు చేయడం హర్షణీయం. ఒక వేళ    శాసనసభ్యులను జిల్లా కమిటీ సభ్యులుగా చేయకపోయినప్పటికి ఆ       కమిటీలు న్యాయంగా వ్యవహరిస్తాయనే గారంటీ ఏమీలేదు. అసలు జిల్లా కేంద్రాలలో ఎంప్లోయిమెంట్ ఎక్స్చేంజీల పని తీరు మెరుగుపరచి వాటినే        ఉపయోగించుకోవచ్చుకదా! ప్రతి జిల్లా ఆఫీసుకూ ఒక కంప్యూటర్ ను ఇస్తే సరి. సీనియారిటీ అర్హతలను బేరీజు వేసి ఆ కంప్యూటర్ ఉద్యోగాలకు       అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఇక రాత పరీక్షల మిషయానికొస్తే, అర్హతల     అంచనాకు అదొక్కటే కొలమానం కాదు. జిల్లా ఎంప్లాయిమెంటు   ఎక్స్చేంజీలలో రిజిస్టరు చేసుకుని సంవత్సరాల తరబడి జీవనోపాధి కోసం        ఎదురు చూస్తున్న అభాగ్యులెందరో ఉన్నారు. ఉద్యోగాల కేటాయింపులో    అటు వంటివారిని పరిగణనకు తీసుకోవాల్సిన అవసరమెంతయినా ఉంది. అంతే గాని నాల్గవ గ్రూపు ఉద్యోగాలకు సర్వీస్ కమిషన్ అక్కర లేదు. జిల్లా కమిటీలూ అక్కరలేదు. జిల్లా ఉపాధి కల్పనా కేంద్రాలను సక్రమంగా    వినియోగించుకోగలిగితే అదే పదివేలు.


ఇది సబబేనా?         

                                                                                   
                   ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెల 28 నుంచి జరగవలసిన   గ్రూప్ 1 మెయిన్ పరీక్షలోని కొన్ని పేపర్లను అక్టోబర్ చివరి వారానికి       వాయిదా వేసింది. అయితే మిగతా పేపర్లు అక్టోబర్ ఒకటి నుంచి   మామూలుగానే జరుగుతాయి.

              సగం పరీక్ష మొదటి వారంలో, సగం పరీక్ష చివరి వారంలో, సగం      పరీక్ష చివరి వారంలో పట్టణాలకు వచ్చి మకాం వేసి వ్రాయాలంటే దూర     ప్రాంతాలలోని పేద అభ్యర్ధులకు సాధ్యమా? ఈ విధానం బీదవారిని పరీక్ష     వ్రాయకుండా అడ్డగించడానికేనా?

              అయిదు రోజులలో అయిపోయే పరీక్షల కోసం అభ్యర్ధులకు నెల       రోజుల ఖర్చూ, నాలుగూ ప్రయాణాలు విధించడం న్యాయమేనా? సర్వీస్ కమిషన్ వారు ఈ విషయాలు ఆలోచించాలి.


ప్రభుత్వ దారిద్ర్యం
ఈనాడు  24-4-1985                                                           
              ఆర్థికంగా వెనుక బడిన వారికిచ్చే స్కాలర్ షిప్పులు, స్టయిఫండ్లు      రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసినట్లు నిరూపించుకుంది. ఆర్థికంగా       వెనుకబడిన వారు అని వారికిచ్చిన బిరుదులోనే వారి దారిద్ర్యం     స్పష్టమవుతుంది. వారికిచ్చే సౌకర్యాలు రద్దు చేయటం ఏమిటి? అసలు       సహాయం చేయటానికి ప్రాతిపదిక ఏది? కులంలో వెనుకబడి ఉండటమా?        ఆర్ధికంగా వెనుకబడి ఉండటమా? ప్రభుత్వం పునరాలోచించాలి.


ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ
అంధ్రజ్యోతి 21-4-1985                                         
              ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ వారు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలో        ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ భూగోళం, చరిత్ర గురించి ప్రశ్నిస్తున్నారు. కానీ       విచారకరమైన విషయం ఏమంటే ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతిని గురించి       తెలిసినంతగా మన రాష్ట్రంలో ఏ జిల్లాకు ఎన్ని తాలూకాలు, ఆ తాలూకాల,   జిల్లాల సమాచారం, వాటిలోని నదులు, వాగులు, పరిశ్రమలు, ఖనిజ       సంపద, ప్రాజెక్టులు, ఆదాయవనరులు, రవాణా మొదలైన వివరాలు        తెలియజేసే పాఠ్య గ్రంథాలను ప్రభుత్వం ఏ తరగతిలోను సిలబస్ గా పెట్టలేదు. ఆంధ్రప్రదేశ్ పై ఇయర్ బుక్ రావడం లేదు.
              కనుక తాజా సమాచారంతో తెలుగు అకాడమీ వారు ఆంధ్రప్రదేశ్     జాగ్రఫీ పుస్తకం ప్రచురించాలి.


గ్రూప్ 1 పరీక్షలు
ఆంధ్రజ్యోతి 13-3-1991                                                   
                  
       మన రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ జనవరి 27 వ తేదీన గ్రూప్ 1 సర్వీసుల కోసం పరీక్ష నిర్వహించింది. ఇప్పుడు 32-34 సంవత్సరాల వయస్సు వారి కోసం అదే పరీక్షను ఏప్రిల్ లో నిర్వహించాలని చూస్తోంది. ఈ వయస్సు వారి కోసం ఈ పరీక్షను విడిగా మరోసారి నిర్వహించవచ్చు. కాని జరిగిపోయిన పరీక్షకు దీన్ని ముడి పెట్టడం ఎంతవరకు సమంజసం? పోయినసారి రాసిన వాళ్ళు కూడా మళ్ళీ అప్లై చేశారు. క్రితం సారి పేపర్ కంటే ఈసారి ఇచ్చేది తేలికగా ఉండొచ్చు. అప్పుడు మొదట రాసిన వాళ్ళకు అన్యాయం జరిగినట్లే గదా ? కోర్టులు, కాలయాపన తతంగాలు ఆపి జరిపిన పరీక్ష ఫలితాలు వెంటనే ప్రకటించాలని మనవి.



ప్రజా భాషకు విలువెక్కడ?
      ఈనాడు  12-2-1991                                           
                                                               
          ప్రజల భాష అయిన తెలుగు భాష ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు కాకపోవటానికి ఐ..ఎస్ అధికారులు మొదలు మంత్రుల వరకు అందరూ కారణమౌతున్నారు. సర్వస్ కమీషన్ నిర్వహించే గ్రూప్-1 పరీక్షల్లో ఇంగ్లీషు భాషా పరిజ్ఞానంపై ప్రశ్నా పత్రం ఎందుకు ? తెలుగు మీడియంలో డిగ్రీ చదివిన వారికి అయిదు శాతం మార్కులు ప్రోత్సాహకంగా ఇవ్వలేరా? పైగా ఉద్యోగులకు శిక్షణ ఇచ్చే తెలుగు పరిపాలనా సంస్థలో ఆంగ్లంలో శిక్షణ ఇస్తున్నారు. ఇక ప్రజల భాషకు విలువెక్కడ ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి