ఈ బ్లాగును సెర్చ్ చేయండి

6, ఆగస్టు 2013, మంగళవారం

న్యాయస్థానాలు



న్యాయస్థానాల్లో రాజకీయాలు
                                                                                                                                                                                          
                        జులై 30న 'ఈనాడు' సంపాదకీయంలో న్యాయ స్థానాల్లో రాజకీయాల ప్రవేశం గురించి బాగా రాశారు. నిజంగా శ్రీ వాత్సన ఎన్ని రాజకీయ       వేదింపులకు గురై రాజీనామా చేశారో రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో       పడి, వారి దారుణమైన వేధింపులకు గురై న్యాయాన్ని నిలబెట్టలేని        న్యాయమూర్తులు ఎంతమంది ఉన్నారో! అక్రమంగా బదిలీ చేసి న్యాయమర్తుల నోళ్ళు మూయించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుంది ? ఎంతో   కల్మషాన్ని చేదుని మనసులో దాచుకొని పైకి తియ్యటి కబుర్లు చెప్పే       పరిపాలకులు తమ అంతరాత్మను బాగా పరిశీలించుకోవాలి. న్యాయం    ఖచ్చితంగా అమలు జరగవలసి వచ్చినప్పుడు వాళ్ళు గతంలో చేసిన       తప్పులన్నిటికీ శిక్ష అనుభవించవలసి వస్తుంది.


మనలో మనకు భేదాలు వద్దు
ఆంధ్రభూమి  12-10-1989                                                                                                 
              సుప్రీంకోర్టు బెంచిని దక్షిణాదిన ఏర్పాటు చేయటం కుదరదని   సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పడం సమర్థనీయం కాదు.ఆయన వాదన ఎలా ఉందో చూడండిః
"దానివల్ల ఎన్నో  అసౌకర్యాలున్నాయి. లేకపోతే ప్రాంతీయాభిమానం అతిగా పెరిగి ప్రతి రాష్ట్రంలో ఓ  సుప్రీంకోర్టు బెంచి ఉంచాలంటూ వాదిస్తారు. దేశంలో ఒకే సుప్రీంకోర్టు  ఉంటుంది. ప్రతి రాష్ట్రానికో హైకోర్టు ఉండనే ఉంది.అది చాలు.ఉత్తరాదివాళ్ళు, దక్షిణాది వాళ్ళంటూ భేదాలతో దేశీయ పౌరులు ఉండగూడదు. జాతీయత పెంపొందించుకోవాలి. దేశ సమైక్యం దేశ సమగ్రతకు భంగం కలిగించే  అభిప్రాయాన్ని నిజమైన భారతీయుడు వ్యక్తం చేయడు. ప్రతి భారతీయుడు సమైక్యతతో ఉండటాన్నే కోరాలి.    వేర్పాటువాదాన్ని తృణీకరించాలి. ఏదైనా దేశ ప్రగతి కి ఉపయోగపడే సూచనలివ్వాలి. విరుద్ధ భావాలు వ్యక్తం చేయగూడదు. ఈ విషయాన్ని పట్టించుకోవద్దు.ఎలాగూ ప్రభుత్వం పేద వాళ్ళను నిశితంగా గ్రామ సభల ద్వారా న్యాయాన్ని కలిగిస్తుంది. వీళ్ళ కేసులు సుప్రీంకోర్టు దాకా పోనే పోవు.పూర్వంలా ఏ కేసులు ఎక్కడా పెండింగులో ఉండవు. న్యాయం ప్రతివానికి   అందుబాటులో ఉంటుంది. ఇప్పుడున్న పద్ధతి బాగానే ఉంది. దీన్ని ప్రతి పౌరుడు సమర్ధించి నిజాయితీని పాటించాలని కోరుతున్నాను".
ప్రజలకు న్యాయం త్వరగా అందాలంటే న్యాయస్థానాలు,పాలనా కేంద్రాల వికేంద్రీకరణ జరగాలి.పౌరుడిదగ్గరకురానిపాలనవ్యర్ధం.విపరీతమయిన దూరం భారమై  నిజాయితీని,సమర్ధతను చంపి అవినీతిని  పెంచుతుంది.


దక్షిణాది లో సుప్రీంకోర్టు బెంచ్
ఆంధ్రప్రభ  15-10-1989                                     
                                                             
              సుప్రీంకోర్టు బెంచిని దక్షిణాదిన ఏర్పాటు చేస్తే వేర్పాటువాదం   పెరిగిపోతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భయపడ్డారు.   అలాంటిదేమీ జరగదు. ఉత్తర భారతంలో తిష్ట వేసిన న్యాయపీఠం తమ మీద        దయతలచి తమకు దగ్గరగా వచ్చినందుకు దక్షిణాది జనం కృతజ్ఞతను ప్రకటిస్తారు. ఢిల్లీ ప్రదక్షిణాలకయ్యే ఖర్చు ఎంతగానో తగ్గిందని సంతోషిస్తారు.        'మాకు కుడుము, మీకు మూకుడు' అనే ధోరణిని ఉత్తరాది వాళ్ళు     మార్చుకుని అన్ని ప్రాంతాలకు సమాన సౌకర్యాలను కల్పిస్తున్నారని        భావిస్తారు. బెంచీ ఏర్పాటు చెయ్యకపోతేనే వేర్పాటువాదం తలఎత్తవచ్చు. వేర్పాటువాదం అంసతృప్తిలో నుంచే పుడుతుంది. కాబట్టి దక్షిణాది వాళ్ళ        అవస్థను గమనించి కేంద్రం సుప్రీంకోర్టు బెంచీని ఏర్పాటు చెయ్యాలి.


అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ బెంచీలు
ఆంధ్రజ్యోతి  8-9-1985                                        ఎన్. రహంతుల్లా     
                                                              నెల్లూరు
              కేంద్ర ప్రభుత్వోద్యోగుల సర్వీస్ వివాదాల పరిష్కారానికి కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయడం హర్షదాయకం. అయితే, మరో మంచి సంగతి ఏమిటంటే అలహాబాద్, బొంబాయి, బెంగుళూరు,కలకత్తా, గౌహతి, మద్రాస్, నాగపూర్ లలో అదనపు బెంచీలు కూడా ఏర్పాటు చేసి ఉద్యోగులకు వ్యయ ప్రయాసలు తగ్గించడం.
      
              ప్రధాన బెంచీ దూరంగాను, అతి ఖరీదైన ప్రదేశంలోను ఉన్నప్పుడు    దూర ప్రాంతాల లోని వారు అదనపు బెంచీలు ఏర్పాటు చేయమని కోరడం     సహజం. సుప్రీంకోర్టు బెంచీని హైదరాబాద్ లో ఏర్పాటు చేయమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరడం న్యాయమే. అలాగే హైదరాబాద్ లో ట్రిబ్యునల్ బెంచి కూడా ఏర్పాటు చేయమని కోరాలి.

              ఇకపోతే ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ బెంచిల విషయంలో     మన రాష్ట్రం కేంద్ర ట్రిబ్యునల్ విధానాన్ని అనుసరించాలి. విజయనగరం, ఏలూరు, ఒంగోలు, కడప, కరీంనగర్ లలో అయిదు అదనపు బెంచీలు  ఏర్పాటు చేస్తే ప్రతి జోన్ మధ్యలో అందరు ఉద్యోగులకు అందుబాటులో  ట్రిబ్యునల్ ఉంటుంది.

              కోర్టులలో పేరుకుపోయిన కేసులను త్వరగా పరిష్కరించడం కోసం    సంచార  న్యాయస్థానాలలను, అదాలత్ లను ఏర్పాటు చేయాలని ఢిల్లీలో      జరిగిన న్యాయమూర్తుల, ముఖ్యమంత్రుల సమావేశం మంచి నిర్ణయం   చేసింది.
             
              అందువల్ల, పై అయిదు చోట్ల ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్     బెంచిలను ఏర్పాటు చేస్తూ, ట్రిబ్యునల్ తీర్పును హైకోర్టు తీర్పులాగానే ఆమోదించేలా చేయాలని ముఖ్యమంత్రికి మనవి చేస్తున్నాను.


అ'న్యాయ' వాదం
ఈనాడు 4-4-1992                                                

 రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలలో హైకోర్టు బెంచీలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు రాజధానికి చెందిన న్యాయవాదులు అభ్యంతరం తెలపడం అన్యాయం. హైకోర్టు బెంచీలు ఏర్పాటు చేస్తే తమ సంపాదన తగ్గుతుందనే వారు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. తమ స్వార్థమే తప్ప ప్రజల ఇబ్బందులు వారికి పట్టడం లేదు. ప్రజలందరికీ సాధ్యమయినంత తక్కువ ఖర్చుతో సత్వర న్యాయం అందించాలనే సదాశయం ప్రభుత్వానికి ఉంటే న్యాయవాదుల అభ్యంతరాలను పక్కకు నెట్టి ప్రధాన పట్టణాలలో హైకోర్టు బెంచీలు ఏర్పాటు చేయాలి. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా దక్షిణాదిన సుప్రీంకోర్టు బెంచీ ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలి.



జిల్లా కోర్టులకు అధికారాలు బదలాయింపు
వార్త 4-11-1999                                             
హైకోర్టుకు రాష్ట్రంలో మరో రెండు చోట్ల బెంచీలు ఏర్పాటు చేయాలనే ప్రజల వాంఛ తీరేలా లేదు. కాబట్టి జిల్లా కోర్టులకు కొన్ని అధికారాలను హైకోర్టు బదిలీ చేస్తే బాగుంటుంది. ఉదాహరణకు ఆక్రమణలు, రొయ్యల చెరువుల తవ్వకం, భూసేకరణ లాంటి విషయాలు డైరెక్టుగా హైకోర్టులో పిటీషన్లు దాఖలు అవుతున్నాయి. వీటిపై కేసులకు హాజరు కావటానికి రాష్ట్ర వ్యాప్తంగా అధికారులకు అయ్యే ఖర్చులు ప్రభుత్వం భరిస్తున్నది. హైదరాబాద్ ప్రయాణం దూరం-భారంతో కూడుకున్నందువల్ల ప్రజలు, అధికారులు కూడా యాతనపడుతున్నారు. అన్ని రకాల కేసులూ  జిల్లా కోర్టుల తీర్పులపై అప్పీళ్ళు మాత్రమే హైకోర్టు అనుమతించి, డైరెక్టు పిటీషన్లను నిరాకరిస్తే బాగుంటుంది.



న్యాయ వ్యవస్థను వికేంద్రీకరించాలి
ఈనాడు 6-11-19991                                          

న్యాయస్థానాల్లో పేరుకుపోతున్న కేసుల సంఖ్య ఆందోళన కలిగించే విషయం. న్యాయాధికారాలు బదలాయించనంతకాలం  పరిస్థితి తప్పదేమో. హైకోర్టు అధికారాల్లో కొన్నింటిని జిల్లా కోర్టులకు బదలాయిస్తే సమస్య తీవ్రత కొంతవరకు తగ్గవచ్చు. ప్రజలకు దూర ప్రయాణాల భారం తగ్గుతుంది. కొన్ని కేసులలో జిల్లా కోర్టుల తీర్పులపై అప్పీళ్ళను మాత్రమే హైకోర్టు విచారించేలా చట్టంలో మార్పులు చేయాలి.



       సామర్ధ్యమే ప్రాతిపదిక
ఈనాడు 25-1-2000                                          
                                                 
రిజర్వేషన్లు ఎంతవరకూ సామాజిక న్యాయాన్ని అందించగలుగుతున్నాయన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రమోషన్లలో రిజర్వేషన్లు మరో వివాదమవుతోంది. ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించడానికి రాజ్యాంగ సవరణ చేయాలన్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విజ్ఞప్తి సహేతుకం కాదు. కాంగ్రెస్ తోపాటు అన్ని రాజకీయ పార్టీల ఓట్ల బ్యాంకుల కోసం నిర్ధష్ట సిద్ధాంతం లేకుండా వ్యవహరిస్తుండటం సిగ్గుచేటు. సర్వోన్నత న్యాయస్థానం ఇది. సరికాదని తేల్చి చెప్పినా రాజకీయ పార్టీల ధోరణి మారకపోవడం దురదృష్టకరం. ఉన్నత పదవుల్లో ఉండే వ్యక్తులు తమ నిర్ణయాల ద్వారా ప్రజాజీవితాన్ని ప్రభావితం చేయగలరు. అందువల్లే వారికి ప్రతిభాపాటవాలు అవసరం. ప్రమోషన్లలో సామర్థ్యమే గీటురాయి కావాలి.


                                                           A suggestion
Indian Express   19-12-1990              N. Rahamthulla   Eluru
          Sir
                   Hyderabad, which is an abode of slaughter and curfew, has lose its      eligibility to continue as our State Capital. People undertaking journeys to   that city are undergoing an ordeal. Therefore it is desirable to develop two   more capital cities in the “Vissalandhra” – one at Kurnool and the other at Guntur. These two areas also will develop if the High Court is transferred to  Guntur and the directorates to Kurnool. Similarly, Telugu University to  Rajahmundry and the Open University to Nagarjuna Sagar.
                        All important offices are concentrated at Hyderabad. People of all        other areas of the State are suffering a lot because of curfews. I request the      Government to take steps to transfer offices to other areas.



భద్రత లేని రాజధాని
ఈనాడు 22-12-1990                                           నూర్ బాషా రహంతుల్లా
                                                 
                                                               
          హైదరాబాదు నగరం మత కలహాలకు నిలయమై సాంఘిక భద్రత కొరవడి రాజధానిగా ఉండే అర్హత కోల్పోయింది. ఆ నగరంలో శాంతి భద్రతలను రక్షించటానికయ్యే ఖర్చు రాష్ట్ర ప్రజలందరి మీదా మోపడం న్యాయం కాదు. పోలీసు, సైన్యం మీద పెట్టిన ఖర్చు ఆ నగర పౌరుల నుండే రాబట్టాలి. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, డైరక్టరేట్లు మొదలైన అగ్రశ్రేణి ఆఫీసులన్నీ హైదరాబాద్ లోనే ఉండటం వల్ల ఇతర ప్రాంతాల ప్రజలు తప్పనిసరై ఆ ఊరికి ప్రయాణాలు చేస్తున్నారు. హైదరాబాదు ప్రయాణం యమపురికి యాత్రలాగా ఉంది. అందువలన అసెంబ్లీ, సచివాలయం మాత్రం అక్కడే ఉంచి, హైకోర్టును గుంటూరులో డైరెక్టరేట్లన్నీ కర్నూలులో స్థాపిస్తే బాగుంటుంది. ప్రజలకు చౌకగా పనులౌతాయి. ఈ రెండు ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి. 



'న్యాయం' కోసం పరుగు
ఆంధ్రప్రభ  22-3-1987                                       
                                                             
              'తెలుగు గంగ' ప్రాజెక్టులో సీనియర్లను వదిలేసి జూనియర్లకు    ప్రమోషన్లు ఇస్తున్నారని ఫిర్యాదు చేస్తూ మేము హైకోర్టులో కేసు దాఖలు చేశాము. ట్రిబ్యునల్ తీర్పులను ప్రభుత్వం ఖాతరు చేయదని భావించి అలా చేశాం. ఉద్యోగుల విషయంలో హైకోర్టు తీర్పుల నివ్వరాదని, ప్రభుత్వం   ట్రిబ్యునల్ తీర్పును ఆమోదించి తీరాలని సుప్రీంకోర్టు ఈ మధ్య తీర్పు        ఇచ్చింది. అందువల్ల హైకోర్టు తన దగ్గర పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల       కేసులన్నింటిని డిస్మిస్ చేసింది. కనీసం ట్రిబ్యునల్ కు బదిలీ చేసి ఉంటే కాలమూ, సీనియారిటీ కలసి వచ్చేవి. గత్యంతరం లేక, ఈ మధ్యనే    ట్రిబ్యునల్ లో కొత్తగా కేసు దాఖలు చేశారు. ఇంతలో ట్రిబ్యునల్ ను రద్దు    చేయాలని ప్రభుత్వం రాష్ట్రపతిని కోరనున్నట్లు తెలిసింది. అక్కడ కాదంటే   ఇక్కడికి, ఇక్కడ కాదంటే అక్కడికి ఏళ్ళ తరబడి 'న్యాయం' కోసం పరుగులు    తీయడమేనా?


విజ్ఞప్తి
ఉదయం 25-12-1990                                      
                                                                       
          మీరు మీరు చంపుకొని కర్నూలు తెస్తుంటే, ఆ నగరంలో పని మీద వచ్చే మాకు ప్రాణాలమీద కొస్తున్నది. మీరు ఇట్లాగే నగరాన్ని నరకంగా మారుస్తూపోతే, మేము మరో రాజధానిని ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ, డైరెక్టరేట్లు... ఇలా ఎన్నో ఆఫీసుల్తో మాకు పనులుంటాయి. హైదరాబాద్ ప్రయాణం అంటే యమలోకం గుర్తొస్తుంది. మీరు స్వేచ్ఛగా మారణకాండ జరుపుకోదలిస్తే అసెంబ్లీ ఒక్కటి ఉంచుకొని, హైకోర్టును గుంటూరుకు, డైరెక్టరేట్లను కర్నూలుకు బదిలీ చేయించండి. మిమ్మల్ని పరామర్శించడానికి నాయకులుంటారు. మాకు పనులు చేయడానికి ఆఫీసులుంటాయి.




కోర్టు తీర్పు వచ్చే వరకూ ఆగలేరా ?
ఆంధ్రజ్యోతి 28-11-1990                                                  
                                                               
          అయోధ్యలో మళ్ళీ కరసేవ చేయడానికి విశ్వ హిందూ పరిషత్ సన్నాహాలు చేయడం శోచనీయం. మసీదును పడగొట్టి మందిరం నిర్మించడంలో, మతానికి ఆధ్యాత్మిక భావనలకు ముడిపెట్టగూడదట. జాతీయ సమైక్యతకు మతసామరస్యానికి మందిర నిర్మాణం తప్పనిసరి అంటున్నారు. ఇది ఎంత అసమంజనమైన భావన? తన్ను తప్పించి ఆకాశమంత పిడుగు పడమన్నట్లుంది బి.జె.పి ధోరణి. ఆధ్యాత్మిక విశ్వాసాలకు తావు లేని రామమందిరం రాజకీయ మందిరమే అవుతుంది. బల ప్రయోగంతో హింసామార్గంలో నడుస్తూ మెజారిటీ మతస్తుల్ని ఉసిగొల్పుతూ, బి.జె.పి. దేశంలో కల్లోలం సృష్టిస్తోంది. ఆధ్యాత్మిక విషయాలపై కోర్టు తీర్పు ఇవ్వలేదంటున్నారు. మరి మందిరం ఆధ్యాత్మిక విషయం కాదని వారే చెబుతున్నారు. భూమి ఎవరికి చెందాలన్నది కోర్టు నిర్ణయిస్తుంది.



మందిరం కట్టగానే సరా?
ఆంధ్రభూమి 28-9-1990                                   
                                                                       
          సెప్టెంబర్ 26 నాటి 'ఆంధ్రభూమి' సంపాదకీయం అయోధ్య-అద్వానీ యాత్ర మత మౌఢ్య వాదులకు అడ్డువాత నిలుపువాత వేసింది. దేశంలో కూటికి నోచుకోని కోట్లాది ప్రజల సమస్యలు పరిష్కారానికి నోచుకోక, దేశ దారిద్యాన్ని ప్రతిబింబిస్తుంటే ఈ రధయాత్రలు ఏం సాధించాలని? జాతి సమైక్యతను కాపాడటం ఇలాగేనా? జాతీయ సమైక్యతా మండలి సమావేశాల్లో పాల్గొనకుండా బి.జె.పి. దేశ సమైక్యతను దెబ్బతీసింది. కోర్టు తీర్పునూ లెక్క చేయక, చర్చల్లోనూ  పాల్గొనక బలం ఉంది కదా అని దేశం మీద పడి యాత్రలు చేసి జనాన్ని రెచ్చగొట్టడం, రక్తాన్నైనా చిందించి రామాలయం నిర్మిస్తామనటం, ఆ పార్టీ హింసా బుద్ధికి నిదర్శనం. అయోధ్య రథయాత్రకు గాంధీగారి గోరక్షణ యాత్రకూ పోల్చటం అద్వాన్నంగా ఉంది. గాంధీగారిని చంపింది ఎవరు ? అహింస అనేది ఆవరణలో చూపాలి. ఒక్క మందిరం కట్టగానే దేశ సమస్యలన్నీ సమసిపోవు.




చట్టాలు మారాలి
ఆంధ్రజ్యోతి 27-8-1985                              ఎన్. రహంతుల్లా
                                                              తెలుగు గంగ
                                                              నెల్లూరు
              సెప్టెంబర్ 8 ఆంధ్రజ్యోతి అనుబంధం లోని 'మనిషి కోసం చట్టమా?     చట్టం కోసం మనిషా?' వ్యాసంలో హిందూ ధర్మశాస్త్రం పుట్టుక, పరివర్తన     గురించిన అంశాలను రచయిత ఎస్.కె.ఆచార్య గారు చక్కగా వివరించాడు.   హిందూ ధర్మశాస్త్రం దైవదత్తం కాదు. ఏ ఒక్కడు ఆవిష్కరించి మానవులకు      ప్రసాదించింది కూడా కాదు. ఆర్థిక జీవన అవసరాలను బట్టి మారుతున్న      సంఘానికి అనువుగా ఉండే న్యాయ సూత్రాలను అన్వేషించడమే ఈ        న్యాయశాస్త్ర ఆశయం అని రచయిత ధైర్యంగా చెప్పారు.
              మారుతున్న కాలానికి అనుగుణంగా ధర్మ శాస్త్రాలు మారాలి. అయితే       కాలం ఎంత మారినా సహజ న్యాయసూత్రాలు శాశ్వతంగా ఉంటాయి.      ధర్మ శాస్తారలను మతం ఆదేశించి అమలు చేస్తూ ఉండడమే ఈనాడు పెద్ద సమస్యగా ఉంది.
              విడాకులు, మనోవర్తి, స్త్రీలకు ఆస్తి హక్కు, బహు భార్యాత్వం, రెండవ భార్య లేక ఉంపుడుగత్తెల పిల్లలకు వారసత్వపు హక్కు మొదలైనవి ఇంకా      సమస్యలుగానే ఉన్నాయి.
              కనుక హిందూ లా, ముస్లిం లా అనే వేర్వేరు న్యాయాలను తీసివేసి   సమాజ న్యాయ సూత్రాలపై ఆధారపడిన, లౌకికమైన జాతీయ సివిల్ కోడ్       తీసుకురావాలి. చట్టం మన కోసమే కాని మనం చట్టం కోసం కాదు. మన అందరి మంచికోసమే చట్టాలు మారాలి.



హాస్యాస్పదం
ఆంధ్రప్రభ 3-11-1987                                    
              ముఖ్యమంత్రి కేసులో వాదించటానికి సమర్థులైన న్యాయవాదులు ఆంధ్రుల్లో లేరా? శ్రీ నానీ పాల్కీవాలాను తెచ్చి ఆరుకోట్ల ఆంధ్రుల    ఆత్మాభిమానాన్ని రామారావు నడివీధిలో అమ్మి వేశారు అంటూ ప్రదేశ్ కాంగ్రెస్ సంయుక్త కార్యదర్శి శ్రీ హనుమంతరావు గగ్గోలు పెట్టం చాలా        హాస్యాస్పదంగా ఉంది. వాది, ప్రతివాది ఇద్దరు సమర్ధుడైన న్యాయవాదిని    వెదికి తెచ్చుకుంటారు. కేసు గెలవాలంటే అది తప్పదు. ఆంధ్రుల      ఆత్మాభిమానం గురించి రామారావుగారు నోరు తెరిచినప్పుడల్లా ప్రాంతీయ దురభిమానియనీ, సంకుచితుడనీ విమర్శించిన కాంగ్రెస్ నేతలకు కూడా ఈ     ప్రాంతీయ అభిమానతత్వం అంటుకుందా? లేక సమర్ధుడైన న్యాయవాదిని     పట్టుకొచ్చాడే అనే దిగులు పట్టుకుని ఇలా సంకుచితంగా కలవరిస్తున్నారా?        ఆంధ్ర న్యాయవాదులు ఇతర రాష్ట్రాలలో కూడా వాదిస్తుంటారని        న్యాయవాదుల పరిధి దేశవ్యాప్తమైనదని కాంగ్రెస్ నాయకులు గమనించాలి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి