ఈ బ్లాగును సెర్చ్ చేయండి

6, ఆగస్టు 2013, మంగళవారం

నరకప్రాయం ఏలూరు



నరక ప్రాయం ఏలూరు
ఆంధ్రజ్యోతి 29-5-1990                                            నూర్ బాషా రహంతుల్లా
అమీనాపేట, ఏలూరు

ఏలూరులోని అమీనాపేటలో పారిశుధ్య పరిస్ధితులు అధ్వాన్నంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా రోడ్ల మీద మురికినీరు పారుతోంది. మురికి కాల్వలను ఎవరూ శుభ్రం చేయడం లేదు. మునిసిపాలిటీ వారు చెత్తా చెదారం తీసుకొచ్చి పార్కులో పోస్తున్నారు. మురుగు నీరు పల్లపు ప్రాంతాలలో నిల్వ వుండి దోమలు విపరీతంగా వృద్ధి చెందుతున్నాయి.

రక్షిత నీటి సరఫరా అనేదీ పేరుకే కాని బురదతో కలుషితమైన నీరు పైపుల్లో వస్తోంది. కలుషితమైన నీరు త్రాగడం వల్ల కామెర్ల రోగాలతో చాలామంది బాధపడుతున్నారు. మునిసిపాలిటీ నిర్లక్ష్యం ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నది.

పట్టణ జనాభా విపరీతంగా పెరిగి పోయింది. కాని వారికవసరమైన స్థాయిలో కొత్త ఇళ్ళ నిర్మాణం జరుగలేదు. చాలీ చాలని ఇళ్ళ అద్దెలు హైదరాబాదు కంటే ఎక్కువగా ఉన్నాయి. బావులలో ఉప్పు నీరు పడుతోంది. త్రాగే నీటి సరఫరా కొత్త ప్రాంతాలకు విస్తరించడం లేదు. ఈ పట్టణం జిల్లా కేంద్రమైనప్పటికీ కూలిపోయిన వంతెనలతో, పొంగే మురుగు కాల్వలతో, ఈగలు, దోమలు, పందుల స్వైర విహారంతో నరకప్రాయంగా ఉంది.
దోమలను నిర్మూలించాలి
స్థానిక సమస్యలు 1-7-1990                                      నూర్ బాషా రహంతుల్లా
అమీనాపేట, ఏలూరు

ఏలూరు పట్టణంలో బోదకాలు వ్యాధి విస్తరిస్తున్నది. ఇక్కడి క్యూలెక్స్ దోమల నివారణ కోసం మునిసిపల్, ఆరోగ్య శాఖల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. తమ్మిలేరు గట్లు రెండు దురాక్రమణలకు గురై వున్నాయి. ఈ పట్టణానికి భూగర్భ మురుగు నీటిపారుదల వ్యవస్థ కావాలి. తమ్మిలేరు రెండు గట్టులమీద నివాసాలు వుంటున్న వారిని ఖాళీ చేయించి తారురోడ్లు వెయ్యాలి. నిర్వాసితుల కోసం పట్టణం బయట స్థలాలు కేటాయించాలి. కొత్త బస్టాండు దగ్గరలోకి రైల్వే స్టేషన్ ను మార్చాలి. వరదలు, మురుగు బారి నుంచి పట్టణాన్ని కాపాడాలని, ధర్నాలు చేసినా, వంతెనల కోసం ఉద్యమాలు నడిపినా ఎవరికీ చీమ కుట్టినట్టుగా లేదు. పరిస్థితి ఇలానే  కొనసాగితే ఏలూరు ప్రజలందరికీ బోదకాళ్ళు రావడం ఖాయం.

గ్రంథాలయ నిర్వహణ అధ్వాన్నం
                                                                  ఎన్.రహంతుల్లా  
                                                                 ఏలూరు

ఏలూరు లోని జిల్లా గ్రంథాలయం నిర్వహణ అధ్వాన్నంగా ఉంది. పాతపేపర్లు ఏవీ దొరకడం లేదు. ఏదైనా ఒక పేపర్ అడిగితే కట్టల్లో వెతుక్కోమంటున్నారు. అవన్నీ చినిగిపోయి రకరకాల పేపర్లు కలిసి చిత్తు కాగితాల గుట్టల్లాగా ఉంటున్నాయి. ఆదివారం అనుబంధాలు కావాలని అడిగితే రావడం లేదని సమాధానం చెబుతున్నారు. లైబ్రరీ నిర్వహణను మెరుగుపర్చాల్సిందిగా అధికారులను కోరుతున్నాను.



    ప్రభుత్వ కాలేజీ లేదు
ఆంధ్రజ్యోతి 17-7-1990                                             నూర్ బాషా రహంతుల్లా
ఏలూరు

జిల్లా కేంద్రం అయిన ఏలూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదంటే ఈ ఊరి స్థాయిని ఎవరైనా అంచనా వేయవచ్చు. ప్రతి జిల్లా కేంద్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కేంద్రాన్ని పెడతామని ప్రతిజ్ఞలు చేసే ప్రభుత్వం ముందు డిగ్రీ కాలేజి ఏర్పాటు చేస్తే సంతోషిస్తాము. ఈ ఊళ్ళో చదువంతా ప్రైవేటు యాజమాన్యాలు గుప్పిట్లో బందీగా వుంది. ఫీజులు, డొనేషన్లు తలకు మించిన భారం అయ్యాయి. జిల్లా కేంద్రం పరిస్థితే ఇలా ఉందంటే ఇక మండలాలు ఎలా ఉన్నాయో ?


జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు
ఈనాడు 23-7-1990                                                నూర్ బాషా రహంతుల్లా
                                                                 ఏలూరు

ప్రతి జిల్లా కేంద్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. అయితే ఏయే జిల్లాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు లేవో అక్కడ ముందుగా వాటిని ఏర్పాటుచేసి ఆ తరువాత పోస్టు గ్రాడ్యుయేట్ కాలేజీలపై దృష్టి నిల్పడం సమంజసంగా ఉంటుంది. ఉదాహరణకు ఏలూరు జిల్లా కేంద్రమే అయినప్పటికీ ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేదు.



రోడ్ల మీద పారుతున్న మురికి నీరు
ఈనాడు 26-6-1990                                                నూర్ బాషా రహంతుల్లా
అమీనాపేట, ఏలూరు

ఏలూరు అమీనాపేటలో పారిశుధ్య పరిస్ధితులు అధ్వాన్నంగా ఉన్నాయి. రోడ్లమీద మురికి నీరు పారుతోంది. మురుగుకాల్వలను మున్సిపాలిటీ వారు శుభ్రం చేయడంలేదు. దోమలు, ఈగలు, పందులు స్వైర విహారం చేస్తున్నాయి. విపరీతమైన ఎండ, వాన, వరదలు ఒక పక్క జనాన్ని బాధిస్తుంటే మరోపక్క మున్సిపాలిటీ వారి క్రూరమైన నిర్లక్ష్యం ప్రజల్ని నానాయాతనలకు గురిచేస్తోంది.

  కాలనీలు నిర్మించాలి
స్థానిక సమస్యలు 14-7-1990                                    నూర్ బాషా రహంతుల్లా
అమీనాపేట, ఏలూరు
ఏలూరు ఓవర్ బ్రిడ్జి క్రింద, తమ్మిలేరు రెండు గట్టుల మీద అసంఖ్యాకమైన పేద ప్రజలు గుడిసెలు వేసుకుని, దడులు అడ్డం కట్టుకుని బ్రతుకులీడుస్తున్నారు. వీరి నివాసాలు ట్రాఫిక్ కు ఎంతగానో అంతరాయం కలిగిస్తున్నాయి. వీరందరికీ ఊరి బయట కాలనీలు కట్టించాలి. పట్టణం మధ్యలో రాచపుండులా దర్శనమిస్తున్న వీరికి ఉపాధి చూపించాలి. పట్టణంలో అడుగడుక్కీ అడ్డం వస్తున్న రైలు కట్ట మీద మరో మూడు ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం జరగాలి. కాలువ మీద వంతెనలన్నీ వాహనాలు పోవడానికి వీలుగా కట్టించాలి. ఏలూరు చుట్టూ ఒక రింగ్ రోడ్డు నిర్మించాలి.



ముందు డిగ్రీ కాలేజీలు నెలకొల్పండి
ఆంధ్రప్రభ 24-8-1990                                              నూర్ బాషా రహంతుల్లా
                                                                ఏలూరు

ప్రతి జిల్లా కేంద్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కేంద్రాన్ని నెలకొల్పాలని ఉరకలు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ముందు అన్ని జిల్లా కేంద్రాలలో డిగ్రి కళాశాలల ఏర్పాటును పూర్తి చెయ్యాలి. ప్రజల విత్యావసరాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి, విద్యను ప్రైవేటు యజమానులకు అప్పజెప్పిన ప్రభుత్వం తన తప్పులు దిద్దుకోవాలి. కొత్తగా డిగ్రి కాలేజీలు ఏర్పాటు చేసే ప్రసక్తే లేదని మంత్రి శ్రీ రోశయ్య గారు సెలవిస్తున్నారు. ఏలూరు జిల్లా కేంద్రమయినప్పటికీ ప్రభుత్వ డిగ్రి కళాశాల లేకపోవడం సిగ్గుచేటు. డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు ఒక ప్రాతిపదిక అంటూ ఏదీలేదా ? రాజకీయ నాయకుల కిష్టమైతే తాలూకా కేంద్రాలలో గూడా డిగ్రీ కళాశాలలు వెలుస్తాయి. మరి జిల్లా కేంద్రమైన ఏలూరును ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.


హైస్కూలు కావాలి
ఆంధ్రజ్యోతి 10-7-1990                                            నూర్ బాషా రహంతుల్లా
అమీనాపేట, ఏలూరు

ఏలూరు  అశోక్ నగర్ లోని మునిసిపల్ అప్పర్ ప్రైమరీ స్కూలును హైస్కూలుగా మార్చాలని ప్రజలు ఎంతో కాలం నుంచి కోరుతున్నారు. కాని ఈ ప్రాంతంలోని ప్రైవేటు పాఠశాలల యజమానులు తమ పలుకుబడిని ఉపయోగించి ఇది హైస్కూల్ కాకుండా అడ్డుపడుతున్నారు. అమీనాపేట, అశోక్ నగర్, ఫత్తేబాద్ మొదలైన ప్రాంతాలన్నిటికీ కలిపి ఒక్క ప్రభుత్వ హైస్కూల్ కూడా లేదు. ప్రజల అవసరాన్ని గుర్తించి మునిసిపల్ అధికారులు ఇక్కడ హైస్కూలు ఏర్పాటు చేయాలి.



ప్రత్యామ్నాయ స్థలాలు చూపించాలి
ఆంధ్రజ్యోతి  స్థానిక సమస్యలు 10-12-1990                             
                                                               
          ఏలూరు పట్టణాన్ని వరద ప్రమాదం నుంచి తప్పించేందుకు, తమ్మిలేరు గట్టుల్ని పటిష్ట పరచే కార్యక్రమంలో భాగంగా, కాల్వగట్ల ఆక్రమణదారుల్ని తొలగించబోతున్నారు. ఇది హర్షదాయకమైన పని. అయితే అక్కడి పేదల కోసం ప్రత్యామ్నాయ స్థలాలను చూపవలసిన అవసరం ఉంది. ఏలూరు చుట్టూ విస్తారమైన వ్యవసాయ భూములను కొని నిరాశ్రయులకు గృహ వసతి కల్పించడంలో తప్పులేదు. అలాగే తమ్మిలేరు గట్టుల మీద కేవలం మూడు మీటర్ల ఆక్రమణలనే తొలగిస్తున్నారు. కనీసం ఆరు మీటర్ల ఆక్రమణలను తొలగించి రెండు గట్టుల్ని తారు రోడ్డుగా మారిస్తే పట్టణంలో రవాణా సమస్య చాలా వరకు తొలగి పోతుంది. పవర్ పేట రైల్వే స్టేషన్ ను కొత్త బస్టాండు దగ్గరకు మార్చే పని నత్తనడక నడుస్తోంది తంగెళ్ళమూడు, అశోక్ నగర్ ల వద్ద వంతెనల నిర్మాణం, బైపాస్ రోడ్డు పని ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. మళ్ళీ వరద రాక ముందే అధికారులు పనులు పూర్తి చేయాలి.



'బీఫ్ కూడా అమ్మాలి'
ఆంధ్రజ్యోతి స్థానిక సమస్యలు 20-9-1990                             
                                                                       
          ఏలూరు ఓవర్ బ్రిడ్జి క్రింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాంసం, పోర్క్, బీఫ్ విక్రయశాల ఉంది. ఇందులో పంది మాంసం విక్రయిస్తున్నారు. కాని 'బీఫ్' అమ్మడం లేదు. ఏలూరులో గొడ్డు మాంసం చాలా తక్కువగా లభిస్తుంది. హైదరాబాదుతో పోలిస్తే ఏలూరు మాంసం విషయంలో చాలా వెనుకబడి ఉంది. ప్రభుత్వం తరఫున నడిచే ఈ విక్రయశాలలో రిఫ్రిజిరేటర్లు ఖాళీగా మూలన పడి ఉన్నాయి. అందువల్ల వేలాది బీఫ్ వాడకందారుల అవసరాలు గమనించి ఈ విక్రయశాలలో పందిమాంసంతో పాటు బీఫ్ కూడా అమ్మాలని విజ్ఞప్తి.



బైపాస్ రోడ్డు నిర్మాణం ఎప్పుడు?
స్థానిక సమస్యలు 20-9-1990                             
                                                                       
          ఏలూరు పట్టణానికి బైపాస్ రోడ్డు కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఆరు నెలలు దాటింది. కాని జాతీయ రహదారుల ఇంజనీర్లు ఇంతవరకు ఆ రోడ్డు పని ప్రారంభించలేదు. నాలుగు ప్రక్కల కాలువలతో ఏలూరు పట్టణం అనేక రవాణా సమస్యలను ఎదుర్కొంటున్నది. పట్టణంలోని కాలువల మీద వంతెనలన్నీ అతి చిన్నవి గాను కార్లు పోవడానికి వీలు లేకుండా ఉన్నాయి. ఈ కాలువల మీద కార్లు పోయేందుకు వీలుగా మరిన్ని వంతెనలు కట్టాలి. తమ్మిలేరు కట్టల మీద స్థిర నివాసాలు అనేకం వెలిశాయి. తమ్మిలేరు రెండు గట్టులను వెడల్పు చేసి తారు రోడ్లు వేస్తే పట్టణంలో రవాణా సమస్య చాలా వరకు తీరుతుంది. అశోక్ నగర్ వద్ద నిర్మించ తలపెట్టిన పెద్ద వంతెన తగాదాలలో చిక్కుకుంది. తంగెళ్ళమూడి వద్ద బెయిలీ వంతెన స్థానంలో పెద్ద వంతెన ఎప్పటికి నిర్మించబడుతుందో మరి, రోడ్లు, వంతెనల కొరతతో బాధపడుతున్న ఏలూరు ప్రజలను నాయకులు, అధికారులు ఆదుకోవాలి.



స్థలాల కొనుగోలుకు ఋణాలు ఇవ్వాలి
స్థానిక సమస్యలు 20-9-1990                             
                                                                       
          పశ్చిమ గోదావరి జిల్లాలో సహకార బ్యాంకుల వ్యవస్థ బాగా విస్తరించింది. ఆంధ్రప్రదేశ్ లో కెల్లా ఏకైక ఇళ్ళ తనఖా బ్యాంకు ఏలూరులో ఉంది. సహకార గ్రామీణ బ్యాంకులు, అర్బన్ బ్యాంకులు, సెంట్రల్ బ్యాంకు, గృహ నిర్మాణ సొసైటీ కలిసి ఎన్నో రకాల ఋణాలు ఇస్తున్నాయి. అయితే, ఇవన్నీ ఒక ప్రధానమైన అత్యవసరమైన రంగాన్ని మరచాయి.

       ఇళ్ళ స్థలాల కొనుగోలుకు ఏ సహకార బ్యాంకు కూడా అప్పు ఇవ్వడం లేదు. ఇంటి స్థలం ఉన్నవారికే ఇంటి నిర్మాణం కోసం అప్పిస్తారట. కాని, ఇంటి స్థలం కొనుగోలుకు మాత్రం అప్పు ఇవ్వరట. సహకార బ్యాంకులు ఈ విషయం ఆలోచించాలి. కొనుగోలు చేసిన వస్తువునే తాకట్టు పెట్టుకునే పద్ధతిలో ఎన్నో ఋణాలు ఇస్తున్నారు. నిరాశ్రయులధికంగా ఉన్న మన దేశంలో పది శాతం వడ్డీతో ఇళ్ళ స్థలాల కొనుగోలుకు అప్పులిచ్చేందుకు ఈ బ్యాంకులు ముందుకు రావాలి. 30 లక్షల జనాభాగల పశ్చిమ గోదావరి జిల్లాలో 7 లక్షల ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. ఈ ఇళ్ళ కొరతను నివారించడానికి సహకార బ్యాంకులు తోడ్పడాలి. 75 శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడిన వారే గనుక వారికిచ్చే స్థలం కొనుగోలు ఋణాలను తక్కువ వడ్డీకి ఇవ్వవచ్చు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి