ఈ బ్లాగును సెర్చ్ చేయండి

6, ఆగస్టు 2013, మంగళవారం

కొత్త జిల్లాలు -మండలాలు-పార్లమెంటు స్థానాలు



మండలాల రద్దు యోచన అసమంజసం
ఈనాడు 15-12-1989
                    తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన పనుల్లో కొన్ని మంచివీ కొన్ని చెడ్డవీ        ఉన్నాయి. ప్రజలకు మేలు కలిగించిన పనుల్ని కొనసాగించి ప్రజా కంటకంగా       మారిన పనుల్ని ఆపివేయటం కాంగ్రెస్ ప్రభుత్వానికి ధర్మం. అంతేకాని తెలుగుదేశం చేసిన ఏ పని అయినా తప్పుడుదే అనే అభిప్రాయం మంచిది కాదు. దొడ్డి దారిన దొరలయిన వారికి ఆశ్రయంగా మారిన కౌన్సిల్ ను పునరుద్ధరించడం, ప్రజలకు ఎంతో చేరువ అయిన మండలాలను రద్దు  చేయబోవడం, ప్రజాకంటకులుగా మారిన పటేల్, పట్వారీలను తిరిగి తేవడం  ఇవన్నీ తొందరపాటు పనులే. సజావుగా నడుస్తన్న వ్యవస్థను చిందర  వందర చేయకుండా ఇప్పుడున్న మండలాల సంఖ్యను ఇంకా పెంచి ఆయా   కేంద్రాలన్నింటిలో అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేయాలి. మండలాల రద్దువల్ల ప్రజలకు ఎలాంటి మేలు కలుగకపోగా కష్టం  కలుగుతుంది. చేయదలిస్తే ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా   చేయడం మంచిది.

మంచిది కాదు
ఆంధ్రప్రభ 19-12-1989
                        మండలాలు రద్దు చేస్తామనే చెన్నారెడ్డి ఆలోచనకు కాంగ్రెస్     నాయకులే కొందరు ఎదురుతిరిగారనే వార్త చాలా ఆనందంగా ఉంది. పాత     ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రతి పనీ తప్పుడుదేననే అభిప్రాయం మంచిది కాదు. ఇప్పుడున్న మండలాల సంఖ్య ఇంకా పెంచాలి. మండలాలన్నిటికీ        ఉద్యోగుల్ని భారీ ఎత్తున రిక్రూట్ చేసుకోవాలి. ఇంకా వీలైతే ప్రతి పార్లమెంటు నియోజక వర్గాన్ని ఒక జిల్లాగా ప్రకటించాలి.

బాలాజీ జిల్లా
అంధ్రప్రభ     24.5.1985
          16 వేల చదరపు కిలో మీటర్ల వైశాల్యం తోను 30 లక్షల జనాభా తోను,        పరిపాలనా సౌలభ్యం ఎంత మాత్రం లేని చిత్తూరు జిల్లాను విడదీసి తిరుపతి       జిల్లా ఏర్పాటు చేయాలని జిల్లా ప్రజలు ఎన్నో దశాబ్దాల నుండి       కోరుకుంటున్నారు. అయినా ప్రతి ప్రభుత్వం ఈ జిల్లా తూర్పు ప్రాంత ప్రజల    గోడు చెవిటివాని ముంది శంఖం వూదినట్లున్నది. ముఖ్యంగా శ్రీ కాళహస్తి   ప్రజలు చిత్తూరు రావాలంటే 110 కిలోమీటర్లు ప్రయాణం చెయ్యాలి. అదే తిరుపతి జిల్లా కేంద్రం అయితే 34 కిలోమీటర్లు మాత్రమే. కాబట్టి తిరుపతిని  వాటికన్ సిటీగా చేయడం కంటే బాలాజి జిల్లాను ఏర్పాటు చేయటం లక్షలాది స్థానిక ప్రజలకు మేలు చేసినట్లు అవుతుందని ముఖ్యమంత్రి  గారికి మనవి.

కొత్తగా మూడు జిల్లాలు
ఆంధ్రజ్యోతి 24.5.1983
              ఈ మధ్య రాయలసీమకు చెందిన నాయకులు ముఖ్యమంత్రి గారిని   కలసి ఒక మంచి కోర్కె కోరారు. అదేమిటంటే తిరుపతి, నంద్యాల, గుంతకల్లు     కేంద్రాలుగా మరో మూడు జిల్లాలు ఏర్పాటు చేయాలని. ఇది తప్పని సరిగా రాయలసీమకు మేలు చేసే కోర్కె. పరిపాలనా సౌకర్యాలను ప్రజల చేరువకు తేవాలని మండలాలను ఏర్పాటు చేసిన శ్రీ ఎన్. టి. రామారావు గారు ఈ     మూడు జిల్లాలను కూడా తన చేతుల మీదు గానే ప్రారంభించి రాయలసీమ        ప్రజల అభిమానం పొందాలి.

7 కొత్త జిల్లాలు
ఆంధ్రప్రభ 7-5-1984
              మన రాష్ట్రంలో ఆదిలాబాద్, అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు,       ఖమ్మం, ప్రకాశం జిల్లాలు 15 వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యమును మించి   యున్నవి. హైదరాబాదు, శ్రీకాకుళం, కృష్ణా, విజయనగరం వంటి జిల్లాలతో   పోల్చుకున్న ఎడల పై జిల్లాల ప్రజలు ఎక్కువ దూరం ప్రయాణించి       కష్టపడవలసి వస్తున్నది. పెద్ది జిల్లాలలో పరిపాలన సౌలభ్యం ఉండదు.        ప్రజలకు సౌకర్యం ఉండదు. కాబట్టి పై జిల్లాలను చీల్చి సిరిపూర్, గుంతకల్లు,       తిరుపతి, రాజంపేట, నంధ్యాల, భద్రాచలం, చీరాల కేంద్రాలుగా 7 కొత్త జిల్లాలను, ఏర్పాటు చేయటం మంచిది. అప్పుడు జిల్లాల సగటు వైశాల్యం 9 వేల చదరపు కిలోమీటర్లు అవుతుంది. ఏ వ్యక్తీ జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల కంటే, ఎక్కువ దూరం ప్రయాణించ అవసరం ఉండదు.

        
కొత్త జిల్లాల ఏర్పాటు అవసరం
ఈనాడు 21-10-1992
దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన మధ్యప్రదేశ్ లో ఇప్పుడున్న 45 జిల్లాలకు తోడు మరో 16 జిల్లాల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ అయింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆ రాష్ట్రంలో జిల్లాల సగటు వైశాల్యం 7,200 చ.కి.మీ. లకు తగ్గుతుంది. మన రాష్ట్రంలో 42 పార్లమెంటు నియోజకవర్గాలుండగా 23 జిల్లాలు మాత్రమే ఉన్నాయి. జిల్లాల సగటు వైశాల్యం 11,959 చ.కి.మీ ఉంది. పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్యతో జిల్లాల సంఖ్యను సమానం చెయ్యలేకపోయినా కనీసం విజయవాడ, రాజమండ్రి, నంద్యాల, తిరుపతి, భద్రాచలం, మెదక్ కేంద్రాలుగా ఆరు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే రాష్ట్రంలోని మూడు ప్రాంతాల వారికి ఎంతో సదుపాయం చేకూరుతుంది. జిల్లాల వైశాల్యం తగ్గి, జిల్లా కేంద్రాలకు ప్రయాణం సులువవుతుంది.



కొత్త జిల్లాల ఏర్పాటుపై కిమ్మనరేం ?
ఈనాడు 6-11-1990                                       

విశాలాంధ్ర ఏర్పడి ముప్పయి నాలుగు సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సుదీర్ఘ కాలంలో కేవలం మూడు కొత్త జిల్లాలు మాత్రమే ఏర్పడ్డాయి. ఒరిస్సా ప్రభుత్వం ఒక్కసారిగా పది కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది. 37 జిల్లాలతో మొదలైన ఉత్తరప్రదేశ్ ఇప్పుడు 62 జిల్లాలతో అలరారుతోంది. అధికార వికేంద్రీకరణ దిశగా అన్ని రాష్ట్రాలు జిల్లాల సంఖ్యను పెంచడానికి ప్రయత్నిస్తున్నాయి. మన రాష్ట్రంలో మాత్రం కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంలేదు. జిల్లా కేంద్రాలు గ్రామాలకు చాలా దూరంలో ఉండి ప్రజల అనేక యాతనలు పడుతున్నారు. మొదట్లో 13 కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చిన శ్రీ చెన్నారెడ్డి తరువాత భద్రాచలం, శ్రీశైలం జిల్లాలు మాత్రం ఏర్పాటు చేస్తామన్నారు. ఆపని కూడా పూర్తి చేయలేదు. ఇప్పటికైనా జిల్లాల సంఖ్యను పెంచి పాలనా సదుపాయాలను ప్రజల చేరువకు తీసుకెళ్ళాలి. గ్రామాధికారులుగా నిరుద్యోగులని రిక్రూట్ చేయాలి. ల్యాండ్ రెవెన్యూ కమిషనర్ కు ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి.



జిల్లా కేంద్రాలు మార్చాలి
ఆంధ్రజ్యోతి 3-4-1991
మన రాష్ట్రంలోని 23 జిల్లాలలో హైదరాబాదు, నల్గొండ, నెల్లూరు, కడప జిల్లాలు మినహా మిగతా వాటన్నింటి జిల్లా కేంద్రాలు జిల్లాల మధ్యలో లేవు. ఆయా జిల్లా కేంద్రాలు ఏదో ఒక మూలన వుండడం వల్ల ప్రజలకు ప్రయాణ భారం అధికంగా ఉంది. అందువల్ల పెద్ద జిల్లాలను చీల్చి మరిన్ని కొత్త జిల్లాలు ఏర్పాటు చెయ్యాలి. లేదా జిల్లా కేంద్రాలను వెంటనే ఆయా జిల్లాల మధ్య ప్రాంతాలలో ఏర్పాటు చెయ్యాలి.ఆదిలాబాద్ కు మామిడిపల్లి, నిజామాబాద్ కు డీచ్ పల్లి, సంగారెడ్డికి అందోల్, ఖమ్మంకు కొత్త గూడెం, శ్రీకాకుళానికి టెక్కలి, విజయనగరానికి బొబ్బిలి, విశాఖపట్నానికి మూడుగుల, తూర్పు గోదావరికి పిఠాపురం, పశ్చిమ గోదావరికి తాడేపల్లి గూడెం, కృష్ణాకు హనుమాన్ జంక్షన్, గుంటూరుకు సత్తెనపల్లి, ప్రకాశంకు పొదిలి, అనంతపురం కు ధర్మవరం, కర్నూలుకు దోన్, మహబూబ్ నగర్ కు నాగర్ కర్నూలు కేంద్రాలుగా నిర్ణయించాలి.
పార్లమెంటు పరిధిలో జిల్లాలను ఏర్పాటు చేస్తారా ?
ఈనాడు 13-6-1990
అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు తాలూకాలను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వం నిర్ణయం అసమర్ధనీయం. ఒకవేళ అదే పద్ధతిని పాటించినా ఆ లెక్కన పార్లమెంట్ స్థానానికి కూడా రెండేసి జిల్లాలను ఏర్పాటు చేస్తే బావుంటుంది. కొత్త జిల్లాలను ఏర్పాటు చేయలేని ప్రభుత్వం, ఉన్న మండలాలను రద్దు చేయబూనడం దారుణం. నిజంగా ప్రజల చేరువలోకి ప్రభుత్వాన్ని తీసుకుపోవాలనే ధృడ దీక్ష ప్రభుత్వానికి ఉంటే మండలాల సంఖ్యను పెంచి పరిపాలనను సక్రమంగా అందించాలి.
మరిన్ని జిల్లాల ఏర్పాటుకు వినతి
ఈనాడు 16-8-1990
భద్రాచలం, శ్రీశైలం కేంద్రాలుగా రెండు గిరిజన జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నట్లు శ్రీ చెన్నారెడ్డి ప్రకటించడం ఆనందదాయకం. మన రాష్ట్రంలో కొన్ని జిల్లాల వైశాల్యం విస్తారంగా ఉండి ప్రజలకు దూరాభారం సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. తరచుగా తుఫాను తాకిడికి గురయ్యే కోస్తా ప్రాంతంలో చిన్న జిల్లాల ఏర్పాటు ఎంతో మేలు చేస్తుంది. ఆయా జిల్లాల కలక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉండచానికి, కీలక సమస్యలపై దృష్టి కేంద్రీకరించడానికి వీలవుతుంది.
'రద్దు' అభివృద్ధి నిరోధక చర్య
ఆంధ్రజ్యోతి 11-6-1990
మండలాలను రద్దు చేసి, తాలూకాలను గ్రామాధికారుల వ్యవస్థను పునరుద్ధరించడం అనాగరికమైన, అభివృద్ధి నిరోధకమైన ప్రజా వ్యతిరేక చర్య. అధికార నిరోధకమైన ప్రజా వ్యతిరేక చర్య. అధికార వికేంద్రీకరణ చర్యలో అతి గొప్పదైన కొత్త జిల్లాల ఏర్పాటుకు పూనుకోకపోగా, వున్న మండలాలను కూడా మూసివేసి కరణాలు మునసబులను తిరిగి తెచ్చి పెట్టే ఫ్యూడల్ పనికి పాల్పడడం అన్యాయం.తెలుగుదేశం చేసిన తప్పు ఒక్కటే. తొలగించిన గ్రామాధికారుల స్థానాలలో  ఉద్యోగుల్ని నియమించకపోవడం, మండల కార్యాలయాలలో తగిన వసతులు ఏర్పాటు చేయకపోవడం, ఈ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే చాలు, పరిస్థితి పూర్తిగా చక్కబడుతుంది.అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోనే తాలూకా కూడా ఉండాలి అనేదే ప్రభుత్వ ధ్యేయం అయితే పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోనే జిల్లాలను కూడా ఏర్పరచాలి. అసెంబ్లీకి రెండు తాలూకాలు, పార్లమెంటుకు రెండు జిల్లాలు ఏర్పరచాలి. కాని చట్ట సభల్లో పాల్గొని విధాన నిర్ణయాలు చేయవలసిన ఎమ్మెల్యేలు తాలూకాల మీద పడి తాసీల్దారుల్ని, ఆర్డీవోలను నియంత్రించే అవకాశం ఇవ్వడం కేవలం రాజకీయ లాభం కోసమే గాని ప్రజా ప్రయోజనం ఎంత మాత్రం కాదు.
ఆలూ లేదు...
ఆంధ్రప్రభ 2.5.1990
ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా ఇంకా భద్రాచలం జిల్లా ఏర్పడనే లేదు, దానికి అల్లూరి పేరు పెట్టాలని కొందరు వాదిస్తున్నారు. ముందు జిల్లా ఏర్పడటం ముఖ్యం గానీ దాని పేరు గురించి వాదులాట ఎందుకు ? ఇప్పటికే రంగారెడ్డి, ప్రకాశం, కృష్ణా, గోదావరి లాంటి పేర్లతో జిల్లా కేంద్రం ఎక్కడుందో అర్ధం కాని పరిస్థితి తయారయ్యింది. ప్రతి జిల్లాకు ఆ జిల్లా కేంద్రం పేరే ఉండటం మంచిది. మొత్తం మీద కొత్త జిల్లాలు ఏర్పడటం ప్రజల సౌకర్యం కోసమే గాని నాయకులు పేర్ల కోసం కాదు.
కంటి తుడుపు కమిటీలు ఖజానాకు భారం
ఈనాడు 6-11-1992
జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలని, వివిధ డైరెక్టరేట్లను సెక్రటేరియట్ లో విలీనం చెయ్యాలని 1960 లో ఉన్నతన్ కమిటీ సిఫార్సు చేసింది. పంచాయతీరాజ్, మున్సిపల్, రెవిన్యూ శాఖలను విలీనం చెయ్యాలని 1964 లో రామచంద్రారెడ్డి కమిటీ సిఫార్సు చేసింది. పౌరసరఫరాల బాధ్యతలను జిల్లా కలెక్టర్ల నుంచి తప్పించాలని 1967 లో ఎం.టి.రాజు కమిటీ నివేదించింది. ఈ సిఫార్సులేవీ ఈనాటికీ అమలుకు నోచుకోలేదు.  అలాంటప్పుడు అసలు ఆ కమిటీలను ఎందుకు నియమించినట్లు ? సమస్య పరిష్కారం పట్ల నిజమైన శ్రద్ధ ఉండి, సమగ్ర నివేదికల కోసం కమిటీలను ఏర్పాటు చేస్తే ఆ కమిటీల సిఫార్సులను అమలు చేయాలి. అంతేగాని ప్రతిపక్షాలు కోరాయనో, ప్రజలు అడిగారనో కంటితుడుపుగా ఏర్పాటుచేసే కమిటీలు ఖజానాకు భారమే తప్ప వాటి వల్ల ప్రజలకు ఒరిగేదేమిటి ?
చిన్న జిల్లాల వల్ల సౌలభ్యం
 ఈనాడు 6-6-1992
గత ఏడాది ఒకే రోజున పది కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి సంచలనం సృష్టించిన ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం తన యాభై ఎనిమిది రెవిన్యూ డివిజన్లనూ జిల్లాలుగా మార్చి మరో రికార్డు నెలకొల్పబోతున్నది. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ముఠా తగాదాలతో పరస్పర నిందారోపణలతో మునిగి తేలుతున్న నాయకులు ఇకనైనా కళ్ళు తెరవాలి. జిల్లాల వైశాల్యాన్ని ఏడువేల చదరపు కిలోమీటర్లకు మించనీయకూడదు. చిన్న జిల్లాల వల్ల పాలనా వికేంద్రీకరణ జరిగి ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుంది. మండల వ్యవస్థకు రద్దుచేయాలని యోచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం జిల్లాల సంఖ్య పెంచితే మండలాల రద్దు వల్ల ప్రజలు కోల్పోయే సౌకర్యం చిన్న జిల్లాల రూపంలో చేతికందుతుంది. 
పార్లమెంటు సీట్ల సంఖ్య పెంచాలి
ఈనాడు 15-2-1992
ఎన్నికల సంస్కరణలలో భాగంగా రిజర్వుడు నియోజకవర్గాలకు రొటేషన్ పద్ధతిని ప్రవేశ పెట్టాలనే యోచన మంచిదే. అయితే లోక్ సభ అసెంబ్లీ స్థానాలను పెంచే ఆలోచన ఏదీ లేదని కేంద్ర మంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి పేర్కొనడం సమంజసంగా లేదు. పెరిగిన జనాభాకు తగిన నిష్పత్తిలో నియోజకవర్గాల సంఖ్య పెరగాలని కాంగ్రెసేతర పార్టీలన్నీ చాలాకాలం నుంచి కోరుతున్నాయి. 1962 లో 494, 1967 లో 525, లోక్ సభ స్థానాలుండగా 1973 లో ఆ సంఖ్యను 543 కు పెంచారు. 1971 జనాభా లెక్కల ప్రకారం ప్రతి లోక్ సభ నియోజక వర్గంలోను గరిష్టం ఏడున్నర లక్షల మంది ప్రజలుండగా ఈనాడు ఆ సంఖ్య పదిహేనున్నర లక్షలకు చేరుకుంది. ఎనిమిది లక్షల మందికి ఒక లోక్ సభ నియోజకవర్గం చొప్పున నిర్ణయించినా వందలాది స్థానాలను అదనంగా ఏర్పాటు చేయవలసి వస్తుంది. లోక్ సభ నియోజకవర్గాల వైశాల్యం కూడా అలవి మాలిన రీతిలో సగటున ఆరువేల చదరపు కిలోమీటర్లు ఉంది. ఈ వైశాల్యాన్ని సగానికి సగం తగ్గించడం అవసరం కనుక నియోజకవర్గాల సంఖ్య పెంచేది లేదని మొండిపట్టు పట్టకుండా పెరిగిన జనాభాకు అనుగుణంగా నియోజకవర్గాల సంఖ్య పెంచే విషయాన్ని పరిశీలించడం న్యాయం.
మండలాల రద్దు వద్దు
ఈనాడు 31-7-1993
మండలాల ఏర్పాటువల్ల రాష్ట్రంలో రాజకీయ వికేంద్రీకరణ ఊపందుకొంది. బలహీన వర్గాల వారు గణనీయ సంఖ్యలో మండలాధ్యక్షులు కాగలిగారు. దిగువ స్థాయిలో రాజకీయ చైతన్యం పెల్లుబికింది. దానితో గుత్త రాజకీయ పెత్తనానికి, బ్యూరోక్రాట్ల ఆటలకు అడ్డుకట్ట పడింది. ఇలా రాజకీయ జాగృతిని కల్గించిన మండలాలను రద్దు చేయాలని ప్రభుత్వం తలపోయడం దురదృష్టకరం. దీని వల్ల బలహీన వర్గాల రాజకీయ ప్రయోజనాలకు భంగం కల్గుతుంది. అసెంబ్లీ నియోజక వర్గాన్ని తాలూకాగా ప్రకటిస్తామంటున్నారు. మరి అదే పంథాలో పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా చేయాల్సి వస్తుందని ప్రభుత్వం గ్రహించాలి.
రెవిన్యూ వ్యవస్థ ఊసే లేదు
ఈనాడు  3-11-1994
        ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నాయి. అందులో ఊరించే ఊకదంపుడు అంశాలే ఎక్కువగా ఉంటున్నాయి. పరిపాలనను మెరుగుపర్చే అంశం పైన వారు దృష్టి సారించడం లేదు. భారతీయ జనతా పార్టీ మాత్రమే కాస్త రెవిన్యూ వ్యవస్థ దుస్థితి పై దృష్టి సారించింది. తాము అధికారంలోకి వస్తే 20 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి పరిపాలనను ప్రజలకు చేరువ చేస్తామని బి.జె.పి. ప్రకటించడం ప్రశంసనీయం. రాష్ట్రావతరణ జరిగి 38 సంవత్సరాలయినా పెద్ద జిల్లాలను విభజించలేదు. రెవిన్యూ పాలనను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్న ఇంగితజ్ఞానం పాలకులకు కొరవడింది. పార్లమెంటు సభ్యుడు 16 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తోంటే జిల్లా కలెక్టర్ 29 లక్షల మంది అవసరాలు తీరుస్తున్నాడు. లోక్ సభ నియోజకవర్గాలతో జిల్లాలకు సారూప్యత లేక పోవడంతో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కడంలేదు. ఈ అంశాల దృష్ట్యా మిగతా పార్టీలు కూడా రెవిన్యూ వ్యవస్థపై ప్రకటన చేయాలి.
వికేంద్రీకరణ ద్వారా సంస్కరణలు
ప్రజావాక్కు  వార్త 16-1-1998
పాలనా సంస్కరణలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదే పదే ప్రకటనలిస్తున్నారు. శ్వేతపత్రాలు ప్రకటిస్తామనీ, కంప్యూటర్లు నెలకొల్పుతామని, పారదర్శకంగా పరిపాలన సాగిస్తామనీ అంటున్నారు. క్షణం తీరిక లేకుండా ఫైళ్ళ క్లియరెన్సనీ, ఆకస్మిక తనిఖీలనీ, జన్మభూమి అనీ తిరుగుతూనే ఉన్నారు. బూజుపట్టిన ఫైళ్ళు వేలకొలదీ సచివాలయంలోనే పేరుకు పోయినట్లు గమనించిన మంత్రులంతా ఆగ్రహాలు వ్యక్తం చేసి వెళ్ళిపోయారు. కానీ మండల స్థాయినుంచి సచివాలయం దాకా ఫైళ్ళ నడక వేగం పెంచటానికి ఎటువంటి చర్యలు అవసరమో ఆలోచించాలి. అసమర్థత, అసూయలు ప్రాథమిక లక్షణంగా ఉండే 'ఇంజలిటిటిస్' వ్యాధితో బాధపడే పరిపాలనా యంత్రాంగానికి శస్త్ర చికిత్స చేయక తప్పదు అని ప్రఖ్యాత మేనేజ్ మెంట్ మేధావి పార్కిన్ సన్ అన్నారు. జనాభా పెరిగేకొద్దీ ప్రజల నాగరికత పెరిగే కొద్దీ ప్రభుత్వ సేవలు కూడా అదే స్థాయిలో పెరగాలి. ప్రైవేటు కంపెనీలు మెరుగైన సేవలందిస్తామని పోటీపడుతుంటే ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రం బద్ధకం. బూజుపట్టిన పాత పద్ధతులే ఉంటున్నాయి. 1956 లో మన రాష్ట్రం ఏర్పడిన తరువాత మొట్టమొదట 1957 లో ఆర్థిక కమిటీ ప్రభుత్వ పాలనలో పొదుపు చర్యలు సూచించటానికి  ఏర్పడింది. ఆ తరువాత పాలనా సంస్కరణల గురించి 1960 లో ఉన్నితన్ కమిటీ, 1964 రామచంద్రారెడ్డి కమిటీ, 1967 లో ఎంటి రాజు కమిటీ, 1976 లో ఎన్జీవోల సదస్సు, 1980 లో లాల్ కమిటీ, చంద్రశేఖర్ కమిటీ, 1981 లో శ్రీ రాములు కమిటీ, 1985 లో రుస్తుంజీ కమిటీ ఎన్నో సూచనలు చేశాయి. వాటిలో కొన్ని అమలు అయ్యాయి. కొన్ని సిఫారసులు నేటికీ అమలు కాలేదు. 41 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మండలాల ఏర్పాటు మహా గొప్ప పాలనా సంస్కరణ. పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రజలంతా హర్షించిన సంస్కరణ అది. అలాగే కొత్త రెవిన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని రెవిన్యూ మంత్రి దేవేందర్ గౌడ్ కసరత్తు చేస్తున్నారు. అమలు చేయగలిగితే ప్రజలకు అది కూడా గొప్ప వరం లాంటిదే. కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం, ఆరు జోనుల్లోను జోనల్ రెవిన్యూ కార్యాలయాలు తెరవటం వల్ల రాష్ట్ర ప్రజలకు ఎంతో వెసులుబాటు కలుగుతుంది. రాజధాని నగరం మీద పెనుభారం తగ్గుతుంది. ప్రజలకు ఖర్చు తగ్గుతుంది. పేదవారికి పాలనా సదుపాయాలు చేరువవుతాయి. ముఖ్యమంత్రి కృషి ఈ దిశగా ఫలించాలని ఆశిద్దాం !
సత్వరమే కొత్త జిల్లాల ఏర్పాటు
ఈనాడు 24-6-1993
రాష్ట్రంలో 15 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నట్లు వార్త.  పెద్ద జిల్లాల వల్ల కొన్ని ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. పాలనా యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. రాష్ట్రావతరణ నాటి నుండీ ప్రతి ముఖ్యమంత్రీ కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రకటనలు గుప్పిస్తూ ప్రజలను ఊరిస్తున్నారు. ఇంతవరకూ మూడు కొత్త జిల్లాలు మాత్రమే ఏర్పాటయ్యాయి. నంద్యాల, తిరుపతి, గుంతకల్లు, రాజమండ్రి, విజయవాడ, అమలాపురం, భద్రాచలం, పార్వతీపురం, చీరాల, మంచిర్యాల, మెదక్, సిద్దిపేట జిల్లాలు ఏర్పాటు కావాలని ఆ ప్రాంతాల ప్రజలు చిరకాలంగా కోరుతున్నారు. వారి చిరకాల వాంఛ సత్వరమే తీర్చాలని మనవి.




1 కామెంట్‌:

  1. http://www.suryaa.com/opinion/edit-page/article-150717

    http://www.namasthetelangaana.com/Editorials/story.asp?category=1&subCategory=7&ContentId=135434

    http://nrahamthulla3.blogspot.in/2013/08/blog-post.html?showComment=1377055365498#c4916862236633738096

    రిప్లయితొలగించండి