ఈ బ్లాగును సెర్చ్ చేయండి

6, ఆగస్టు 2013, మంగళవారం

పాకిస్థాన్ - యుద్ధాలు



ఇదీ పాక్ నిజస్వరూపం
ఈనాడు 15-6-1993                                                   

కాశ్మీర్, పంజాబుల్లో తీవ్రవాదులకు సాయం చేస్తూ లేదని ఇంతకాలమూ పాకిస్తాన్ బుకాయిస్తూ వచ్చింది. తుట్టె పురుగుకు రెక్కలు వచ్చినా, ముసలి వాడికి ప్రాయం వచ్చినా పట్టపగ్గాలుండవన్నట్లు కోర్టు తీర్పుతో పునర్జన్మ ఎత్తిన నవాజ్ షరీఫ్ లో అత్యుత్సాహం పెల్లుబికింది. కాశ్మీర్ మిలిటెంట్లకు సాయం ఆపేస్తామని ప్రకటించడంతో నిజస్వరూపం బయటపడింది. ఇంతకాలం తీవ్రవాద కుంపటిని ఎగదోశామని పరోక్షంగా ఒప్పుకున్నట్లయింది. ఉభయదేశాలు ఆయుధాల కోసం వెంపర్లాడకుండా రక్షణ వ్యయాన్ని తగ్గించుకొని అర్ధికాభివృద్ధి కోసం కృషి చేయ్యాలని సూచించినట్లు వార్త. అంగిట బెల్లం, ఆత్మలో విషం అన్నట్లు పాక్ పాలకులు గతంలో ఎన్నో సార్లు ప్రవర్తించారు. తన మాటలకు నవాజ్ షరీఫ్ కట్టుబడితే ఇరు దేశాలకూ లాభదాయకం.



యుద్ధం అనర్థదాయకం
ఈనాడు 16-4-1998                                           

భారత్ – పాకిస్తాన్ ల మధ్య 2006 వ సంవత్సరంలో యుద్ధం జరిగి రెండు దేశాలు నాశనమైన తరువాత ఐక్యరాజ్యసమితి, అమెరికాలు రంగ ప్రవేశం చేస్తాయని పెంటగాన్ చెప్తున్న జోస్యాన్ని ఇరు దేశాలూ గమనించాలి. అలా జరగడం అమెరికా కోరిక కావచ్చు. ఆయుధ సంపత్తిలో భారత్ కంటే వెనుకబడి ఉన్న పాకిస్తాన్ తీవ్రవాదుల్ని ప్రోత్సహిస్తోందని పెంటగాన్ అంటున్నది. ఈ విషయంలో పాకిస్తాన్ ను అమెరికా కట్టడి చేయవచ్చు గదా? ఆ దేశానికి ఆయుధ సాయం అందించడం నిలిపి వేయవచ్చు కదా ? దేశ విభజన వల్ల ఎంతటి అనర్ధం జరిగిందో కుష్వంత్ సింగ్ తన 'ది ట్రైయిన్ టు పాకిస్తాన్' పుస్తకంలో కళ్ళకు కట్టినట్టు వివరించారు. యుద్ధమే సంభవిస్తే మానవ మారణహోమం జరుగుతుంది. అనవసరమైన అపార్ధాలతో ఉభయ దేశాల్లో మత కలహాలు చెలరేగుతాయి. ఈ వినాశకర పరిస్థితులు తలెత్తకుండా రెండు దేశాల ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకోవాలి. శాంతి, సుస్థిరతల కోసం ఇప్పుటి నుంచే కృషి జరగాలి. 



మానవత్వాన్ని మంట కలిపిన మతరక్కసి
ఈనాడు 31-8-1990                                
                                                                       
          స్వాతంత్ర్య దినోత్సవం నాటి ఈనాడు సంచికలో శ్రీ కులదీప్ నయ్యర్ రాసిన 'ఆ క్షణంలో అందరం శరణార్థులం' వ్యాసం హృదయవిదారకమైన గతాన్ని కళ్ళకు కట్టింది. అల్లాహో అక్బర్ అని వాళ్ళు, భారతమాతకీ జై అని వీళ్ళూ నరహంతక ప్రవృత్తితో నర్తనమాడుతుంటే, శాంతిప్రియులు, సౌమ్యులు, సాధారణ పౌరులు ఎంతో మంది ప్రాణాలు అరచేత పట్టుకోని గూళ్ళను వీడి బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేయవలసిరావడం ఎంత దౌర్భాగ్యం. ఈ మతాల వల్లనే కదా మారణ హోమం సాగింది. మానవజాతిని ముక్కలు చెక్కలు చేసింది ఈ మతాలే కదా? ఆ చేదు అనుభవాల తాలూకు జ్ఞాపకాలను మరచిపోవడం ఎవరి తరమూ కాదు. ఇప్పుడు అక్కాడా, ఇక్కడా ఉన్న వాళ్ళు నాటి కన్నీటి గాథల్ని చెబుతూనే ఉంటారు. సహనం, కరుణ, పరోపకార నైజం, ఐక్యత ఈనాటి అవసరాలు, జరిగిన నరమేధం నుంచి గుణపాఠాలు నేర్పి రెండు దేశాల పాలకులు ఉపఖండంలో శాంతికి పాటుపడాలని ఆకాంక్ష.



రక్షణ వ్యయం తగ్గిస్తే...
ఆంధ్రప్రభ 9-2-1989                                    
              ప్రస్తుతం మన దేశం సంవత్సరానికి 15 వేల కోట్ల రూపాయలు 'రక్షణ' కోసం ఖర్చు చేస్తున్నది. ఈ మొత్తాన్ని 4 వేల కోట్లకు కుదిస్తే, మిగిలిన       డబ్బుతో ఈ దేశంలోని నిరుద్యోగులందరికీ ఏడాదికి వెయ్యి రూపాయల   భృతి ఇవ్వవచ్చనీ, ఇంకా బడి పిల్లలందరికీ మధ్యాహ్న భోజనం పెట్టేందుకు       వెయ్యి కోట్ల రూపాయలు మిగిలి ఉంటాయని 28-7-1989 నాటి 'బ్లిట్జ్' పత్రిక   వెల్లడించింది. ఆకలిని, నిరుద్యోగాన్ని పారద్రోలే ఇలాంటి చర్యలు కేంద్రం        తీసుకోవాలని విజ్ఞప్తి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి